breaking news
Environmental Agreement
-
పర్యావరణ ప్యాకేజీ... 300 బిలియన్ డాలర్లు
బకూ (అజర్బైజాన్): వాతావరణ మార్పుల తాలూకు దుష్ప్రభావాలను ఎదుర్కొనేందుకు వీలుగా వర్ధమాన దేశాలకు 300 బిలియన్ డాలర్లు అందించేందుకు ధనిక దేశాలు అంగీకరించాయి. అజర్‌బైజాన్‌లోని బకూ వేదికగా జరుగుతున్న కాప్–29 సదస్సులో ఆదివారం ఈ మేరకు పర్యావరణ ప్యాకేజీపై ఒప్పందం కుదిరింది. వర్ధమాన దేశాలకు 100 బిలియన్ డాలర్లు ఇచ్చేలా 2009లో కాప్ సదస్సులో అంగీకారం కుదరడం తెలిసిందే. దాని స్థానంలో 2035 నాటికి ఆ దేశాలకు 300 బిలియన్ డాలర్లు అందించేలా ప్యాకేజీని సవరించారు. కానీ పర్యావరణ లక్ష్యాల సాధనకు ఈ మొత్తం ఏ మూలకూ చాలదని భారత్ మండిపడింది. పలు వర్ధమాన దేశాలు కూడా అందుకు గొంతు కలిపాయి. పర్యావరణ పరిరక్షణ చర్చల విషయంలో కాప్–29 ప్రెసిడెన్సీ వ్యవహార శైలి సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. పారిస్ ఒప్పంద లక్ష్యాలకు విఘాతం కలిగిస్తూ ధనిక దేశాలు తమ బలాన్ని ఉపయోగించి తమపై బలవంతంగా ఈ ఒప్పందాన్ని రుద్దుతున్నాయమని మండిపడ్డాయి. ఈ ప్యాకేజీని ‘చాలా తక్కువ, చాలా ఆలస్యం’గా ఆఫ్రికన్ గ్రూప్ ప్రతినిధులు అభివర్ణించారు. గత శుక్రవారం దాకా జరగాల్సిన 12 రోజుల కాప్ సదస్సు రెండో రోజులు అదనంగా కొనసాగి దేశాల అభ్యంతరాలు, వాకౌట్ల నడుమ ఆదివారం ముగిసింది.అంగీకరించబోం: భారత్ వాతావరణ మార్పుల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలే బాగా ప్రభావితమవుతున్నాయని భారత్ గుర్తు చేసింది. ‘‘వాటికి కేవలం 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ చాలా తక్కువ. ఇందుకు అంగీకరించబోం’’ అని స్పష్టం చేసింది. తమ అభ్యంతరాలను తీసుకోకుండా కాప్–29 అధ్యక్షునితో పాటు ఐరాస ఈ ఒప్పందాన్ని దేశాలపై రుద్దాయని ఆరోపించింది. దీన్ని తీవ్ర అన్యాయంగా సదస్సులో పాల్గొన్న భారత్ ఆర్థిక వ్యవహారాల శాఖ సలహాదారు చాందినీ రైనా అభివరి్ణంచారు. ప్యాకేజీని ఆమోదించే ముందు కనీసం తమతో మాట్లాడాలని సూచించినా పట్టించుకోలేదన్నారు. ‘‘అన్నిదేశాల అభ్యంతరాలనూ వినాలి. ఇలా దేశాలను మాట్లాడనీయకుండా చేయడం ఐరాస వాతావరణ మార్పుల ఒప్పందానికి విరుద్ధం. దీన్ని భారత్ పూర్తిగా వ్యతిరేకిస్తోంది’’ అని తెలిపారు.పెద్ద జోక్: నైజీరియా భారత్‌కు నైజీరియా మద్దతు తెలిపింది. 300 బిలియన్ డాలర్లు ప్యాకేజీ పెద్ద జోక్ అని వ్యాఖ్యానించింది. మలావీ, బొలీవియా సైతం భారత్‌తో గొంతు కలిపాయి. ఇది నిరాశాజనక పరిణామమని ‘తక్కువ అభివృద్ధి చెందిన దేశాల’ (ఎల్డీసీ) గ్రూప్ చైర్మన్ ఎవాన్స్ ఎన్జేవా అన్నారు. ఒప్పందం ఏకపక్షంగా జరిగిందని ఆఫ్రికన్ గ్రూప్ ఆఫ్ నెగోషియేటర్స్ (ఏజీఎన్) చైర్మన్ విమర్శించారు. ఇది హాస్యాస్పదమని నైజీరియాకు చెందిన సంధానకర్త ఎన్కిరుకా మదుక్వే అన్నారు. దీనిపై పునరాలోచించుకోవాలి తీసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు వర్ధమాన దేశాలకు ఉందని ఆమె అన్నారు. ఎల్డీసీ గ్రూప్, అలయన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ (ఏఓఎస్ఐఎస్) ప్రతినిధులు వాకౌట్ చేయడంతో గందరగోళం నెలకొంది. ఐరాస వాతావరణ చర్చలు దాదాపు విఫలమయ్యాయని ఐరాస మానవ హక్కుల మాజీ హైకమిషనర్ మేరీ రాబిన్సన్ అన్నారు.1.3 లక్షల కోట్ల డాలర్లు కావాలి గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల కట్టడికి సాయపడేందుకు అల్పాదాయ ఆర్థిక వ్యవస్థలకు సంపన్న దేశాలు ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం, మద్దతు అందిస్తున్నాయి. ఇందుకోసం 2020 నాటికి 100 బిలియన్ డాలర్లు అందిస్తామని 2009లో హామీ ఇచ్చినా దాన్ని నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రకటించిన 300 బిలియన్ డాలర్లు ఏ మూలకూ చాలవని, కనీసం 1.3 లక్షల కోట్ల డాలర్లు కావాలని వర్ధమాన దేశాలు కోరుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మళ్లీ పారిస్ ఒప్పందంలోకి అమెరికా?
