breaking news
Gods Own Country
-
కేరళ 'డ్రై'.. పర్యాటకులు బై బై!
'దేవుడి సొంత దేశం'గా పేరొందిన కేరళ.. ఇప్పుడు వెలవెలబోతోంది. పర్యాటకుల రాక ఉన్నట్టుండి ఒక్కసారిగా తగ్గిపోయింది. బ్యాక్ వాటర్స్, బోట్లు, కొండలు, జలపాతాలు, ఇలా ప్రకృతి రమణీయ దృశ్యాలకు పెట్టింది పేరయిన కేరళ అంటే పర్యాటకుల స్వర్గం. జమ్ము కాశ్మీర్ లాంటి ప్రాంతాలతో సమానంగా పర్యాటక ఆదాయం పొందే రాష్ట్రం అది. కానీ ఇప్పుడు మాత్రం పర్యాటకులు వేరే రాష్ట్రాలు చూసుకుంటూ కేరళను చిన్నచూపు చూస్తున్నారట. దీనంతటికీ కారణం ఏంటా అని చూస్తే.. అక్కడి ప్రభుత్వం తాజాగా విధించిన మద్యనిషేధమేనని తేలింది. వచ్చే శుక్రవారం నాటికల్లా కేరళలో దాదాపు 700 బార్ల లైసెన్సులు రద్దవుతాయి. కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం సరఫరాకు అనుమతినిస్తున్నారు. అది కూడా ఆదివారాలు మాత్రం పూర్తి డ్రైడే పాటించాల్సిందే. ఈ విషయంలో కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని బార్ యజమానులు ఆశిస్తున్నారు. సాధారణంగా పర్యాటకులు వచ్చారంటే.. మద్యపానం పట్ల ఆసక్తి చూపిస్తారు. అందులోనూ బీచ్‌లు, హౌస్బోట్ల లాంటి చోట్ల మద్యం లేదంటే చాలామందికి నిరాశ కలుగుతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే అంశం అక్కడి పర్యాటకానికి పెద్ద దెబ్బగా మారింది. మద్యం అమ్మకాలపై పన్ను రూపేణా రాష్ట్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరంలో దాదాపు 6వేల కోట్ల రూపాయం ఆర్జించింది. అంతా బాగుంటే ఇది ఈసారి మరింత పెరిగేది. కానీ.. ప్రభుత్వం నిషేధం విధించడంతో దాదాపుగా ఇందులో చాలా భాగాన్ని కోల్పోతుంది. ఇప్పుడు దీంతోపాటు పర్యాటక ఆదాయం కూడా తగ్గుతుంది. ఎందుకంటే.. మద్యం లేకపోతే తాము కేరళ కాకుండా మరో రాష్ట్రాన్ని చూసుకుంటామని దాదాపు 58 శాతం మంది ఓ సర్వేలో తెలిపారు. ఇలాంటి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంపూర్ణ మద్య నిషేధానికి మాత్రం గట్టిగా కట్టుబడి ఉండాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అంటున్నారు. -
దళితుల... కాళ్లకు మొక్కే వేడుక
శుద్ధ సంప్రదాయవాదులైన నంబూద్రి బ్రాహ్మణులు సైతం దళిత థెయ్యాలను ఆరాధించడం, వాళ్లకు మొక్కడం కోసం గంటలపాటు క్యూలో వేచి ఉండడం ఈ వేడుకలోని ఒక విశేషం. దేవుడు ఎక్కడెక్కడ ఉంటాడు? స్వర్గలోకంలో. స్త్రీలలో. ఇంకా... కేరళలో! (‘గాడ్స్ ఓన్ కంట్రీ అంటుంటారు కదా). దేవుడు విహరించే ఈ రాష్ర్టంలోనే ‘థెయ్యం’ కూడా ఉంది. థెయ్యం అంటే దెయ్యం అనుకునేరు. ‘దైవం’ కాలక్రమంలో అక్కడ ‘థెయ్యం’గా