breaking news
good price
-
ఇల్లు అమ్ముతున్నారా?.. ఇలా ఉంటే మంచి రేటు..
కొనేటప్పుడు తక్కువ ధరకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ రేటు రావాలనుకునేది ఒక్క స్థిరాస్తిలో మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో బూమ్ లేదు కాబట్టి మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేర్పుతో కాసింత ఖర్చు పెడితే చాలు ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి అమ్మేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించలేవు. మార్కెట్ సెంటిమెంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గిరాకీ, సరఫరా కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని విక్రయించాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ, ఆ ప్రాంతంలో సగటు ధర వంటి విషయాలపై దృష్టిపెట్టాలి.వసతులే కీలకం.. ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్ మాల్స్ లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆస్పత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే.. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరం ఉండదు కాబట్టి ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకం.సౌకర్యాలే ముఖ్యం కాదు.. ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజారవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి. ఇంటిని అమ్మేటప్పుడు ఇలాంటివే కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే.. భవిష్యత్తులో ఇల్లు విక్రయించే సమయంలో కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి విలువ లెక్కగడతారని గుర్తుంచుకోవాలి.చిక్కులుండొద్దు.. స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నా ఓ విషయంలో మాత్రం చిన్నపాటి తేడా ఉన్నా కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. ప్రాంతం కూడా ముఖ్యమే.. మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేము. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆస్పత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఉండాలన్నమాట. ఇంటికి లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటు మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.👉 ఇది చదవలేదా? రుణంతోనే సొంతిల్లు.. ఇలా ఎక్కువగా కొంటున్నదెవరంటే..నిర్వహణతోనే రెట్టింపు విలువ.. గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం ఉండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపు అవుతుంది. ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది. ఇంటి విలువ కేవలం ఫ్లాట్‌కో.. ప్లాట్‌కో పరిమితం కాదు.. సౌకర్యాలు, నిర్వహణతో కలిపి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోంది. ఫుల్లీ ఫర్నీచర్, సెమీ ఫర్నీచర్ ఫ్లాట్లకు ఎక్కువే రేటు వస్తుంది. -
పన్ను ఆదా.. దీర్ఘకాలంలో మంచి రాబడులు
పన్ను ఆదా కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లోనూ ఇన్వెస్ట్ చేసే వారున్నారు. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ కూడా ఒకటి. రాబడులు..: టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ పథకం స్వల్ప కాలంలో మోస్తరు పనితీరే చూపించగా, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో మాత్రం బెంచ్ మార్క్‌తో పోలిస్తే మెరుగైన రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది. గత ఏడాది కాలంలో ఈ పథకం 14.49 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 14 శాతం వార్షిక రిటర్నులు ఇచ్చింది. ఐదేళ్లలో 12.13 శాతం, పదేళ్లలో 13.28 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. కాకపోతే ఏడాది, మూడేళ్ల కాలంలో మాత్రం బెంచ్ మార్క్ ఎస్అండ్పీ బీఎస్ఈ సెన్సెక్స్ టీఆర్ఐతో పోలిస్తే ఒక శాతం నుంచి రెండు శాతం వరకు తక్కువ రాబడులు ఉన్నాయి. కానీ, ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు 