breaking news
Fish species
-
డైనోసార్ల నాటి చేప!
అవడానికి అది చేప మాత్రమే. కానీ దాని ఘనత అంతా ఇంతా కాదు. ఎందుకంటే పూర్వ చారిత్రక యుగం నుంచీ ఉనికిని కాపాడు కుంటూ వస్తున్న అత్యంత మొండి ఘటంగా తిరుగులేని రికార్డు దాని సొంతం. మరోలా చెప్పాలంటే అది డైనోసార్లతో రాసుకుపూసుకు తిరిగిన బాపతు. అంటే కనీసం కోటిన్నర ఏళ్ల నాటిదన్నమాట. అత్యంత కఠినమైన కాలపరీక్షకు కూడా తట్టుకుని నిలిచిన అంతటి మొండి జీవి ఉనికి కాస్తా ఇప్పుడు ప్రమాదంలో పడింది. కారణం? మనిషే. అతని పేరాశ పుణ్యమా అని అంతరించిపోయే జాబితాలో చేరిన ఆ చేప జాతిని ఎలాగైనా కాపాడేందుకు క్యూబా సైంటిస్టులు కాలంతో పోటీ పడి మరీ శ్రమిస్తు న్నారు...! అది క్యూబా తీరం వెంబడి పొడవుగా సాగిన ఉప్పునీటి కయ్యలోని జెప్టా చిత్తడి నేలల ప్రాంతం. ప్రాణాంతకమైన వ్యాధులను మోసుకు తిరిగే భయానకమైన దోమలకు పెట్టింది పేరు. అలాంటి ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. డైనోసార్ల కాలంనుంచీ నేటిదా కా మనుగడలో ఉన్న ఒకే ఒక్క చేప జాతి అయిన మంజువారీలకు ప్రపంచంలోకెల్లా ఏకైక ఆవాసమది. పొ డవుగా, సన్నగా, నాజూకుగా, పదునైన పళ్లతో ఉండే ఈ చేప అంతరించే జాబితాలోని జీవజాలంలో ముందువరుసలో ఉంది. దాంతో పాతికేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తాలూకు అంతరించను న్న జీవుల జాబితాలోకి ఎక్కింది. శతాబ్దాల తరబడి మనిషి సాగించిన విచ్చలవిడి వేటే ఇందుకు ప్రధాన కారణం. దాంతో ఈ సహస్రాబ్దం తొలినాళ్లకల్ల మంజువారీ దాదాపుగా అంతరించిపోయినంత పనైంది! దాంతో ఒక దశలో దానిపై అంతా ఆశలు వదలుకున్నారు! కానీ ఉన్నట్టుండి మూడేళ్లకు అంటే 2003 ప్రాంతంలో జెప్టా చిత్తడినేలల్లో ఈ చేప జాతి మళ్లీ కనిపించింది. దాంతో క్యూబా సర్కారు కళ్లు తెరిచింది. దాన్ని ఎలాగైనా కాపాడేందుకు నడుం బిగించింది. ఈ గురుతర బా ధ్యతను అక్కడి ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త ఆంద్రెస్ హర్టాడో బృందానికి అప్పగించింది. ఆయన వెంటనే రంగంలోకి దిగారు. మంజువారీ చేపలను విడిగా పెంచేందుకు చిత్తడి నేలల సమీ పంలోనే యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రత్యేక హాచరీని ఏర్పాటు చేశారు. వాటి సంఖ్య హాచరీలో పట్టనంతగా పెరిగిన కొద్దీ పెద్ద వయసు చేపలను చిత్తడి కయ్యల్లోకి వదులుతూ వస్తున్నా రు. ఇప్పుడు స్థానిక మత్స్యకారులు తమకు మంజువారీలు తరచూ కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ‘‘అప్పుడే ఆనందించడానికి లేదు. మంజువారీలకు అవసరమైన ఆహారాన్ని బయటి పరిస్థితుల్లో అందుబాటులో ఉంచడం చాలా కష్టమైన పని. ఆ సవాలును పూర్తిగా అధిగమించినప్పుడే నిజమైన ఆశ ఉన్నట్టు. వీటిని అంతరించే జీవుల జాబితా నుంచి కొన్నాళ్ల తర్వాతైనా బయట పడేయడం సాధ్యమని చెప్ప గలమన్నట్టు’’అని వివరించారాయన. క్యూబాలోని చేపల న్నింట్లోకెల్లా మంజువారీ రత్నం వంటిదని గర్వంగా చెబు తారు ఆంద్రెస్. అందుకే ఈ చేపను స్థానికులు క్యూబన్ గార్ అని కూడా మురిపెంగా పిలుచుకుంటారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మత్స్య జాతులు మాయం!
