అందరికీ అందుబాటులో వైద్యం
సాక్షి, హైదరాబాద్: వైద్యాన్ని వికేంద్రీకరించి ప్రజలకు అన్నిచోట్లా సేవలు అందుబాటులోకి వచ్చేలా చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఉన్న ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్గ్రేడ్ చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. గద్వాల్, మహబూబాబాద్, నారాయణపేట్, నిర్మల్, ఆసిఫాబాద్, నర్సంపేట, భూపాలపల్లి, సిరిసిల్ల, ములుగులలో ప్రాంతీయ ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా చేస్తామని, అందుకు రూ.576.78 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భరిస్తున్నాయని తెలిపారు.
వీటి నిర్మాణాల కోసం ఈ ఏడాది రూ.214.12 కోట్ల మంజూరుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. గాంధీలో 200 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.30 కోట్లు తొలివిడతగా కేటాయిస్తున్నామన్నారు. వనపర్తి, నాగర్కర్నూల్, గజ్వేల్లో బర్న్ వార్డుల ఏర్పాటుకు రూ.1.5 కోట్లు మంజూరుకు ఆమోదం లభించిందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ డయాగ్నొస్టిక్స్ హబ్ ఏర్పాటుకు కేంద్రం రూ.24 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను సరైన విధంగా వినియోగించుకోవడంతో కేంద్రం ప్రోత్సాహకంగా మరో రూ.80 కోట్లు అదనంగా ఇచ్చిందని తెలిపారు.
అవన్నీ గాలి వార్తలే: తాను పార్టీ మారతానన్నది గాలి వార్తలేనని ఈటల స్పష్టం చేశారు. తాను పార్టీ మారేదీ లేదన్నారు. బీజేపీలోకి వస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారన్న దానిపై స్పందిస్తూ చెప్పేవాళ్లు ఎన్నయినా చెప్తారు అంటూ ఆ విషయాన్ని ముగించారు. తాను కమ్యూనిస్టుగా పెరిగానని, అదే భావజాలంతో ఉన్నానన్నారు.