ట్విట్టర్లో గ్యాంగ్ రేప్ వీడియో కలకలం
సోషల్ మీడియా ట్విట్టర్లో గ్యాంగ్ రేప్ వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేయడం బ్రెజిల్లో కలకలం సృష్టించింది. కొందరు దుండగులు 16 ఏళ్ల అమ్మాయిని సామూహిక అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై బ్రెజిల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బ్రెజిల్ పోలీసులు ఇప్పటి వరకు నలుగురు నిందితులను గుర్తించారు.
బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాల మేరకు.. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరోలో ఆమె ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో వాళ్లిద్దరు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని, ఆ మరుసటి రోజు పక్క భవంతిలో తాను నగ్నంగా పడిఉన్నానని, చుట్టూ కొందరు తుపాకులు పట్టుకుని ఉన్నారని పోలీసులకు చెప్పింది. నీరసించిపోయిన బాధితురాలు మగవాళ్ల దుస్తులు ధరించి ఇంటికి తిరిగివచ్చిందని, ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
రెండు రోజుల తర్వాత బాధితురాలు నగ్నంగా, అపస్మారక స్థితిలో ఉన్నప్పటి వీడియో ట్విట్టర్లో కనిపించింది. 40 సెకెన్ల నిడివిగల వీడియోను ఓ నిందితుడు పోస్ట్ చేశాడు. మరో నిందితుడు బాధితురాలితో అభ్యంతరకర పరిస్థితిలో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ దృశ్యాలను నెటిజెన్లు షేర్ చేసుకున్నారు. ట్విట్టర్ యాజమాన్యం ఈ ఫొటోలను తొలగించే లోపే 500 లైక్‌లు వచ్చాయి. ఈ దారుణ ఘటనపై బ్రెజిల్లో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. మహిళలపై దాడులు, అత్యాచార సంస్కృతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో హింసాత్మక చర్యల పోస్టింగ్స్ పెట్టడాన్ని నిరసించారు. దీంతో బ్రెజిల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధితురాలిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనలో 33 మందికి ప్రమేయముందని, ఇప్పటి వరకు నలుగురిని గుర్తించి అరెస్ట్ వారెంట్లు జారీ చేశామన పోలీసులు చెప్పారు.