breaking news
Fake registration documents
-
‘నకిలీ’ల ముఠా గుట్టు రట్టు
కంచికచర్ల (నందిగామ) : కాసుల కోసం కక్కుర్తిపడి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి పలువురికి భూములు, స్థలాలు అమ్మి కోట్లాది రూపాయలను దండుకున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో పోలీసుల పాత్రపై కూడా విచారణ జరపాలని నిర్ణయించుకోవటం విశేషం. నకిలీ భూముల కుంభకోణంపై కంచికచర్ల పోలీస్ అధికారుల పాత్రలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు అధికారిగా నూజివీడు డీఎస్పీ ఏ శ్రీనివాసరావును నియమించారు. ఈ కుంభకోణంపై మంగళవారం కంచికచర్ల పోలీస్ స్టేషన్లో నందిగామ డీఎస్పీ టీఆర్ మురళీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నూజివీడు డీఎస్పీ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మధిరకు చెందిన శీలం కోటిరెడ్డి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించాడని ఫిర్యాదులు అందాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కోటిరెడ్డి రిజిస్ట్రేషన్ చేసి భూమి అప్పగించలేదని పెనమలూరుకు చెందిన కంచర్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడని తెలిపారు. 2015లో సర్వే నెంబర్ 55/6బీలో 15 సెంట్ల స్థలాన్ని రూ.8 లక్షలకు అమ్మాడని, విజయవాడలో రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు. అలాగే, కపిలవాయి కృష్ణవేణి, శీలం పిచ్చిరెడ్డి, వెన్నం రాజ్యలక్ష్మి, వెన్నం వెంకటకృష్ణారెడ్డి ముఠాగా ఏర్పడి ఇతరులకు చెందిన స్థలాలు, భూములను తమవని నమ్మించి అమాయకులకు అమ్ముతున్నారని వెల్లడించారు. వీరు పలు స్థలాలను కంచర్ల శ్రీనివాసరావుకు తనఖా రిజిస్ట్రేషన్ చేసి అతని నుంచి దఫదఫాలుగా రూ.26 లక్షల వరకు తీసుకున్నారని తెలిపారు. గడువు తీరినా సొమ్ము చెల్లించకపోగా ఫోన్లో కూడా అందుబాటులోకి రాకపోవటంతో డాక్యుమెంట్లను పరిశీలించగా ఆ భూములు వారివి కావని తెలుసుకుని స్టేషన్లో ఫిర్యాదు చేశాడని వివరించారు. కోటిరెడ్డితో పాటు ఏ2గా ఉన్న కృష్ణవేణిలపై కేసు నమోదు చేశామని ఇంకా విచారణ చేపట్టి ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నారో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సివిల్ కేసులో పోలీసుల జోక్యం.. సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోకూడదని నందిగామ డీఎస్పీ తాళ్లూరి రాధేష్‌మురళీ స్పష్టం చేశారు. అయితే, కోటిరెడ్డి – శ్రీనివాసరావుల మధ్య నందిగామ రూరల్ సీఐ ఒప్పంద పత్రాన్ని రాయించాడని చెప్పారు. ఆ ఒప్పందం ప్రకారం గడువు ముగిసినా శ్రీనివాసరావుకు కోటిరెడ్డితో రిజిస్ట్రేషన్ చేయించలేదని తెలిపారు. దీనిపైనా పూర్తిస్థాయిలో విచారణ జరిపి సీఐపై తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
బాపట్లలో సీబీఐ ప్రకంపనలు
8 ఏళ్ల క్రితం ఘటనపై విచారణ బాపట్ల: 8 ఏళ్ల క్రితం కొందరు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి బాపట్ల ఐడీబీఐ బ్యాంకు నుంచి లోన్ల రూపేణా రూ.122 కోట్లు స్వాహా చేశారు. దీనిపై అంతర్గత విచార ణ జరిపిన బ్యాంకు అధికారులు ఎట్టకేలకు 181 మంది రూ.122 కోట్ల మేర బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారని నిర్ధారించుకుని సీబీఐని ఆశ్రయించారు. కేసుకు సంబంధించి మరిన్ని అధారాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు శుక్రవారం బాపట్లలో రహస్యంగా విచార ణ జరిపినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఈ ఏడాది జనవరి 28న 40 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బాపట్ల కేంద్రంగా నడుస్తున్న కామాక్షి డెయిరీ ఫామ్ అధినేత గండూరి మల్లి కార్జునరావుతో పాటు మరికొంతమంది ముఠాగా ఏర్పడి, రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల సహకా రంతో ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించారు. గుంటూరులోని చంద్రమౌళి నగర్ ఐడీబీఐ బ్యాంకు ఏజీఎం చంద్రశేఖర్‌ను కలుపుకుని ఫైల్స్ కదిలించారు. 2010– 2012లో విడతల వారీగా బ్యాంకు నుంచి లోన్ల రూపేణా సొమ్ము దోచుకున్నారు. ఈ కేసులో చంద్రశేఖర్‌ను ఏ–1గా, మల్లికార్జునరావును ఏ–2గా చేర్చారు. మరో 38మందిపై కేసు నమోదైంది. సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వారి వద్ద నుంచి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.