నేరమయం
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: ఈ ఏడాది జిల్లా నేరాలు-ఘోరాలతో అట్టుడుకింది. ఏ క్షణాన ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న భయం వెంటాడింది. దొంగలు, దోపిడీలు, మోసాలు, దందాలు, లైంగికదాడులు...ఇలా ఒకటేమిటీ రకరకాల నేరాలతో జిల్లా అతలాకుతలం అయింది. మితిమీరిన వేగం, అతుకుల గతుకుల రోడ్లు వందలాది ప్రాణాలను బలిగొన్నాయి. దొంగసారా, నల్లబెల్లం వ్యాపారం జోరందుకున్నాయి. దొంగనోట్లు, గంజాయి రవాణ, జోతిష్యం పేరుతో మోసాలు, క్రికెట్ బెట్టింగ్‌లు, చీటీ నిర్వాహకుల మోసాలు, ఆత్మహత్యలు, హత్యలు, సైబర్‌నేరాలు, చైన్‌స్నాచింగ్‌లు, మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు, భూదందాలు, రియల్ ఎస్టేట్ దోపిడీలు, ఇసుక మాఫియా, కిడ్నాప్లతో 2013 జిల్లా చరిత్రలో ఓ నేరమయ సంవత్సరంగా మిగిలిపోనుంది.
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎంత చురుకుగా వ్యవహరించినా కొన్ని నేరాలను అదుపుచేయలేకపోయారు. ఈ ఏడాది మావోయిస్టుల ప్రాబల్యం బాగా తగ్గింది. మావోయిస్టులపై పోలీసులు పైచేయి సాధించారు. ప్రజాప్రతిఘటన దళం తుడిచిపెట్టుకుపోయేలా పోలీసులు వ్యూహం పన్ని సఫలమయ్యారు. అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు వెళ్తున్న మావోయిస్టు అగ్రనేత సుదర్శన్‌ను పట్టుకునేందుకు మార్చి 23వ తేదీన పోలీసులు విశ్వప్రయత్నంచేశారు. తప్పించుకుపోయిన ఆయన వైరా సమీపంలోని పొలాల్లో ఒకటి, రెండురోజులకే పట్టుబడ్డారు. ఏప్రిల్ 17వ తేదీన ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్ ఆర్ఐ వరప్రసాద్‌ను మావోయిస్టులు అతి కిరాతకంగా హతమార్చారు. జనవరి 20వ తేదీన భధ్రాచలం రూరల్ ప్రాంతంలో నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెరిగిన నేరాలు..
జిల్లాలో 2013 సంవత్సరంలో దొంగతనాలు పెరిగాయి. పగలు, రాత్రి తేడాలేకుండా దొంగలు విజృంభించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. గత ఏడాది రూ.6. 60 కోట్ల చోరీ సొత్తు రికవరీ అయింది. ఈ ఏడాది రూ.7.60 కోట్లు సొమ్మును దొంగలు అపహరించుకుపోగా రూ.3.50 కోట్లు మాత్రమే రికవరీ అయింది. గత ఏడాది ఆరువేల దొంగతనం కేసులు నమోదు కాగా ఈ ఏడాది 14,000 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది బెట్టింగ్‌కు పాల్పడుతూ పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. సుమారు 100 మందిని ఈ రకంగా పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరివద్ద నుంచి లక్షల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలపై కొత్తగూడెం సీఐ రవిని సస్పెండ్ చేశారు. తల్లాడలోని ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేస్తున్న వ్యక్తి వెనుక నిల్చున్న విద్యార్థి ఏటీఎం పిన్ నంబర్ తెలుసుకుని ఖమ్మం డిపో రోడ్డులోని నెట్‌సెంటర్ నుంచి నెట్ మార్కెటింగ్‌కు పాల్పడ్డాడు. జిల్లాలో ప్రతిభాగోల్డ్, శ్రీ చక్ర గోల్డ్ పేరుతో కోట్లల్లో మో సాలకు పాల్పడ్డారు. ప్రభుత్వాస్పత్రిలో బాలిక ను కిడ్నాప్ చేశారు. శిశు విక్రయాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమైన దొంగతనాలు, నకిలీ బంగారం తాకట్టు, దొంగనోట్ల వివరాలు...
* నవంబర్ 8వ తేదీన శ్రీరామ్ చిట్‌ఫండ్స్ కార్యాలయం లాకర్లో ఉంచిన 10 కిలోల బంగారం, ఆభరణాలు, రూ.6లక్షల నగదు చోరీకి గురయ్యాయి.
జనవరి 9వ తేదీన దొంగనోట్ల వ్యవహారంలో భద్రాచలం ఎస్ఐ జితేందర్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు.
*జూన్ 11న ఖమ్మంలో జోతిష్యాలయం పేరుతో మోసాలకు పాల్పడుతున్న బెంగళూరుకు చెందిన కృష్ణను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.2.86 లక్షల నగదు, ఒక ఉంగరం స్వాధీనం చేసుకున్నారు.
