breaking news
HVDS
-
ట్రాన్స్ఫార్మర్ కష్టాలు!
వీరఘట్టం, న్యూస్‌లైన్ :వ్యవసాయ విద్యుత్ సరఫరాలో పంపిణీ నష్టాలను నివారించి అన్నదాతకు మేలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం హైవోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(హెచ్‌వీడీఎస్) పథకాన్ని రూపొం దించింది. ప్రస్తుతం ఉన్న పెద్ద ట్రాన్స్ఫార్మర్ల వల్ల పంపిణీ నష్టాలు పెరుగుతున్నాయి. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 20 నుంచి 30 వరకు వ్యవసాయ బోర్లు ఉంటున్నాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పెరిగి లోవోల్టే జీ సమస్య ఏర్పడుతోంది. ఫలితంగా వ్యవసాయ పంపుసెట్ల మోటార్లు తర చూ కాలిపోతున్నాయి. అందుకే పెద్ద ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హెచ్‌వీడీఎస్ పథకాన్ని రూపొందిం చారు. దీనికింద 3 నుంచి 5 వ్యవసాయ కనెక్షన్లకు ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ చొప్పున ఏర్పాటు చేస్తారు. దీనివల్ల పంపిణీ నష్టాలు తగ్గుతాయి. లోవోల్టేజీ సమస్య తీరిపోతుంది. వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం చాలావరకు తగ్గిపోతుంది. జిల్లాలో ఈ పథకానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. హైదరాబాద్‌కు చెందిన జీవీఎస్ సంస్థకు రూ.38 కోట్లతో టెండరును కట్టబెట్టింది. దీంతో సమస్య తీరుతుంద ని రైతులు ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. చేతులేత్తేసిన కాంట్రాక్ట్ సంస్థ రూ.38 కోట్ల భారీ టెండరు దక్కించుకున్న జీవీఎస్ సంస్థ హెచ్‌వీడీఎస్ అమలులోపూర్తిగా చేతులెత్తేసింది. టెండర్ నిబం ధనల ప్రకారం 2013జూలైనాటికి జిల్లాలో ఉన్న 25,565 వ్యవ సాయ పంపుసెట్లను హెచ్‌వీడీఎస్ కిందకు తీసుకురావాలి. నిర్దేశిత గడువు ముగిసి ఆరునెలలు దాటింది. కానీ జిల్లాలో 20 శాతం పనులు కూడా పూర్తికాలేదు. తొలుత రణస్థలం, లావే రు, ఎచ్చెర్లమండలాల్లో పనులు ప్రారంభించి 2013 జులై నాటి కి జిల్లా అంతటా పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ జిల్లా అం తటా దేవుడెరుగు.. కనీసం లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో కూడా పనులు పూర్తి చేయలేదు. లావేరు మండలంలో 350 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 150 ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే అమర్చారు. మెట్టవలస, బుడుమూరు, రొంపివలస, లక్ష్మీపురం, రేగపాలెం, బుడతవలస గ్రామాల్లో అరకొర పనులతో సరిపెట్టారు. రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. పట్టించుకోని అధికారులు అన్నదాతకు ఎంతో మేలు చేసే హెచ్‌వీడీఎస్ పథకాన్ని సకాలంలో పూర్తిచేయాలన్న ఉద్దేశం కాంట్రాక్టు సంస్థకు ఉన్నట్లు కనిపించడం లేదు. పనులు 20 శాతం కూడా పూర్తికాకపోయినా ఈస్ట్రన్ డిస్కం అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ సంస్థను మందలించి పనులు చేయించాలన్న ధ్యాస కూడా వారికి లేకుండాపోయింది. తప్పనిసరైతే కాంట్రాక్టు రద్దు చేసి మరో సంస్థకు అప్పగించవచ్చు. కానీ అధికారులు ఆ దిశగా కూడా ప్రయత్నించడం లేదు. కమీషన్లు దండుకోవడానికే వారు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాతకు తప్పని వెతలు హెచ్‌వీడీఎస్ పథకం అమలుకాకపోవటంతో అన్నదాతలకు విద్యుత్ కష్టాలు కొనసాగుతున్నాయి. వేసవి వస్తుండటంతో విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం 4 గంటలు కూడా ఇవ్వడం లేదు. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో లోవోల్టేజీ సమస్య వేధిస్తోంది. ట్రాన్స్ఫార్మర్లకు శివారులో ఉన్న పంపుసెట్లకు సమస్య మరింత ఎక్కువగా ఉంది. లోడు పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. రైతుల పంపుసెట్ల మోటార్లు కూడా కాలిపోతున్నాయి. దీంతో మరమ్మతుల ఖర్చు అన్నదాతకు అదనపు భారమవుతోంది. ఒక్క పాలకొండ డివిజన్‌లోనే గడచిన నెల రోజుల్లో 200కుపైగా మోటార్లు కాలిపోయాయి. మరోవైపు కాలిపోయిన పెద్ద ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు రైతులే చందాలు వేసుకుని పాలకొండ తీసుకువెళ్లాల్సి వస్తోంది. చిన్నచిన్న ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తే ఈ కష్టాలన్నీ తీరుతాయి. కానీ పథకాన్ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి అటు కాంట్రాక్టు సంస్థకు, ఇటు అధికారులకు లేకుండాపోయింది. దీంతో నిధులున్నా పనులు పూర్తికాక అన్నదాతలు కుంగిపోతున్నారు. -
