వైభవంగా సుదర్శన హోమం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం వైభవంగా సుదర్శన హోమం నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించారు. ముందుగా కలశ ప్రతిష్టాపన, అగ్ని ప్రతిష్టాపన చేసి సుదర్శన హోమం నిర్వహించారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ఈ వేడుకను జరిపించారు. అనంతరం స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం స్వామి వారికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, తీర్ధ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆంజనేయస్వామికి అభిషేకం
రామాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి వారికి మంగళవారం అభిషేకం చేశారు. ఉదయం పవిత్ర గోదావరి నది జలాలు, నారికేళ జలాలు, హరిద్రా చూర్ణాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అనంతరం లక్ష తమలపాకులతో సహస్రనామార్చన చేసి ప్రత్యేక పూజలు చేసి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.