breaking news
HIV attacked
-
హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...
ఏదైనా వ్యాధి సోకితే మానవుల్లోని వ్యాధి నిరోధక శక్తి / వ్యవస్థ దాన్ని సమర్థంగా ఎదుర్కొంటాయి. అయితే... ఎయిడ్స్ వ్యాధి ప్రత్యేకత ఏమిటంటే... అది దేహంలోని జబ్బుల్ని ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తినే దెబ్బతీస్తుంది. దాంతో చిన్న చిన్న సాంక్రమిక వ్యాధులకే బాధితులు తేలిగ్గా లొంగిపోతారు. హెచ్ఐవి వైరస్ క్రిమికి ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాల కారణంగా సమీప భవిష్యత్తులో దీనికి వ్యాక్సిన్ రూపొందే పరిస్థితి లేదు. అయినప్పటికీ 25 రకాల ఏంటి రెట్రో వైరల్ ఔషధాల తోపాటు ఓ ఇంజెక్షన్‌తో ఈ వ్యాధిని నివారించడం సాధ్యమేనని తేలింది. ఇది ఇంచుమించూ టీకాలాగే పనిచేస్తూ జబ్బు బారిన పడకుండా చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం. హెచ్ఐవీకి టీకా రూపొందించడానికి అనేక సాంకేతిక ప్రతిబంధకాలు ఉన్నాయి. సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే... ఏదైనా టీకాను అభివృద్ధి చేస్తే... అది ఆ వ్యాధి నుంచి రక్షణ కల్పించేలా ‘వ్యాధి నిరోధక వ్యవస్థ’ను ప్రేరేపితం చేస్తుంది. కానీ ఈ వైరస్ మానవ వ్యాధి నిరోధక వ్యవస్థలోని కీలక కణాలైన సీడీ4 లింఫోసైట్స్ తదితర కణాల జీన్స్‌లో కలిసిపోతుంది. దాంతో ఇన్ఫెక్షన్ శాశ్వతమైపోయి వ్యాధి నిరోధక వ్యవస్థే కుప్పకూలిపోయి, దీర్ఘ కాలంలో ఎయిడ్స్ వస్తుంది. అందుకే ఎయిడ్స్‌కు టీకా అభివృద్ధి చేయడం సాధ్యం కా(లే)దు. అయినప్పటికీ హెచ్ఐవీని నిరోధించేందుకు పరిశోధనలింకా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఇంజెక్షన్‌తో విప్లవాత్మక మార్పు... గతేడాది అంటే... 2024 జూలైలో దక్షిణ ఆఫ్రికాకి చెందిన పరిశోధకులు డాక్టర్ లిండా గేయిల్ బెక్కర్ తదితరులు... హెచ్ఐవీని నిరోధించడానికి ప్రీఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్గా ఓ సరికొత్త ఇంజక్షన్ ‘లెనకపావిర్’ సమర్థంగా పనిచేస్తుందని ప్రకటించారు. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన ప్రయోగంలో... తమ భర్తలకు హెచ్ఐవీ పాజిటివ్ ఉండి... తాము మాత్రం నెగెటివ్ అయిన ఓ 3204 మంది మహిళలకు (అంటే... సీరో డిస్కార్డెంట్ విమెన్‌కు) టెనొఫోవిర్, ఎమ్ ట్రైసిటాబైన్ అనే మందులు ఇచ్చారుగానీ వారిలో 35 మందికి హెచ్ఐవీ సోకింది. ఇక మరో ప్రయోగంలో మరో 2134 మంది సీరో డిస్కార్డెంట్ మహిళలకి సరికొత్త ఔషధం అయిన లెనకపావిర్ (927 మిల్లీగ్రాముల) ఇంజక్షన్స్ ని ఆరు నెలలకు ఒకటి చొప్పున, ఏడాదిలో రెండు ఇంజెక్షన్స్ ఇచ్చారు. వీళ్లలో ఒక్కరికి కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ సోకలేదు. దీంతో హైరిస్క్ గ్రూపుల్లో, అంటే... భర్త హెచ్ఐవి పాజిటివ్ అయి, భార్య నెగిటివ్‌గా ఉన్న పరిస్థితుల్లో ఈ ఇంజక్షన్స్‌తో ఎయిడ్స్‌ను సమర్థంగా నివారించవచ్చని తేలింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన లెనకపావిర్ ఇంజక్షన్ తాలూకు ఒక్క మోతాదు ఆరు నెలలపాటు రక్షణ ఇస్తుండడంతో అనేక ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఎయిడ్స్ వ్యాప్తి నిరోధానికి ఈ ఇంజెక్షన్‌ను వాక్సిన్ (టీకా) తరహాలోనే ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అసలీ లెనకపావిర్ కాప్సిడ్ ఇన్హిబిటర్ ఎలా పనిచేస్తుదంటే... హెచ్ఐవీ తాలూకు జీన్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్... ఈ అన్నింటినీ కలిపి ‘కోర్’ (న్యూక్లియో కాప్సిడ్) అంటారు. ఈ ‘కోర్’ని కలిపి ఉంచే ఒక సంచి వంటి నిర్మాణమే కాప్సిడ్. ఈ క్యాప్సిడ్ మూలంగానే హెచ్ఐవి తాలూకు ‘కోర్ ’కు ఓ శంఖువు లాంటి ఆకృతి వస్తుంది. ఈ కోర్ తాలూకు ప్రోటీన్‌నే ‘పీ 24 ఏంటిజెన్’గా పిలుస్తారు. ఇన్ఫెక్షన సోకిన తొలివారాల్లో దీన్ని గుర్తించడానికి ప్రత్యేక టెస్ట్‌లు ఉన్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లెనాకపావిర్ అనేది ‘కాప్సిడ్ ఇన్హిబిటర్ ’ ఔషధం. అంటే... వైరస్ సంక్రమించే సందర్భంలో కాప్సిడ్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు... న్యూక్లియస్ క్యాప్సిడ్ లోని భాగాలు ‘కోర్’గా మారి, దాని చుట్టూ సంచి వంటి కాప్సిడ్ ఏర్పడకుండా అడ్డుతుంది. అంతేకాదు... హెచ్ఐవీ జన్యువుల్లోని అణువులను అది మానవుల కణాల్లోకి విడుదల కాకుండా అడుకట్ట వేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ ఇంజెక్షన్ హెచ్ఐవీ లోని జన్యువులను మనిషి జీన్స్‌లో కలిసే ప్రక్రియని అడ్డుకుంటుందని చెప్పవచ్చు. లెనాకపావిర్ ప్రత్యేకతలివి... ఇప్పటివరకు ఉన్న యాంటీ రెట్రోవైరల్ మందులు... హెచ్ఐవీ సోకి అది మానవుల్లో వృద్ధి చెందే దశల్లోని ఏదో ఒక దశలో మాత్రమే అడ్డుకొంటాయి. అయితే లెనాక΄ావిర్ మాత్రం హెచ్ఐవీ క్రిమి వృద్ధి చెందడాన్ని మూడు దశలలో అడ్డుకుంటుంది. అంతేకాదు... ఈ మందు ఆర్నెల్ల పాటు పనిచేస్తుంది. అంటే ఏడాదికి రెండు ఇంజెక్షన్లతోనే ఏడాదంతా హెచ్ఐవీ / ఎయిడ్స్ రాకుండా చూస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే... ముందుగా ఓ టీకా, ఆర్నెల్ల తర్వాత ఓ బూస్టర్ డోస్ ఎలా పనిచేస్తాయో, ఈ ఇంజెక్షన్ తాలూకు రెండు మోతాదులు అదే పనిచేస్తాయి. పైగా హెచ్ఐవీ బాధితులకు ఇప్పుడు అనేక మందుల్ని రకరకాల కాంబినేషన్లలో వాడుతుంటారు. మందులు పెరుగుతున్న కొద్దీ హెచ్ఐవి క్రిమి వాటికి రెసిస్టెన్స్ పెంచుకుని, వాటికి లొంగకుండా తయారయ్యే అవకాశాలెక్కువ. అలాంటి వారిలో లెనకపావిర్ను ఏదో ఒక మందుతో కలిపి వాడుతున్నారు. ఈ రకంగా చూసినప్పుడు కూడా లెనకపావిర్ అనే ఈ ఇంజెక్షన్ ఎయిడ్స్ బాధితుల పాలిట ఆశారేఖగా నిలుస్తోంది.