breaking news
Foundation of the capital
-
ప్రధానమంత్రి వస్తున్నారు.. హోదా ఇస్తారా?
♦ వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఏపీ ప్రజానీకం ♦ పాత హామీలనే ప్యాకేజీగా ఇచ్చేందుకు నీతి ఆయోగ్ కసరత్తు చేస్తోందని సమాచారం ♦ హోదా ఇచ్చే అవకాశం లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అధికార వర్గాలు ♦ హోదాకోసం పోరాడకపోవడానికి రాజకీయ అవసరాలే కారణమంటూ వ్యాఖ్యలు ♦ విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు రూ.2 లక్షల కోట్లు ♦ దీంతోపాటు ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు సాక్షి, హైదరాబాద్: రాజధాని శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది... దేశ ప్రధాని నరేంద్రమోదీ రాబోతున్నారు... ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకహోదాపై ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు... హోదాతో పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుందని భవితపట్ల బంగారు కలలు కంటున్నారు... అయితే హోదా సంజీవని కాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తరచూ మాట్లాడటం, విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలకయ్యే ఖర్చు వివరాలు పంపాలంటూ కేంద్ర ప్రభుత్వ శాఖలన్నింటికీ నీతిఅయోగ్ లేఖలు రాసి సమాచారం తెప్పించుకోవడం చూస్తుంటే... విభజన చట్టంలోని హామీలన్నింటినీ ఒకచోట చేర్చి, దానికి ప్యాకేజీ అని కొత్తపేరు పెట్టి ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర అత్యున్నత అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధులను కూడా ఈ ప్యాకేజీలోనే కలిపేసే ప్రయత్నం జరుగుతోందని ఆ వర్గాలు తెలిపాయి. ఇదే జరిగి రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన వ్యక్తంచేశాయి. రాష్ట్రం తలరాతను మార్చే ప్రత్యేకహోదాపై రాష్ట్ర ముఖ్య నాయకత్వం పోరాడకుండా రాజీ పడడానికి రాజకీయ అవసరాలే కారణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. హోదా, హామీల అమలు... రెండూ హక్కే! పార్లమెంటు తలుపులు మూసివేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కేంద్రంలోని అధికార, ప్రతిపక్షాలు... అన్నింటా నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవడానికి విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చాయి. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్‌లాంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు, విమానాశ్రయాలు, మెట్రోరైలు ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, నూతన రాజధానికి నిధులు, ఆర్థిక లోటు భర్తీ చేస్తామని విభజన చట్టంలో పొందుపరిచాయి. అయినా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేమని... అదనంగా ఐదేళ్లు ప్రత్యేక హోదా కూడా ఇస్తామని ఆరోజు పార్లమెంట్ సాక్షిగా ప్రధాని హామీ ఇచ్చారు. ఐదేళ్లు చాలదు, పదేళ్లు కావాలని అప్పటి ప్రతిపక్షం బీజేపీ డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రత్యేకహోదానే ప్రచారాస్త్రంగా చేసుకుని టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చాయి. దీంతో ప్రత్యేకహోదా సులువుగా వస్తుందని రాష్ట్ర ప్రజలందరూ సంతోషించారు. కానీ హోదా సాధించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా... హాదా సంజీవని కాదంటూ తరచూ మాట్లాడుతూ ప్యాకేజీవైపే మొగ్గు చూపారు. దీంతో విభజన చట్టంలో ఇచ్చిన హామీలకే కొత్తరంగు వేసి, కొత్త పేరు పెట్టి, సరికొత్త ప్యాకేజీ రూపంలో ప్రకటించి మభ్యపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకోసం విభజన చట్టంలోని హామీలన్నింటినీ కూర్చి నీతి అయోగ్ ప్యాకేజీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వాటినే ప్రధానమంత్రి రాజధాని శంకుస్థాపన సమయంలోగానీ లేదా దానికి ముందుగానీ ప్రకటించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. రెండు లక్షల కోట్ల నిధుల ప్రాజెక్టులన్నీ పాత హామీలే రాష్ట్రాన్ని విభజించినప్పుడు చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ చట్టంలో కేంద్రం పలు హామీలను ఇచ్చింది. చట్ట రూపంలో వచ్చిన హామీలైనందున వాటిని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేర్చాలి. ఆ హామీలన్నింటి ని నెరవేర్చడానికి లక్షా 50 వేల కోట్ల రూపాయల మేరకు వ్యయం అవుతుందని అంచనా. వీటికి తోడు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే కేంద్రం నుంచి ఆయా పథకాలకు లభించే నిధులను కలిపితే వచ్చే అయిదేళ్ల కాలంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేరకు రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. అయితే వీటినే అటుతిప్పి... ఇటుతిప్పి... దీనికి కొంచెం అటుఇటుగా ఒక ప్యాకేజీగా... అదేదో రాష్ట్రానికి కొత్తగా ఇవ్వబోతున్నట్టుగా చూపబోతున్నారు. 2014-15 ఆర్థిక లోటు పూడ్చడం (14,500 కోట్లు), రాజధాని నిర్మాణం కోసం (12,500 కోట్లు) పోలవరం ప్రాజెక్టు కోసం (తాజా అంచనాలను ప్రభుత్వం 32 వేల కోట్లకు పెంచింది), వెనుకబడిన ఏడు జిల్లా అభివృద్ధికి (7 వేల కోట్లు), జాతీయస్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు (9,580 కోట్లు), పరిశోధన, శిక్షణా సంస్థల ఏర్పాటుకు (8,000 కోట్లు), పోర్టులు, మెట్రోరైళ్లు, స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వంటి వాటికి (46,600 కోట్లు) ఆర్థిక లోటును పూడ్చడానికి 14 ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు (32,809 కోట్లు)... రాష్ట్రాన్ని విడదీసినందుకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన నిధుల మొత్తం 1,47,999 కోట్ల రూపాయలు అవుతాయి. ఇవి కాకుండా కేంద్రం అమలు చేసే వివిధ కార్యక్రమాల కింద మరో 45 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఈ రకంగా 2 లక్షల కోట్ల మేరకు కేంద్రం నిధులను కేటాయించాల్సి ఉంది. ఇవ్వన్నీ రాష్ట్రానికి చట్టం ద్వారా హక్కుగా లభించినవే. ఇవీ ఇచ్చిన హామీలు విభజన చట్టంలోని 13 వ షెడ్యూలు సెక్షన్ 93 లో ఇచ్చిన హామీల మేరకు నెలకొల్పాల్సిన జాతీయ స్థాయి విద్యా సంస్థలు... ఐఐటీ (300 ఎకరాల్లో), ఐఐఎం (200 ఎకరాల్లో), ఎన్ఐటీ (300 ఎకరాల్లో), ఐఐఎస్ఈఆర్ (200 ఎకరాల్లో), సెంట్రల్ యూనివర్సిటీ (500 ఎకరాల్లో), ఐఐఐటీ (100 ఎకరాల్లో) పెట్రోలియం యూనివర్సిటీ (200 ఎకరాల్లో), వ్యవసాయ యూనివర్సిటీ (500 ఎకరాల్లో), ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) (200 ఎకరాల్లో), గిరిజన విశ్వవిద్యాలయం (500 ఎకరాల్లో), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్ఐడీఎం -10 ఎకరాల్లో) ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితోపాటు షెడ్యూలు 9, 10లో పేర్కొన్న శిక్షణ, పరిశోధనా సంస్థలను నెలకొల్పాలి. ఇకపోతే, విభజన చట్టంలోని 13 వ షెడ్యూలు సెక్షన్ 93 లో మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఎత్తున సమకూర్చాల్సివుంది. ప్రధానంగా దుగరాజపట్నం ఓడరేవు అభివృద్ధి (దశలవారీగా) తొలి దశ 2018 నాటికి పూర్తి చేయడం, కడపలో కర్మాగారం నిర్మాణం (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో అధ్యయనం చేసి ఆరు నెలల్లో సాధ్యాసాధ్యాలపై నివేదిక), గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులు, రైల్వే జోన్ ఏర్పాటు (మౌలిక సదుపాయాలు, అవసరమైన కొత్త లైన్లు), విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి మెట్రోరైల్, ఏపీ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ప్రధాన పట్టణాలను కలుపుతూ రాపిడ్ రైల్, రోడ్డు మార్గాల నిర్మాణం చేపట్టాలి. పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని పార్ట్ 10 సెక్షన్ 94 లో ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని ఏర్పాటు విషయంలో మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటును అందిస్తామని పేర్కొంది. అందులో సెక్షన్ 94 (3) ప్రకారం విభజిత ఏపీలో రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాసనసభ, శాసనమండలితో పాటు ఇతర అత్యవసర మౌలిక సదుపాయల కల్పనలో ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొంది. ఇవి కాకుండా కేంద్రం అమలు చేస్తున్న ఆయా పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి కనీసంగా 45 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించే విధంగా నీతి ఆయోగ్ రూపొందిస్తున్న ప్యాకేజీలోనూ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అనేకం పొందుపరచలేదని సమాచారం. -
రాజధాని శంకుస్థాపనకు రండి
* జాతీయ నేతలు, ప్రముఖులకు సీఎం ఆహ్వానం * 22న ప్రధానమంత్రి వస్తామన్నారు : చంద్రబాబు * జగన్, కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నా * సోనియాగాంధీకి ఆహ్వానం పంపించా * రాజధాని నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రావాలంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం పలువురు జాతీయ నేతలు, ప్రముఖులను ఆహ్వానించారు. స్వచ్ఛభారత్ సబ్ గ్రూప్ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు.. ఈ విభాగం రూపొందించిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు బుధవారం ఢిల్లీకి వచ్చారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. రాజధాని శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలపైన చర్చించారు. శంకుస్థాపనకు రావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తును ఆహ్వానించారు. అనంతరం ఏపీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 22వ తేదీన జరిగే రాజధాని శంకుస్థాపనకు వస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని కూడా కలిసినట్లు తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా అందరినీ ఆహ్వానిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆహ్వానం పంపామని చెప్పారు. నా రాజధాని, మన రాజధాని అన్న భావన రావాలని, ప్రజలంతా ఇందులో భాగస్వాములు కావాలని అన్నారు. శంకుస్థాపనకు దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలు, నదుల నుంచి నీరు, మట్టి తెస్తామని, దీన్నొక పవిత్ర సంగమంగా చేస్తామనిఅన్నారు. అమరావతి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటి కావాలని అన్నారు. ప్రజల అలవాట్లలో మార్పు రావాలి స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతమ్వాలంటే నిధుల్లో 20 శాతం పైనే ఖర్చు చేసి, ప్రజల్లో అవగాహన పెంచాలని బాబు చెప్పారు. ప్రజల అలవాట్లలో మార్పు రావాలన్నారు. స్వచ్ఛ భారత్ కోశ్ ఫండ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకు పెట్రోల్, డీజిల్, టెలికాం సర్వీసులపై సెస్ వేయొచ్చని సూచించినట్లు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిధులను ఈ మిషన్‌కు వెచ్చించాలని కోరామాన్నారు. వ్యర్థాల నిర్వహణను ఒక సమీకృత వ్యవస్థలా రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై చర్చించాం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం అందించేందుకు నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ రూపొందిస్తుందని చెప్పారు. ‘‘నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అమెరికాలో ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి నృపేందర్ మిశ్రాకు గుర్తు చేశాం. దీనిపై వర్కవుట్ చేస్తామన్నారు’’ అని తెలిపారు. ఇప్పటివరకు ఈ దిశగా ఒక్క సమావేశం కూడా జరగలేదని గుర్తు చేయగా.. వారు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు అని బదులిచ్చారు. కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రితో పెండింగ్ అంశాలపై చర్చించామన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కూడా చర్చించామని చెప్పారు. ప్రధాని నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనను ఆశిస్తున్నారు అని ప్రశ్నించగా ‘‘ఆంధ్రప్రదేశ్ పసిబిడ్డ. ఒక్కో సమస్యను అధిగమించి అనేక సంస్థలను సాధించుకున్నాం. కొన్ని మనం ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తున్నాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. -
శంకుస్థాపనకు నేటి నుంచి మట్టి సేకరణ
ప్రతి గ్రామం నుంచి కిలో మట్టి, పావు లీటర్ నీరు సేకరణ సాక్షి, హైదరాబాద్: రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కిలో మ ట్టి, పావు లీటర్ నీరు చొప్పున ప్రభుత్వం సేకరించనుంది. ఇందుకోసం మంగళవారం నుం చి వారం రోజుల పాటు ‘ప్రజా రాజధాని- మన నీరు-మన మట్టి’ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించిం ది. నీరు-మట్టి సేకరణ, ర్యాలీగా అమరావతికి వాటి తరలింపునకు సంబంధించిన వారం రోజుల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. మంగళవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ప్రతి గ్రామంలో పసుపురంగు సంచిలో మట్టిని అలాగే రాగి పాత్రలో నీటిని సేకరించాలి. గ్రామంలోని ఈశాన్య ప్రాంతంలో మట్టిని సేకరించాలి. ఆయా గ్రామాల్లోని అన్ని మతాలకు చెందిన దేవాలయాల్లోనూ పూజలు, ప్రార్థనలు నిర్వహించాలి. సేకరించిన మట్టి సంచీలను, నీటి పాత్రలను 16వ తేదీన మండల కేంద్రాలకు, మున్సిపల్ కార్యాలయాలకు తరలించాలి. 17వ తేదీన ర్యాలీగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు చేరుకోవాలి. 18వ తేదీ ఉదయం నియోజకవర్గ కేంద్రాల నుంచి ‘మన రాజధాని అమరావతి-మన నీరు-మన మట్టి’ అని రాసి ఉన్న బ్యానర్లను పట్టుకుని జిల్లా కేంద్రాలకు చేరాలి. జిల్లా కేంద్రాల నుంచి వాహనాల్లో 18 సాయంత్రం గానీ 19వ తేదీ ఉదయం గానీ బయలుదేరి అదేరోజు సాయంత్రం 5 గంటలకు నాగార్జున వర్సిటీకి చేరుకోవాలి. 20వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు వర్సిటీ దగ్గర జెండా ఊపి ర్యాలీలను అమరావతికి పంపిస్తారు. 21వ తేదీన దేశంలోని పవిత్ర నదుల నుంచి తీసుకువచ్చిన నీటిని ఈ నీటితో కలుపుతారు. ఆ నీటిని 22న శంకుస్థాపన కార్యక్రమంలోను తర్వాత రాజధాని భవనాల నిర్మాణంలోను వినియోగిస్తారు. గ్రామా ల్లో మట్టి, నీరు సేకరణ సందర్భంగా అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ సంకల్ప పత్రం మీద ప్రజలు సంతకం చేసి సీఆర్డీఏకు పంపిస్తారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించే వారిని ప్రభుత్వం ఖరారు చేసింది. ఆహ్వానితుల్లో అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్య మంత్రులు, ఢిల్లీలోని అన్ని దేశాల దౌత్యవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. ఇంటి పండుగలా శంకుస్థాపన వేడుకలు అమరావతి శంకుస్థాపన వేడుకలను ఇంటి పండుగలా, గ్రామ వేడుకలా ప్రతి ఒక్కరూ భావించి విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ నెల 18న అన్ని పట్టణాల్లో 5కె, 10కె రన్లలో ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.