మారిపోయింది. థెయ్యం అంటే దైవనృత్యం. (దైవం+ఆట్టం). ఉత్తర కేరళ, కేరళ సరిహద్దు ప్రాంతాలలోని దాదాపు వెయ్యి ఆలయాలలో ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు థెయ్యం ఉత్సవాలు జరుగుతాయి. ఇటీవలే ముగిశాయి. థెయ్యం దళితుల వేడుక. అంతా ఒక చోట చేరతారు. డప్పులు వాయిస్తూ పాటలతో, నృత్యాలతో దేవుళ్లను, దేవతల్ని స్తుతిస్తారు. వీరిలో కొందరిని దేవుడు ఆవహిస్తాడు. అప్పుడు వారేం చెబితే అది జరుగుతుందని ఓ నమ్మకం. బడుగు వర్గాలపై అగ్రవర్ణాల వారి క్రౌర్యాన్ని కథలు కథలుగా చెప్పడం, పాటలు పాటలుగా వినిపించడం థెయ్యం పండుగలోని ప్రధాన కథాంశం. ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. బ్రిటిష్ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ తన ‘నైన్ లివ్స్’ పుస్తకంలో థెయ్యం కళాకారుల గురించి చెబుతూ, ‘‘ఈ సీజన్లో మనుషులు పార్ట్‌టైమ్ దేవుళ్లుగా అవతరిస్తారు’’ అని రాశారు. అంతేకాదు, థెయ్యం ఉత్సవాల కళాకారులుగా మారేందుకు ఉద్యోగాలు వదులుకున్నవారూ ఉన్నారు! వీళ్లు నిష్ఠగా ఉంటారు. ఆ నాలుగు నెలలు మాంసం, మద్యం ముట్టరు. స్త్రీకి దూరంగా ఉంటారు. మన అయ్యప్పలు పాటించే కఠినమైన నియమాలన్నీ వీరూ పాటిస్తారు. దేశంలోని మిగతా ప్రాంతాల వారికి థెయ్యం ఉత్సవం వింతగా కనిపిస్తుంది. కొంత భయం కూడా వేస్తుంది. దేవుడు పూనినట్లు వారు ఊగుతున్నప్పుడు, నేపథ్యంగా వినిపించే సంగీతం హృదయస్పందనలను వేగవంతం చేస్తుంది. పైగా పూనకాలు, భయానక నృత్యాలు రాత్రిపూట మాత్రమే జరుగుతాయి. స్త్రీలు వీటిని చూడడం నిషిద్ధం! వీధుల్లో ‘థెయ్యం’ ఊరేగుతుంటే పిల్లలున్నవారు తలుపులు వేసుకుంటారు. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నవారు, దేవుడిని వరాలు అడగదలచుకున్నవారు, దేవుడికి మొక్కులు తీర్చుకోవాలనుకున్నవారు ‘థెయ్యం’ పూనిన కళాకారులతో సంభాషిస్తారు. వారితో మాట్లాడితే దేవుడితో మాట్లాడినట్లే. వారికి ఏదైనా చెల్లించుకుంటే, దేవుడికి చెల్లించుకున్నట్లే. కరడుగట్టిన సంప్రదాయవాదులైన నంబూద్రి బ్రాహ్మణులు సైతం ‘దళిత థెయ్యాల’ను ఆరాధించడం, వాళ్లకు మొక్కడం కోసం గంటలపాటు క్యూలో వేచి ఉండడం ఇంకో విశేషం. ఏటా కనీసం ఇరవై మంది యువ ఫొటోగ్రాఫర్లు పనిగట్టుకుని కేరళ వచ్చి థెయ్యం ఫొటోలను తీసుకుని వెళుతుంటారు. ఈ ఏడాది అలా వచ్చి వెళ్లిన వారందరి ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం కోసం స్థానిక ఫొటోగ్రాఫర్ షాజీ ముల్లూక్కరన్ ఆహ్వానాలు పంపారు. కన్నూర్ దగ్గరి షాజీ స్వగ్రామమైన నారికోడ్లో త్వరలోనే ఈ ప్రదర్శన జరగబోతోంది