breaking news
Haldhar Naag
-
అడవికి పూచిన మహాకవి
అతను కవిత్వం రాసే వరకు దేశానికి ‘కోసలి’ భాష ఒకటుందని తెలియదు. అతన్ని చూసే వరకు అడవి కూడా ఒక మహాకవిని పుట్టించగలదని తెలియదు. నగ్నపాదాలతో నడిచే అతగాడు పొరలు కప్పుకోని మనిషి కోసం స్వప్నిస్తాడు. ఈ భూప్రపంచాన్ని ఒకే ఇంటిగా మార్చమని ఉద్బోధిస్తాడు. మూడో తరగతి వరకే చదివి, వంటవాడిగా జీవితమంతా కట్టెలు ఎగదోసి ఆ అగ్నిలో నుంచి అతడు తీసిన స్వచ్ఛమైన కవిత్వం ఇవాళ అతనికి గొప్ప ఖ్యాతిని తెచ్చిపెడుతోంది. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ తో సత్కరించిన మట్టికాళ్ల మహాకవి ‘హల్దర్ నాగ్’ పరిచయం ఇది. ‘ఇదిగో ఉత్తరం వచ్చింది హల్దర్ నాగ్. నీ కోసం ఉత్తరం వచ్చింది. సృష్టిలో గొప్పదైన మానవజాతి నేడు చీకటిలో తడుముకుంటోంది. తన బులబాటం తీర్చుకునేందుకు మందిని బాధలు పెడుతోంది. ఉత్తరం ఇదే చెబుతోంది హల్దర్ నాగ్ ఉత్తరం ఇదే చెబుతోంది’ హల్దర్ నాగ్ కవిత్వం ఇలా ఉంటుంది. అతడు తనకు తానే ఉత్తరం రాసుకుంటూ ఉంటాడు. తాను కనుగొన్న సత్యాలు చెప్పుకుంటూ ఉంటాడు. ‘లోకం శుభ్రపడాలనుకుంటున్నావా... ముందు నిన్ను నువ్వు కడుక్కో. ఇతరులను చేయి పట్టి పైకి లాగాలనుకుంటున్నావా... ముందు నువ్వో ఒకటి రెండు మెట్లకు ఎగబాకు. కష్టాన్ని కూడా తల్లి ఆశీర్వాదం అనుకో. విషం చిమ్మే చోట కచ్చితంగా మధువు ఉంటుంది వెతుకు. అన్ని బరువులు మోసుకుంటూ ప్రవహించే గంగే నీకు అదర్శం. బాధలు నువ్వు ఉంచుకొని సంతోషాన్ని పంచు’ అంటాడు తన కవితలో హల్దర్ నాగ్. ఇప్పుడు అతని కవిత్వం మీద ఎనిమిది పిహెచ్‌డిలు జరుగుతున్నాయి. అతని పేరు మీద ఒరిస్సా ప్రభుత్వం అతని సొంత గ్రామం ‘ఘెన్స్’ లో ‘కోసలి మాండలికం, సాహిత్య పరిశోధనా కేంద్రాలను నెలకొల్పనుంది. భారత ప్రభుత్వం 2016లో అతనిని ‘పద్మశ్రీ’తో గౌరవించింది. కేవలం ఓనమాలు నేర్చిన కవి మహాకవిగా అవతరించినందుకు కలిగిన ఫలితం ఇది. పశ్చిమ ఒరిస్సా అడవిబిడ్డ హల్దర్‌నాగ్‌ది పశ్చిమ ఒరిస్సాలోని బార్‌గర్హ్ జిల్లాలోని ఘెన్స్ అనే చిన్న గ్రామం. ఎగువ ఊళ్ళల్లో కలరా సోకితే అతడి కుటుంబం ఆ ఊళ్లో స్థిరపడింది. అక్కడే ఆఖరి సంతానంగా హల్దర్ నాగ్ 1950లో జన్మించాడు. చర్మకార వృత్తి చేసే తండ్రి పాముకాటుకు చనిపోతే మూడో తరగతిలోనే చదువు ఆపేశాడు. అతని కంటే ముందు పుట్టిన వాళ్లు పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిపోవడంతో ఒక్కడుగా మిగిలి ఊళ్లో ఉన్న మిఠాయి దుకాణంలో గిన్నెలూ, వంట పాత్రలు కడిగే పనికి కుదిరాడు హల్దర్. అక్కడే వంట నేర్చుకున్నాడు. ఊరి పెద్దమనిషి అతణ్ణి స్కూల్లో వంటవాడిగా పెట్టాడు. దాదాపు పన్నెండేళ్ళు అక్కడే వంటవాడిగానే బతికాడు. ఆ సమయంలో స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం గమనించాడు. వెయ్యి రూపాయలు చేబదులు తీసుకుని స్కూల్ ఎదురుగానే స్టేషనరీ షాపు, పిల్లలు తినే తినుబండారాలు పెట్టి కూచున్నాడు. ఆ సమయంలోనే అతనిలో ఏదో కవిత్వం పెల్లుబుక సాగింది. కోసలి భాషలో తనకు నచ్చింది రాసుకుని షాపుకి వచ్చేవారికి వినిపించేవాడు. ఆ సమయంలోనే ఆ ప్రాంతంలోని ‘అభిమన్యు సాహిత్య సన్సద్’ అనే గ్రూప్‌తో పరిచయమయ్యింది. వారు ఇతనికి ఒరియా సాహిత్యం పరిచయం చేశారు. ఒరిస్సా సాహిత్యం చదువుతూనే హల్దర్ తన కోసలి భాషలో కవిత్వసృష్టి సాగించాడు. 