*జనవరి 4న గంజాయి, నల్లబెల్లం తరలిస్తున్న లారీని కొత్తగూడెంలో వన్‌టౌన్ సీఐ నరేష్కుమార్ దాడి చేసి పట్టుకున్నారు.
* జనవరి 11న చండ్రుగొండ మండలం రావికంపాడు సమీపంలోని తండాల్లో గంజాయి మొక్కలను పెంచుతుండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.
* జూన్ 2న ఖమ్మం అర్బన్మండలంలో అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్న లారీపై అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.
* ఫిబ్రవరి 15న కారేపల్లి మండలంలో 17 టన్నుల నల్లబెల్లం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
రక్తమోడిన రహదారులు
* జూన్ 6న తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్ద ఆటో, లారీ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఐదుగురు మృతిచెందారు.
* జూన్ 7న నేలకొండపల్లి మండలంలో ఆటో, డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు మరణించారు.
* మే 23న అశ్వారావుపేట మండలంలో పెళ్లి ఊరేగింపు బృందంపైకి లారీ దూసుకుపోవడంతో వధువుతో సహా నలుగురు చనిపోయారు.
* ఆగస్టు 23న స్నేహితుడి వివాహానికి కారులో వెళ్తున్న హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు వైరా సమీపంలో కారు చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురూ మృతిచెందారు.
లైంగిక దాడులు
* జనవరి 3వ తేదీన కామేపల్లి మండలం బర్లగూడెంలో ఓ మహిళ పట్టపగలు ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన బానోతు సక్రు లైంగికదాడికి యత్నించాడు.
* జనవరి 2న ఖమ్మం అర్బన్ మండలం చింతగుర్తికి చెందిన ఓ మహిళ తన భర్తకు ఫోన్ చేసేందుకు బయటకు వచ్చి మాట్లాడుతుండగా, భర్తకు సోదరుడి వరుసైన ఎ. వెంకటేశ్వర్లు లైంగికదాడికి యత్నిం చాడు.
* జనవరి 10న వెంకటాపురం మండ లం చిన్న గంగారానికి చెందిన యువ తి పశువులను మేపేందుకు వెళ్లగా, అదే గ్రామానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు లైంగికదాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది.
* ఫిబ్రవరి 9న చండ్రుగొండ మండలం కరిసెలబోడు గ్రామానికి చెందిన ఓ మహిళపై ఆర్ఎంపీగా పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది.
* మే 17న కూసుమంచి మండలం మల్లాయిగూడెంలో ఓ బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించాడు.
హత్యలు..
* జనవరి 8న దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో నీలం నరేష్ అనే హోంగార్డును మావోయిస్టులు కాల్చి చంపారు.
* జూన్ 10న దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన ఊకే రాజమ్మను వివాహేతర సంబంధం కలిగి ఉన్న నాగరాజు అనే వ్యక్తి హత్య చేశాడు.
* ఫిబ్రవరి 27న జూలూరుపాడు మండలం ఒంటిగుడిసెలో యువతి రేణుక హత్యకు గురైంది.
* ఫిబ్రవరి 16 చర్ల మండల కేంద్రంలో ఓ కొడుకు తల్లిని హతమార్చాడు.
* ఫిబ్రవరి10నకొత్తగూడెం మండలంరేగళ్ల గ్రా మంలో పిట్టల రమేష్‌ను అతని భార్య సారి క, ప్రియుడు శేషగిరితో కలిసి హతమార్చిం ది.
* మే 18న ఏన్కూరు సమీపంలోని జన్నారం అడ్డరోడ్డులో కారు యజమానిని దుండగులు హత్య చేసి కారుతో పరారయ్యారు.
* జనవరి 10న ఖమ్మం అర్బన్ మండలంలోని రాంక్యాతండాలో వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు మహిళలను చంపి ఉరివేశారు.
* జూన్ 6న ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెంలో కన్నతండ్రే గొడ్డలితో కూతురిని నరికి చంపాడు.
ఆత్మహత్యలు...
* తండ్రి బైక్ కొనివ్వలేదనే మనస్తాపంతో జనవరి 4న ఖమ్మం గ్రెయిన్ మార్కెట్ రోడ్డులో ఇంజనీరింగ్ విద్యార్థి అభివన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
* జనవరి 28న వెంకటాపురం మండలం మరికాల గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న పచ్చా రమాదేవిని తల్లి మందలించడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
* జనవరి 26న ఖమ్మం రిక్కాబజార్కు చెందిన గడ్డం రాము కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
* మే 24న దుమ్ముగూడెం మండలం పర్ణశాల శివారు ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా రేగొండ మండలం నిజాంపేటకు చెందిన బైరి కృష్ణమోహన్, వాణిలుగా వీరిని గుర్తించారు.
* మే 29న టేకులపల్లి మండలం లచ్చుతండాకు చెందిన గుగులోతు సుక్కి హెడ్‌కానిస్టేబుల్ వేధింపులకు తాళలేక స్టేషన్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
* జూన్ 13న ఖమ్మం శ్రీనివాసనగర్‌లోని బెస్తకాలనీకి చెందిన బైర్రాజు వెంకన్న కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.