breaking news
the guidelines
-
ఇదెక్కడి రేషనలైజేషన్ సారూ... !
తలలు పట్టుకుంటున్న అధికారులు తాత్కాలిక సర్దుబాటు చేస్తే చాలామంది కుప్పం వెళ్లాల్సిన పరిస్థితి కుప్పం వెళ్లేందుకు సుముఖత చూపుతారా? చిత్తూరు(టౌన్): ఉపాధ్యాయుల తా త్కాలిక సర్దుబాటు (రేషనలైజేషన్) అంశం విద్యాశాఖ, ఉపాధ్యాయ వర్గాలో కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు గైడ్‌లైన్స్ చెప్పకుండా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా సర్దుబాటు చేయమని చెప్పి చేతులు దులుపుకున్నారు. దీని పై క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గైడ్‌లైన్స్ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. రెండు రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో అధికారులు సర్దుబాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. అయితే క్షేత్రస్థాయి నుంచి రావాల్సిన సమాచారం ఆలస్యంగా అందుతోంది. మొత్తంగా ఈ కార్యక్రమం విద్యాశాఖలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. సర్దుబాటు అంటే.. ఉన్నతాధికారులు చెప్పిన దాని ప్రకారం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి తాత్కాలికంగా సర్దుబాటు చేయాలి. ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు చెప్పింది ఇదొక్కటే. కాగా రేషనలైజేషన్ అంటే సవాలక్ష గైడ్‌లైన్స్ ఉంటాయి. అవే వీ పరిగణనలోకి తీసుకోకుండా సర్దుబాటు చేయడమంటే ఆషామాషీ కాదు. జిల్లాలో 18,505 ఉపాధ్యాయ శాంక్షన్ పోస్టులుండగా, వీటిలో 16,167 మంది పని చేస్తున్నారు. 2,338 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఉపాధ్యాయులు లేని పాఠశాలలు-8, ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు-703, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు- 2703 ఉన్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం 1-19 మంది విద్యార్థులు ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 20-60 మధ్య విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగానే ఉంది. ఇక్కడకు ఉపాధ్యాయులను సర్దుబాటు ద్వారా తీసుకురావాల్సి ఉంటుంది. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇక్కడి నుంచి కొంత మందిని సర్దుబాటు పేరుతో అవసరం ఉండే పాఠశాలలకు పంపాలి. పంపిస్తే వెళ్లిపోతారా? ఉపాధ్యాయుల సర్దుబాటు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనే జరగాల్సి ఉంటుంది. రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా సర్‌ప్లస్‌గా తేలే వాళ్లలో జూనియర్ టీచర్లను పంపాలి. అయితే తాత్కాలిక సర్దుబాటుకు ఈ నిబంధనలు వర్తిస్తాయా ? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సర్దుబాటు పేరుతో పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు సుముఖత చూపకపోవచ్చు. ఇంకా గత సంవత్సరం బదిలీల కౌన్సెలింగ్‌లో బదిలీ అయి రిలీవ్ కాని టీచర్లు సుమారు జిల్లాలో 400 మంది ఉన్నారు. ఒకవేళ వీళ్లే సర్‌ప్లస్‌గా తేలితే అధికారులు చెప్పిన చోటుకు వెళ్లకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. సరైన గైడ్‌లైన్స్ లేకపోతే సర్దుబాటు కార్యక్రమం విజయవంతంగా జరగదని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు. కుప్పంలోనే అధికంగా ఖాళీలు జిల్లాలో అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలోనే ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 572 ఖాళీలు ఉండగా, గుడుపల్లెలో-99, కుప్పంలో-167, రామకుప్పంలో-175, శాంతిపురంలో-131 ఉన్నాయి. సర్దుబాటు జరిగే ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఇక్కడికే రావాల్సి ఉంది. అయితే కుప్పం నియోజకవర్గంలో పని చేసేందుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఇష్టపడరని తెలుస్తోంది. అప్పుడే ప్రయత్నాలు మొదలు సర్దుబాటు కాకుండా ఉండేందుకు ఉపాధ్యాయులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికార పార్టీ నేతలు, కీలకంగా ఉండే ఉపాధ్యాయ సంఘ నేతల ద్వారా ఎంఈవోలపై, విద్యాశాఖ సిబ్బందిపై సర్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉన్న ఉపాధ్యాయులు ఒత్తిళ్లు తెప్పిస్తున్నట్టు తెలిసింది. ఇదే అదనుగా భావించి కొందరు ఎంఈవోలు విద్యార్థుల సంఖ్య మార్చి చెప్పి పోస్టు సర్దుబాటు కాకుండా చూస్తామని, తాము కోరుకున్న చోటుకు వెళ్లాలని భావించే టీచర్లను పంపుతామని హామీలు ఇస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు ముట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కార్యక్రమం కొంత మందికి తలనొప్పులు తీసుకురాగా, మరికొంత మందికి కాసులు కురిపించేదిగా మారింది. తాత్కాలిక సర్దుబాటు సరికాదు ఉపాధ్యాయులను తాత్కాలికంగా సర్దుబాటు చేయడం సరికాదు. అదీ ఎటువంటి గైడ్‌లైన్స్ ఇవ్వకుండా చెప్పడంతో క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు వస్తాయి. కొంతమంది టీచర్లు వెళ్తామంటారు, కొందరు వెళ్లమంటారు. ఈ సమయంలో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, కొన్ని రోజుల తర్వాత అయినా రేషనలైజేషన్, సాధారణ బదిలీలు చేపడితే బాగుంటుంది. -వి.రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర స్ట్రీరింగ్ కమిటీ సభ్యులు డీఎస్సీ నిర్వహిస్తే సమస్య తీరుతుంది ఉపాధ్యాయుల కొరత తీరాలంటే డీఎస్సీ నిర్వహించాలి. ఇలా తాత్కాలికంగా సర్దుబాటు చేయడం వల్ల సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. గత సంవత్సరం మెగా డీఎస్సీ నిర్వహిస్తారని నిరుద్యోగులు ఆశపడ్డారు. అయితే అలా ఏం జరగలేదు. త్వరలో అయినా డీఎస్సీ జరిపి టీచర్ పోస్టుల ఖాళీలు భర్తీ చేస్తే బాగుంటుంది. -చెంగల్రాయమందడి, ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షులు -
విశాఖకు ‘రాజ’ యోగం!