అదుపునకు కొన్ని మార్గాలివి...కండోమ్స్, డిస్పోసబుల్ సిరంజీల వాడకం తోపాటు, బ్లడ్ బ్యాంకులలో హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేయడం వల్ల హెచ్ఐవీ వ్యాప్తిని కొంతమేరకు అదుపు చేయడం సాధ్యమైంది. అయితే ఈ జబ్బుకు గురయ్యేందుకు అవకాశమున్న అనేక వర్గాలకు ముందుగానే ఇచ్చేలా ‘ప్రీ ఎక్సపోజర్ ప్రొఫైలాక్సిస్’ (ప్రెప్ ) వంటి ప్రక్రియలూ, అలాగే ఈ జబ్బు ఉన్న వారికి సేవలు చేసే సందర్భాలలో ప్రమాదవశాత్తు జబ్బు వచ్చే అవకాశం ఉన్న డాక్టర్లు, నర్సుల వంటివారికి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్’ (పెప్)ల వంటి ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. (చదవండి: సార్కోమాను ఎదుర్కోలేమా!) -
మసాజ్‌కు వెళ్తే.. హెచ్ఐవీ వచ్చింది
మసాజ్ కేంద్రానికి వెళ్లిన యువకులను రెచ్చగొట్టి.. యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని, అలా వెళ్లిన తనకు హెచ్ఐవీ సోకిందని బాధితుడు నగర పోలీస్ కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఆ కేంద్రాన్ని సీజ్ చేసి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాలు మేరకు.. పాత ఎయిర్ పోర్టు రోడ్డులోని దొమ్మలూరులో ఉస్మాన్ అనే వ్యక్తి ఓ మసాజ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీకి చెందిన యువతులతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. యువతుల అర్ధనగ్న ఫొటోలతో ఇంటర్నెట్లో ప్రచారం చేశాడు. మసాజ్ కేంద్రానికి వెళ్లిన యువకులను రెచ్చగొట్టి యువతులతో వ్యభిచారం చేయించసాగాడు. విటులను ఆకర్షించడానికి ముగ్గురు పింప్‌లను పెట్టాడు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి (29) కొద్ది రోజుల క్రితం ఆ మసాజ్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఒక యువతికి రూ. 25 వేలు చెల్లించి లైంగిక కోర్కెలు తీర్చుకున్నాడు. ఇటీవల పదేపదే జ్వరం వస్తుండటంతో ఈనెల 11న ఆస్పత్రికి వెళ్లిన అతనికి హెచ్ఐవీ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ బాధితుడు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. మసాజ్ కేంద్రం ముసుగులో వ్యభిచారం చేయిస్తూ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆ కేంద్ర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు సీసీబీ పోలీసులు సోమవారం రాత్రి ఆ కేంద్రంపై దాడి చేశారు. ముగ్గురు పింప్‌లను అరెస్టు చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబాయికి చెందిన నలుగురు యువతులను రక్షించారు. పరారీలో ఉన్న ఉస్మాన్ కోసం గాలిస్తున్నట్లు సీసీబీ పోలీసులు మంగళవారం తెలిపారు.