breaking news
Governer Post
-
గవర్నర్‌కు జోక్యం చేసుకునే అధికారం లేదు: దత్తాత్రేయ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం/సింహాచలం: రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన గవర్నర్ వ్యవస్థతో రాజకీయాలు చేయడం సరికాదని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. సోమవారం విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఉన్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ మాజీ చైర్మన్ చెరువు రామకోటయ్య నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గాంధీజీ వర్థంతి సందర్భంగా మహాత్ముని చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిపై ప్రభుత్వాలు, పార్టీలు అవగాహన కల్పించుకొని.. గవర్నర్ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. ఆ వ్యవస్థ నచ్చకపోతే రాజకీయం చేయడం మాని పార్లమెంట్లో చర్చించాలన్నారు. ఇటీవల ఏపీలోని కొందరు ఉద్యోగులు జీతాల చెల్లింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయంపై దత్తాత్రేయ స్పందిస్తూ.. ఈ విషయంలో గవర్నర్‌కు జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు. గవర్నర్ దృష్టికి వచ్చిన ప్రతి విషయం తిరిగి ప్రభుత్వానికే పంపించాలని, కేవలం పరిశీలించమని చెప్పే అధికారం మాత్రమే గవర్నర్‌కు ఉందని వ్యాఖ్యానించారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతానన్నారు. శారదాపీఠంలో వేద పోషణ అభినందనీయం వేద పోషణ కోసం విశాఖ శ్రీశారదా పీఠం శ్రమిస్తున్న తీరు అభినందనీయమని బండారు దత్తాత్రేయ తెలిపారు. శారదాపీఠం వార్షికోత్సవాలు నాల్గవరోజైన సోమవారం వైభవంగా జరిగాయి. ఈవేడుకల్లో దత్తాత్రేయ పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశ్యామల యాగంలోను, శ్రీనివాస చతుర్వేద హవనంలోను పాల్గొన్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. ఈసందర్భంగా శారదాపీఠం ముద్రించిన మాండుక్యోపనిషత్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఠం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రసంశనీయమన్నారు. దత్తాత్రేయ వెంట ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నారు. కాగా, వార్షికోత్సవాల్లో భాగంగా శారదాపీఠంలో సాయంత్రం జరిగిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. -
ఘర్షణ పెరిగి.. గౌరవం తగ్గి..
మొన్న తమిళనాడు.. నిన్న పశ్చిమ బెంగాల్.. నేడు కేరళ.. మరి రేపు? వరుస చూస్తుంటే, కేంద్ర పాలకుల చెప్పుచేతల్లో ఉంటారని పేరుబడ్డ గవర్నర్లపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు గట్టిగానే సమర శంఖం పూరిస్తున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు కులపతి అనే గౌరవ హోదా నుంచి గవర్నర్లను ఒక్కో ప్రభుత్వం సాగనంపుతోంది. ఇతర రాష్ట్రాల బాటలో ఇప్పుడు కేరళ శాసన సభ సంబంధిత బిల్లును ఆమోదించింది. గవర్నర్ స్థానంలో విద్యావేత్తల్ని ఛాన్సలర్‌గా నియమించే విశ్వవిద్యాలయ చట్టాల (సవరణ) బిల్లుకు కేరళ అసెంబ్లీ మంగళవారం ఓకే