breaking news
France police
-
పోలీసుల అతి.. ఆగని ప్రజాగ్రహం.. రణరంగాన్ని తలపిస్తున్న ఫ్రాన్స్
ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలపై పోలీసులు 17 ఏళ్ల యువకుడ్ని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టి స్తున్నారు. మైనార్టీలపై ఫ్రాన్స్ పోలీసుల అకృత్యాలు ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అమెరికాలో జాత్యహంకారంతో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి హత్యపై కూడా అప్పట్లో ఫ్రాన్స్ నిరసనలతో దద్దరిల్లింది. గతంలో ఫ్రాన్స్‌లో పోలీసుల అతిపై పలుమార్లు తీవ్ర ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. వాటి వివరాలు.. నేహల్ ఎం.. అల్జీరియా సంతతికి చెందిన నేహల్‌కు 17 సంవత్సరాలు. మంగళవారం అతను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు ఆ కారు ఆపడానికి ప్రయత్నించారు. అయితే నేహల్ కారు ఆపకుండా తమ మీదకి దూసుకురావడంతో అతనిపై కాల్పులు జరపాల్సి వచి్చందని, దీంతో అందరి ప్రాణాలు కాపాడడానికే అతనిపై కాల్పులు జరిపామన్నది పోలీసుల వాదన. ఆ కాల్పుల్లో నేహల్ మృతి చెందడంతో సామాన్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల తీరుని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల వాదనకు పూర్తిగా విరుద్ధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఆ యువకుడిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతున్నారు. దేశం ఒక అగ్ని గుండంగా మారింది. మైకేల్ జెస్లెర్.. 2020 నవంబర్‌లో నల్లజాతీయుడైన మ్యూజిక్ ప్రొడ్యూసర్ మైకేల్ జెస్లర్పై పోలీసులు తమ కర్కశత్వం ప్రదర్శించారు. పారిస్‌లో ఉన్న జెస్లర్ని ఒక కేసులో అరెస్ట్ చేయడానికి నలుగురు పోలీసులు వెళితే అతను ప్రతిఘటించాడన్న సాకుతో వారు తమ దాషీ్టకం ప్రదర్శించారు. జెస్లర్ను గొడ్డును బాదినట్టు బాదారు. ఈ వీడియో బయటకి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం ఆ నలుగుర్ని సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో ఫ్రాన్స్‌లోని వ్యవస్థల్లో జాతి వివక్షపై మరోసారి విస్తృతంగా చర్చ జరిగింది. జార్జ్ ఫ్లాయిడ్ 2020 జూన్‌లో అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను తెల్ల తోలు అహంకారంతో ఒక పోలీసు అధికారి నేలపై పడేసి తన మోకాలితో అతని గొంతుపై ఎనిమిది నిమిషాల సేపు నొక్కి ఉంచి హత్య చేయడంపై నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు నల్లజాతి వారిని, అరబ్బులని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఫ్లాయిడ్ మృతిపై అమెరికాను మించి ఫ్రాన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం నిందితుల్ని అరెస్ట్ చేసినప్పడు వారి మెడపై చెయ్యి వెయ్యడాన్ని నిషేధించింది. యెల్లో వెస్ట్స్ ఉద్యమం 2018లో