వాషింగ్టన్: భవిష్యత్‌లో శీతోష్ణస్థితి మార్పుతో సముద్రాలు అనూహ్యంగా వేడెక్కి చేపల జాతులు తగ్గిపోతాయని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. ఈ వివరాలను రాయల్ సొసైటీ బీకి చెందిన జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించారు. ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రెడేటర్– ప్రే సంబంధాలు (ఇతర జీవులను చంపి తినే జీవిని ప్రెడేటర్ అంటారు. ప్రెడేటర్‌కు ఆహారమయ్యేవాటిని ప్రే అంటారు) మార్పు చెందిన పలు జాతులు బతికేందుకు అవసరమైన పరిస్థితులు మారిపోతాయని తెలిపింది. కేవలం పెద్ద జాతుల చేపలే కాకుండా, వాణిజ్యపరమైన చేపల జాతులు కూడా తగ్గిపోతాయని పేర్కొంది. ఉదాహరణకు అట్లాంటిక్‌లో జాలరికి 200 ఫిష్ ఇయర్స్ తర్వాత ప్రస్తుతం దొరికేదాని కన్నా తక్కువగా చేపలు దొరుకుతాయని వివరించిది. చేపలు తగ్గే కొద్దీ వాటి వేట అధికమవుతుందని, దీనివల్ల జీవవైవిధ్యతలో భారీ మార్పులు వస్తాయని పరిశోధనలో పాల్గొన్న మలిన్ పింక్సీ చెప్పారు. కంప్యూటర్ మోడల్స్‌ను ఉపయోగించి ప్రెడేటర్– ప్రే సంబంధాలను విశ్లేషించినట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ లక్షల చేపల జాతులు ధృవప్రాంతాలకు పోతాయని, దీనివల్ల భూమిపై జీవరాసుల బంధాల్లో సైతం గణనీయమార్పులు వస్తాయని చెప్పారు. -
జలపుష్పాల జాడేది?
పెరిగిపోయిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కనుమరుగవుతున్న ప్రాణుల జాబితాలోకి ప్రస్తుతం అరుదైన మత్స్య సంపద కూడా చేరుతోంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల కాల్వల్లో ఎక్కువగా దొరికే అనేక రకాల జలపుష్పాలు అంతరించిపోతున్నాయి. గతంలో గ్రామాల్లోని కాల్వలు, చెరువు, కుంటల్లో బొచ్చెలు, కొర్రమీనులు (మట్టలు), బొమ్మిడాలు, ముల్లు జెల్లలు, రొయ్యల వంటి మత్స్య సంపద ఎక్కువగా కనిపించేది. వర్షాకాలంలో చెరువులు కుంటల నుంచి కాల్వలకు నీరు వదలగానే ఇవి విరివిగా దొరికేవి. కాల్వల్లో పెరిగే ఈ చేపలు ఎంతో రుచిగా ఉండడంతో మాంసాహార ప్రియులు వీటి కోసం ఎంతో ఆరాట పడుతుంటారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు లేని సమయాల్లో వలలు, గాలాలు పట్టుకుని చేపలు పట్టి జీవనోపాధి పొందేవారు. అయితే పదిహేనేళ్లుగా నెలకొంటున్న వర్షాభావ పరిస్థితులు, రసాయన ఎరువులవాడకం, నీటి కలుషితం వల్ల మత్స్య సంపద కనుమరుగవుతోంది. గతంలో వర్షాకాలం వచ్చిందంటే రైతులు, మత్స్యకారులు కాలువల్లో చేపలను పట్టి ఇంటి అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన వాటిని సదాశివపేట మార్కెట్లో విక్రయించేవారు. వర్షాకాలంలో వాగులు వంకల నుంచి చేపలు వరద నీటిలో ఎదురీదుతూ గ్రామాల పంట పొలాలు, చెరువులు, కుంటల్లోకి వచ్చి చేరేవి. దీంతో వీటిలో చేపల సంతానం పెరిగేది. కానీ మారిన వాతావరణ పరిస్థితుల వల్ల వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కొర్రమీనులు, బొమ్మిడాలు, బొచ్చెలు, జెల్లలు తదితర చేప జాతులు కనిపించకుండా పోతున్నాయి. వీటిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఇవి అంతరించి పోయే ప్రమాదం ఉందని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ మొక్కలను విరివిగా పెంచాలని విద్యాధికులు సూచిస్తున్నారు.