1990లో అతని తొలి కవిత ‘ధోడో బగ్గాచ్’ (పాత మర్రిచెట్టు) స్థానిక పత్రికలో అచ్చయ్యింది. అది మహాకవి మొదటి అడుగు. నాటి రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటూ... ఎదురుగానే కవి ఆ ప్రాంతంలో అందరికీ వంటవాడు హల్దర్ తెలుసు. కాని కవి హల్దర్ తెలియదు. ఎవరో కవి అని అందరూ ఆ కవిత్వాన్ని అభిమానించారు. చాలా రోజుల తర్వాత ఆ కవి, ఈ వంటవాడు ఒకడే అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. హల్దర్‌కి జ్ఞాపకశక్తి ఉంది. ఏ పుస్తకంలోని ఏ కవితనైనా చదివి గుర్తు పెట్టుకోగలడు. అంతేకాదు తన కవిత్వాన్ని కాగితం చూడకుండా చెప్పగలడు. అందుకే ప్రజలు అతణ్ణి ‘ఆశు కబి’ అని, ‘లోక కబి రత్న’ అని పిలుస్తారు. కావ్యాంజలి హల్దర్ నాగ్ కవిత్వం మొదట ‘కావ్యాంజలి’ అనే సంకలనంగా వచ్చి పండిత, పామరుల ఆదరణ పొందింది. అతని రెండవ సంపుటం ‘కావ్యాంజలి2’ను సంబల్పూర్ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పెట్టింది. అతడి అనేక కవితలు ఇప్పుడు పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాలు అయ్యాయి. దేశీయ జానపద శైలి, పురాణ సంకేతాలు, కల్తీ లేని భాష, అప్రయత్న ధాటి హల్దర్ నాగ్ కవిత్వాన్ని జీవంతో, ఆకర్షణతో నింపుతాయి. అతడి రచనలు ఇప్పటి వరకూ దాదాపు 22 పుస్తకాలుగా వచ్చాయి. పాటలూ రాశాడు. సంబల్పూర్ యూనివర్సిటీ అతనికి డాక్టోరల్ డిగ్రీ ఇచ్చి సత్కరించింది. బి.బి.సి అతడిపై డాక్యుమెంటరీ తీసింది. ఒకప్పుడు వంట కాంట్రాక్టు కోసం ఎదురు చూసే హల్దర్ నేడు ఒరిస్సా రాష్ట్రంలో దేశంలో ప్రతిరోజూ సాహిత్య కార్యక్రమాలకు ఆహ్వానింపబడే కవిగా గౌరవం పొందుతున్నాడు. అంతే కాదు 2015లో వచ్చిన ‘కౌన్ కిత్నే పానీ మే’ అనే లఘు చిత్రంలో రాధికా ఆఫ్టే, సౌరభ్ శుక్లా వంటి నటులతో కలిసి నటించాడు. గుల్జార్ మోహం హల్దర్ నాగ్ కవిత్వానికి ప్రఖ్యాత కవి గుల్జార్ అభిమాని. ఆయన హల్దర్ కవిత్వం చదివి 50 వేల రూపాయల డబ్బును కానుకగా పంపాడు. అంతేకాదు, బాలీవుడ్ దర్శకుడు ‘భరత్‌బాల’ తన ‘వర్చువల్ భారత్’ ఫీచర్ కింద హల్దర్ పై తీసిన షార్ట్‌ఫిల్మ్‌కు వ్యాఖ్యానం కూడా అందించాడు. హల్దర్ కవిత్వం భారీగా ఇంగ్లిష్‌లోకి అనువాదం అవుతోంది. ఇప్పటికి 350 సంస్థలు హల్దర్‌ను సత్కరించాయి. ఇంత పేరు వచ్చినా ఇప్పటికీ చెప్పుల్లేకుండా నడుస్తాడు హల్దర్. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘పద్మశ్రీ’ అందుకునేటప్పుడు కూడా చెప్పులు తొడుక్కోలేదు. ‘ఈ మట్టి మీద నడిచేటప్పుడు మొత్తం భూగోళం మీద నడుస్తున్నట్టుగా భావించు’ అంటాడు హల్దర్. అంతే ఈ భూమి మనందరిది. అంటే ప్రతి మనిషి మరో మనిషి కోసమే అని భావిస్తూ ‘మనం’ అనే భావనతో బతకాలని హల్దర్ కోరుతాడు. అతడు అసహ్యించుకునే దుర్గుణాలు ప్రతి మనిషిలో ఉండేవే. కాకుంటే వాటిని వదిలించుకోవడానికి అప్పుడప్పుడు హల్దర్ వంటి మహాకవి పిలుపు అవసరం. ఇప్పుడా పిలుపు వినిపిస్తూ తిరుగుతున్నాడు హల్దర్ నాగ్. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆ డ్రాపవుట్ రచనలతో ఐదు పీహెచ్ డీలు