నేడు రాజధాని ఎంపిక కమిటీ రాక సానుకూలాంశాలే ఎక్కువ కమిటీ పర్యటనతో చిగురిస్తున్న ఆశలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సీమాంధ్ర రాజధాని ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి కె.ఎస్. శివరామకృష్ణన్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం జిల్లాకు వస్తోంది. కొత్త రాష్ట్రానికి రాజధానిగా విశాఖ జిల్లాకు ఉన్న అర్హతలపై కసరత్తు చేయనుంది. ఈ కమిటీ విశాఖతో పాటు విజయవాడ కూడా పర్యటిస్తుంది. విశాఖలో మౌలిక సదుపాయాలు, జిల్లాకున్న అర్హతలతో అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో సీమాంధ్ర రాజధానిని ఎంపిక చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రం మార్గదర్శకాలు, అందుబాటులో ఉన్న వనరులు అంచనా వేసుకుంటూ.. ఈ కమిటీ సీమాంధ్రలో ఉన్న 13 జిల్లాల్లో దేనికి రాజధానిగా అర్హతలున్నాయన్న విషయంపై దృష్టి సారించింది. దీని కోసం ప్రధాన జిల్లాల్లో పర్యటించనుంది. తొలుత శుక్రవారం విశాఖ జిల్లాలో పర్యటించనుంది. ఈ కమిటీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖవాసుల్లో రాజధాని ఆశలు రేకెత్తుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి ఈ కమిటీ చేరుకుంటుంది. ఇందులో చైర్మన్ కె.శివరామకృష్ణన్‌తో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డెరైక్టర్ డాక్టర్ రథిన్‌రాయ్, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డెరైక్టర్ అరోమర్ రేవి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ ఎఫైర్స్ డెరైక్టర్ జగన్‌షా, న్యూఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్ ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్, హైదరాబాద్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.తిమ్మారెడ్డి ఉన్నారు. వీరు ఆ రోజు రాత్రి ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయనున్నారు. 10న జిల్లాలోనే అధికారులతో సమావేశమై జిల్లాలో ప్రభుత్వ భూములు, ఇతర మౌలిక సదుపాయాల విషయాలను సేకరించనున్నారు. 11న విజయవాడ వెళ్లనున్నారు. విశాఖపై అంచనాలు రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అంతటిస్థాయిలో విశాఖ విశేషాభివృద్ధి చెందుతోంది. పర్యాటకంగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. పారిశ్రామిక రాజధానిగా పేరుపొందింది. హైదరాబాద్ తరువాత పెట్టుబడులకు విశాఖ అనువైన ప్రాంతంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సీమాంధ్ర రాజధానిగా అన్ని అర్హతులు 13 జి ల్లాల్లో విశాఖకే పుష్కలంగా ఉన్నాయని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా వారి ఎన్నికల అజెండాలో విశాఖకు ప్రత్యేక స్థానం కల్పించాయి. మౌలికవసతులు పుష్కలం రోడ్డు, జల, వాయు మార్గాలకు అనువైన ప్రాంతంగా రాష్ట్రంలోనే విశాఖ గుర్తింపు పొందడంతో రాజధాని రేసులో నిలిచింది. అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి దిశగా పయనిస్తుండడంతో విశాఖను రాజధానిగా నిర్మాణానికి వ్యయం కూడా తక్కువగా అవుతుందన్న విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయంతో పాటు ఓడరేవు, స్టీల్‌ప్లాంట్, పోర్టు, హెచ్‌పీసీఎల్, డాక్‌యార్డ్, షిప్‌యార్డ్, ఎన్ఎస్టీఎల్ వంటి ప్రధాన ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి. హైదరాబాద్ తరువాత అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉంది. సింగపూర్, దుబాయ్ ఇలా అంతర్జాతీయ నగరాలకు వెళ్లడానికి విమాన సదుపాయాలున్నాయి. కొద్ది రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ విమానాలు విశాఖ వాకిట నుంచి ఎగురనున్నాయి.