breaking news
Indravelli police
-
పోలీసుల ఓవర్ యాక్షన్.. తిరగబడ్డ ఆటో డ్రైవర్
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ఈశ్వర్‌నగర్‌లో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల ఓవర్ యాక్షన్‌ను అడ్డుకున్న గ్రామస్తులు.. వారికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో పరిస్థితి అదుపు తప్పింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఘన్‌శ్యామ్ 2018 జూలై 23న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆటోపార్కింగ్ విషయంలో పోలీసులతో జరిగిన గొడవలో రాస్తారోకో చేయగా..అప్పుడు అతనితోపాటు పలువురిపై కేసు నమోదైంది. ఇందులో భాగంగా శనివారం ఎస్సై గంగారం సిబ్బందితో కలిసి ఘన్‌శ్యామ్ ఇంటికి వచ్చారు. తొలుత పోలీసులు గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై చెయ్యి చేసుకోవడంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య గొడవ మొదలైంది. తర్వాత ఘన్‌శ్యామ్‌ను రిమాండ్‌కు తరలించేందుకు జీప్‌లో ఎక్కించడతో ఈ గొడవ మరింత ముదిరింది. అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ గ్రామస్తులు పోలీసులను ప్రశ్నించారు. కాగా ఎస్సై తమ ఇంటికొచ్చి ఘన్‌శ్యాంను కొట్టడంతోపాటు మహిళలపై కూడా చేయి చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎస్పీ వచ్చే వరకు పోలీస్ వాహానాన్ని పోనివ్వమని అడ్డుకున్నారు. పోలీసు వాహనం అక్కడి నుంచి కదలకుండా ఘన్‌శ్యామ్ దంపతులు దానికి అడ్డుగా పడుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఉట్నూర్ సీఐ వినోద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చూశారు. డీఎస్పీ డెవిడ్ కూడా ఇంద్రవెల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి సీఐ, ఎస్సైతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పోలీసుల ఓవరాక్షన్
-
ఇంద్రవెల్లి ఘటనకు 35 ఏళ్లు
► ఆంక్షల నుంచి స్వేచ్ఛ వైపు.. ► నేడు అమరుల సంస్మరణ దినం ► ఉమ్మడి రాష్ట్రంలో ఆంక్షలతోనే గడిచిపోయిన 33 ఏళ్లు ► గతేడాది స్వేచ్ఛగా నివాళులు ► నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినం జల్.. జంగల్.. జమీన్ కోసం ఉద్యమించిన అడవి బిడ్డలపై 1981 ఏప్రిల్ 20న అప్పటి ప్రభుత్వం తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. 13 మంది ఆదివాసీ గిరిజనులు అమరులయ్యూరు. వారి రక్తంతో తడిసిన వనసీమ ఎరుపెక్కింది. ఈ ఘటనకు నేటితో 35 ఏళ్లు.. అడవిబిడ్డల అమరత్వంతో నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆదివాసీ గిరిజనులు అమరులకు స్వేచ్ఛగా నివాళులు అర్పించలేని దుస్థితి. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్వేచ్ఛగా నివాళులు అర్పించే దిశగా ఆంక్షలు సడలిస్తున్నారు. ఇప్పటికీ కొందరు బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. - ఇంద్రవెల్లి, ఇంద్రవెల్లి : 1981 ఏప్రిల్ 20 జల్..జంగల్...జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన వనసీమ ఎర్రబారింది. అడవి బిడ్డల అమరత్వం నింగికెగిసిన అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 35 ఏళ్లు. ఇప్పటికీ ఆ స్తూపం వద్ద ఏప్రిల్ 20న ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులు అర్పించలేని దుస్థితి. పోలీసు బందూకుల నీడలో అమరుల స్తూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత గతేడాది మొదటిసారిగా నామమాత్రపు ఆంక్షలు విధించడంతో వందల మంది ఆదివాసీలు వచ్చి నివాళులర్పించారు. ఈసారి ప్రభుత్వం అధికారికంగా ఉతర్వులు జారీ చేయకపోయినా జిల్లా కలెక్టర్, ఎస్పీకి పలువురు ఆదివాసీ సంఘల నాయకుల వినతిపత్రాలు ఇవ్వడంతో రెండు గంటలపాటు అనుమతి ఇవ్వడంతో ఆదివాసీలు స్వేచ్ఛగా సంప్రదాయ పూజలు చేసి నివాళులు అర్పించనున్నారు. 33 ఏళ్లపాటు నివాళులకు దూరం కాల్పుల ఘటనకు సాక్షిగా ఇంద్రవెల్లిలో సమీపంలో స్తూపం నిర్మించారు. ఆ రోజు నుంచి ఉమ్మడి ప్రభుత్వం హయం ముగిసే వరకు 33 ఏళ్లుగా అమరులకు నివాళులు అర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. 20 ఏప్రిల్‌కు రెండు రోజుల ముందు నుంచే గుడిహత్నూర్, ఉట్నూర్ ప్రధాన రహదారిని దిగ్బంధం చేయడంతో పాటు ఇంద్రవెల్లి మండల కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఏటా ఏప్రిల్ 19వ తేదీ ఉదయం నుంచి 25వ తేదీ వరకు 144 సెక్షన్ విధించేవారు. 