breaking news
Gummalla Balaramya
-
ఒకరికొకరు
నా అప్రయత్న ప్రియసఖి.. చీకటి నిజాలు.. పగటి కలలు.. రేయి చంద్రుడు, సంధ్యా సూర్యుడు.. సరదావిహారాలు.. సైద్ధాంతిక పోరాటం అన్నిటికీ కావాలి నువ్వు. తోడునీడలు కావొద్దు.. కోయిల గోరింకలు కావొద్దు.. కలసి తిరిగే స్వతంత్ర స్నేహితులమవుదాం.. తను జతకూడాలి అనుకున్న అమ్మాయితో అబ్బాయి మనసు చెప్పిన ఊసు ఇది! వాళ్ల సహజీవనానికి ఎనిమిదేళ్లు. ముందు అనుకున్నట్టుగానే వాళ్లిద్దరూ తోడునీడలుగా లేరు.. కోయిల, గోరింకలు అసలే కాలేదు! ఆమె అతని సృజన.. అతను ఆమె తేజమై.. ఎవరికివారు ఎంచుకున్న దారుల్లో కలసి నడుస్తున్నారు! మార్గనిర్దేశకాలుండవ్.. తడబడితే చేయూత ఉంటుంది ! ఆలుమగలులా కాకుండా స్వతంత్ర స్నేహితులుగా ఉంటున్న ఆ జంటలో అతడు.. పదిరి రవితేజ, ఆమె.. గుమ్మళ్ల సృజన. వాళ్ల చెలిమే ఈ యూ అండ్ ఐ! - రవితేజ, సృజన ఈ ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరువేరు కాదు కొంచెం ఘనమైనవి కూడా. రవితేజ ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు వాసిరెడ్డి కృష్ణారావు మనవడు. సృజన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గుమ్మళ్ల బలరామయ్య కూతురు. ఈ భిన్నాలు వీళ్లలోనూ ఉన్నాయి. రవితేజ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకు. సృజన.. పుస్తకాల పురుగు. ఆ సంఘజీవికి.. ఈ ఇంట్రావర్టిస్ట్కి స్నేహం ఎలా కుదిరింది?. సెంట్రల్ యూనివర్సిటీలో.. ‘నేను అప్పుడు పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. తేజ.. విజయవాడలో లా చదువుతున్నాడు. సమతా విద్యార్థి సమాఖ్య మీటింగ్స్ కోసం తరచుగా యూనివర్సిటీకి వచ్చేవాడు. నేను స్టూడెంట్ పాలిటిక్స్‌లో యాక్టివేం కాదు.. కానీ సంఘీభావం తెలపడానికి మీటింగ్స్‌కు అటెండ్ అయ్యేదాన్ని. అలా అతను పరిచయం’ అని చెప్తుంది సృజన. ప్రణయం.. పరిణయం.. ‘ఓ మూడు నెలల తర్వాత అనుకుంటా.. నేనే చెప్పాను తనతో నువ్వంటే ఇష్టం అని’ సృజన అంటుంటే.. ‘అలా ఏం లేదు.. నాకూ అనిపించింది. నేను మొదటి నుంచి ఫంకి, చింకి, కెరీరిస్ట్ అమ్మాయిలకు చాలా దూరం. సృజన అందుకు భిన్నం. అందుకే చాలా నచ్చింది’ అన్నాడు రవితేజ. ‘కాబట్టే నేను ప్రపోజ్ చేసిన మూడు నెలలకు ఆలోచించుకుని ఓకే చెప్పాడు’ నవ్వుతూ సృజన. ‘ఒక రోజు ఈవెనింగ్ చెప్పాను.. నాతో కలసి ఉంటావా? మనిద్దరం కలసి ఉండగలం అని. విని పొద్దున్నే నువ్వన్నది నిజమేనా అని రీకన్ఫర్మ్ చేసుకుంది’ రవితేజ. ‘అలా నిర్ణయించుకున్న అయిదేళ్లకు పెళ్లయింది. పెళ్లనే ఫ్రేమ్‌లోకి వచ్చి మూడేళ్లయినా.. మా సహజీవనం మాత్రం ఎనిమిదేళ్ల నుంచి’ అని ప్రీషియస్ పోస్ట్‌ను జ్ఞాపకం చేసుకుంది సృజన. కెరీర్.. ‘పెళ్లికి ముందు మూడుసార్లు సివిల్స్ రాశాను.. రాలేదు. గ్రూప్‌వన్ రాసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను కూడా. సివిల్స్‌కి ఇంకో చాయిస్ ఉంది కదా అని తేజ గుర్తు చేస్తే అప్పుడు మళ్లీ దాని మీద దృష్టి పెట్టాను. వచ్చింది. ఆ క్రెడిట్ తేజాదే’ అంటుంది ఇంతకన్నా భాగస్వామి సహకారం ఏముంటుంది అన్నట్టు. మరి తేజకు? ‘నేను హైకోర్ట్ అడ్వొకేట్‌ని. ఎన్‌కౌంటర్స్‌కి, సోంపేట ఫైరింగ్‌కు వ్యతిరేకంగా కేసులు టేకప్ చేశాను. నా ఈ చర్యల వల్ల సృజన మీద ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసు. అయినా తను ఏనాడు క్వశ్చన్ చేయలేదు. అసలు ఆ ప్రెషర్స్ తాలూకు ప్రభావం ఏదీ నా మీద పడనీయదు’ గర్వంగా చెప్తాడు రవితేజ. కోపాల్ తాపాల్.. గొడవలు పోట్లాటలు.. ‘పెద్దగా ఉండవ్. ఎప్పుడైనా నాకే కోపం వచ్చి అరుస్తాను కానీ తేజకు అస్సలు కోపం ఉండదు. నా కోపం కూడా తను తీసింది తీసిన చోట పెట్టనప్పుడే. అరుస్తాను.. అయినా ఏమీ అనడు’ అని సృజన అంటుంటే ‘ఏమీ అనను.. ఆ వస్తువు తీసుకెళ్లి తీసిన చోట పెట్టను’ అని నింపాదిగా ఆన్సర్ చేస్తాడు తేజ. ‘ఇక గొడవలు.. పోట్లాటలు లేనేలేవు. బేసిక్‌గా ఇద్దరం పీస్‌ఫుల్‌గా ఉండటానికే ఇష్టపడతాం. గొడవపడి మాటలు మానేసుకున్న సందర్భాలు లేవు ఈ ఎనిమిదేళ్ల కాలంలో అంటుంది సృజన. కంప్లయింట్స్ అండ్ డిమాండ్స్ ‘అస్సలు లేవు’ ఇద్దరూ చెప్తారు ఏక కంఠంతో. ‘తను నా ప్రిన్సిపుల్స్‌ని రెస్పెక్ట్ చేస్తుంది. నగలు, షాపింగ్లాంటివేమీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయదు’ అంటాడు. ‘తను ఏం చెప్పినా, ఏం చేసినా ఓ క్లారిటీ ఉంటుంది. ఆలోచించి చెప్తాడు, చేస్తాడు. ఒకరిపట్ల ఒకరికి ఇలాంటి గౌరవం, నమ్మకం ఉంటాయి కాబట్టి కంప్లయింట్స్, డిమాండ్స్ ఉండవ్’ అని చెప్తుంది సృజన. కాంప్లిమెంట్స్.. ఇన్స్పిరేషన్.. ‘నాలో నాకన్నా తేజానే ఎక్కువుంటాడు’ అని ఆమె తన ప్రేమకు కాంప్లిమెంట్ ఇస్తే, ‘ఐ లవ్ లివింగ్ విత్ హర్’ అని అతని మాట. ‘పెళ్లికి ముందు అమ్మానాన్న, ఇప్పుడు తేజ.. అమ్మానాన్న, కొడుకు, స్నేహితుడు ఎవ్రీథింగ్.. ఆయన సహచర్యం అందించిన గిఫ్ట్ ఇది’ భర్త ప్రభావం ఆమెను మురిపిస్తుంటే.. ‘సృజన వల్ల విషయాలను సిస్టమేటిక్‌గా ఎలా డీల్ చేయగలరో తెలుసుకున్నాను’ అని భార్య ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌ను ఒప్పుకుంటాడు రవితేజ నిజాయితీగా. ఈ అవగాహన.. అన్యోన్యత వెనుక.. ‘వీ నెవర్ ఇన్సిస్ట్ ఆన్ లివింగ్ టుగెదర్ ఫిజికల్లీ, మనీ అండ్ సెక్స్.. ఈ రెండింటి కన్నా బలమైన బాండింగ్ ఒకటుండాలి’ అని ఆయన అంటే ‘u have been my love, my dad, my mom, my guru, my support system.. my god.. for all that u were n u were not, i am that blessed soul.. to have u around always.. i wish i could love half as much as u do and shall always be my endeavor.. thanks for being u.’ అంటూ సృజన నిర్వచిస్తుంది. - సరస్వతి రమ -
ఆచరించాం... అనుసరించారు...
