breaking news
Formers Anxiety
-
గర్జించిన అన్నదాత
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అన్నదాత గర్జనతో రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతులు శుక్రవారం నిర్వహించిన మహా ర్యాలీ విజయవంతమైంది. సప్త వర్ణాలను తలపించేలా పతాకాలు చేతబట్టిన రైతన్నలు రామ్‌లీలా మైదానం నుంచి పార్లమెంటు స్ట్రీట్‌కు సమీపంలోని జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. అడుగడుగునా పోలీసు బందోబస్తు, దారిపొడవునా బారికేడ్లు, వాటర్ క్యానన్లు, పోలీసు కెమెరాలు, సాయుధ బలగాలకు తొణకకుండా ముందుకు సాగారు. పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర కల్పించాలని, శాశ్వతంగా రుణ విముక్తి కల్పించాలన్న డిమాండ్‌తో అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) ఇచ్చిన పిలుపు మేరకు ఈ రెండు రోజుల కవాతు జరిగింది. రామ్‌లీలా మైదానం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని పార్లమెంటుకు ర్యాలీగా బయల్దేరారు. కానీ జంతర్‌మంతర్ వద్దే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రైతు పార్లమెంట్ నిర్వహించి తమ డిమాండ్లపై పలు తీర్మానాలు చేశారు. ఢిల్లీలో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ర్యాలీగా చెబుతున్న ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ నాయకులు మేథాపాట్కర్, యోగేంద్ర యాదవ్, అతుల్ కుమార్, హన్నన్ మొల్లా, కవితా కురగంటి, వీఎంకే సింగ్ తదితరులు ముందు నడవగా రైతులు వారిని అనుసరించారు. అయోధ్య కాదు..రుణ మాఫీ కావాలి: డప్పు నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, కోలాటాలు, విచిత్ర వేషాలు, గిరిజన నత్యాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలు, ఉరితాళ్లు, అప్పుల కోసం రాసిన ప్రామిసరీ నోట్లు వంటివి ప్రదర్శిస్తూ రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ‘అయోధ్య–రామజన్మభూమి కాదు.. రుణాలు మాఫీ కావాలి’, ‘రైతుల్ని రుణభారం నుంచి విముక్తం చేయాలి’, ‘చౌకీదార్ బడాచోర్’, ‘మోదీ కిసాన్ విరోధి’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘కిసాన్ ఏక్తా– జిందాబాద్’ లాంటి నినాదాలు ఢిల్లీ వీధుల్లో మార్మోగాయి. పోలీసులు అడ్డగించిన చోటల్లా రైతు ఉద్యమకారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, పంజాబ్సహా దేశంలోని 24 రాష్ట్రాల రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన మహిళలు అనేక మంది అప్పుల భారంతో మరణించిన తమ కుటుంబ పెద్దల ఫొటోలను చేతబూని ర్యాలీలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు.. ‘రుణమాఫీ పెద్ద దగా’ అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. రైతు సమస్యలే అజెండా కావాలి... జంతర్‌మంతర్ వద్ద రైతు పార్లమెంట్(సభ)లో పలువురు వక్తలు ప్రసంగిస్తూ.. రైతులు బిచ్చగాళ్లు కాదని, అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపై నిలిచి ఒకే వాణి వినిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదీ బతికి బట్ట కట్టలేదని, అయోధ్య, రామజన్మభూమి..రైతు ఆత్మహత్యల కన్నా ఎక్కువ కాదని అన్నారు. మరోవైపు, రుణ విముక్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులకు అన్ని రాజకీయ పార్టీల మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తూ రైతు సదస్సు తీర్మానం చేసింది. రైతు మేనిఫెస్టోను ఆమోదిస్తూ మరో తీర్మానం చేసింది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏకేఎస్సీసీ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జంతర్‌మంతర్ వద్ద రైతుల్ని ఉద్దేశించి ప్రసంగించిన వారిలో రాహుల్, కేజ్రీవాల్‌తో పాటు సీతారాం ఏచూరీ (సీపీఎం), సురవరం సుధాకరరెడ్డి (సీపీఐ), శరద్ పవార్ (ఎన్సీపీ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), శరద్ యాదవ్ (ఎల్జేడీ) తదితర జాతీయ నాయకులున్నారు. సంపన్నులకేనా రుణమాఫీ: రాహుల్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానికి సన్నిహితులైన 15 మంది బడా పారిశ్రామికవేత్తలు బకాయిలు పడిన రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేసిన ప్రభుత్వం రైతు రుణాలను ఎందుకు విస్మరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. రైతులు ప్రభుత్వం నుంచి ఉచిత కానుకలు కోరడం లేదని వారు అడుగుతున్న రుణమాఫీ, మద్దతు ధర వారి హక్కని రైతు సభలో పేర్కొన్నారు. రైతులు, యువత గొంతుకల్ని ప్రభుత్వం అణగదొక్కలేదని, ఒకవేళ వారిని అవమానిస్తే ఆ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. ఫసల్ బీమా యోజన ద్వారా అనిల్ అంబానీ సంస్థలకు ప్రధాని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. బీమా పథకాన్ని రెండుగా విభజించి అంబానీ, అదానీ సంస్థలకు పంచిపెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ..స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా రైతులను ప్రధాని నరేంద్ర మోదీ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్డీయే హయాంలో వ్యవసాయ రంగం తిరోగమన బాట పట్టిందని, అందువల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ విభజనవాద రాజకీయాలపై గళమెత్తాలని, రైతు సమస్యలపై అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. మోదీ–అమిత్ షా ద్వయాన్ని ఆయన దుర్యోదన–దుశ్శాసనలుగా అభివర్ణించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రైతులు ఢిల్లీలో జరిగిన మహా ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రైతులు -
