breaking news
Foreign shares
-
మార్కెట్‌కు మళ్లీ నష్టాలు
ముంబై: స్టాక్ సూచీల లాభాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 502 పాయింట్లు పతనమై 58,909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 129 పాయింట్లు క్షీణించి 17,322 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లోనూ ఇంధన, యుటిలిటీ, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, రియల్టీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లో కదలాడాయి. సెన్సెక్స్ 545 పాయింట్లు నష్టపోయి 59,411 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు క్షీణించి 17,306 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,771 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,129 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు క్షీణించి 82.60 స్థాయి వద్ద స్థిరపడింది. అధిక ద్రవ్యోల్బణం మరికొంత కాలం కొనసాగొచ్చనే ఆందోళనల మధ్య వడ్డీరేట్లు మరింత పెరుగుతాయనే భయాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘అమెరికాలో ద్రవ్యోల్బణం కొనసాగొచ్చని ఇటీవల విడుదలైన ఆ దేశపు స్థూల ఆర్థిక డేటా సూచించడంతో పదేళ్ల బాండ్లపై రాబడి నాలుగుశాతం మించి నమోదైంది. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. బాండ్లపై రాబడులు పెరగడంతో భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఎఫ్ఐఐలు వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లలో నికర విక్రయదారులుగా నిలిచారు. లార్జ్ క్యాప్ షేర్లతో పోలిస్తే చిన్న, మధ్య తరహా షేర్లలో విక్రయాలు తక్కువగా ఉండటం కలిసొచ్చే అంశంగా ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అదానీ షేర్లలో రెండోరోజూ ర్యాలీ అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీలు నాలుగింటిలో స్వల్పంగా వాటాలు విక్రయించి రూ.15,446 కోట్లు సమకూర్చుకోవడంతో ఈ గ్రూప్ షేర్లలో రెండోరోజూ ర్యాలీ కొనసాగింది. మరోవైపు హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు ఐదు శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. అదానీ పోర్ట్స్ 3.5%, అదానీ ఎంటర్‌ప్రెజెస్ 3%, ఏసీసీ సిమెంట్స్ ఒకటిన్నర శాతం పెరిగాయి. గత రెండురోజుల్లో రూ.70,302 కోట్ల సంపద సృష్టి జరిడంతో గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.7.86 లక్షల కోట్లకు చేరింది. -
విదేశాల్లో పెట్టుబడులు.. ఇప్పుడెంతో ఈజీ !
ఉదయం నిద్ర లేవడం మొదలు.. రాత్రి తిరిగి విశ్రమించే వరకూ ముఖ్యమైన ముచ్చట్లు ‘ఫేస్బుక్’ పేజీలోకి ఎక్కాల్సిందే. ప్రతీ ప్రత్యేక జ్ఞాపకాన్ని బంధు మిత్రులు, సన్నిహితులతో షేర్ చేసుకోవాల్సిందే. తాజా వార్తా, విశేషాల సమాచారం కోసం ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేయాల్సిందే..! ఇక గ్రోసరీ నుంచి కావాల్సిన స్మార్ట్ ఫోన్ వరకు అమెజాన్‌లో ఆర్డర్ చేసేవారూ మన చుట్టూ చాలా మందే ఉన్నారు. సమాచారం ఏది తెలుసుకోవాలన్నా.. గూగుల్‌లో (ఆల్ఫాబెట్) వెతికేయడం, ఆండ్రాయిడ్ ఓఎస్, గూగుల్ క్రోమ్, గూగుల్ పే, గూగుల్ ఫొటోస్ ఇవన్నీ కూడా జీవనంలో భాగమైనవే. చేతిలో యాపిల్ ఫోన్ ఉంటే ఆ ఆనందమే వేరు..! ఇవన్నీ కూడా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు. వీటి అవసరం లేకుండా ఆధునిక తరం రోజు గడవదంటే అతిశయోక్తి కానే కాదు. ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వెనకేసుకోవాలన్న ఆలోచన భారత ఇన్వెస్టర్లలో క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంతో.. ఈ సేవలు అందించేందుకు ఎన్ఎస్ఈ కూడా రంగంలోకి దిగింది. ఎన్ఎస్ఈ అందిస్తున్న ఈ సేవల సమాచారమే ఈ వారం ప్రాఫిట్‌ప్లస్ కథనం.. త్వరలోనే ఎన్ఎస్ఈ సేవలు భారతీయ ఇన్వెస్టర్లు అమెరికాలో లిస్ట్ అయిన స్టాక్స్ కొనుగోలు, విక్రయాలు చేసుకునేందుకు వీలుగా అవసరమైన వేదికను ఏర్పాటు చేయాలని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ)కి చెందిన ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక మేరకు పనులు పూర్తయితే త్వరలోనే ఫ్యాంగ్ స్టాక్స్ (ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్), మైక్రోసాఫ్ట్, టెస్లా తదితర ఎన్నో స్టాక్స్‌లో లావాదేవీలు సులభతరం కానున్నాయి. సెబీ, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కేవైసీని పూర్తి చేసిన (కస్టమర్ గుర్తింపు వివరాల ధ్రువీకరణ) కస్టమర్లు యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి దేశీయ బ్రోకరేజీ సంస్థలు కొన్ని యూఎస్ స్టాక్స్‌లో నేరుగా పెట్టుబడులకు వీలు కల్పిస్తున్నాయి. కానీ, స్థానికంగా ఒక ఎక్సే్ఛంజ్ ప్లాట్‌ఫామ్ లేదు. ఆ లోటును ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ భర్తీ చేయనుంది. ప్రత్యేక ఖాతా అక్కర్లేదు! సుమారు 40 దేశీయ బ్రోకరేజీ సంస్థలు గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ/గిఫ్టి సిటీ)లో కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసే క్రమంలో ఉన్నాయి. విదేశీ స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే ఇన్వెస్టర్లు గిఫ్ట్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్రోకర్ల వద్ద ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. అయితే, ఎన్ఎస్ఈ నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఇప్పటికే కేవైసీ వివరాలు సమర్పించి ట్రేడింగ్/డీమ్యాట్ ఖాతా కలిగిన వారు యూఎస్ స్టాక్స్‌లో పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా ఖాతా తెరవాల్సిన అవసరం లేకుండా అనుమతి పొందే ప్రయత్నం చేస్తోంది. ఇది ఫలిస్తే.. ఇన్వెస్టర్లు ప్రస్తుత తమ ట్రేడింగ్ ఖాతా నుంచే దేశీయ స్టాక్స్ మాదిరే.. యూఎస్ స్టాక్స్‌లోనూ కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. ఇందుకోసం తమ సమ్మతి తెలియజేస్తూ ప్రత్యేకంగా ఒక పత్రం సమర్పిస్తే సరిపోతుంది. గిఫ్ట్‌సిటీ అన్నది అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన ప్రత్యేక ప్రాంతం. మరిన్ని విదేశీ స్టాక్స్కూ అవకాశం మనదేశంలోని రెండు డిపాజిటరీ సంస్థలైన సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్ కూడా గిఫ్ట్ సిటీలో అనుబంధ సంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేశాయి. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలనే కొత్త ఇన్వెస్టర్లకు ఈ డిపాజిటరీల నుంచి డీమ్యాట్ ఖాతాలను బ్రోకరేజీ సంస్థలు ఆఫర్ చేయనున్నాయి. ప్రారంభంలో యూఎస్ స్టాక్స్‌లో లావాదేవీలకే పరిమితమైనప్పటికీ.. తర్వాత ఇతర విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడులకు అవకాశం అందుబాటులోకి రానుంది. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు తమ బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. గిఫ్ట్ సిటీలోని బ్రోకర్ వద్ద తన ఖాతాకు నిధులు బదిలీ చేయాలని కోరాల్సి ఉంటుంది. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఒక ఏడాదిలో 2,50,000 డాలర్లు (సుమారు రూ.1.85కోట్లు) విదేశాలకు పంపుకోవచ్చు. స్టాక్స్, మ్యచువల్ ఫండ్స్ యూనిట్ల కొనుగోలు, ఈటీఎఫ్‌ల కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు. కాకపోతే ఎల్ఆర్ఎస్ కింద పంపుకునే నిధులతో విదేశీ డెరివేటివ్ సాధనంలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఖాతాదారు కోరిక మేరకు బ్యాంకు ఎల్ఆర్ఎస్ పరిమితిని పరిశీలించిన తర్వాత గిఫ్ట్ సిటీలో బ్రోకర్ ఖాతాకు నిధులను బదిలీ చేస్తుంది. ప్రస్తుత తమ బ్యాంకు శాఖ నుంచే ఈ సేవలను పొందొచ్చు. ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ఇందుకోసం తెరవాల్సిన అవసరం ఉండదు. తొలుత టాప్–50కే పరిమితం నిధుల బదిలీ అనంతరం విదేశీ స్టాక్స్‌లో క్రయ, విక్రయాలు నిర్వహించుకోవచ్చు. తొలుత యూఎస్‌కు చెందిన టాప్–50 స్టాక్స్‌లో లావాదేవీలకు ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ అనుమతించనుంది. తర్వాత మరిన్ని స్టాక్స్‌లో లావాదేవీలకు అవకాశం కల్పించాలన్నది ఎన్ఎస్ఈ ప్రణాళిక. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ప్రత్యేకంగా అంతర్జాతీయ బ్రోకరేజీలను నియమించుకోనుంది. ఈ బ్రోకర్లు అమెరికా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో షేర్లను కొనుగోలు చేసి, డిపాజిటరీ రిసీప్ట్ (సర్టిఫికెట్ ఆఫ్ ఓనర్షిప్)ను గిఫ్ట్‌సిటీలోని ఇన్వెస్టర్లకు కేటాయించనున్నాయి. మన దేశంలో పాక్షిక షేర్లకు అవకాశం లేదు. కనీసం ఒక షేరును లావాదేవీగా నిర్వహించాల్సిందే. కానీ, అమెరికాలో పాక్షిక షేర్లను కూడా సొంతం చేసుకోవచ్చు. 3 డాలర్లు, 6 డాలర్ల డినామినేషన్లో పాక్షిక షేర్లను పొందే అవకాశం గిఫ్ట్ సిటీ ఇన్వెస్టర్లకు ఉంటుంది. ఉదాహరణకు యాపిల్ ఒక షేరు సుమారు 149 డాలర్ల వద్ద ఉంది. ఒక్క షేరు కొనుగోలుకు పెట్టుబడి రూ.11వేలపై మాటే. ఇంత ఇన్వెస్ట్ చేయలేని వారు పాక్షిక షేర్లను కొనుగోలు చేసుకోవచ్చు. లావాదేవీలకు ఎన్ఎస్ఈ క్లియరింగ్ కార్పొరేషన్ హామీదారుగా ఉంటుంది. టీప్లస్3 సెటిల్మెంట్ అమలవుతుంది. లావాదేవీ నమోదైన రోజు కాకుండా తర్వాతి మూడవ పనిదినం ముగింపు నాటికి షేర్లు డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. ఈ బ్రోకర్ల నుంచి సేవలు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, జియోజిత్, మోతీ లాల్ ఓస్వాల్, యాక్సిస్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మ్యాటర్ట్రస్ట్, విన్వెస్టా, వెస్టెడ్ ఫైనాన్స్ తదితర సంస్థలు ఇప్పటికే యూఎస్ స్టాక్స్ లో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇం దుకోసం ఈ సంస్థలు అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థలతో భాగస్వామ్యాలను కూడా కుదుర్చుకున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశీ స్టాక్స్, బాండ్లు, రీట్, ట్రెజరీ బాండ్లలోనూ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఒక్క డాలర్ నుంచి పెట్టుబడులకు ఇవి అనుమతిస్తున్నాయి. వేగంగా, సులభంగా ఖాతా తెరిచే సేవలను ఇవి అందిస్తున్నాయి. పన్ను ఇక్కడే చెల్లించాలి.. విదేశీ స్టాక్స్‌లో లాభాలపై దేశీయంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే స్థానిక స్టాక్స్‌లోని లాభాలపై పన్నుతో పోలిస్తే భిన్నమైన రేట్లు అమల్లో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్ తదితర చాలా దేశాల్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆర్జించిన ఈక్విటీ (స్టాక్స్,ఫండ్స్) లాభాలపై మూలధన లాభాల పన్ను లేదు. డివిడెండ్లు, వడ్డీ రాబడి కూడా పన్ను రహితమే. కానీ, ఆయా లాభాలు, ఆదాయంపై ఇక్కడ పన్ను చెల్లించాలి. విదేశీ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అయిన షేరు లేదా ఫండ్‌లో రెండేళ్ల తర్వాత పెట్టుబడులను విక్రయించగా వచ్చిన లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభంగా చట్టం పరిగణిస్తోంది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించగా మిగిలిన లాభంపై 20%పన్ను చెల్లించాలి. దేశీయ స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాల మూలధన లాభం మొదటి రూ.