breaking news
economic bills
-
వర్షాలుంటే.. వేగంగా వృద్ధి
♦ ఆర్థిక బిల్లుపై సమాధానంలో అరుణ్‌జైట్లీ ♦ రాజధానికి ఇప్పటికే రూ. 2,050 కోట్లు ఇచ్చాం ♦ పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం ♦ ప్రత్యేక హోదాపై ప్రస్తావించని ఆర్థిక మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడం తో ఏపీకి కష్టాలు ఎదురయ్యాయని, వాటిని ఎదుర్కొనేందుకు కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. ఏపీకి ఏ కష్టమూ రానివ్వబోమన్నారు. కేంద్ర ఆర్థిక బిల్లుపై చర్చకు గురువారం సమాధానమిచ్చిన జైట్లీ ఏపీ విషయం మాట్లాడినప్పటికీ ప్రత్యేక హోదా విషయంపై మాటెత్తలేదు. ‘‘13వ ఆర్థిక సంఘం అవిభాజ్య రాష్ట్రానికి రూ. 98,820 కోట్ల మేర నిధులు అందాయి. అన్ని రకాల గ్రాంట్లు కలిపి ఐదేళ్లలో వచ్చిన మొత్తం ఇది. ఇందులో ఏపీకి దాదాపు 52 శాతం, తెలంగాణకు 48 శాతం నిధులందాయి. అంటే ఐదేళ్ల ముందే రాష్ట్రం విడిపోయిందనుకుందాం. అప్పుడు మొత్తం ఐదేళ్లలో ఏపీ వాటా దాదాపు రూ. 52 వేల కోట్లుగా ఉండేది. ఏపీకి రాజధాని నిర్మించుకోవాలి. పోలవరం నిర్మించుకోవాల్సి ఉం ది. జాతీయ స్థాయి విద్యాసంస్థలు అనేకం తెలంగాణలో ఉండిపోయినందున ఏపీకి కొత్త గా జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఇచ్చాం. వాటన్నింటినీ నేను లెక్కించడం లేదు. 13వ ఆర్థిక సంఘం ద్వారా మీకు రూ. 50 వేల కోట్లు వచ్చాయి. అంటే ఏటా సగటున రూ. 10 వేల కోట్లు వచ్చాయి. విభజన అనంతరం తొలి ఏడాది అయిన 2014-15 కూడా 13వ ఆర్థిక సంఘం పరిధిలోదే. ఈ ఏడాది ఈ మొత్తం రూ. 14,100 కోట్లుగా ఇచ్చాం..’’ అని వివరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నిధులు ఏపీకి రూ. 21,900 కోట్లు ఇచ్చినట్లు జైట్లీ తెలిపారు. ఇది ఏపీ హక్కు, మేం చేసిన మేలు కాదన్నారు. ‘‘పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న రీతిలో రెవెన్యూ మిగులు కోసం రూ. 6,609 కోట్లు ఇచ్చాం. ఎస్డీఆర్ నిధులు కూడా ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇక తొలి ఏడాదికి గాను రెవెన్యూ లోటును రూ. 13,000 కోట్లుగా ఏపీ లెక్కించింది. మేం దానిని వెరిఫై చేస్తున్నాం. తుది మొత్తం ఖరారైతే ఆమేరకు చెల్లిస్తాం. ఏపీ క్లెయిం చేసుకున్న మొత్తాల్లో తక్కువగా ఇచ్చింది ఈ ఒక్క పద్దులోనే. తొలి ఏడాదిలో రెవెన్యూ లోటుకు మేం ఇప్పటివరకు రూ. 2,800 కోట్లు ఇచ్చాం. ఎందుకంటే ఈ మొత్తం మేం ఏటా వాయిదా పద్ధతుల్లో ఇవ్వాల్సి ఉంది. రాజధానికి మేం ఇప్పటికే రూ, 2,050 కోట్లు ఇచ్చాం. నీతి ఆయోగ్ ఈ మేరకు అంచనా వేసింది. కానీ ఏపీ ఇంతకంటే కొద్దిగా ఎక్కువగా అడుగుతోంది. మేం దీనిపై కూడా తుది నిర్ణయం తీసుకుంటాం. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాల్సి ఉంది. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మొత్తంగా రూ. 6,403 కోట్లు ఇచ్చాం’’ అని చెప్పారు. నాబార్డు కింద కేంద్రం ఏర్పాటు చేసిన ఫండ్ ద్వారా పోలవరానికి కొంత ప్రత్యేక నిధి ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు. పోలవరంపై వెనక్కి వెళ్లలేం... ఇంతలో బీజేడీ లోక్‌సభా పక్ష నేత భర్తృహరి మెహతాబ్ లేచి ‘పోలవరంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు మనం ఆగాలని మీకు అనిపించడం లేదా?’ అంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఇతర ఎంపీలు లేచి పోలవరం ఆపాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో జైట్లీ జోక్యం చేసుకుని ‘‘అది సమస్యేమీ కాదు. ఏపీకి ఉన్న కొన్ని జిల్లాల్లో తీవ్ర కరువు నెలకొనే జిల్లాలు ఉన్నాయి. మీకు కూడా ఆ సమస్య ఉంది. రెండో సమస్య ఏంటంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఆ హామీ నుంచి మేం వెనక్కివెళ్లలేం. ఒడిస్సా ఇబ్బందులను ప్రత్యేకంగా చూస్తాం’’ అని స్పష్టంచేశారు. అయితే జైట్లీ సమాధానానికి సంతృప్తి చెందని బీజేడీ ఎంపీలు నిరసన వ్యక్తంచేస్తూ వాకౌట్ చేశారు. ‘‘ఈ చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం రూపొందించింది. ఆ చట్టంలో ఈ నిబంధన ఉంటే దాని నుంచి వెనక్కి వెళ్లలేం కదా. దాన్ని అమలుచేయాలి..’’ అంటూ జైట్లీ ప్రసంగం ముగించారు. అయితే ప్రత్యేక హోదా విషయం ప్రస్తావనే లేకపోవడంతో వైఎస్సార్సీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు లేచి ప్రత్యేక హోదా విషయం ఏమైందంటూ ప్రశ్నించారు. అయితే ఆర్థిక మంత్రి దానిపై స్పందించకుండా ఆర్థిక బిల్లు సవరణలపైనే దృష్టిపెట్టారు. -
కీలక బిల్లులను ఆమోదించండి..
