breaking news
Indoor court
-
కామాంధుడికి మరణశిక్ష .
ఇండోర్: మధ్యప్రదేశ్‌లో నాలుగు నెలల చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసిన కేసులో దోషిగా తేలిన నవీన్ గడ్కే(26)కు ఇండోర్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసును విచారించిన అదనపు సెషన్స్ జడ్జి వర్షా శర్మ రికార్డుస్థాయిలో 23 రోజుల్లోనే నవీన్‌ను దోషిగా నిర్ధారిస్తూ శనివారం తీర్పు ఇచ్చారు. పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నవీన్ దోషిగా తేలినట్లు న్యాయమూర్తి శర్మ తీర్పులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శర్మ 51 పేజీల తీర్పును వెలువరిస్తూ.. ‘ఇలాంటి హేయమైన, క్రూరమైన చర్యలకు పాల్పడే వ్యక్తి సమాజానికి పట్టిన చీడ లాంటివాడు. రోగి శరీరంలో కుళ్లిపోయిన భాగాలను ఆపరేషన్ ద్వారా డాక్టర్లు తొలగించినట్లే.. ఇలాంటి నేరస్తులను సమాజం నుంచి దూరంగా ఉంచాలి. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం’ అని వ్యాఖ్యానించారు. ఏడ్వడం తప్ప మరొకటి తెలియని చిన్నారితో నేరస్తుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్‌లోని రజ్వాడా ప్రాంతంలో తల్లిదండ్రులతో నిద్రపోతున్న చిన్నారిని ఏప్రిల్ 20న కిడ్నాప్ చేసిన నవీన్.. ఓ వాణిజ్య భవనం బేస్మెంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత చిన్నారి ఏడుస్తుండటంతో ఆమె తలను నేలపై మోది కిరాతకంగా హత్యచేశాడు. -
అధికార పార్టీ నేతల..‘ఇండోర్’ గేమ్స్
చీపురుపల్లి:అధికార పార్టీ నేతలు ప్రతి అంశాన్నీ రాజకీయంగానే చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న, మొన్నటి వరకు అంగన్వాడీ, ఉపాధిహామీ, రేషన్ డీలర్ అంటూ పలువురు ఉద్యోగులపై కొనసాగిన వేధింపులు నేడు షటిల్ ఇండోర్ కోర్టు వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. అధికార పార్టీ నేతల సూచనల ప్రకారం పట్టణంలో ఉన్న ఇండోర్ కోర్టుపై పలువురు వ్యక్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో షటిల్ కోర్టును స్వాధీనం చేసుకోవాలంటూ ఆర్డీఓ నుంచి తహశీల్దార్‌కు ఆదేశాలు అందాయి. అయితే తహశీల్దార్ పెంటయ్య అందరికీ ఉపయోగపడే షటిల్‌కోర్టును ఉంచాలా? లేదంటే ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయాలా? అన్న సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కూడా ఇదే విషయమై మంత్రి కిమిడి మృణాళినిని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇండోర్ కోర్టు ఎలా ఏర్పాటయిందంటే.... షటిల్ క్రీడాకారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్టార్ కార్యాలయం ప్రాంగణంలోనే వ్యవసాయశాఖకు చెందిన పురాతన గొడౌన్లు ఖాళీగా ఉండేవి. ఈ గొడౌన్లో చాలా కాలం క్రితమే ప్రస్తుత వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటు పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ ఇండోర్ కోర్టుగా సిద్ధం చేయించారు. దీంతో అప్పటి నుంచి అందులోనే క్రీడాకారులు శిక్షణ పొందుతూ, జిల్లా స్థాయి టోర్నమెంట్లు, జిల్లాస్థాయి సెలక్షన్స్ నిర్వహిస్తూ పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా అప్పటి ఎంపీ ఝాన్సీలక్ష్మి నిధులతో ఇండోర్కోర్టును వుడెన్ కోర్టుగా అభివృద్ధి చేశారు. సమస్య ఏమిటి.....? పట్టణంలో ఉన్న ఇండోర్ షటిల్ కోర్టుకు ఒక అసోసియేషన్ ఏర్పాటయింది. ఆ అసోసియేషన్‌కు బెల్లాన చంద్రశేఖర్ తండ్రి పేరుతో బెల్లాన సింహాచలం మొమోరియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌గా నామకరణం చేశారు. అయినప్పటికీ బెల్లాన కుటుంబీకులు ఎవ్వరూ అసోసియేషన్‌లో లేరు, కోర్టుకు వస్తున్న ఇతర వ్యక్తులే అసోసియేషన్‌ను లీడ్ చేస్తున్నారు. అయితే షటిల్ క్రీడాభివృద్దికి బెల్లాన చంద్రశేఖర్ ఎనలేని సేవలు అందించడంతోనే ఆయన తండ్రి పేరు ఉంచారు. అంతెందుకు బెల్లాన అందించిన సేవలు గుర్తించే జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయనను ఎన్నుకున్నారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఈ అంశాన్ని తట్టుకోలేని కొంతమంది ప్రభుత్వ గొడౌన్‌ను ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికారులు సైతం ముందూవెనుకా చూడకుండా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.