ఫ్రాన్స్ ప్రభుత్వం చమురుపై పన్ను విధించడానికి సన్నాహాలు చేస్తోందనే వార్తలపై ప్రజాందోళనలు భగ్గుమన్నాయి. ప్రతిపాదిత పన్నుని నిరసిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనల్ని అణగదొక్కడానికి పోలీసులు మరింత హింసకు పాల్పడ్డారు. రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగం, గ్రనేడ్స్ కూడా వాడడంతో క్షతగాత్రులైన వేలాదిమంది శాశ్వతంగా మంచానికే పరిమితమైపోయారు. అడమా ట్రయోర్.. 2016 జూలైలో 24 ఏళ్ల వయసున్న అడమా ట్రయోర్ అనే యువకుడు పోలీసు కస్టడీలో మరణించడంతో ఫ్రాన్స్‌లో ఘర్షణలు చెలరేగాయి. ఉత్తర పారిస్‌లోని బీమాంట్ పోలీసుల అదుపులో ఉండగా అడమా ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతి గల కారణాలపై వైద్యులు భిన్న నివేదికలు సమరి్పంచడం, అనారోగ్యంతో అడమా మరణించాడని పోలీసులు చెప్పడంతో ప్రజలు రోడ్డెక్కారు. జస్టిస్ ఫర్ అడమా అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తూ వేలాది మంది రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తతలకి దారితీసింది. పారిస్ ఊచకోత.. 2005 నవంబర్‌లో పోలీసులను తప్పించుకుంటూ వెళ్లిన ఇద్దరు ముస్లిం అబ్బాయిలు జయ్యద్ బెన్నా, బౌనా టరయోర్ విద్యుద్ఘాతంతో మరణించడంపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇద్దరు మైనార్టీలపై పోలీసులు దొంగలన్న ముద్ర వేసి వారి మరణానికి కారకులయ్యారన్న ఆగ్రహంతో ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనల్లో 10 వేల ప్రభుత్వ వాహనాలను తగులబెట్టారు. 233 ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పోలీసులు 4 వేల మందిని పైగా అదుపులోనికి తీసుకున్నారు. ఈ సమయంలో అల్లర్లను అదుపు చేయడానికి ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచి్చంది. ఫ్రాన్స్‌లో పోలీసుల హింస దశాబ్దాల క్రితం నుంచే ఉంది. వలస పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించిన అల్జీరియన్లపై పోలీసుల అకృత్యాలు ఫ్రాన్స్ చరిత్రపై ఒక మాయని మచ్చగా మిగిలిపోతాయి. అరబ్బులు, ముస్లింలపై పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తారో తెలపడానికి ఇదే నిలువెత్తు ఉదాహరణ. పోలీసు కాల్పుల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. పెరిగిపోతున్న పోలీసు హింస ► ఫ్రాన్స్‌లో పోలీసుల హింస రోజురోజుకి పెరిగిపోతోంది. గత అయిదేళ్లలో ఈ అకృత్యాలు 20% పెరిగినట్టు స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి. పోలీసులకుండే అధికారాలను పెంచుతూ 2017లో చట్టాలను సవరించారు. పోలీసుల కన్నుగప్పి పారిపోయే వారి వాహనాలపై కాల్పులు జరపవచ్చునని కొత్త చట్టాల్లో చేర్చారు. 2021లో వాహనాలపై పోలీసుల కాల్పుల ఘటనలు 157 జరగగా, 2022లో 138 జరిగాయి. ఇక గత ఏడాది పోలీసు కాల్పుల్లో 13 మంది అమాయకులు మరణించారు. దేశంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. -