2004లో అప్పటి బోథ్ ఎమ్మెల్యే సోయం బాపురావ్ గిరిజన నాయకులతో పాటు అప్పటి ఎంపీ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఏప్రిల్ 20కి బదులుగా 25న నివాళులు అర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీ గిరిజనులు 25న వారి సంప్రదాయ ప్రకారం నివాళులర్పిస్తున్నారు. గతేడాది నుంచి... 2015న ఏప్రిల్‌లో ప్రత్యేక రాష్ట్రంలో ఆదివాసీ సంఘాల కోరిక మేరకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించి స్తూపం వద్ద నివాళులు అర్పించడానికి రెండు గంటల సమయం ఇవ్వడంతో గతేడాది నుంచి ఆదివాసీలు సంప్రదాయ రీతిలో పూజలు చేసి నివాళులు అర్పించారు. ఈసారి అలాగే రెండు గంటల పాటు నివాళులు అర్పించడానికి అనుమతి ఇచ్చారు. కానీ ఎలాంటి ఆంక్షలు లేకుండా స్తూపం వద్ద దినమంతా సంప్రదాయ పూజలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. రెండోసారి స్మారక స్తూపం నిర్మాణం ఇంద్రవెల్లి పోలీసు కాల్పుల్లో మరణించిన ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. ఆ స్తూపాన్ని 1986 మార్చిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు డైనమేట్లతో పేల్చారు. దీంతో గిరిజనులు ఆందోళన చేయడంతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి స్తూపాన్ని నిర్మించింది. ఒకేసారి అనుమతి జాతీయ స్థాయిలో ఒక ఘోర సంఘటనగా పేరుపొందిన ఇంద్రవెల్లి అమరవీరుల సభకు 1989లో ఒకేసారి అనుమతి లభించింది. ఆ సంవత్సరం అప్పటి ప్రభుత్వం పీపుల్స్‌వార్‌పై ఉన్న నిషేధాన్ని తొలగించడంతో సభకు అనుమతి వచ్చింది. ఆ ఏడాది సభకు మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్, ప్రజా గాయకుడు గద్దర్ హజరవుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. అసలు ఏం జరిగింది..? స్వాతంత్రం వచ్చి 35 ఏళ్లు దాటినా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లి గిరిజనులు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో పాటు సభ ఏర్పాటు చేయడంతో ఉదయం నుంచే నలువైపుల నుంచి ఆడ, మగ, చిన్న, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకే ఇంద్రవెల్లి గిరిపుత్రులతో కిక్కిరిసిపోయింది. బహిరంగ సభ స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా గిరిజనులు ర్యాలీగా సభ స్థలానికి బయల్దేరడం.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ముందున్న గిరిజన యువతితో పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారు. భరించలేని ఆ యువతి సదరు పోలీసుపై దాడి చేయడంతో ఆయన నేలకొరిగాడు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. రక్తం ఏరులై పారింది. ప్రాణాలు కాపాడుకోవడానికి ఉద్యమకారులు పరుగులు తీశారు. ఈ సంఘటనలో పోలీసుల కాల్పుల్లో కేవలం 13 మంది మాత్రమే చనిపోయినట్లు ప్రభుత్వం రికార్డులో ఉన్నా.. సంఘటన స్థలంలో కొందరు తూటల గాయూలతో తమ ఇళ్లకు వెళ్లి, పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక సుమారు 60 మంది ఆదివాసీ గిరిజనులు చనిపోయినట్లు పౌరహక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసింది. ఇప్పటి వరకు చనిపోయిన వారి కుటుంభ సభ్యులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందకపోవడంతో యజమానులు కోల్పోయిన కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ఘటన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య పిట్టబొంగరం సందర్శించి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చినా నేటికీ నెరవేరలేదు. ఏ పనీ చేయలేకపోతున్న ఏప్రిల్ 20న సోమవారం కావడంతో నా భర్త మడావి సంభుతో కలిసి అంగడికి వెళ్లిన. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ నా భర్త చనిపోయిండు. నా కుడి చేతిలోకి బుల్లెట్ పోరుు తీవ్ర గాయమైంది. దాని ప్రభావంతో ఇప్పటికీ ఏ పనీ సరిగా చేయలేకపోతున్నా. కొడుకు గంగారాం కూడా పెళ్లి అయిన తర్వాత అనారోగ్యంతో చనిపోయాడు. నాకెవరూ దిక్కు లేరు. కూలీ పని చేయలేకపోతున్న. వృద్ధాప్య పింఛన్ కూడా ఇస్తలేరు. చాలా కష్టంగా ఉంది. - కాల్పుల్లో అయిన బుల్లెట్ గాయాలను చూపుతున్న మడావి జంగుబాయి నా భర్తను కోల్పోయిన ఆ రోజు జరిగిన పోరాటంలో నా భర్త సెడ్మాకి కొద్దు మృతిచెందాడు. ఇంటి యజమాని చనిపోవడంతో అప్పటి నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నం. ఇప్పటి వరకు ప్రభుత్వం మమ్ములను గుర్తించలేదు. ఎలాంటి ఆర్థిక సహాయం కూడా అందలేదు. ఇకనైనా ఆదుకోవాలి.- సెడ్మాకి లక్ష్మీబాయి, తాటిగూడ