'అరిహంత్ అణురియాక్టర్' మరో ముందడుగు
'ఐఎన్ఎస్ అరిహంత్'లోని అణు రియాక్టర్ పని చేయడం ప్రారంభించడంతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞనం అభివృద్ధి చేసుకోవడంలో భారత్ మరో అడుగు ముందుకు వేసిందని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో అరిహంత్కు సొంతంగా విద్యుత్ సరఫరా చేసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. దాంతో ఇది అతిపెద్ద పరిణామం అని ఆయన పేర్కొన్నారు. ఐఎన్ఎస్ అరిహంత్ అణు రియాక్టర్‌ను రూపొందించడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలు, రక్షణ సిబ్బందికి ధన్యవాధాలు తెలిపారు.
ఐఎన్ఎస్ అరిహంత్ భారత దేశపు తొట్టతొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు-జలాంతర్గామి. దీనిని ఆంధ్ర ప్రదేశ్‌లోని, విశాఖపట్నం డాక్‌యార్డ్‌నందు నిర్మితమయింది. ఇది 2012 నాటికి పూర్తిస్థాయిగా నావికాదళంలో చేరుతుంది. దీనితో ఇటువంటి పరిజ్ఞానం కలిగిన అయిదు పెద్ద దేశాల సరసన భారత్ ఆరవ దేశంగా నిలిచింది. దీనిలో అణు వార్హెడ్లను మోసుకుపోగల కె-15 (సాగరిక) క్షిపణులు ఉంటాయి. దీనితో నేల, నింగి, నీరు మూడు విధాలుగాను అణు క్షిపణులను ప్రయోగించగల పెద్ద దేశాల సరసన భారత్ చేరింది.
ఇది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమవుతున్న అరిహంత్ తరగతి జలాంతర్గాముల్లో మొదటిది. ఇంకో నాలుగు వేర్వేరు నిర్మాణ దశల్లో ఉన్నాయి. అడ్వాన్డ్స్ టెక్నాలజీ వెసల్(ఏటీవీ) పేరుతో కొన్ని దశాబ్దాలు పాటు అత్యంత రహస్యంగా సాగింది దీని నిర్మాణం. దీని పొడవు 117 మీటర్లు. బరువు 6000 టన్నులు. దీనిలో కల్పక్కం అణుపరిశోధనా సంస్థ రూపొందించిన 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అణు రియాక్టరు ఉంది. దీని మొదటి జలప్రవేశం జులై 26, 2009 తేదీన, ప్రధాని మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్ చేతుల మీదుగా సాగింది.