భర్తను కోర్టుకు లాగారని భార్య ఆత్మహత్య
మైసూరులోని కోర్టు
ఆవరణంలో ఘటన
మైసూరు : ఓ వ్యక్తి నకిలీ ప్రొనోట్ సృష్టించి తన భర్తపై కేసు బనాయించి కుటుంబాన్ని కోర్టుకు లాగారని ఆరోపిస్తూ ఓ వివాహిత కోర్టు ఆవరణంలోనే డెత్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. మైసూరులో బుధవారం ఈ ఘటన కలకలం సృష్టించింది. మూసూరులోని హణసూరు తాలూకా బూచనహళ్లిలో బలరామేగౌడ, మంగళమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. బలరామేగౌడ తన వద్ద రూ.75 వేలు అప్పుగా తీసుకున్నారని అదే గ్రామానికి చెందిన తిమ్మేగౌడ హణసూరు తాలూకా కోర్టులో కేసు వేశారు.
బలరామేగౌడ కేసు విచారణకు గైర్హాజరు కావడంతో అరెస్ట్ వారెంట్ జారీఅయింది. అయితే రెండేళ్లుగా బలరామేగౌడ, భార్య మంగళమ్మ ఊరు వదిలి వెళ్లిపోయారు. కాగా కోర్టు నుంచి వారెంట్ జారీ కావడంతో కోర్టు ఖర్చుల కోసమంటూ రూ.10 వడ్డీతో మరో రూ.30 వేల అప్పు చేయాల్సి వచ్చింది. కోర్టులో కేసు నడుస్తుండడం, ఆ కేసు పరిష్కారం కోసం మళ్లీ అప్పులు చేయాల్సి రావడంతో మనోవేదనకు గురైన మంగళమ్మ బుధవారం కోర్టు విచారణకు హజరయ్యే సమయంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టి విషం తాగింది. స్పృహకోల్పోయిన ఆమెను నగరంలోని కేఆర్.ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
అప్పు చేయకపోయినా తిమ్మేగౌడ నకిలీ ప్రొనోట్ సృష్టించి వేధింపులకు పాల్పడినట్లు మృతురాలు ఆ సూసైడ్ నోట్లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి తిమ్మేగౌడ కోసం గాలింపు చేపట్టారు.