breaking news
G- 20
-
విజ్ఞతతో అడుగేయాలి
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఆర్థిక సమస్యలపైనా...త్వరలో జరగబోయే పర్యావరణ శిఖరాగ్ర సమావేశంపైనా, యూరప్ ఎదుర్కొంటున్న శరణార్థుల సమస్యపైనా ప్రధానంగా దృష్టి సారించాల్సిన జీ-20 దేశాలకు ఇప్పుడు ఉగ్ర వాదం కీలకాంశంగా మారింది. టర్కీ తీరంలోని అంటాల్యా నగరంలో ఆదివారం ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు ప్రస్తుతం తన ఎజెండాను పక్కనబెట్టి పారిస్ మారణహోమంపై చర్చిస్తున్నది. ప్రపంచంలోని 85 శాతం ఆర్థిక వ్యవస్థలకు జీ-20 ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సహకారంలో ఎదురవుతున్న సవాళ్ల పైనా, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఇది సమీక్షించాల్సి ఉంది. దేశాల ఆర్థిక వ్యవస్థలను కుంగదీస్తున్న నల్ల డబ్బు బెడద విషయంలో కఠినంగా వ్యవహరించాలని మన దేశం గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. ఏవేవో సాకులు చెప్పి చాలా దేశాలు నల్ల కుబేరుల వివరాలు ఇవ్వడానికి ముందు కు రావడం లేదు. పన్నుల ఎగవేత, నల్లడబ్బు లాంటి సమస్యలు వర్ధమాన దేశాల అభివృద్ధికి ఆటంకంగా పరిణమించాయని భారత్ ఆందోళన పడుతోంది. దేశాలన్నీ పారదర్శకతను పాటిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని చెబుతున్నది. అలాగే ఎన్నారైలు, వివిధ వ్యాపారాలు చేసేవారూ భారత్‌కు పంపే సొమ్ముపై లావాదేవీల భారాన్ని తగ్గించాలని మన దేశం కోరుతోంది. 2013లో ఇలా దేశంలోకి వచ్చిన సొమ్ము 7,000 కోట్ల డాలర్లు. ఈ లావాదేవీల వ్యయం దాదాపు 10 శాతం ఉండేది. మన దేశం గట్టిగా డిమాండ్ చేయడంవల్ల ప్రస్తుతం అది 7.5 శాతానికి వచ్చింది. 2030కల్లా దీన్ని 3 శాతానికి తీసుకురావాలని కోరుకుంటోంది. అంతేకాదు... వేర్వేరు దేశాలనుంచి వచ్చిపడుతున్న నిధుల వరదతోనే ఉగ్రవాదం వర్థిల్లుతున్న దని, దాన్ని ఆపగలిగినప్పుడే ఆ సమస్యను దుంపనాశనం చేయడం సాధ్యమ వుతుందని మన దేశం వాదిస్తోంది. అల్ కాయిదా, ఐఎస్ వంటి సంస్థలకు జీ-20 సభ్య దేశాల ఆర్థిక సంస్థల ద్వారానే నిధులు వెళ్తున్నాయి. ఇలాంటి సమస్యల న్నిటిపైనా చర్చ పెట్టాలని మన దేశం భావించింది. ఈ సమావేశంలో సిరియాపై అమీ తుమీ తేల్చుకోవాలని టర్కీ అనుకుంది. సిరియా విషయంలో అమెరికా నాన్చుడు వైఖరిపై అది ఆగ్రహంతో ఉంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను సాధ్యమైనంత త్వరగా పదవీచ్యుతుణ్ణి చేస్తే తప్ప ఉగ్రవాదాన్ని ఎదుర్కొనలేమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వాదిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా 2009 తర్వాత టర్కీకి రావడం ఇదే ప్రథమం. ఆనాటి పర్యటన పర్యవసానంగా రెండు దేశాలమధ్యా సాన్నిహిత్యం, సహకారం పెరిగాయి. సిరియాతో తమకుండే తగువును అమెరికా ద్వారా పరిష్కరించుకోవా లన్నది ఎర్డోగాన్ ఎత్తుగడ. కనుకే సిరియాపై సైనిక చర్య తీసుకుంటే దాని పర్యవ సానంగా వచ్చిపడే సామాజిక, ఆర్థిక సమస్యలను భరించడానికి... ముఖ్యంగా 20 లక్షలమంది శరణార్థుల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన గతంలో చెప్పారు. స్వదేశంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరంలో నిండా కూరుకుపోయి, తీరిక దొరక్క ఎర్డోగాన్ ఎటూ కదల్లేకపోయారు గానీ...