పరారీలో ఇద్దరు ఉగ్రవాదులు..యూరప్ అప్రమత్తం
పారిస్: పారిస్‌లో శుక్రవారం రాత్రి మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల్లో ఇంకా ఇద్దరు తప్పించుకుని తిరుగుతున్నారని పారిస్ అధికారులు ప్రకటించారు. వారి కోసం ఫ్రాన్స్‌తో పాటు, యూరప్ దేశాల్లోనూ గాలింపు ముమ్మరం చేశారు. దీంతో యూరప్ దేశాలన్నీ అప్రమత్తయ్యాయి. పారిస్ ఉగ్రదాడిలో 129 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 350 మంది వరకూ గాయపడ్డం తెలిసిందే. ఆ దాడిలో ఎనిమిది మంది పాల్గొన్నారని.. ఏడుగురు ఉగ్రవాదులు మానవబాంబులుగా ఆత్మాహుతి చేసుకోగా, మరొక ఉగ్రవాది తప్పించుకుని పొరుగున ఉన్న బెల్జియం లోకి పారిపోయాడని ఫ్రాన్స్ పోలీసులు మర్నాడు తెలిపారు. అయితే.. తాజాగా మరొక వ్యక్తీ ఈ దాడుల్లో పాల్గొన్నట్లు వీడియోల ద్వారా గుర్తించినట్లు తెలిపారు. బెల్జియంలో జన్మించి ఫ్రాన్స్‌లో స్థిరపడిన సలాహ్ అబ్దెస్లామ్ తన సోదరుడు బ్రహీమ్తో కలిసి దాడుల్లో పాల్గొన్నాడని.. వీరు బ్లాక్ సీట్ కారులో ప్రయాణిస్తూ కొన్ని బార్లు, రెస్టారెంట్లపై కాల్పులు జరిపారని వివరించారు. అయితే.. వారి కారులో మూడో వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. దాడుల అనంతరం సలాహ్ పరారవగా.. అతడి సోదరుడు బ్రహీమ్ బౌల్వార్డ్ ఓల్టేర్ వద్ద బాంబులతో పేల్చుకుని చనిపోయాడు. మూడో వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. అయితే.. సలాహ్, బ్రహీమ్ల మరో సోదరుడైన మొహమద్‌ను ఉగ్రదాడి తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడు సలాహ్‌ను పోలీసులకు లొంగిపోవాల్సిందిగా అతడు విజ్ఞప్తి చేశాడు. జర్మనీలోని హనోవర్‌లో బుధవారం జర్మనీ-నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను బాంబు దాడి అనుమానాలతో రద్దు చేశారు. అప్పుడు జరిమానా విధించి వదిలేశాం..! సలాహ్ అబ్దెస్లామ్ (26) ఈ ఏడాది ఫిబ్రవరిలో డ్రగ్స్‌తో నెదర్లాండ్స్‌లో పోలీసులకు చిక్కాడు. అతడికి 70 యూరోలు జరిమానా విధించి వదిలివేశారు. సలాహ్, అతడి సోదరుడు, మరొకడు బెల్జియంలో రిజిస్టరయిన ఒక కారులో వెళ్తుండగా నెదర్లాండ్స్‌లోని గోరిన్చెమ్ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారని.. అతడి వద్ద కొంత గంజాయి ఉండటంతో జరిమానా విధించామని ఆ దేశ పోలీసులు తెలిపారు. అప్పటికి అతడిపై కేసులు లేనందున ఇంకా లోతుగా దర్యాప్తు చేయలేదన్నారు. -
పాత నేరస్తుడు.. శరణార్థి..