లక్ష (ఒక ఆర్థిక సంవత్సరంలో) పై పన్ను లేదు. కానీ, విదేశీ మూలధన లాభాలకు ఇది వర్తించదు. విదేశీ స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను రెండేళ్లలోపే విక్రయించినట్టయితే.. లాభాన్ని తమ ఆదాయం కింద రిటర్నుల్లో చూపించాలి. అప్పుడు తమకు వర్తించే శ్లాబు రేటు కింద పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. విదేశీ పెట్టుబడుల వివరాలను (విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయం) ఎప్పటికప్పుడు ఐటీఆర్‌లో విధిగా పేర్కొనాల్సిందే. స్టాక్స్ కొనుగోలు క్రమం ఇదీ ► డీమ్యాట్ ఖాతా ఉంటే చాలు. ఇప్పటి వరకు డీమ్యాట్ ఖాతా లేని వారు గిఫ్ట్ సిటీ కేంద్రంగా పనిచేస్తున్న బ్రోకర్ల వద్ద ఖాతా తెరవాల్సి ఉంటుంది. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ► ఆర్బీఐ ఎల్ఆర్ఎస్ కింద బ్యాంకు నుంచి గిఫ్ట్ సిటీలోని ఖాతాకు ఒక ఏడాదిలో 2.5లక్షల డాలర్లను పంపుకోవచ్చు. ► యూఎస్ స్టాక్స్‌లో పాక్షిక వాటాలనూ సొంతం చేసుకోవచ్చు. తొలుత యూఎస్ టాప్–50 స్టాక్స్ అందుబాటులో ఉండనున్నాయి. ► ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ క్లియరింగ్ కార్పొరేషన్ ఈ లావాదేవీల సెటిల్మెంట్ను చూస్తుంది. -
విదేశీ షేర్లలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు
మనం ఉండేది ఇండియాలో. ఇక్కడి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడదామంటే అదేపనిగా తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు. ఈ మధ్య తీవ్రమైన హెచ్చుతగ్గులు కూడా చాలా సహజమైపోయాయి. మరోవంక అమెరికా మార్కెట్లు అదేపనిగా పెరుగుతున్నాయి. చైనా కూడా ఆ మధ్య బాగా పడి... ఇప్పుడు పెరగటం మొదలు పెట్టింది. సరే! మనం విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలంటే మార్గమేంటి? నేరుగా ఇన్వెస్ట్ చేయొచ్చా? అక్కడ పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్లేమైనా ఉన్నాయా? అవన్నీ వివరించేదే ఈ కథనం... అవకాశం కల్పిస్తున్న గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ * రాబడిపై మాత్రం కరెన్సీ; రాజకీయ ప్రభావాలు పోర్టు ఫోలియో వైవిధ్యంగా ఉండాలంటే ఇదో మార్గం * ఇన్వెస్ట్మెంట్ల రాబడిపై మాత్రం పన్ను చెల్లించాల్సిందే దేశీ ఇన్వెస్టర్లు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పించే వేదికే గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. దేశీ మ్యూచువల్ ఫండ్ హౌస్ (ఏఎంసీ)లు కొన్ని ప్రత్యేకంగా ఈ పథకాలను అందిస్తున్నాయి. ఆయా దేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి తగిన స్కీముల్ని ఈ ఫండ్ హౌసెస్ అమలుచేస్తున్నాయి. అయితే ఈ ఫండ్లు నేరుగా విదేశీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయవు. ఎందుకంటే అక్కడి స్థితిగతులు లోకల్ మ్యూచువల్ ఫండ్లకే బాగా తెలుస్తాయి. అందుక ని ఈ ఫండ్లు... వివిధ దేశాల్లోని మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే వీటిని గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్‌గా పిలుస్తారు. టెక్నాలజీ వల్ల ప్రపంచం మొత్తం ఒకే మార్కెట్లా మారుతున్న నేపథ్యంలో దేశీ ఇన్వెస్టర్లు అంతర్జాతీయ పరిణామాల వల్ల ప్రయోజనం పొందటానికి ఈ గ్లోబల్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉపకరిస్తాయి. నిజానికి ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేక రంగ వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు లాటిన్ అమెరికా కమోడిటీస్‌కు, ఆసియా ప్రాంతం సర్వీసెస్‌కు అనుకూలం. అదే అమెరికా తీసుకుంటే... అది అత్యంత భిన్నమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు కీలకమైన మార్కెట్. బ్రిక్స్ మార్కెట్లయితే బాగా ఆశాజనక వృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థల సమూహం, ఇలా వివిధ ప్రాంతాలు