2–5 శాతం వరకు అధిక రాబడులు టాటా ఇండియా ట్యాక్స్సేవింగ్స్లోనే ఉన్నాయి. ఈ పథకానికి 20 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, 2014 చివరి వరకు ఈ పథకంలో గ్రోత్ ఆప్షన్ లేదు. రాబడుల చరిత్రను పరిశీలించే వారు ఈ అంశాలను గుర్తు పెట్టుకోవాలి. పెట్టుబడుల వ్యూహాలు మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో దీర్ఘకాలం కోసం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒకింత సురక్షితమనే చెప్పాలి. ఎందుకంటే మూడేళ్ల పాటు ఇందులో చేసే పెట్టుబడులపై లాకిన్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. దీంతో ఈఎల్ఎస్ఎస్ పథకాలకు రిడెంప్షన్ (పెట్టుబడులను ఉపసంహరించుకోవడం) ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్మెంట్ విషయంలో దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలంలో రాబడులకూ తోడ్పడుతుంది. ఈ పథకం మల్టీక్యాప్ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను వివిధ మార్కెట్ విలువ కలిగిన (లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్) స్టాక్స్ మధ్య మార్పులు, చేర్పులు కూడా చేస్తుంది. ఉదాహరణకు 2017లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో ఈ పథకం తన మొత్తం పెట్టుబడుల్లో 40 శాతాన్ని కేటాయించింది. కానీ, చిన్న, మధ్య స్థాయి షేర్లలో అస్థిరతల నేపథ్యంలో 2018 చివరికి మిడ్, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు తోడ్పడుతున్నాయి. పథకం పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 35 స్టాక్స్ ఉండగా, టాప్ 10 స్టాక్స్‌లోనే 58.41 శాతం మేర పెట్టుబడులను కలిగి ఉంది. బ్యాంకింగ్ ఫైనాన్షియల్, ఇంధనం, టెక్నాలజీ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే 44.5 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. -
‘మద్దతు'లేక రైతన్న దిగాలు
జడ్చర్ల: ఈ ఏడాది పంట ఉత్పత్తులకు మంచిధరలు ఉంటాయని ఆశించిన రైతులకు భంగపాటు ఎదురైంది. ప్రభుత్వం 2014-15 సంవత్సరానికి ప్రకటించిన మద్దతుధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు సాగుఖర్చులు పెరగడం.. మరోవైపు గిట్టుబాటు ధరలు కూడా దక్కకపోవడంతో ఈ ఏడాది కూడా అప్పులబాధ తప్పేలాలేదని రైతులు కలవరపడుతున్నారు. జిల్లాలో ప్రధానంగా ఈ ఏడాది మొక్కజొన్న పంటను 1.53 లక్షల హెక్టార్లలో సాగుచేశారు. పత్తి 2.15 లక్షల హెక్టార్లు, 96,350 హెక్టార్లలో వరిపైరును సాగుచేశారు. అయితే ప్రధాన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలు ఆశించినస్థాయిలో లేవు. గతేడాదితో పోలిస్తే పత్తి క్వింటాలుకు కేవలం రూ.50మాత్రమే పెరిగిది. మొక్కజొన్నకు ఈ ఏడాది ధరను పెంచకపోగా..పాతధర రూ.1310 కొనసాగిస్తున్నారు. అదేవిధంగా రబీలో ప్రధానంగా సాగుచేసే వేరుశనగకు కూడా పాతధర క్వింటాలుకు రూ.4వేలు చెల్లిస్తున్నారు. వరికి మాత్రం కంటితుడుపుగా రూ.90 పెంచారు. కందులకు క్వింటాలుకు రూ.50, పెసర్లకు మాత్రం రూ.100 చొప్పున పెంచారు. పెరిగిన సాగుఖర్చులు ఈ ఏడాది సాగుఖర్చులు గణనీయంగా పెరిగాయి. సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు రెండుమూడుసార్లు విత్తారు. విత్తనాలకు రూ.నాలుగు నుంచి ఆరువేలు, దుక్కిదున్నడానికి రూ.రెండువేలు, యూరియాకు రూ.ఐదువేలు, పురుగుమందుల కోసం మరో రూ.ఆరువేలు, విత్తనాలు విత్తేందుకు, కలుపుతీత పనులకు ఐదువేలు ఖర్చయింది. ఇలా పత్తిసాగుకు ఎకరాకు రూ.30 నుండి రూ.40వేల వరకు ఖర్చుచేశారు. అయితే ఎకరాకు 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే గిట్టుబాటు అవుతుందని, ప్రస్తుతం ఎకరాకు 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలపై పెదవివిరుస్తున్నారు. సాగుఖర్చులు తడిసిమోపెడయ్యాయని, మరోవైపు విద్యుత్‌చార్జీల భారం ఉండనే ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. పత్తి క్వింటాలుకు రూ.6వేలు, మొక్కజొన్నకు రూ.1800, వరికి రూ.1800 నుంచి 2000 చెల్లించాలని కోరుతున్నారు.