పారిస్ దాడుల్లో ఇద్దరు ముష్కరుల గుర్తింపు ♦ ఒక ఉగ్రవాది గ్రీస్‌లో శరణార్థిగా పేరు నమోదు చేసుకున్నట్లు నిర్ధారణ ♦ మరొక ఉగ్రవాది ఫ్రాన్స్‌కే చెందిన చిన్న చిన్న నేరాలు చేసే పాత నేరస్తుడు ♦ బెల్జియంలో ముగ్గురు అనుమానితుల అరెస్ట్.. జర్మనీ లింకుపై దర్యాప్తు ♦ దాడిలో ఏడుగురు మానవబాంబులు పాల్గొన్నారు: ఫ్రాన్స్ అధికారి వెల్లడి పారిస్/ఏథెన్స్: ఉగ్రవాదుల నరమేధంతో నెత్తురోడిన పారిస్ నగరం.. ఆ పెను విషాదం నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. ఫ్రాన్స్ రాజధానిలో శుక్రవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో బలయిన 129 మంది మృతులకు సంతాపంగా శనివారం రాత్రి విఖ్యాత ఈఫిల్ టవర్ చీకటిలో ఉండిపోయింది. దేశ వ్యాప్తంగా మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా అధ్యక్షుడు హోలాండ్ ప్రకటించారు. దేశ భద్రతను పూర్తిస్థాయి గరిష్టానికి పెంచారు. దేశవ్యాప్తంగా వేలాది మంది సైనికులను మోహరించారు. నగరంలోని పర్యాటక కేంద్రాలను ఆదివారం కూడా మూసే ఉంచారు. దాడుల్లో గాయపడ్డ 352 మందిలో 99 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ మారణహోమానికి కారకులైన వారిని వేటాడే పనిలో ఫ్రాన్స్ పోలీసులు, దర్యాప్తు సంస్థలు తలమునకలయ్యాయి. దేశంతో పాటు, అంతర్జాతీయంగానూ.. ముఖ్యంగా యూరప్ దేశాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. దాడులకు పాల్పడిన వారికి.. బెల్జియం, సిరియాల్లో లింకులను గుర్తించారు. బెల్జియం పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. జర్మనీలో ఇటీవల కారులో పేలుడు పదార్థాలతో దొరికిన ఒక వ్యక్తికి పారిస్ దాడులతో సంబంధముందా అనే కోణంలో ఆ దేశ పోలీసులు పరిశోధిస్తున్నారు. దర్యాప్తు క్రమంలో ఒక ఉగ్రవాది గత నెల గ్రీస్‌లో శరణార్థిగా పేరు నమోదు చేసుకుని యూరప్‌కు వచ్చినట్లు కనుగొన్నారు. మరొక ఉగ్రవాది పారిస్‌కే చెందిన పాత నేరస్తుడిగా నిర్ధారించారు. అతడి కుటుంబసభ్యులను అధికారులు ప్రశ్నించారు. దాడిలో ఏడుగురు మానవబాంబర్లు. ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి పారిస్ నడిబొడ్డున పలు కఫేలు, రెస్టారెంట్లపై తుపాకులతో కాల్పులు జరపటం, జాతీయ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడులు చేయటం, కచేరీ జరుగుతున్న బాతాక్లాన్ థియేటర్లో తుపాకులు, గ్రెనేడ్లతో దాడి చేయటం ద్వారా 129 మందిని బలితీసుకోవడం తెలిసిందే. ఏడుగురు ఆత్మాహుతి బాంబర్లు సహా ఉగ్రవాదులు మూడు బృందాలుగా నరమేధం సృష్టించాయని పారిస్ ప్రాసిక్యూటర్ ఫ్రాంకోయి మొలిన్ తెలిపారు. ఉగ్రవాదులు ఒకే రకం జాకెట్లు ధరించారని.. వాటిలో టీఏటీపీ పేలుడు పదార్థాలు అమర్చుకున్నారన్నారు. బాతాక్లాన్లో 89 మందిని ఊచకోత కోసిన ఉగ్రవాదులు సిరియా, ఇరాక్‌ల గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. దర్యాప్తులో దేశం వెలుపల లింకులను గుర్తించినటు తెలిపారు. మారణహోమం తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించగా.. ఇది ఫ్రాన్స్‌పై దాడేనని, ఈ నరమేధానికి దేశం వెలుపల కుట్ర పన్ని, స్థానికుల సాయంతో విదేశాల నుంచే