వాషింగ్టన్: తమకు ఆమోదయోగ్యమైన విధంగా ‘పారిస్ పర్యావరణ ఒప్పందం’లో మార్పులు జరిగితే అందులో తిరిగి చేరడంపై యోచిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘నిజాయితీగా చెబుతున్నా. పారిస్ ఒప్పందంతో నాకెలాంటి సమస్య లేదు. కానీ అమెరికా ప్రయోజనాలు దెబ్బతీసేలా నాటి ఒబామా సర్కారు సంతకం చేయడం ఆందోళనకు గురిచేసింది. ఇది అమెరికాకు ఒక చెత్త డీల్. ఒప్పందంలో మాకు అనుకూలంగా మార్పులు జరిగితే తిరిగి అందులో చేరొచ్చు. పర్యావరణ కాలుష్యంపై నేనూ ఆందోళన చెందుతున్నా. స్వచ్ఛ జలం, స్వచ్ఛ గాలితో పాటు ఇతర దేశాలతో పోటీపడుతూ వ్యాపారాలు చేయడం ముఖ్యమే. కానీ పారిస్ ఒప్పందం మా పోటీతత్వ ప్రయోజనాన్ని హరిస్తోంది’ అని ట్రంప్ అన్నారు. -
పారిస్ ఒప్పందానికి భారత్ ఆమోదం
-
పారిస్ ఒప్పందానికి భారత్ ఆమోదం
న్యూయార్క్: గతేడాది పారిస్‌లో చేసుకున్న పర్యావరణ ఒప్పందానికి ఆదివారం భారత్ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన ఒప్పందం ఆమోద ప్రతిని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ యూఎన్ ఒప్పందాల విభాగ చీఫ్ విల్లపాండోకు అందజేశారు. మహాత్మాగాంధీ 147వ జయంతి సందర్భంగా యూఎన్ అధికారులు, దౌత్యవేత్తలతో కలసి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దీన్ని అందించారు. ఈ ఒప్పందం వల్ల వాతావరణంలో కీలక మార్పులకు తొలి అడుగుపడనుందని, ఒప్పందంపై ప్రపంచదేశాలను ఏకం చేయటంలో భారత్ కీలకంగా వ్యవహరించిందని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ ప్రశంసించారు. ప్రపంచ మూడో అత్యధిక కర్బన ఉద్గార దేశంగా ఉన్న భారత్.. అహింసా దినోత్సవం నాడు ఒప్పంద పత్రాన్ని అందించడం అద్భుతమన్నారు. -
సానుకూల ఫలితంపై ధీమా!
పారిస్: ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కర్బన ఉద్గారాలను తగ్గించటం, ఓ ప్రభావవంతమైన పర్యావరణ ఒప్పందం అమలుకు.. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రపంచ పర్యావరణ సదస్సులో ఓ సానుకూల ఫలితం వస్తుందని భారత్ ధీమా వ్యక్తం చేసింది. సరైన లక్ష్యాల్లేకుండా పారిస్ సదస్సు ముగియకుండా చూస్తామని ఆదివారం భారత పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అయితే.. పర్యావరణ ఒప్పందంపై ఇప్పటివరకు చాలా స్వల్ప పురోగతి మాత్రమే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. సమావేశాలు ప్రారంభమై వారం రోజులు అవుతున్నా.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు.. అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికసాయం చేయాలనే విషయంపై పూర్తి ఏకాభిప్రాయం రాలేదు. ఈ నేపథ్యంలో నేటి నుంచి మొదలు కానున్న సభ్యదేశాల మంత్రుల సమావేశం ఆసక్తికరంగా మారింది.