అంది. పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థకూ, ప్రజాప్రభుత్వాలకూ మధ్య ఘర్షణకు ఇది తాజా ఉదాహరణ. కేరళలోని వామపక్ష సర్కారుకూ, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కూ మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అను గుణంగా జరగలేదంటూ, కేరళ టెక్నలాజికల్ యూనివర్సిటీ వైస్–ఛాన్సలర్ (వీసీ) నియామకాన్ని సుప్రీమ్ కోర్ట్ కొట్టేయడంతో రాజ్‌భవన్‌తో సర్కారు వారి రచ్చ షురూ అయింది. సుప్రీమ్ చట్ట విరుద్ధమన్న పద్ధతిలోనే మరో 11 మంది వీసీల నియామకం జరిగిందంటూ, ఆ వీసీలు రాజీనామా చేయాల్సిందేనని గవర్నర్ తాఖీదులిచ్చారు. నిజానికి, రాష్ట్ర ఉన్నత విద్యలో రాష్ట్ర చట్టాలు, యూజీసీ చట్టానికి విరుద్ధంగా ఉంటే తప్పు కానీ, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వీసీల నియామకాన్ని కొట్టేయడం సరి కాదని రాజ్యాంగ నిపుణుల మాట. మొత్తానికి, తలనొప్పి గవర్నర్లను వర్సిటీల నుంచి తప్పించడమే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మార్గమవుతోంది. ప్రస్తుతం దేశంలో బీజేపీ మినహా మిగతా పక్షాలన్నీ ఢిల్లీ పాలకులతో, వారికి ఏజెంట్లుగా పని చేస్తున్నారని అపకీర్తి సంపాదిస్తున్న గవర్నర్లతో విసిగిపోతున్నాయనడానికి ఇది ఓ నిదర్శనం. గవర్నర్లను కులపతి పీఠం నుంచి కదిలించే ప్రక్రియ ఊపందుకుంది అందుకే. ఈ ఏడాది ఏప్రిల్‌లో తమిళనాట స్టాలిన్ సర్కార్ రెండు బిల్లులు తెచ్చింది. గవర్నర్ బదులు రాష్ట్రప్రభుత్వమే వీసీలను నియమించేలా బిల్లులో నిబంధనలు పెట్టింది. ఇక, జూన్‌లో పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర వర్సిటీలకు ముఖ్యమంత్రినే కులపతిని చేస్తూ, మమత మంత్రివర్గం నిర్ణయించింది. మహారాష్ట్ర సర్కార్ సైతం రాష్ట్ర వర్సిటీల్లో వీసీల నియామక ప్రక్రియను మారుస్తూ 2021లోనే బిల్లు తేవడం గమనార్హం. తాజాగా కేరళ సర్కారు తన అధికారాలకు కత్తెర వేసిన కొత్త బిల్లును అక్కడి వివాదాస్పద గవర్నర్ ఎలాగూ ఆమోదించరు. కథ రాష్ట్రపతి వద్దకు చేరుతుంది. తర్వాత మలుపులేమిటో చూడాలి. నిజానికి, రాష్ట్రాల సమాఖ్య అయిన మన దేశంలో కేంద్రానికీ, రాష్ట్రాలకూ మధ్య సంబం ధాలు సవ్యంగా సాగట్లేదు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై భారత ప్రభుత్వం గతంలో సర్కారియా కమిషన్ వేసింది. తర్వాత రెండు దశాబ్దాలకు 2007లో పూంఛీ కమిషన్ వేసింది. పూంఛీ కమిషన్ 2010లో గవర్నర్ల పాత్ర సహా అనేక అంశాలపై 273 సిఫార్సులు చేసింది. రాజ్యాంగంలో చెప్పని అధికారాలనూ, హోదాలనూ కట్టబెట్టి గవర్నర్‌పై భారం మోపితే, వివాదాలు, విమర్శలు తప్పవు అంది. ఇప్పుడు ఆ సిఫార్సు ఆసరాతోనే బెంగాల్ మమత నుంచి కేరళ పినరయ్ విజయన్ దాకా అందరూ గవర్నర్‌ను వర్సిటీల నుంచి పక్కనబెడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఇలాగే చేసింది. 