నిర్వహించారని దేశాధ్యక్షుడు హోలాండ్ పేర్కొన్నారు. దాడులకు వాడిన కారులో ఏకే 47 తుపాకులు.. ఉగ్రవాదులు వాడిన ఒక కారును మాంట్రీయోలో గుర్తించారు. అందులో దాడుల్లో ఉపయోగించిన తరహా ఏకే47 తుపాకులు చాలా ఉన్నాయి. తూర్పు పారిస్‌లో ఒక రెస్టారెంట్‌పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు నల్ల సీట్ లియాన్ కారులో వచ్చారని, ఏకే47 తుపాకులతో కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. మృతుల్లో వివిధ దేశాల యువత...వైట్ కాలర్ నేరాల కేసుల్లో నిపుణుడైన ఫ్రాన్స్ లాయర్ వాలెన్టిన్ రిబెట్(26), స్పెయిన్‌కు చెందిన ఇంజనీర్ గొంజాలెజ్ గారిడో(29), మ్యూజిక్ గ్రూప్ ప్రొడ్యూసర్ థామస్ అయాద్ (32), రాక్ బ్యాండ్‌కు వస్తువులు విక్రయిస్తున్న ఇంగ్లండ్‌కు చెందిన నిక్ అలెక్సాండర్(36).. వీరు పారిస్ నరమేధంలో అసువులు బాసిన వారిలో కొందరు. శరణార్థులతో పాటు.. ఈ ఏడాది ఆరంభం నుంచి యూరప్‌లోకి పెరుగుతున్న వలసలు.. ప్రత్యేకించి అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియా నుంచి భారీగా కొనసాగుతున్న వలసలను జిహాదీ ఉగ్రవాదులు అనుకూలంగా మలచుకునే ప్రమాదముందని ఈయూ భద్రతా అధికారులు చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 80 వేల మంది మధ్యధరాసముద్రం దాటి యూరప్‌కు శరణార్థులుగా వచ్చారు. మధ్య ప్రాచ్యంలో ఇస్లాం ఫాసిజం బాధితులతో పాటు అతివాద శక్తులు కూడా యూరప్‌లోకి ప్రవేశిస్తున్నాయన్న విషయం ఇప్పుడు స్పష్టమయిందని గ్రీస్ రక్షణమంత్రి పనోస్ కమెనోస్ అన్నారు. ఎనిమిదిసార్లు దోషి..! నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరిని 29 ఏళ్ల ఒమర్ ఇస్మాయిల్ మొస్తెఫాయ్గా అధికారులు గుర్తించారు. బాతాక్లాన్ థియేటర్లో మారణకాండ తర్వాత బాంబులు పేల్చుకుని ఆత్మాహుతి చేసుకున్న అతని శరీరం నుంచి తెగిపడిన చేతివేలి ముద్రలు.. పోలీసు పాత నేరస్తుల రికార్డుల్లోని మెస్తెఫాయ్ వేలిముద్రలతో సరిపోయాయని తెలిపారు. అతడు పారిస్‌లోని పేద ప్రాంతమైన కోర్కోరానెస్లో జన్మించాడని.. అతడికి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారని చెప్పారు. గతంలో చిన్న చిన్న నేరాల్లో ఎనిమిదిసార్లు దోషిగా నిర్ధారితుడయ్యాడని.. అయితే ఎప్పుడూ జైలు శిక్షకు గురికాలేదని వివరించారు. అనుమానితుడిఆచూకీ చెప్పండి... పారిస్ దాడులకు సంబంధించి అనుమానిత ఉగ్రవాది ఫొటో, వివరాలను ఫ్రాన్స్ పోలీసులు ఆదివారం విడుదల చేశారు. సలాహ్ అబ్దేస్లాం అనే 26 ఏళ్ల వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అతడిపై బ్రెజిల్ ప్రభుత్వం అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆశ్రయంకోసం వచ్చి...! పారిస్ దాడుల్లో పాల్గొన్న ఒక ఉగ్రవాది కొంత కాలం కిందట గ్రీస్‌లో శరణార్థిగా పేరు నమోదు చేసుకున్నట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. సిరియా