లేకుంటే ఆయన జీ-20 ఎజెండాలో సిరియా సమస్యను తెచ్చిపెట్టేవారే. కానీ ఐఎస్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం ఇక తనవల్లగాదని ఇప్పటికే గ్రహించిన అమెరికా...ఆ విషయంలో సిరియా సహకారాన్నీ, ఇరాన్ తోడ్పాటునూ కోరుకుంటోంది. మారిన ఈ పరిణామం ఎర్డోగాన్‌కు మింగుడుపడటం లేదు. పారిస్‌లో ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సం మాటలకందనిది. అందువల్లే 129మందిని పొట్టనబెట్టుకుని, మరో 352మందిని గాయపరిచిన ఆ ఉన్మాదుల చర్యను సదస్సులో మాట్లాడిన దేశాధినేతలంతా తీవ్రంగా ఖండించారు. ఆ మహమ్మారితో కఠినంగా వ్యవహరించేందుకు సమష్టిగా కదులుదామని ప్రకటిం చారు. దాంతోపాటు యూరప్ దేశాలకు ఇప్పుడు పెనుముప్పుగా పరిణమించిన శరణార్థుల సమస్యపై కూడా వారు దృష్టిసారించారు. ఇవి రెండూ సంబంధంలేని అంశాలు కాదు. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అంతేకాదు...పారిస్ మారణహోమంపై అందుతున్న తాజా సమాచారాన్నిబట్టి చూస్తే ఈ రెండు అంశాలూ అక్కడ జరిగిన బీభత్సానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. శరణార్థుల రూపంలో వచ్చిన ఉగ్రవాదులు దాడికి పథక రచన చేసి ఉండొచ్చునని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయంటున్నారు. కనుక యూరప్ దేశాలు సరిహద్దుల పహారాను మరింతగా పెంచి, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాకే శరణార్థులను అనుమతించాలని ఈ శిఖరాగ్ర సదస్సు కోరబోతున్నదని చెబుతున్నారు. అయితే ఉగ్రవాదానికి దారితీసిన పరిస్థితుల్ని సమీక్షించకుండా, ఆత్మవిమర్శ చేసుకోకుండా తీసుకునే ఇలాంటి నిర్ణయాలు ఆచరణలో ఫలితాన్నివ్వవు. సరిగదా వికటించి ఉగ్రవాదాన్ని మరింత పెంచుతాయి. సిరియాకూ, తమకూ ఉన్న సమస్యల్ని అంతర్జాతీయం చేసి లాభపడదామని టర్కీ ప్రయత్నించడం...స్వప్రయోజనాలను ఆశించి అమెరికా, నాటో దేశాలు దానికి పక్కతాళం వేయడం...అసద్‌ను పదవి నుంచి దించడానికి ఆయన వ్యతిరేకులకు విచక్షణారహితంగా డబ్బు, ఆయుధాలు అందించడం పర్యవసానంగానే ఐఎస్ ఉగ్రవాద సంస్థ పుట్టుకొచ్చిందని విస్మరించ కూడదు. అది సిరియా, లిబియా, ఇరాక్ తదితర ప్రాంతాల్లో సాగిస్తున్న మారణ హోమం వల్లనే కొంపా గోడూ వదిలి లక్షలాదిమంది శరణార్థు లుగా వస్తున్నారు. తాము సమావేశం నిర్వహించుకునే చోటకు కేవలం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరియాలో ఊళ్లన్నీ వల్లకాడుల్లా మారాయని జీ-20 దేశాధినేతలు తెలుసుకోవాలి. సమస్య తమ సృష్టే గనుక కనీసం పరిష్కారం విషయంలోనైనా విజ్ఞతతో వ్యవహరించాలన్న స్పృహ ధనిక దేశాలకు కలగాలి. జీ-20 శిఖరాగ్ర సదస్సు అందుకు దోహదపడితే ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం సులభమవుతుంది. -
జీ-20 సదస్సు ఆర్థిక నిర్ణయాలు.. విశ్లేషణ
