220 టన్నుల నల్లబెల్లం పట్టివేత
తొర్రూరుటౌన్, న్యూస్‌లైన్ : అక్రమంగా తరలిస్తున్న 220 టన్నుల నల్లబెల్లంను మరిపెడ మండలం గిరిపురం సబ్‌స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు.తొర్రూరు ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ కథనం ప్రకారం... చిత్తూరు జిల్లా నుంచి మహబూబాబాద్‌కు లారీలో అక్రమంగా నల్లబెల్లం తరలిస్తుండగా పక్కా సమాచారంతో మరిపెడ మండలం గిరిపురం వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీ నిర్వహించగా లారీ చిక్కింది. లారీలో 220 టన్నుల నల్లబెల్లం లభ్యం కావడంతో సీజ్ చేశారు.
ఈ నల్లబెల్లం లోడు మహబూబాబాద్‌కు చెందిన సోమశేఖర్ అనే వ్యాపారికి సంబంధించిందని పోలీసుల విచారణలో తేలింది. కాగా ఈ నెల 5న కూడా ఇదే వ్యాపారికి చెందిన 350 బస్తాల నల్లబెల్లంను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
పది రోజుల వ్యవధిలో ఒకే వ్యాపారికి చెందిన రెండు లారీల లోడు నల్లబెల్లం ఎక్సైజ్ పోలీసులకు చిక్కడం గమనార్హం. ఎక్సైజ్ పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్‌తోపాటు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో ఎస్సై సుధాకర్, ప్రసన్న కుమార్, సిబ్బంది రమేష్, రాంమూర్తి, భద్రుసింగ్, రషీద్, హరిప్రసాద్, హచ్య, రాంచందర్, మల్లేషం, రవిప్రసాద్ పాల్గొన్నారు.