తండ్రి ఐఏయస్ ఆఫీసర్... తల్లి సర్పంచ్... కూతురు కూడా ఐఏయస్. కొడుకు... నేడో రేపో అమెరికా వెళ్లబోతున్న ఇంజినీర్. ఏమనిపిస్తోంది? వెల్ప్లాన్డ్ అని కదా! కెరియర్ ఓరియంటెడ్ అని కదా! పైపైకి ఎదగడమే ఆ ఫ్యామిలీ ధ్యేయం అని కదా! అయితే ఈ వారం లాలిపాఠం మీరు చదవాల్సిందే ‘ఇది చదువు’ ‘అది చదువు’ అని ఒత్తిడి చేయకుండా ‘అది వద్దు’ ‘ఇది వద్దు’ అని కట్టడి చేయకుండా ‘ఎదగడ’మంటే మనకు మనం ఎదగడం కాదనీ ఎంత ఎదిగితే అంతగా ఒదిగి సాటి మనిషికి సాయం చేయాలనీ ఆచరించి చూపిన తల్లిదండ్రుల గురించి మీరు చదవాల్సిందే... హైదరాబాద్, పంజగుట్టలోని ఆఫీసర్స్ కాలనీ. క్వార్టర్ నంబరు 43. ఇది విశ్రాంత ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్య నివాసం. జిల్లా కలెక్టర్‌గా పిల్లల పెంపకంలో తాను అనుసరించిన పద్ధతులను చెప్పడానికి ముందు ఆయన తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మా ఊరు చిత్తూరు జిల్లా మాధవమాల. మా ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. నన్నైనా చదివించాలని మా అమ్మ పట్టుబట్టింది. కానీ మా ఊళ్లో బడి లేదు. అందుకు ప్రత్యామ్నాయంగా మా అమ్మ... ఆ ఊరిలో చదువుకున్న ఒక రాజుగారిని ఒప్పించి పదిమంది పిల్లల్ని చైతన్యవంతం చేసి వీధిబడిని ఏర్పాటు చేసింది. అందులో శ్లోకాలు, బాలరామాయణం, పెద్దబాలశిక్ష, లెక్కలు నేర్చుకున్నాను. ఆరోతరగతికి ఎంట్రన్స్ రాసి శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పాఠశాలలో చేరాను. 1974లో ఎం.ఏ పూర్తయిన నాటికి కూడా నాకు పోటీపరీక్షల గురించి తెలీదు. తర్వాతెలాగో స్నేహితుల ద్వారా తెలుసుకుని గ్రూప్-4 రాసి జూనియర్ అసిస్టెంట్‌గా చేరాను. 1983లో గ్రూప్-2 రాసి తాసిల్దారునయ్యాను. అదే ఏడాది పెళ్లయింది. ఆ తర్వాత నాలుగేళ్లకు గ్రూప్-1 ఆఫీసర్‌గా సెలక్టయ్యాను. ఆర్డీవోగా, డిఆర్వోగా, జాయింట్కలెక్టర్గా, కలెక్టర్‌గా, పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌గా, ఎండోమెంట్స్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించాను. నిరక్షరాస్య కుటుంబంలో పుట్టిన నేను ఐఏఎస్ అధికారి అయిన వైనం ఇది’’ అని చెప్పారు. ‘‘మా అమ్మాయి సివిల్స్ రాస్తానని చెప్పినప్పుడు సంతోషించాను. సృజన చాలా తెలివైన అమ్మాయి, చదువుని ఇష్టపడే అమ్మాయి, త్వరగా గ్రహిస్తుంది కూడ. ఒకసారి వింటే ఇక మర్చిపోదు. మూడో ఏటనే స్కూలుకి పోతానని మారాం చేసేది. పెద్దయిన