Indian Universities ranks
-
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారతీయ వర్సిటీల హవా
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు ఇటీవలికాలంలో బాగా మెరుగయ్యాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు దశాబ్దకాలంలో అంతర్జాతీయ వర్సిటీ ర్యాంకింగ్స్‌లో పెరిగిన భారతీయ వర్సిటీల సంఖ్యను ప్రబల తార్కాణంగా ప్రభుత్వం చూపించింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 2015 ఏడాదిలో కేవలం 11 భారతీయ విశ్వవిద్యాలయాలు మాత్రమే ర్యాంక్‌లు సాధిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా 46 వర్సిటీలు ర్యాంక్‌లు సాధించడం విశేషం. అంటే దశాబ్దకాలంలో భారత వర్సిటీలు 318 శాతం వృద్ధిని సాధించాయి. జీ20 సభ్యదేశాల్లో ఇంతటి వృద్ధిని సాధించిన ఏకైక దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర విద్యాశాఖ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే 1950–51 కాలంలో పాఠశాల్లో చేరే వారి సంఖ్య(గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో–జీఈఆర్) కేవలం 0. 4 శాతంగా నమోదైతే ఇప్పుడు 2021–22 నాటికి 71 రెట్లు పెరిగి ఏకంగా 28.4 శాతానికి చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2035 నాటికి 50శాతం జీఈఆర్ లక్ష్యంగా ముందుకు అడుగులు వేçస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ వర్సిటీల ద్వారా 3.25 కోట్ల మందికి విద్య రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య సైతం గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి పదో తేదీన నీతి ఆయోగ్ ఒక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 3.25 కోట్ల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2035 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసే లక్ష్యంతో నూతన జాతీయ విద్య విధానం, 2020ను అమలుచేస్తున్నామని విద్యాశాఖ తెలిపింది. ‘1857లో కోల్‌కతా, ముంబై, మద్రాస్‌లలో తొలి విశ్వవిద్యాలయాలు స్థాపించబడినప్పటి నుంచి దేశ ఉన్నత విద్యావ్యవస్థ గణనీయంగా విస్తరించింది. 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల ద్వారా 2.38 లక్షల మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అక్ష్యరాస్యత రేటు 14 శాతం ఉండటంతో ఆరోజుల్లో విద్య వ్యవస్థ ఆందోళనకరంగా ఉండేది. ఆనాటి రోజుల నుంచి విద్యలో పురోగతి సాధిస్తూ ఈ విశ్వవిద్యాలయాల ద్వారా 81 శాతం విద్యార్థుల నమోదును సాధించాం’’అని కేంద్రం వివరించింది. ఎస్‌పీయూల ద్వారా పురోగతి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2011–12లో 2.34 కోట్ల మంది విద్యార్థులు ప్రభుత్వ వర్సిటీల్లో చదువుకుంటే 2021–22 నాటికి ఆ విద్యార్థుల సంఖ్య 3.24కోట్లకు పెరిగింది. ఓబీసీ విద్యార్థుల్లో వృద్ధి 80.9 శాతం మంది కాగా ఎస్సీ విద్యార్తుల్లో 76.3 శాతం వృద్ధి కనిపించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 16 లక్షల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వరిస్తున్నారు. వీరిలో 68 శాతం మంది లెక్చరర్లు/అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. రీడర్లు/అసోసియేట్ ప్రొఫెసర్లు 10శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే భారత్ నుంచి పరిశోధనా పత్రాలు సైతం గణనీయంగా పెరిగాయి. 2017లో మొత్తం పరిశోధనా పత్రాల్లో భారత్ వాటా కేవలం 3.5 శాతం ఉండగా 2024 ఏడాదిలో అది 5.2 శాతానికి పెరిగింది. -
వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో.. భారత్‌వే 91!
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ సెప్టెంబర్ 27న ప్రకటించిన వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2024లో రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లలో అత్యంత ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు, 2017 తర్వాత తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 2024 ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో భారతదేశం ఇప్పుడు నాల్గవ ఉత్తమ ప్రాతినిధ్యం కలిగిన దేశంగా ఎదిగింది. గతేడాది భారత్ నుంచి కేవలం 75 ఇన్స్టిట్యూట్లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోగా.. ఇండియా ఆరో స్థానంలో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత, అన్నా యూనివర్శిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్శిటీ, శూలినీ యూనివర్శిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్‌లు భారతదేశం నుండి తదుపరి ఉత్తమ సంస్థలు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ 501-600 బ్యాండ్‌లో ఉన్నాయి. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800కి పెరిగింది. కోయంబత్తూరులోని భారతియార్ విశ్వవిద్యాలయం గత సంవత్సరం 801-1000 బ్యాండ్ నుంచి 601-800 బ్యాండ్‌కి మారింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి (IIT గౌహతి) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్ ప్రపంచంలోని టాప్ 800 విశ్వవిద్యాలయాలలో స్థానం పొందాయి. ఈ ఇన్స్టిట్యూట్ తమ ర్యాంకింగ్‌లను 1001-1200 బ్యాండ్ నుండి 601-800కి మెరుగుపరుచుకుంది. జాబితాలో మొదటిసారిగా ప్రవేశించడం ద్వారా, మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జైపూర్ 601-800 బ్యాండ్‌లోకి ర్యాంక్ చేయబడింది. అయితే అనేక అగ్రశ్రేణి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు).. వరుసగా నాల్గవ సంవత్సరం ర్యాంకింగ్‌లను బహిష్కరించి ర్యాంకింగ్‌ల పారదర్శకత, ప్రమాణాలపై సందేహాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఇన్స్టిట్యూట్లలో బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీకి చెందిన ఏడు IITలు ఉన్నాయి. ఐఐటీ గౌహతి గతేడాది ర్యాంకింగ్స్‌లో చేరడం గమనార్హం. -
దేశంలో ఐఐఎస్సీయే టాప్
లండన్: భారత్ విశ్వవిద్యాలయాల్లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే మంగళవారం విడుదలైన క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2016-17 జాబితాలో ఐఐఎస్సీ ర్యాంకు 152కు తగ్గింది. గత ఏడాది జాబితాలో దీనికి 147వ స్థానం లభించింది. తాజా జాబితాలోని తొలి 400 ర్యాంకుల్లో స్థానం దక్కిన ఇతర భారత ఉన్నత విద్యా సంస్థల్లో ఢిల్లీ ఐఐటీ(185), బాంబే ఐఐటీ(219), మద్రాస్ ఐఐటీ(249), కాన్పూర్ ఐఐటీ (302), ఖరగ్‌పూర్ ఐఐటీ (313), రూర్కీ ఐఐటీ(399) ఉన్నాయి. ఈ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ (2), హార్వర్డ్ యూనివర్సిటీ(3), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్(4) తదితరాలున్నాయి.