breaking news
Germanwings crash
-
డోర్ ఓపెన్ కాలేదట..
వాషింగ్టన్ : ఫ్రాన్సులోని దక్షిణ ఆల్ప్స్ పర్వతాల్లో జర్మనీకి చెందిన ఎయిర్‌బస్ ఎ-320 విమానం కూలిపోవడానికి పైలటే కారణమా? కాక్‌పిట్ తలుపు తెరుచుకోకపోడమే ప్రమాదానికి కారణమా? విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు కాక్‌పిట్ నుంచి బయటికి వెళ్లడం వల్లనే విమానం కూలిపోయిందా... అసలు ఆ పైలట్ బైటికి ఎందుకు వెళ్లాడు... ఇవన్నీ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను పరిశీలిస్తున్న సీనియర్ సైనిక అధికారి అనుమానాలు. విమాన ప్రమాదంలో కీలకమైన సమాచార సేకరణలో భాగంగా కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఆ అధికారి విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే పైలట్ కాక్‌పిట్ నుంచి బయటకు వెళ్లి, మళ్లీ తిరిగి కాక్‌పిట్‌లోకి ఎంటర్ కావడానికి ప్రయత్నించి విఫలమైన విషయం స్పష్టంగా రికార్డు అయినట్లు చెబుతున్నారు. అలాగే పైలట్ ఎందుకు బైటికి వెళ్లాడు? కాక్‌పిట్‌లో రెండవ పైలట్ ఒక్కడే ఉన్నాడా..డోర్ తెరవలేకపోయాడా? అనేది కూడా ఖచ్చితంగా నిర్ధారించలేమంటున్నారు. మొదటి బ్లాక్‌బాక్స్‌లో కొన్ని శబ్దాలు, మాటలు రిజిస్టర్ అయినట్లు ఫ్రాన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో హెడ్ రెమీ జౌటీ కూడా నిర్ధారించారు. పైలట్ తలుపును గట్టిగా కొడుతున్న శబ్దాలు, మాటలు నమోదయ్యాయనీ.. అయితే పూర్తి వివరాలు తెలియడానికి మరికొన్ని రోజులు లేదా వారాలు పట్టవచ్చన్నారు. జర్మన్ వింగ్స్ ఎయిర్‌బస్ ఎ320 మంగళవారం కూలిపోయిన దుర్ఘటనలో ఆరుగురు సిబ్బంది సహా 144 ప్రయాణీకులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. కాగా ప్రమాద సమయంలో 150 మంది ఉండగా, ఎవరూ బతికేందుకు అవకాశం లేదని ఇదివరకే ఫ్రాన్స్ ప్రకటించింది. -
ఆ రెండు నిమిషాల్లో ఏం జరిగింది?
సైన్-లెస్-ఆల్ఫ్స్(ఫ్రాన్స్): ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలో మంగళవారం కూలిపోయిన జర్మన్వింగ్స్ ఎయిర్‌బస్ 320 విమానానికి చెందిన బ్లాక్‌బాక్స్ బాగా దెబ్బతింది. ప్రమాదానికి సంబంధించి కీలక సమాచారం నిక్షిప్తం అయ్యే ఈ బ్లాక్‌బాక్స్‌ను అధికారులు సేకరించారు. దీనిని పగులగొట్టి తెరిచారు. మంగళవారం ఉదయం 10:30-10:31 గంటల మధ్యే విమానం కూలిందని, ఈ రెండు నిమిషాల్లో ఏం జరిగిందన్నది బ్లాక్‌బాక్స్ సమాచారంతో వెల్లడికావచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బ్లాక్‌బాక్స్‌ను జాగ్రత్తగా పునరుద్ధరించి, దానిలోని సమాచారం సేకరించాల్సి ఉందని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి బెర్నార్డ్ కాజెనీవ్ తెలిపారు. ఎయిర్‌బస్ 320 విమానంలో ప్రమాద సమయంలో 150 మంది ఉండగా, ఎవరూ బతికేందుకు అవకాశం లేదని ఇదివరకే ఫ్రాన్స్ ప్రకటించింది. అతి క్లిష్టమైన పర్వత ప్రాంతంలో ఉన్న ప్రమాదస్థలికి చేరుకున్న సైనిక సిబ్బంది సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటోంది. విమానం బలంగా ఢీకొట్టడంతో శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే, ప్రమాదం వెనక ఉగ్రవాదం, ఇతర కుట్ర వంటి కోణాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని జర్మనీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టంచేశారు. కాక్‌పిట్‌లో పైలట్ల సంభాషణలు, ఇతర అన్ని రకాల శబ్దాలు కూడా రికార్డు అవుతాయి. బ్లాక్‌బాక్స్ సమాచారం డౌన్లోడ్ చేసుకునేందుకు కొన్ని గంటలు పట్టవచ్చని తెలిపారు. అయితే, విమాన సమాచారం నిక్షిప్తం అయ్యే రెండో బ్లాక్‌బాక్స్ ఇంకా లభించాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా, బ్లాక్‌బాక్స్ నుంచి సేకరించిన ఆడియోలో ఏం ఉందన్న వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. విమాన సమాచారం నిక్షిప్తం అయ్యే రెండో బ్లాక్‌బాక్స్ ఇంకా లభించాల్సి ఉందన్నారు. కాగా, జర్మన్వింగ్స్ విమాన ప్రమాద స్థలాన్ని బుధవారం ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ నాయకులు పలువురు సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ ప్రధాని మారియానో రజోయ్ హెలికాప్టర్ ద్వారా ప్రమాద స్థలిని పరిశీలించారు. మరోవైపు ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగవంతం అయింది. ఒకే కుటుంబంలో మూడు తరాలు... ఎయిర్‌బస్ విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మూడుతరాల వారు మృత్యువాతపడ్డారు. బార్సిలోనాకు చెందిన ఓ విద్యార్థిని, ఆమె తల్లి, నానమ్మ ప్రమాదంలో మృతిచెందారు. నివాళి మరణించిన 16 మంది విద్యార్థులకు హాల్టెన్ నగరంలో స్కూలు వద్ద సహవిద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మరణించిన తోటి విద్యార్థులను తలచుకొని విలపించారు. జర్మన్వింగ్స్ విమానం రద్దు.. జర్మన్వింగ్స్ ఎయిర్‌బస్ విమాన దుర్ఘటన నేపథ్యంలో ఆ సంస్థ విమానం నడిపేందుకు పైలట్లు నిరాకరించడంతో బుధవారం ఓ విమానాన్ని రద్దుచేసినట్లు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ఒబామా సంతాపం.. ఫ్రాన్స్‌లో విమాన దుర్ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సంతాపం ప్రకటించారు. జర్మనీ, ఫ్రాన్స్, తదితర దేశాలకు చెందిన బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.