శరణార్థులు యూరప్‌లో ప్రవేశించటానికి ప్రధాన ద్వారంగా ఉన్న గ్రీస్‌లో శరణార్థులుగా పేర్లు నమోదు చేసుకుని ఉగ్రవాదులు ప్రవేశించారన్న సందేహంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ విషయం నిర్ధారణ అయింది. పారిస్‌లోని బాతాక్లాన్ థియేటర్ వద్ద దాడులకు పాల్పడి చనిపోయిన ఒక వ్యక్తి వద్ద సిరియా పాస్‌పోర్ట్ దొరకడంతో.. అతడి వేలిముద్రలను, మరోఉగ్రవాది వేలిముద్రలను పరీక్షించాలని గ్రీస్‌ను ఫ్రాన్స్ కోరింది. పాస్‌పోర్ట్ కలిగివున్న వ్యక్తి అక్టోబర్ 3న గ్రీస్ దీవి లెరోస్లో శరణార్థిగా పేరు నమోదు చేసుకుని యూరోపియన్ యూనియన్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించామని ఆ దేశ పౌర రక్షణ మంత్రి నికోస్ తాస్కాస్ తెలిపారు. దీంతో పారిస్ దాడుల్లో సిరియా ఉగ్రవాదుల పాత్ర ఉందన్నది తేలుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆత్మాహుతి జాకెట్లు పారిస్‌లోనే తయారు చేశారు! పారిస్‌లో దాడులకు ఉగ్రవాదులు ఉపయోగించిన ఆత్మాహుతి జాకెట్లు.. చాలా నైపుణ్యం గల వ్యక్తి రూపొందించినవని.. ఆ వ్యక్తి ఇంకా యూరప్‌లో సంచరిస్తూ ఉండే అవకాశముందని నిఘా, భద్రతా నిపుణులు చెప్తున్నారు. ‘ఉగ్రవాదులు ఏడుగురూ ఒకే తరహా బాంబు జాకెట్లు ధరించారు’ అని వారు వివరిస్తున్నారు. ‘లండన్ నగరంలో 2005లో జరిగిన ఉగ్రదాడుల్లో దాడిచేసిన వారు పేలుడు పదార్థాలను వీపుకు ధరించిన బ్యాగుల్లో పెట్టుకున్నారు. కానీ.. పారిస్‌లో దాడి చేసిన ఉగ్రవాదులు వినియోగించిన జాకెట్లు మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో బాంబు దాడులకు ఉగ్రవాదులు వినియోగించే జాకెట్ల లాగానే ఉన్నాయి. ఆత్మాహుతి జాకెట్లు తయారు చేయటానికి బాంబుల తయారీ నిపుణుడు అవసరం. అది చాలా క్లిష్టమైన పని’ అని ఫ్రాన్స్ నిఘా సంస్థ మాజీ అధిపతి విలేకర్లతో పేర్కొన్నారు. ‘బాంబులు అమర్చిన బెల్టు కానీ, జాకెట్ కానీ.. అది తొడుక్కున్న వ్యక్తి ఇబ్బంది లేకుండా సంచరించేలా చూడటం.. ప్రమాదవశాత్తూ పేలిపోకుండా చూడటం.. బాంబుల విషయంలో ఎంతో నైపుణ్యం గల వారు మాత్రమే చేయగలరు. పారిస్ నగరంలో ఉగ్రవాదులు వాడిన ఆత్మాహుతి జాకెట్లు టీఏటీపీతో చేసినట్లుగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ జాకెట్లలో ఒక బ్యాటరీని, ఒక పేల్చే స్విచ్ (డిటొనేషన్ బటన్)ను, పేలుడులో గాయాలను పెంచటానికి పదునైన వస్తువులను వినియోగించారు. వారు ఈ జాకెట్లను సిరియా నుంచి తీసుకురాలేదు’ అని వివరించారు. ‘బాంబులు తయారు చేసిన వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు ఇక్కడే ఫ్రాన్స్‌లో, యూరప్ ఖండంలో ఉండే అవకాశం చాలా ఉంది. వారు జిహాదీ ప్రాంతాలకు వెళ్లి వీటిని తయారు చేయటం నేర్చుకుని తిరిగి వచ్చి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.