ప్రపంచంలో 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లకు సంబంధించిన గ్రూపును జీ-20గా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో వివిధ అంశాలకు సంబంధించి ఆయా దేశాల సహకారం, చర్చల కొనసాగింపునకు వీలుగా జీ-20 గ్రూపు ఏర్పాటును కెనడా మాజీ ప్రధానమంత్రి పాల్మార్టిన్ ప్రతిపాదించారు. జీ-20ని 1999 సెప్టెంబర్‌లో ప్రకటించగా.. మొదటి సమావేశం అదే ఏడాది డిసెంబర్లో జరిగింది. తాజాగా జీ-20 దేశాల నేతలు సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సభ్య దేశాలు కలిసి పని చేయాలని సమావేశంలో నిర్ణయించారు. డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. జీ-20 దేశాల విజయాలను పరిశీలిస్తే.. బ్రిక్స్ (BRICS) వంటి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పటిష్టంగా ఉంది. దీనివల్ల అంతర్జాతీయ విత్త సంస్థల పటిష్టత, ఆర్థిక నియంత్రణల నాణ్యతలో పెరుగుదల సంభవించింది. పీటర్‌సబర్‌గ సమావేశం- నిర్ణయాలు: ఐదు సంవత్సరాల క్రితంతో పోల్చితే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు కొంత వరకు మెరుగయ్యాయి. ఆర్థిక వృద్ధిరేటు వేగవంతమైనప్పటికీ.. మరోవైపు అనిశ్చితి కూడా పెరిగింది. ఈ క్రమంలో సెయింట్ పీటర్‌సబర్‌గలో జరిగిన జీ-20 సమావేశం పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా అధిక వృద్ధి, ఉపాధి కల్పన మెరుగుపడగలదని అభిప్రాయపడింది. సమర్థమైన నియంత్రణల అమలుతోపాటు మార్కెట్లపై విశ్వాసం పెంపొందించే చర్యలు చేపట్టాలని కూడా ఈ సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సెయింట్ పీటర్‌సబర్‌గ కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించారు. బడ్జెట్‌లోటు తగ్గుదల, సమగ్రమైన నిర్మాణాత్మక సంస్కరణల అమలును మధ్యకాలిక లక్ష్యాలుగా నిర్ణయించారు. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా శ్రామిక మార్కెట్, పన్నుల వ్యవస్థపై నియంత్రణ, మానవ మూల ధనం పెంపు, అవస్థాపనా సౌకర్యాల మెరుగుదల, వస్తు మార్కెట్ నియంత్రణ విధానాలను అమలు చేయాలని సూచించారు. ఈ చర్యలు విత్త మార్కెట్‌ను పటిష్టపరచడంతోపాటు అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడిదారుల పాత్రను పెంచాల్సిన అవసరాన్ని వివరించాయి. అభివృద్ధి వ్యూహం: జీ-20 నేతలు సెయింట్ పీటర్‌సబర్‌గ అభివృద్ధి వ్యూహాన్ని ఈ సమావేశంలోనే వెల్లడించారు. అల్పాదాయ దేశాలకు ఆర్థిక సహాయం అందించే క్రమంలో అనుసరించాల్సిన ప్రాధాన్యత అంశాలను ఈ వ్యూహంలో పేర్కొన్నారు. అవి: ఎ)ఆహారభద్రత బి)ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సి)ఫైనాన్షియల్ లిటరసీ డి)ఆధునిక అవస్థాపనా సౌకర్యాల కల్పన ఇ)మానవ మూలధనం పెంపు, వేగంగా అభివృద్ధి చెందుతున్న (ఎమర్జింగ్) వ్యవస్థలలో స్వదేశీ వనరుల సమీకరణ. పాత్ర కీలకం: ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పురోగమనం దిశగా మళ్లించడంలో జీ-20 దేశాల పాత్ర కీలకమన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. వృద్ధి రేటును పటిష్టం చేయడం ద్వారా ఉపాధి కల్పన పెంచాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పటిష్టమైన, సుస్థిర, సంతులిత వృద్ధి సాధన దిశగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమించాలని ఆయా దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. సుస్థిర వృద్ధి సాధన పెట్టుబడులపై ఆధారపడి ఉండడంతో.. పెట్టుబడులకు సంబంధించి సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా భావించారు. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెంపుతోపాటు విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం కలిగించే విధంగా సమర్థమైన నియంత్రణ విధానం ఉండాలని కూడా సమావేశం పేర్కొంది. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు సభ్య దేశాలు పరస్పర సహకారంతో పని చేయాలని ఆయా దేశాల నేతలు సూచించారు. సుస్థిరత సాధించేందుకు: విత్త యాజమాన్యాన్ని సమర్థంగా నిర్వహించడంతోపాటు విత్త మార్కెట్లో సుస్థిరత సాధించేందుకు ప్రయత్నించాలని.. తద్వారా ఆర్థిక వ్యవస్థలు పురోగమిస్తాయన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో నిరుద్యోగం, అల్ప ఉద్యోగిత పెరిగింది. ఈ నేపథ్యంలో యువత కోసం నాణ్యతతో కూడుకున్న ఉత్పాదకత గల ఉపాధిని పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాలని సమావేశంలో నేతలు వ్యాఖ్యానించారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రభుత్వ విధానాల మధ్య సమన్వయం ఉండాలి. స్థూల ఆర్థిక విధానాల అమలు ద్వారా విద్య, నైపుణ్యం, నవకల్పనలు, ఉపాధి, ద్రవ్య, సాంఘిక భద్రత పెంపొందించే చర్యలు అవసరమని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. శ్రామిక మార్కెట్లో సంస్కరణల అమల్లో భాగంగా సమ్మిళిత శ్రామిక మార్కెట్ల ఏర్పాటుకు అవసరమైన మద్దతు కొనసాగించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. పెట్టుబడులు పెంచే క్రమంలో దీర్ఘకాల రుణ మార్కెట్ల అభివృద్ధి ఆవశ్యకతను సమావేశంలో పేర్కొన్నారు. అవస్థాపనా రంగం, చిన్న, మధ్య తరహా సంస్థలకు పెట్టుబడుల ప్రవాహం పెరగాలని.. ఆయా రంగాల్లో పెట్టుబడుల పెరుగుదల అధికవృద్ధి సాధనకు తోడ్పడటమే కాకుండా ఉపాధి కల్పనకు దోహదపడగలదని పేర్కొన్నారు. బహుళ దేశాలతో వాణిజ్యం: పటిష్టమైన బహుళ దేశాలతో వాణిజ్యం (Multi lateral Trading) పెంపుపై దేశాలు దృష్టి కేంద్రీకరించాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం పొందిన దేశాలు మరింత సరళీకరణ (flexibility) కనబరచి ఈ సంవత్సరంలో జరిగే మల్టీ లేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స ద్వారా ఆశించిన ఫలితాలు సాధించాలని సమావేశం పేర్కొంది. పటిష్టమైన, సుస్థిర, సంతులిత వృద్ధి ద్వారా ప్రజలందరూ లబ్ధి పొందే అవకాశం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమనాన్ని అతి ముఖ్యమైన అంశంగా ఈ సమావేశం పేర్కొంది. ఇతర చర్యలు: సెయింట్ పీటర్‌సబర్‌గ సమావేశం గవర్నెన్సకు సంబంధించి ప్రపంచీకరణ విధానాల అమలుపై దృష్టి కేంద్రీకరించింది. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరస్పర ఆధారిత వ్యవస్థగా రూపాంతరం చెంది అధిక వృద్ధి వైపు పయనించింది. భారత్‌తోపాటు అనేక దేశాలు నియంత్రణ విధానాలను విడనాడాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు, దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షల తొలగింపు, అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి, మూల ధన ప్రవాహాలపై వివిధ దేశాల ఆంక్షలు తొలగించడం, చైనా, భారత్‌తోపాటు ఇతర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి సాధించడంలో తోడ్పడటం లాంటి పరిమాణాలు సంభవించాయి. ఆర్థిక సంక్షోభం అనంతర కాలంలో పరస్పర ఆధారిత దేశాలన్నీ లబ్ధి పొందేరీతిలో జీ-20 ప్రక్రియ ప్రారంభమైంది. తదుపరి కాలంలో బేసెల్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ సూపర్విజన్, ది ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు, ది ఫైనాన్షియల్ ఆప్షన్ టాస్క్ఫోర్స, ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషనర్స, ది ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రస్తుతం నిర్వహణలో ఉన్న పలు సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రగతిపై సమీక్ష: గత కొంతకాలంగా వరుసగా వివిధ దేశాల ఆర్థిక స్థితి క్షీణించింది. ఈ క్రమంలో అగ్రెసివ్ టాక్స్ ప్లానింగ్, పన్నులు ఎగవేతలకు ఆస్కారం లేనివిధంగా అంతర్జాతీయ సహకారం పెంపొందించడానికి జీ-20 కృషి చేసింది. సభ్య దేశాల్లో విధాన నిర్ణయాల అమలు ప్రగతిని జీ-20 సమీక్షించింది. భారత్ వస్తు, సేవలపై పన్ను విధింపును ప్రకటించింది. ఎగుమతుల తగ్గింపు ద్వారా స్వదేశీ వినియోగ పెంపునకు చైనా అనుమతించింది. జపాన్ ఆర్థిక సహాయంతో ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్‌ను పూర్తి చేయడానికి భారత్ సంకల్పించింది. పారదర్శకత పెంపు ద్వారా అవినీతి నిర్మూలనకు జీ-20 కట్టుబడి ఉంది. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి అవస్థాపనా రంగంపై పెట్టుబడులు పెరగాలి. భారత్ అవస్థాపనా సౌకర్యాలపై ఆశించిన మేర పెట్టుబడులు ఆకర్షించకపోవడం అధిక ఆర్థికవృద్ధి సాధనకు అవరోధంగా మారింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో అవస్థాపనా రంగంపై పెట్టుబడుల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా సమిష్టి డిమాండ్‌ను పెంచగలదు. ముగింపు: పటిష్టమైన, సుస్థిర, సంతులిత వృద్ధి సాధన లక్ష్యాన్ని సెయింట్ పీటర్‌సబర్‌గ సమావేశం సదర్భంగా జీ-20 దేశాలు ప్రకటించాయి. ఆయా దేశాల్లో సమానత్వం సాధించకుండా ప్రతిపాదిత లక్ష్యాల సాధన సాధ్యం కాదు. జీ-20 దేశాల్లో కొన్ని ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను లక్షిత వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నాణ్యతతో కూడిన విద్య, ఆరోగ్య సంరక్షణ, అధికవేతన స్థాయి ప్రజలు పొందగలగాలి. తలసరిశక్తి వినియోగం, తాగునీరు, స్వచ్ఛమైన గాలి (క్లీన్ ఎయిర్) వంటి సౌకర్యాలు పెంపొందించాలి. ఆయా దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు వేర్వేరుగా ఉండటాన్ని ఈ సందర్భంగా గమనించవచ్చు. పన్ను ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా పన్ను ఎగవేతను నివారించే ఉద్దేశంతో పన్నుల విధానంలో సంస్కరణలను ఆయా దేశాల్లో అత్యవసరంగా ప్రవేశపెట్టాలి. రీజనల్ ట్రేడ్ ఒప్పందాలతో పారదర్శకతను పెంపొందించేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక సంక్షోభం- భారత్ చర్యలు అమెరికా సంక్షోభానికి ముందు కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థగా నిలిచింది. 