తర్వాత కూడా నేనెప్పుడూ తనని పుస్తకాలు చదవమని చెప్పలేదు. ఇంగ్లిష్ సాహిత్యం, రామాయణం, భారతంతో సహా నా లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నింటినీ చదివేసింది. సాహిత్యాభిలాష స్వతహాగా కలగాలి తప్ప ఒకరు ఒత్తిడి చేస్తే అలవడదు. సాహిత్యం, డ్రామాలు నా హాబీలు. ఇప్పటికీ నటిస్తున్నాను. తండ్రికి పాఠాలు..! మా అమ్మాయి చదివిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. ఒకప్పుడు మా మధ్య ఏదైనా విషయం మీద చర్చ జరిగేది, ఇప్పుడు చర్చ లేదు... పాప చెప్పింది వినడమే నా వంతు. (నవ్వు) మా పిల్లలు అలా అయితే బావుణ్ను, ఇలాగైతే బావుణ్ణు అనే కోరికకు మేమేమీ అతీతులం కాదు. మా అబ్బాయి పొడగరి, ఐపిఎస్ అయితే బావుణ్ణనే కోరిక నాకు, అమ్మాయిని మెడిసిన్ చదివించి మా ఊళ్లో హాస్పిటల్ కట్టి ఆమె చేత మా ఊరి వాళ్లకు వైద్యం చేయించాలని మా ఆవిడ కోరిక. ఐఎఎస్, ఐపిఎస్ రెండూ నిత్యం సమాజంతో సంబంధాలు కలిగి ఉండాల్సిన వృత్తులు. వాటిని ఇష్టంగా స్వీకరించాలి, తప్ప ఒకరు ప్రభావితం చేయడం సరికాదు. అందుకే నేను మా అబ్బాయితో తన అభిరుచి తెలుసుకోవడానికన్నట్లు ప్రస్తావించాను. కానీ చార్వాక్ మాటల్లో పోలీస్ వ్యవస్థ పట్ల తృష్ణలాంటివేవీ కనిపించలేదు, టెక్నాలజీ వైపు ఆసక్తి కనబరిచాడు’’ అన్నారాయన. లలిత కళల్లో ప్రవేశం! తన పెంపకంలో పిల్లలకు ఒద్దిక, జాగ్రత్త, ఆదరణ అలవాటయ్యాయి అంటారు సుగుణశీల. ‘‘మాకు బంధువుల రాకపోకలు ఎక్కువ. మా ఊరి నుంచి వచ్చిన వాళ్లను స్టేషన్ నుంచి తీసుకురావడం మా అబ్బాయి పని, వాళ్లకు అన్నీ అమర్చి భోజనాలు వడ్డించడం అమ్మాయి బాధ్యత. పిల్లలకు అతిథులను సాదరంగా స్వాగతించే లక్షణం అలవడుతుందని ఇలా ఇద్దరికీ చెరో పని అప్పగించేదాన్ని. మా అమ్మాయి బాగా పాడుతుందని సంగీతంతోపాటు కూచిపూడినాట్యంలో శిక్షణ ఇప్పించాను. వంట నేర్పించాను! నేను పిల్లలను జాగ్రత్తగా పెంచాలని మాత్రం అనుకునేదాన్ని. క్వార్టర్స్‌లో వంటవాళ్లు, చేతిలో పని అందుకోవడానికి మనుషులుంటారు. అయినా ఆడపిల్లకు వంట తెలిసి ఉండాలని నేర్పించాను. అలాగే చిన్నప్పటి నుంచి ఇంటికి వచ్చిన వారిని పలకరించి కూర్చోమని చెప్పడం, నాన్నగారి కోసమా అని అడిగి వచ్చినది ఎవరో తెలుసుకుని ఆ సమాచారాన్ని వాళ్ల నాన్నగారికి తెలియచేయడం అలవాటు చేశాను. ‘పిల్లలకు అధికారం విలువ తెలియాలి, అంతేకాని అధికారాన్ని ఆస్వాదించడంలో ఆనందం పొందడం అలవాటైతే కష్టం’. మా