చేతులెత్తేశారు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన హై ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్ స్కీం(హెచ్‌వీడీఎస్) అమలు అటకెక్కింది. 2009 జనవరిలో ప్రారంభమైన ఈ పథకం అమలు కాంట్రాక్టరు చేతులెత్తేయడంతో అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇదే పథకం కింద తాజాగా మరో రూ.100 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత అనుభవాల నేపథ్యంలో ప్రస్తుతం పథకం అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునికీకరించడం లక్ష్యంగా 2009 జనవరిలో రూ.47.49 కోట్లతో హెచ్‌వీడీఎస్ కింద పనులు ప్రతిపాదించారు. లో ఓల్టేజీ సమస్య నివారించి, సరఫరాలో విద్యుత్ నష్టాన్ని అరికట్టడం ఈ పథకం ఉద్దేశం. వదులుగా వున్న తీగలను, శిథిలావస్థలో వున్న స్తంభాలను సరిచేయడం, 25 కేవీ, 16 కేవీ సామర్థ్యమున్న ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సెంట్రల్ పవర్ డిస్కమ్ పరిధిలోని మెదక్ సర్కిల్లో 20 ఫీడర్ల పరిధిలో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. 100 కేవీ సామర్థ్యమున్న 589 ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో తక్కువ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. సర్కిల్ పరిధిలోని పనులన్నీ హైదరాబాద్‌కు చెందిన ఐసీఎస్ఏ అనే సంస్థకు టెండర్ ద్వారా అప్పగించారు. అయితే కాంట్రాక్టు సంస్థ 521 ట్రాన్స్ఫార్మర్లను మాత్రమే మార్చగలిగింది. రూ.41.49 కోట్లు ఖర్చు చేసినట్లు సీపీడీసీఎల్ అధికారులు చెప్తున్నారు. కాంట్రాక్టు సంస్థ అర్ధంతరంగా చేతులెత్తేయడంతో హెచ్‌వీడీఎస్ పనులు మెదక్ సర్కిల్ పరిధిలో నిలిచిపోయాయి. ‘షార్ట్ క్లోజింగ్’ పద్ధతిలో పనులు నిలిపివేసినట్లు కన్స్ట్రక్షన్ డీఈ రాజశేఖరం ‘సాక్షి’కి వెల్లడించారు. పనులు మధ్యలోనే వదిలేసి వెళ్లిన కాంట్రాక్టు సంస్థకు జరిమానా విధించే అధికారం కార్పొరేట్ ఆఫీసుకు మాత్రమే వుందని అధికారులు చెప్తున్నారు. రూ.100 కోట్లతో ప్రతిపాదనలు... గతంలో హెచ్‌వీడీఎస్‌ను సక్రమంగా అమలు చేయలేని అధికారులు తాజాగా ఇదే పథకం కింద రూ.100 కోట్లతో పనులు ప్రతిపాదించారు. జపాన్ ఆర్థిక సంస్థ(జికా) సహాయంతో మెదక్ సర్కిల్లో 85 ఫీడర్ల పరిధిలో ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం 1800కు పైగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి వుంటుంది. గతంలో సర్కిల్ అంతటికీ ఒకే కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయగా, ప్రస్తుతం ఒక్కో డివిజన్లో ఒక్కో సంస్థకు పనులు అప్పగించనున్నారు. ఇప్పటి వరకు మూడు డివిజన్ల పరిధిలో టెండర్ ద్వారా కాంట్రాక్టరును ఎంపిక చేసి లెటర్ ఆఫ్ ఇండెంట్(ఎల్ఓఐ) కూడా జారీ చేశారు. కాంట్రాక్టు దక్కిన సంస్థలు రెండేళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. గతంలో హెచ్‌వీడీఎస్‌ను అడ్డుపెట్టుకుని సంబంధిత అధికారులు, సిబ్బంది చేతి వాటం చూపినట్లు ఆరోపణలు వున్నాయి. రైతుల నుంచి డబ్బు వసూలు చేసి కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారని విమర్శలు వచ్చాయి. ఈ పథకం కింద మంజూరైన సామగ్రికి కూడా పూర్తి లెక్కలు కూడా లేవనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పనుల అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.