2005-07 మధ్య కాలంలో 9.6 శాతం వృద్ధి సాధించగా 2008 -09లో సంక్షోభం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. సంక్షోభం కారణంగా భారత్‌లో టెక్స్టైల్, వజ్రాలు, ఆభరణాలు వంటి ఎగుమతి ప్రాధాన్యత పరిశ్రమల్లో, ఉపాధి క్షీణత సంభవించింది. ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ప్రభుత్వం 2008 డిసెంబర్, 2009 జనవరి, ఫిబ్రవరిలో మూడు విడతలుగా విత్త మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ విధానం ముఖ్యోద్దేశ్యం సమ్మిళిత వృద్ధి. ప్రభుత్వ వ్యయం పెంపు ద్వారా గ్రామీణ ఆదాయాలు పెరిగి తద్వారా వడ్డీరేటు తగ్గి స్వదేశీ డిమాండ్ పెరగగలదని విధాన నిర్ణేతలు భావించారు. విత్త మద్దతులో భాగంగా... ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టిన రహదారులు (హైవేస్), నౌకాశ్రయాలు, విద్యుత్ రంగానికి సంబంధించిన అవస్థాపనా ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడం. విత్త సంస్థల నిధుల సమీకరణను రీజినల్ ఇన్‌స్టిట్యూషన్‌స లేదా మల్టిలేటరల్ సంస్థల నుంచి అనుమతించారు. టెక్స్టైల్, హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్, వజ్రాలు, ఆభరణాలు, తోలు రంగానికి సంబధించి పన్ను రాయితీలు ఆర్థిక వ్యవస్థలో మూలధన ప్రవాహం పెంపు. ఆస్తుల కొనుగోలు, ప్రభుత్వం లేదా కేంద్ర బ్యాంకు రుణాలు, ద్రవ్యత్వం పెంపు వంటి చర్యల ద్వారా మూలధన ప్రవాహం పెంపు. గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరిచే క్రమంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం, అవస్థాపనా రంగం, సుపరిపాలనా సంస్కరణలకు సంబంధించి జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ఏర్పాటు, భారత్ నిర్మాణ్ కార్యక్రమాల అమలు సంక్షోభకాలంలో దేశంలో స్వదేశీ డిమాండ్ పెరుగుదలకు దోహదపడ్డాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ - ప్రస్తుత సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించడంతోపాటు నిరుద్యోగం పెరుగుతోంది. ఈ పరిస్థితి పలు దేశాల్లో సమ్మిళిత వృద్ధి సాధన ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఐరోపాలో విత్త మార్కెట్ సంక్షోభం. వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ వ్యవస్థలో మందగించిన వృద్ధి ప్రపంచ వ్యాప్తంగా మూలధన ప్రవాహానికి సంబంధించిన ఒడిదుడుకులు నమోదు కావడం. వివిధ దేశాల్లో ప్రైవేట్ పెట్టుబడులు కావల్సినంతగా లేకపోవడంతోపాటు మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ దేశాల ప్రభుత్వ రుణ భారం అధికంగా ఉండటం. ప్రపంచవ్యాప్తంగా సమిష్టి డిమాండ్ తగ్గుదల. వివిధ దేశాల ప్రభుత్వాల కోశ విధానంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగడం వస్తు ధరల ఒడిదుడుకులతోపాటు ఫైనాన్షియల్ కండీషన్స (ఆర్థిక పరిస్థితులు) కఠినంగా ఉండటం.