breaking news
FIU
-
యూనియన్ బ్యాంక్‌పై భారీ జరిమానా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) చర్యలు చేపట్టింది. అనుమానాస్పద లావాదేవీలను నివేదించడంలో విఫలమైనందుకు, ముంబై శాఖలలోని కొన్ని ఖాతాలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోనందుకు రూ.54 లక్షల జరిమానా విధించింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 13 కింద అక్టోబరు 1న యూనియన్ బ్యాంక్‌కు పెనాల్టీ నోటీసును జారీ చేసిన ఎఫ్ఐయూ బ్యాంక్ చేసిన రాతపూర్వక, మౌఖిక సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత యూనియన్ బ్యాంక్‌పై అభియోగాలు నిరూపితమైనవిగా గుర్తించింది.ఎఫ్ఐయూ ఈ మేరకు బ్యాంక్ కార్యకలాపాల సమగ్ర సమీక్ష చేపట్టబడింది. కేవైసీ/ఏఎంఎల్ (యాంటీ మనీ లాండరింగ్)కి సంబంధించిన కొన్ని "వైఫల్యాలను" వెలికితీసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై హిల్ రోడ్ బ్రాంచ్‌లో నిర్దిష్ట కరెంట్ ఖాతాలపై చేసిన స్వతంత్ర పరిశీలనలో ఒక ఎన్బీఎఫ్సీ దాని అనుబంధ సంస్థల ఖాతాల నిర్వహణలో అవకతవకలు ఉన్నట్లు వెల్లడైందని పబ్లిక్ ఆర్డర్ సారాంశంలో ఎఫ్ఐయూ పేర్కొంది. -
డిపాజిట్ల నిగ్గుతేల్చేందుకు ఆడిటర్ల సాయం!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత బ్యాంకుల్లోకి వెల్లువలా వచ్చిన నగదు డిపాజిట్ల నిగ్గుతేల్చేందుకు ఆదాయపు పన్ను శాఖ సమాయత్తమవుతోంది. సంబంధిత డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ చేయడం కోసం అంతర్జాతీయ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై), కేపీఎంజీ, ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్(పీడబ్ల్యూసీ) వంటి దిగ్గజాల సాయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా సంస్థలతో దీనిపై ఐటీ శాఖ చర్చలు జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా డిపాజిట్ల ద్వారా వచ్చిన సొమ్ములో ఏదైనా మనీల్యాండరింగ్ చోటుచేసుకుందా అనేది తేల్చడం కోసం ఐటీ శాఖ ఈ చర్యలను తీసుకుంటోంది. రద్దయిన నోట్లలో దాదాపు 95 శాతంపైగా(రూ.15 లక్షల కోట్లు) ఇప్పటికే బ్యాంకుల్లోకి వెనక్కివచ్చేసినట్లు తాజాగా అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా, నోట్ల రద్దు తర్వాత 60 లక్షల మంది వ్యక్తులు, సంస్థలు భారీస్థాయిలో పాత రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్ చేసినట్లు అంచనా. వీటి విలువ రూ. 7 లక్షల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. రూ.4 లక్షల కోట్ల విలువైన వ్యక్తిగత డిపాజిట్లపై ఐటీ శాఖ కొన్ని లొసుగులను గుర్తించినట్లు సమాచారం. మరోవైపు అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్ఐయూ) నుంచి ఐటీ శాఖ ఇప్పటికే సమాచారం సేకరించింది. నిద్రాణంగా ఉన్న, జన్‌ధన్ ఖాతాలతోపాటు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఎంతమేరకు డిపాజిట్లు వచ్చాయన్న వివరాలన్నీ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎన్‌ఎస్‌ఈఎల్‌పై ఎఫ్ఐయూ దర్యాప్తు