కాలనీలో ఆఫీసర్ ఇంటి ఫంక్షన్ల కంటే మా అటెండర్ ఇంట్లో వేడుకలకు తప్పనిసరిగా వెళ్తాను. పిల్లలు కూడా పనివాళ్లను ఆదరంగా చూడడం నేర్చుకున్నారు. ఇప్పటికీ మా పిల్లలు పనివాళ్లకు పనిపురమాయించడం ఆర్డర్ జారీ చేసినట్లు ఉండదు. మా అమ్మాయికి ఎంత జాగ్రత్త అలవాటైంది అంటే... షాపింగ్‌కెళ్లినప్పుడు మేము అనుకున్న బడ్జెట్‌కంటే ఎక్కువ ధరలో ఉన్న డ్రెస్ తనకు నచ్చినప్పుడు రెండు డ్రస్‌లు బదులు ఒక్కటే తీసుకుంటుంది’’ అన్నారు సుగుణశీల. ఆయన అభిప్రాయాల బాటలోనే... ‘‘మా వారు అధికారాన్ని హోదా అనుకోరు, బాధ్యత అంటారు. ఐఏఎస్ అధికారిగా ఎవరికి ఎంతగా సర్వీస్ అందించవచ్చో అంత సర్వీస్నీ ఇవ్వాలంటారు. పిల్లల పెంపకంలో నేను ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకునేదాన్ని. సృజన చిన్నప్పుడు ఉదయాన్నే వాళ్ల నాన్నగారి పక్కనే కూర్చుని... వచ్చిన వారితో ఆయన వ్యవహరించే తీరు, సాయం అందించడానికి ఆయన పడే తపన చూసేది. సృజన చారిటీలలో సేవ చేయడానికి, సివిల్స్‌ను కెరీర్‌గా తీసుకోవడానికి కారణం అదే’’ అంటారామె. ప్రతి మనిషికీ మానవతావిలువలు, మంచితనం ఉండాలంటారు బలరామయ్య. సహాయం కోరి వచ్చిన వారిని నిరాశతో పంపించకూడదు. ఎదుటివారిని ప్రేమించాలి, అభిమానించాలి. అప్పుడే మనిషి పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాడు. అలాంటి వారిని అందరూ ఇష్టపడతారు... అనే బలరామయ్య బాటలోనే ఆయన పిల్లలు కూడా నడుస్తున్నారు. మంచి పౌరులు ఇలా ఉండాలని నేర్పించడమే కాదు, తాము ఆచరించి చూపించిన తల్లిదండ్రులు గుమ్మళ్ల బలరామయ్య, సుగుణశీల. - వాకా మంజుల, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పిల్లల్ని వ్యక్తులుగా తీర్చిదిద్దడానికే... పిల్లల్ని నా అభిప్రాయాల మేరకు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాను. నేను అధ్యయనం చేసిన సమాజాన్ని, జీవితం పట్ల దృక్కోణాన్ని రంగరించి నా భావాలకు అనుగుణంగా వారిని ప్రభావితం చేశాను. కానీ వారి కెరీర్‌ని నేను నిర్ణయించాలనుకోలేదు. - జి. బలరామయ్య, విశ్రాంత ఐఏఎస్ అధికారి సృజన: సివిల్స్‌లో 44వ ర్యాంకర్. మసూరిలో ట్రైనింగ్‌లో ఉన్నారు. చార్వాక్: బీటెక్, ఎంబిఎ. బలరామయ్య: విశ్రాంత ఐఎఎస్ అధికారి (కర్నూలు కలెక్టర్, కడప జాయింట్ కలెక్టర్, టిటిడి జెఇవో, అనంతపూర్ డిఆర్ఓ, పిడి డిఆర్డిఎ కడప, ఎండోమెంట్స్ కమిషనర్) సుగుణశీల: చిత్తూరు జిల్లా పూడి పంచాయితీ సర్పంచ్