వివిధ రంగాలకు అనుకూలం కావటంతో అక్కడ ఆయా రంగాల్లో ఇన్వెస్ట్ చేయటానికి ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉపయోగపడతాయి. ఫండ్స్‌తో డైవర్సిఫికేషన్.. మీ పోర్ట్‌ఫోలియో విభిన్నంగా ఉండటానికి గ్లోబల్ ఫండ్స్ బాగా పనికొస్తాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయటం వల్ల మార్కెట్ విస్తృతి పెరుగుతుంది. అంతేకాక గ్లోబల్ మార్కెట్లన్నీ కూడా ఒకే దిశలో పయనించవు. అంటే కొన్ని పెరగొచ్చు, కొన్ని తగ్గొచ్చు. అందుకే గ్లోబల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ల అస్థిరతల నుంచి మన పోర్ట్‌ఫోలియోను రక్షించుకోవచ్చు. పన్ను విధానం.. గ్లోబల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే.. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో మనం పెట్టుబడి పెడుతున్నట్లు లెక్క. గ్లోబల్ ఫండ్స్‌ను డెట్ ఫండ్‌గా పరిగణిస్తారు. డెట్ ఫండ్లపై చెల్లించినట్లే దీనిపైనా పన్నులుంటాయి. దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ల రాబడిపై 10 శాతం (ఇండెక్సేషన్ కాకుండా) పన్ను చెల్లించాలి. ఇండెక్సేషన్‌తో కలిపి అయితే 20 శాతం పన్ను కట్టాలి. స్వల్పకాల పెట్టుబడుల రాబడిపై చెల్లించే పన్ను మాత్రం ఆయా వ్యక్తుల ఆదాయ శాఖ పన్ను శ్లాబ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలను మరవొద్దు గ్లోబల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ ఫండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీనికోసం ఎక్కువ సమయం కేటాయించి, ఫండ్స్ గురించి అధ్యయనం చేయాలి. అంతర్జాతీయ మార్కెట్ల గురించి స్టడీ చేయాలి. వాటిని ఫాలో అవుతూ ఉండాలి. ఇలా పరిశీలించాక ఆ ఫండ్ మనకు సరిపోతుందా? లేదా? అని ఒక నిర్ణయానికి రావాలి. అలాగే ఫండ్ ఎంటర్, ఎగ్జిట్ లోడ్ తదితర చార్జీలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం తప్పనిసరి. గ్లోబల్ ఫండ్స్-ప్రయోజనాలు.. * మనకు అనువైన ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. * దేశీ, అంతర్జాతీయ పరిణామాల వల్ల ఒక్కో దేశపు మార్కెట్లు ఒక్కో రకంగా స్పందిస్తూ ఉంటాయి. దీంతో రిస్క్ ప్రభావం తక్కువగా ఉంటుంది. * ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫికేషన్ వల్ల రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. * అవసరమైతే నిపుణులైన అంతర్జాతీయ ఫండ్ మేనేజర్ల సలహాలను తీసుకోవచ్చు. గ్లోబల్ ఫండ్స్-ప్రతికూలతలు.. కరెన్సీ ప్రభావం: ఫండ్ పనితీరుతో నిమిత్తం లేకుండా గ్లోబల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్‌ను ఆయా దేశాల దేశీ కరెన్సీ బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు మీరు బ్రెజిల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై రాబడి రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్ల పనితీరు. రెండు బ్రెజిల్ కరెన్సీ (రియాల్) - మన కరెన్సీ (రూపాయి) మారకం విలువ. మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్లు 10 శాతం పెరిగినా... బ్రెజిల్ కరెన్సీ 10 శాతం క్షీణించినట్లయితే మీ రిటర్న్ జీరోగా భావించాల్సి ఉంటుంది. ప్రాంతీయ రాజకీయాలు: గ్లోబల్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అంటేనే వివిధ దేశాల మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం. అందుకే మనం ఇన్వెస్ట్ చేసే ప్రాంతాల్లో ఏవైనా రాజకీయ సమస్యలు ఉత్పన్నమైతే వాటి ప్రభావం మన రాబడిపై ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఆయా దేశాల్లో వరదలు, భూకంపాలు వంటి ఇతర ప్రమాదాలు సంభవిస్తే వాటి ప్రభావం ఫండ్ రాబడిపై ఉంటుంది. అందుకే భౌగోళిక వైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.