న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్ఐయూ) దర్యాప్తు మొదలైంది. దీనిలో భాగంగా ఈ కమోడిటీ ఎక్స్ఛేంజీలో లావాదేవీలు నిర్వహించిన ఇన్వెస్టర్లు, ప్రమోటర్లపై ఎఫ్ఐయూ దృష్టి పెట్టింది. ఎఫ్ఐయూ ఆర్థిక శాఖకింద పనిచేస్తుంది. ఈ కేంద్ర సంస్థ... ఎన్ఎస్ఈఎల్లో అవకతవకలకు కారణమైన లావాదేవీలు, అనుమానాస్పద నగదు బదిలీలు, నగదు ఉపసంహరణలు తదితరాలపై విచారణ నిర్వహించనుంది. ఇప్పటికే ఎన్ఎస్ఈఎల్ అంశంపై పరిశోధన చేపట్టిన పలు నియంత్రణ సంస్థలు ఆర్థిక లావాదేవీలలో అవకతవకలు జరిగినట్లు నిర్థారణకు వచ్చాయి. ఈ బాటలో ఎక్స్ఛేంజీలో లావాదేవీలు నిర్వహించే దాదాపు 25 మంది ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను శాఖ సర్వేలు నిర్వహించింది. వీటికి అనుగుణంగానే ఆయా లావాదేవీలకు సంబంధించిన నగదు బదిలీ, నిధుల సమీకరణ తదితర వివరాలను రూపొందించాల్సిందిగా ఎఫ్ఐయూను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ స్థాయిలో మనీ లాండరింగ్ ఎన్ఎస్ఈఎల్ ద్వారా భారీ స్థాయి మనీలాండరింగ్ లావాదేవీలు జరిగినట్లు నియంత్రణ సంస్థలు అనుమానిస్తున్నాయి. సంక్షోభానికి కారణమైన రూ. 5,600 కోట్లకంటే బాగా అధిక స్థాయిలోనే మనీ లాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు అంచనా వేస్తున్నాయి. ఈ విషయంలో మనీ లాండరింగ్ కార్యకలాపాలను గుర్తించే రక్షణాత్మక వ్యవస్థ విఫలమైనట్లు అనుమానిస్తున్నాయి. దీంతో భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్లు అభిప్రాయపడ్డాయి. ఈ బాటలో కొన్ని వందల కోట్ల రూపాయలమేర అక్రమ లావాదేవీలు జరిగి ఉండవచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి ఎన్ఎస్ఈఎల్ సెబీ పరిధిలోకి రానప్పటికీ బ్రోకర్లు, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ కార్యకలాపాలు, ఇన్సైడర్ ట్రేడింగ్, లిస్టింగ్ ఒప్పందాలు, అక్రమ లావాదేవీలు, స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రమోటర్ నిబంధనలు వంటి అంశాలపై దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఎక్స్ఛేంజీకి చెందిన కొంతమంది ఉన్నతాధికారులు, బ్రోకర్లు, సంపన్న వర్గ క్లయింట్లపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని సోదాలు అవసరం ఎన్ఎస్ఈఎల్ సంక్షోభంపై ఈ నెల మొదట్లో నివేదికలు రూపొందించిన ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ), ఆర్బీఐ నిర్దిష్ట కాలానికి ఎక్స్ఛేంజీలో జరిగిన ఆర్థిక వ్యవహారాల వివరాల కోసం మరింతగా శోధించాల్సి ఉందంటూ అభిప్రాయపడ్డాయి. ఇక మనీ లాండరింగ్ చట్టానికి అనుగుణంగా చర్యలను చేపట్టగల ఎఫ్ఐయూ ప్రస్తుతం ఇటు సీబీఐ, అటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ చేపట్టిన దర్యాప్తులకు తగిన సహకారాన్ని అందించేందుకు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జిగ్నేష్ షాకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ప్రమోట్ చేసిన ఎన్ఎస్ఈఎల్... వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను చేపట్టలేక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. జూలై 31 నుంచి ఎక్స్ఛేంజీ కార్యకలాపాలు మూతపడ్డాయి. నేటి ఎంసీఎక్స్ ఏజీఎంకు ఎదురుగాలి! మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్) వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) సోమవారం(30న) జరగనుంది. చెల్లింపుల సంక్షోభంతో విలవిల్లాడుతున్న ఎన్ఎస్ఈఎల్ సమస్య నేపథ్యంలో ఇన్వెస్టర్ల నుంచి భారీ విమర్శలు తప్పవని నిపుణులు అంటున్నారు. కొందరు ఇన్వెస్టర్లు నిరసనలను వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫైనాన్షియల్ టెక్నాలజీస్(ఎఫ్టీ) ప్రమోట్ చేసిన ఎంసీఎక్స్‌లో ఎన్‌ఎస్‌ఈఎల్‌కు 26% వాటా ఉంది. కాగా, ఎన్ఎస్ఈఎల్ సంక్షోభం కారణంగా గతేడాది(2012-13)కి ఎఫ్టీ ఆర్థిక ఫలితాలను ఆడిట్ చేసిన డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ తమ ఆడిట్ నివేదికను ఉపసంహరించుకోవడం గమనార్హం.