న్యూ ఢిల్లీః అతడు కేవలం పాఠశాల చదువుకూడ పూర్తి చేయలేదు. అయితేనేం రచయితగా అత్యంత ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఒడిషాకు చెందిన ఆయన రచనలు ఐదుగురు పరిశోధనా విద్యార్థులకు ఆధారంగా మారాయి. కోస్లీ భాషా పండితుడు, కవి, 66 ఏళ్ళ హల్దార్ నాగ్ ఎన్నో పురాణాలకు గుర్తుగా పద్యాలు రాసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన రచనలు ప్రస్తుతం సంబల్పూర్ విశ్వవిద్యాలయ సిలబస్ లో భాగమయ్యాయి. హల్దార్ గ్రంథబాలి-2 పేరున విశ్వవిద్యాలయం వాటిని సంగ్రహించింది. హల్దార్ తన రచనలను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తుంటాడు. తాను వల్లించిన పద్యాలను వల్లెవేస్తుంటాడు. కనీసం రోజుకు మూడు నాలుగు ప్రత్యేక కార్యక్రమాలకు హాజరౌతుంటాడు అంటూ అతడి సన్నిహితుడు, కవి నాగ్ చెప్తున్నారు. హల్దార్ రచించిన కోస్టీ భాషలోని పద్యాలు యువకులను అమితంగా ఆకట్టుకుంటాయని, ప్రతివారు కవులు అయినప్పటికీ.. కొందరు మాత్రమే వాటికి ఓ ప్రత్యేక రూపును ఇవ్వగల్గుతారని అదే వారిలోని కళను ప్రస్ఫుటింప జేస్తుందని హల్దార్ సన్నిహితుడు నాగ్ చెప్తున్నారు. కనీసం కాళ్ళకు చెప్పులు కూడ ధరించని హల్దార్... ఎప్పుడూ తెల్లని పంచె, చొక్కా వేసుకుంటాడని, పైగా అలా వేసుకోవడం తనకిష్టమని చెప్తాడు. ఒరిస్సాలోని బర్ఘర్ జిల్లాలోని ఓ పేద కుటుంబంలో 1950 లో పుట్టిన హర్దార్... కేవలం మూడో క్లాసు వరకే పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ అతడు బడికి హాజరు కాలేదు. పదేళ్ళ వయసులో తండ్రిని కోల్పోవడంతో కుటుంభ భారాన్ని నెత్తికెత్తుకున్న అతడు... తప్పని పరిస్థితిలో ఓ మిఠాయి దుకాణంలో పనికి (డిష్ వాషర్) చేరాడు. రెండేళ్ళ తర్వాత ఓ గ్రామపెద్ద అక్కడో హైస్కూలు స్థాపించాడు. అదే గ్రామంలో హల్దార్ పదహారేళ్ళపాటు వంటవాడిగా పనిచేశాడు. ఆ తర్వాత అక్కడ అనేక పాఠశాలలు వెలిశాయి. దీంతో హల్దార్ ఓ బ్యాంకును సంప్రదించి వెయ్యి రూపాయల లోన్ తీసుకొని ఓ చిన్న స్టేషనరీ షాప్ తో పాటు పాఠశాల విద్యార్థులకోసం తినుబండారాల అమ్మకం ప్రారంభించాడు. ఇదే సమయంలో హల్దార్ 'దోడో బర్గాచ్' (పురాతన మర్రిచెట్టు) అంటూ తన మొదటి పద్యాన్ని రాశాడు. 1990 ప్రాంతంలో అతడు రాసిన ఆ పద్యం స్థానిక పత్రికలో ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా నాలుగు పద్యాలు రాసి పంపితే అవి కూడ అచ్చయ్యాయి. అనంతరం అతడి పద్యాలకు సమీప గ్రామాల్లోనూ భారీ స్పందన వచ్చింది. అక్కడే అతడి ప్రస్థానం మొదలైంది. ఆ ప్రోత్సాహం నేడు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేర్చింది. హల్దార్ నాగ్ ను ఒడిస్పాలో లోక్ కబీ రత్నగా పిలుస్తారు. ఎక్కువగా ప్రకృతి, సమాజం, పురాణాలు, మతం వంటివే అతడి పద్యాలకు ప్రధానాంశాలు. అయితే ఎన్నోసార్లు అతడి రచనలకు సమాజం నుంచి వ్యతిరేకత కూడ ఎదురైంది. నా దృష్టిలో కవిత్వం వాస్తవ జీవితానికి అద్దం పడుతుందని, ప్రజలకు సందేశాన్ని అందించేదిగా ఉండాలని హల్దార్ నాగ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.