breaking news
hasmukh
-
సీబీఐకి చిక్కిన మరో డైమండ్ డైరెక్టర్
ముంబై : విన్సమ్ డైమండ్ గ్రూప్ బ్యాంకు కుంభకోణ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) కీలక పురోగతి సాధించింది. ఫరెవర్ డైమండ్స్ మాజీ డైరెక్టర్ హస్ముఖ్ షాను దర్యాప్తు ఏజెన్సీ అరెస్ట్ చేసింది. విన్సమ్ డైమండ్, ఫరెవర్ డైమాండ్స్ రెండు కలిసి బ్యాంకుల నుంచి దాదాపు రూ.7000 కోట్ల రుణం తీసుకున్నాయి. ఈ రుణమంతటిన్నీ ఈ సంస్థలు బ్యాంకులకు కట్టడం మానేశాయి. 2013లో భారీ డిఫాల్ట్‌గా మారిపోయాయి. 2017 ఏప్రిల్‌లో విన్సమ్ డైమాండ్‌కు వ్యతిరేకంగా సీబీఐ కేసు రిజిస్ట్రర్ చేసింది. సీబీఐ వర్గాల సమాచారం మేరకు హస్ముఖ్ షా, ఫరెవర్ ప్రెషియస్ జువెల్లరీ, డైమాండ్స్‌కు అధికారిక సంతకం దారి. షా అరెస్ట్‌తో ఈ కేసులో ప్రధాన పురోగతిని సీబీఐ సాధించగలిగిందని, బ్యాంకు అధికారులకు, కంపెనీ అధికారులకు మధ్యనున్న జరిగిన విషయాలను వెల్లడించే అవకాశముందని తెలిసింది. బ్యాంకుతో ఆయన వ్యవహరించేటప్పుడు, రుణాలను సేకరించడానికి, సంస్థకు క్రెడిట్ లేఖలు జారీచేసే బాధ్యతలు చేపట్టేవారు. అప్పట్లో .. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం నుంచి విన్సమ్ డైమండ్ గ్రూప్‌నకు చెందిన విన్సమ్ డైమండ్ అండ్ జ్యుయలర్స్, ఫరెవర్ ప్రెషియస్ డైమండ్ అండ్ జ్యుయలరీ, సూరజ్ డైమండ్స్ సంస్థలు రూ. 6,800 కోట్లు రుణం తీసుకున్నాయి. ఇందులో పీఎన్బీనే అత్యధికంగా రూ. 1,800 కోట్లు ఇచ్చింది. నీరవ్ మోదీ కేసులోని లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ తరహాలోనే బ్యాంకులు .. విన్సమ్ గ్రూప్ కంపెనీలకు అంతర్జాతీయ బులియన్ బ్యాంకులు బంగారాన్ని సరఫరా చేసేందుకు వీలుగా స్టాండ్‌బై లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చాయి. వీటి ప్రకారం.. బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఒకవేళ విన్సమ్ గ్రూప్ సంస్థలు గానీ నిధులు చెల్లించడంలో విఫలమైతే.. ఆ మొత్తాలను బులియన్ బ్యాంకులకు ఈ బ్యాంకులు కట్టాల్సి ఉంటుంది. విన్సమ్ గ్రూప్.. కొన్నాళ్లకి గల్ఫ్ దేశాల్లోని కొందరు కస్టమర్లు డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో 1 బిలియన్ డాలర్లు నష్టపోవడంతో తమకు రావాల్సిన బాకీలు కట్టలేదన్న కారణంతో బులియన్ బ్యాంకులకు కట్టడం మానేసింది. 2013లో డిఫాల్ట్‌లు మొదలయ్యాయి. అదే ఏడాది విన్సమ్ డైమండ్ గ్రూప్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా బ్యాంకులు ప్రకటించాయి. దీనిపై పీఎన్బీ ఫిర్యాదుతో ప్రారంభమైన సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది. రూ.172 కోట్ల విలువైన విన్సమ్ డైమాండ్ ప్రాపర్టీలను ఈడీ అటాచ్ చేసింది. -
సేవలపై 18% పన్ను!