2013లో గుజరాత్‌లోని నాటి మోదీ సర్కార్ సైతం వర్సిటీల ఛాన్సలర్‌గా వీసీల నియామకానికి గవర్నర్‌కున్న అధికారాలు తీసేసింది. కేంద్రంలో సొంత సర్కారొచ్చాక 2015లో తమ గవర్నర్‌తో దానికి ఆమోదమూ వేయించుకుంది. అలాగే, కొత్త ప్రభుత్వం ఎన్నికైనప్పుడూ, ఏటా తొలి సమావేశంలోనూ అసెంబ్లీలో గవ ర్నర్ ప్రభుత్వ విధాన ప్రసంగం చేయడం 176వ అధికరణం కింద రాజ్యాంగ విహితం. జనవరి బడ్జెట్ సమావేశాల్లో దాన్ని పక్కనపెట్టాలని కేరళ సర్కార్ యోచిస్తోందట. ఇప్పటికే తెలంగాణ సర్కార్ తమతో తరచూ విభేదిస్తున్న గవర్నర్‌ను పక్కనబెట్టి, ఈ ఏడాది ఇలాంటి పనే చేసింది. నిరవధిక వాయిదా తర్వాత అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తున్నట్టు ప్రకటించలేదన్న సాంకేతిక మిష రాష్ట్ర సర్కార్లకు అందివస్తోంది. ఇతరులకిది అనుకోని ఆదర్శమైంది. సాంకేతికంగా అది సరైనదైనా, సభా సంప్రదాయం, గౌరవాల రీత్యా సమర్థించలేం. రాష్ట్ర ప్రథమ పౌరులని పిలుచుకొనే గవర్నర్ పీఠానికే అది అగౌరవం. వ్యక్తుల వ్యవహారశైలి సరిగ్గా లేదని, వ్యవస్థనే తృణీకరించి, తూష్ణీభావం చూపితే అది భవిష్యత్తుకు సత్సంప్రదాయం కాదు. అలాగని రాజ్యాంగ నామినేటెడ్ పదవిలోని గవర్నర్లు సైతం ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు పంపిన ఫైళ్ళను అకారణంగా పెండింగ్‌లో పెట్టడం తప్పు. రాజ్భవన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చడం పార్టీలకు అతీతంగా పాలకులందరూ కొన్నేళ్ళుగా చేస్తున్న తప్పున్నర తప్పు. రాష్ట్రానికి పెద్దగా గవర్నర్ చేయాల్సింది – మంచీచెడూల మార్గదర్శనమే! అలా కాక, ప్రజ లెన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని తానే సర్వం సహా అనుకొని, పగ్గాలు చేతబట్టి సమాంతర సర్కార్ నడపాలనుకుంటేనే సమస్య. ప్రజా ప్రభుత్వాల అజెండాను కాక, పదవి ఇచ్చిన ఢిల్లీ పెద్దల అజెండాల ప్రకారం నడుచుకోవాలని గవర్నర్లు ప్రయత్నిస్తే అది వ్యవస్థ గౌరవాన్ని మరింత పలచన చేస్తుంది. రాష్ట్ర సర్కార్ల ప్రతిచర్యలను ప్రోత్సహిస్తుంది. గవర్నర్‌కూ, గవర్నమెంట్‌కూ మధ్య ఈ సంఘర్షణ వైఖరి ప్రజాస్వామ్యానికి క్షేమం కాదు! ఎవరికీ శోభస్కరమూ కాదు!! -
గవర్నర్ పదవిపై యనమల ఆసక్తి!
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో విపక్ష నేత, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు గవర్నర్ పదవిపై దృష్టి సారించారు. సీమాంధ్రలో ఆ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆయన్ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ప్రచారం బలంగా జరుగుతోంది. అయితే యనమల మాత్రం గవర్నర్ పదవిపై ఆసక్తితో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు తన ఆకాంక్షను సన్నిహితుల వద్ద ఆయన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎన్డీఏ కూటమి ఈనెల 26న కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో గతంలో యూపీఏ ప్రభుత్వం ద్వారా గవర్నర్లుగా నియమితులైన పలువురు రాజీనామాలు సమర్పించే యోచనలో ఉన్నారు. మొత్తం 15 వరకు రాష్ట్రాల్లో గవర్నర్ పదవులు ఖాళీ కానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏదో ఒక రాష్ట్రానికి తనను గవర్నర్‌గా పంపించాల్సిందిగా యనమల ఇప్పటికే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారని, బాబు కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉన్న విషయం విదితమే.