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన కీలకమైన బిల్లులను వాయిదావేయకుండా...ఆమోదముద్ర వేయాలని రాజకీయ పార్టీలకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. బుధవారం ఇక్కడ ఢిల్లీ ఆర్థిక సదస్సు-2013లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2014 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పలేం. రాజకీయాలు మరింత సంక్లిష్టంగా మారొచ్చు. ఇప్పుడుగనుక ముఖ్యమైన బిల్లులు వాయిదాపడితే.. రానున్న ప్రభుత్వ హయాంలో ఆమోదముద్ర లభించడం అత్యంత సవాలుగా మారుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అంశం’ అని రాజన్ పేర్కొన్నారు. అదేవిధంగా భారీ ప్రాజెక్టుల్లో జాప్యాలు తొలగించి.. తక్షణం పట్టాలెక్కించేలా చూడాలని కూడా ఆయన చెప్పారు. లేదంటే వీటి వ్యయాలు అదుపుతప్పి రానున్న ప్రభుత్వానికి మరింత సమస్యాత్మకంగా మారుతాయన్నారు. సబ్సిడీలకు కోతపెట్టాలి..: కీలక బిల్లులు ఆమోదించడంతోపాటు వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్థిక క్రమశిక్షణ పాటించేందుకు కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం నడుంబిగించాలని రాజన్ సూచించారు. డీజిల్ ధరల పెంపు, సామాజిక పథకాలకు సంబంధించిన సబ్సిడీల్లో కోతపెట్టడం చాలా ముఖ్యమని చెప్పారు. ఈ ఏడాది 5 శాతం వృద్ధి రేటు అంచనా... దేశ ఆర్థిక వ్యవస్థలో రికవరీ, స్థిరీకరణ సంకేతాలు కనబడుతున్నాయని రాజన్ పేర్కొన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2013-14)లో ఆర్థిక వృద్ధి రేటు 5 శాతంగా ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ద్రవ్యలోటును లక్ష్యాన్ని(4.8 శాతం) ప్రభుత్వం సాధించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పాలసీలో ద్రవ్యోల్బణం, లిక్విడిటీపైనే దృష్టి... రానున్న పరపతి విధాన సమీక్ష(ఈ నెల 18న)లో ఆర్బీఐ ప్రధానంగా ధరలకు కళ్లెం, వ్యవస్థలో నగదు సరఫరా(లిక్విడిటీ) మెరుగుపరచడంపైనే దృష్టిపెడుతుందని రాజన్ చెప్పారు. తద్వారా మరోవిడత వడ్డీరేట్ల పెంపు/యథావిధిగా కొనసాగించే సంకేతాలు ఇచ్చారు. ద్రవ్యోల్బణం ఎగబాకుతుండటంతో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా రెండు సమీక్షల్లో కూడా పాలసీ వడ్డీ రేట్లను రాజన్ పావు శాతం చొప్పున పెంచారు. టోకు ధరల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7 శాతానికి(8 నెలల గరిష్టం), రిటైల్ ద్రవ్యోల్బణం 10.09% కు ఎగబాకిన సంగతి తెలిసిందే. కావాలనే రుణాలు ఎగ్గొడితే వడ్డీ బాదుడు... బ్యాంకులకు మొండిబకాయిలు(ఎన్పీఏలు) పెరిగిపోతుండటంపై రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అడ్డుకట్టవేయడంలో భాగంగా కావాలనే రుణాలు ఎగ్గొట్టేవారికి(డిఫాల్లర్ల) భవిష్యత్తులో రుణాలపై భారీగా వడ్డీరేట్లు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. మొండిబకాయిల పెరగుదలకు సంబంధించి వచ్చే వారంలో ఒక చర్చా పత్రాన్ని ఆర్బీఐ విడుదల చేయనుందని వెల్లడించారు. దీనిలో ఎన్పీఏల రికవరీకి పరిష్కార మార్గాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.