► జీఎస్టీ మండలికి నివేదిస్తాం ► రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడి న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లో భాగంగా సేవలపై గరిష్టంగా 18 శాతం పన్ను వసూలు చేయవచ్చని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. ఈ ప్రతిపాదనను జీఎస్టీ మండలికి నివేదిస్తామని, సమీక్ష అనంతరం సేవా పన్ను రేట్లపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. 18శాతం ప్రతిపాదనకు జీఎస్టీ మండలి అంగీకరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సేవా రంగంపై గరిష్టంగా 14 శాతం పన్ను విధిస్తుండగా.. అర శాతం చొప్పున స్వచ్ఛ భారత్, క్రిషి కల్యాణ్ పన్నుల్ని వసూలు చేస్తున్నారు. ప్రస్తుత గరిష్ట పన్ను 15 శాతాన్ని 18 శాతానికి పెంచితే కొన్ని సేవల ధరలు పెరగవచ్చు. జీఎస్టీకి ముందు కొనసాగినట్లే వైద్య, విద్య, వ్యవసాయ రంగాల్ని సేవా పన్ను పరిధి నుంచి మినహాయించవచ్చని అధియా పేర్కొన్నారు. ప్రస్తుతం మినహాయింపు జాబితాలో ఉన్న సేవలపై ఎలాంటి పన్ను లేకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. విద్య, వైద్యం, మతపరమైన తీర్థయాత్రలు వంటి 60 సేవలకు సేవాపన్ను నుంచి మినహాయింపు కొనసాగుతోంది. వ్యవసాయదారులు తప్ప మిగతా అందరూ జీఎస్టీ కింద నమోదు చేసుకోవాలని, వారి ఉత్పత్తులు సేవా పన్ను కిందకు వస్తాయా? లేదా? అనేది జీఎస్టీ మండలి నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి మినహాయింపుల జాబితా రూపొందించలేదని, వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను విధించకపోవచ్చని అధియా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం 15 శాతం కంటే తక్కువ పన్ను వసూలు చేస్తున్న రవాణా వంటి రంగాలపై సేవా పన్ను తక్కువ ఉండేలా ప్రయత్నిస్తామని, రవాణా రంగాన్ని 5 లేదా 12 శాతం పన్ను జాబితాలో చేర్చే అవకాశముందన్నారు. అలాగే అధిక శాతం శాతం వస్తువుల్ని సామాన్యుడికి ఇబ్బంది కలిగించకుండా తక్కువ పన్ను జాబితాలోనే చేర్చవచ్చని, కొన్ని వస్తువులపై అధిక పన్ను వసూలు చేయవచ్చని తెలిపారు. జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం జీఎస్టీకి సంబంధించిన నాలుగు సహాయక చట్టాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీంతో జూలై 1 నుంచి దేశమంతా ఒకే పన్ను వసూలుకు మార్గం మరింత సుగమమైంది. రాష్ట్రపతి ఆమోదించిన చట్టాల్లో కేంద్ర జీఎస్టీ చట్టం 2017, సమీకృత జీఎస్టీ చట్టం 2017, జీఎస్టీ(రాష్ట్రాలకు పరిహారం)చట్టం–2017, కేంద్ర పాలిత ప్రాంత జీఎస్టీ చట్టం 2017లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ బిల్లుల్ని మార్చి 29న లోక్‌సభ, ఏప్రిల్ 6న రాజ్యసభ ఆమోదించాయి. సీజీఎస్టీలో భాగంగా రాష్ట్ర పరిధిలో సరుకుల సరఫరా, సేవలపై పన్ను వసూలు చేస్తారు. ఇక సమీకృత జీఎస్టీలో.. రాష్ట్రాల మధ్య వస్తువుల సరఫరా, సేవలపై కేంద్రానికి పన్ను విధించే అవకాశముంటుంది. జీఎస్టీ అమలుతో ఏర్పడే రాష్ట్రాల రెవెన్యూ నష్టాల్ని జీఎస్టీ పరిహార చట్టం మేరకు భర్తీచేస్తారు . కేంద్ర పాలిత ప్రాంతాల్లో వస్తువుల సరఫరా, సేవలపై పన్నును వసూలు చేసేందుకు యూటీజీఎస్టీ అవకాశం కల్పిస్తుంది. కాగా మే 18, 19న జరిగే జీఎస్టీ మండలి భేటీలో ఏఏ వస్తువులు ఏ పన్ను పరిధిలో ఉంచాలన్న అంశంపై చర్చిస్తారు.