గృహ నిర్మాణాల్లో నాణ్యత పాటించకుంటే చర్యలు
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ కేవీ రమణ
నెల్లూరు (పొగతోట) : ఎస్టీఆర్ గృహ నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రమణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక గోల్డన్జూబ్లీ హాల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల హౌసింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎండీ మాట్లాడారు. 2017 మార్చి నాటికి రెండు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లాకు 10,500 గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు 7375 మంది లబ్ధిదారులను గుర్తించి 7,207 మందికి గృహాలు మంజూరు చేశామని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో గృహనిర్మాణాలు వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్నారు.రాష్ట్రంలో గృహనిర్మాణ సంస్థ అధికారులపై విశ్వాసంతో సీఎం నిర్మాణాల అమలుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో గృహనిర్మాణ సంస్థ పీడీ ధనుంజయుడు, ఎస్ఈలు శ్రీరాములు, సీహెచ్ మల్లికార్జునరావు, ఎంజీఎస్ ప్రసా«ద్, రెండు జిల్లాల డీఈలు పాల్గొన్నారు.