రాజధానిలో రైతు రణం
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాలకులకు తమ గళం బలంగా వినిపించేందుకు అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా అన్నదాతలు ఢిల్లీకి చేరుకున్నారు. రుణ విముక్తి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లతో వామపక్ష పార్టీల మద్దతుతో వీరు చేపట్టిన రెండు రోజుల ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు గురువారం చేరుకున్నారు. వీరంతా నేడు పార్లమెంట్ వైపుగా ర్యాలీగా సాగనున్నారు. రైతుల కపాలాలతో ర్యాలీకి.. వామపక్ష పార్టీలు, సంఘాలతో ఏర్పాటైన ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేసీసీ) బ్యానర్ కింద వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీకి వచ్చారు. వీరిలో నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్ లింకింగ్ అగ్రికల్చరిస్ట్స్ అసోసియేషన్‌కు చెందిన 1,200 మంది రైతుల బృందముంది. వీరు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలను తెచ్చారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన సమావేశంలో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఫసల్ బీమా యోజన పెద్ద కంపెనీలకు వరంగా మారింది’అని అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడని ఏపీ నుంచి వచ్చిన రైతు ప్రతినిధి వీరారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కొండల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్, మేథాపాట్కర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మకాం వేసిన రైతులు..వారు ధరించిన ఎర్ర టోపీలు, ఎర్ర జెండాలతో రామ్‌లీలా మైదాన్ ఎరుపు రంగును సంతరించుకుంది. ‘అయోధ్య వద్దు, రుణ మాఫీ కావాలి’ అంటూ వారు చేస్తున్న నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. బంగ్లా సాహిబ్, శీశ్‌గంజ్ సాహిబ్, రాకాబ్‌గంజ్, బాప్ సాహిబ్, మంజు కా తిలా గురుద్వారాల నిర్వాహకులు రైతులకు బస కల్పించేందుకు ముందుకువచ్చారు. అంబేడ్కర్ స్టేడియంలో బస చేసిన సుమారు 6,500 మంది రైతులకు రొట్టెలు పంపిణీ చేసినట్లు ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ఆభా దేవ్ తెలిపారు. -
‘మహా’ రైతుకు రుణ మాఫీ
తాత్కాలికంగా మహారాష్ట్ర రైతుల ఆందోళన విరమణ ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రైతులకు రుణ మాఫీ చేస్తామని ప్రకటిం చింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతు సమస్యల పరిష్కారానికి నియమించిన ఉన్నత స్థాయి కమిటీ, రైతు నాయకుల మధ్య చర్చల్లో ఆ మేరకు అంగీకారం కుదిరింది. దీంతో ఈ నెల ఒకటి నుంచి రైతులు ప్రారంభించిన ఆందోళ నను విరమించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం సూత్ర ప్రాయంగా రైతులకు రుణ మాఫీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను జాయింట్ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయం వల్ల 1.07 కోట్ల మంది రైతులకు లాభం కలుగుతుంది. చిన్న, మధ్య తరహా రైతులకు సంబంధించిన సుమారు రూ. 30 వేల కోట్ల రుణాలు రద్దవుతాయి. పాల ధరలు కూడా పెంచాలని నిర్ణయించాం. సుగర్ పరిశ్రమ తరహాలోనే పాలలో వచ్చే లాభాలను 70:30 నిష్పత్తిలో తీసుకోవడానికి మిల్స్ సొసైటీలు అంగీకరించాయి’ అని చెప్పారు. చర్చల్లో పాల్గొన్న రైతు నాయకుడు రాజు శెట్టి మాట్లాడుతూ తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ‘చర్చలు సానుకూ లంగా జరిగాయి. ఆందోళనలన్నీ తాత్కాలి కంగా ఆపుచేయాలని నిర్ణయించాం. జూలై 25 లోగా సంతృప్తికర నిర్ణయం తీసుకోకుంటే తిరిగి ఆందోళన ప్రారంభిస్తాం’ అని వివరిం చారు. రైతుల ‘అన్ని రకాల రుణాలు’ రద్దు చేస్తామని మంత్రుల బృందం హామీ ఇచ్చిం దని మరో రైతు నాయకుడు రఘునాథ్‌దాదా పాటిల్ చెప్పారు. ఆందోళన బాటలో యూపీ రైతులు అలీగఢ్ (యూపీ): బంగాళాదుంపలకు గిట్టుబాటు ధర లేకపోవడం, సరిహద్దు వ్యవసాయ భూములపై హరియాణా రాష్ట్రం తో నెలకొన్న దీర్ఘకాల వివాదం పరిష్కారం కాకపోవడంతో యూపీలోని అలీగఢ్ రైతులు ఆందోళన బాట పట్టారు. గత 24 గంటలుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నట్లు సమాచారం. భార తీయ కిసాన్ యూనియన్ (హర్పాల్ గ్రూప్) జాతీయ అధ్యక్షుడు మీడియాతో మాట్లా డుతూ రైతుల సమస్యలు పరిష్కారం కాకుంటే ‘జైల్‌భరో’ కార్యక్రమాన్ని చేపడతా మని హెచ్చరించారు.