breaking news
Dr. Padma palvay
-
క్షణం కూడా కలిసుండరు... ఏం చేయాలి?
మాకు ఇద్దరు పిల్లలు... బాబు, పాప. ఐదు, ఏడు తరగతులు చదువుతున్నారు. ఇద్దరూ మహా చురుకు. కానీ అదేంటో... ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. ఎప్పుడు చూసినా పోట్లాడుకుంటూనే ఉంటారు. ప్రతి చిన్నదానికీ వాదనకు దిగుతారు. నేనో, వాళ్ల నాన్నో చూసి అదిలిస్తే ఆగుతారు. లేదంటే కొట్టుకునేవరకూ వెళ్లిపోతారు. అలా కొట్టుకోకూడదని, ఇద్దరూ సఖ్యంగా ఉండాలని చెప్పినా వినడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే వాళ్ల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? ఒకరికొకరు తోడుగా ఎలా ఉంటారు భవిష్యత్తులో? వాళ్ల మధ్య సఖ్యత ఎలా కుదర్చాలో చెప్పండి ప్లీజ్. - సుస్మిత, బెంగళూరు పిల్లలు ఒకళ్లతో ఒకళ్లు పోట్లాడు కోవడం అసహజమేమీ కాదు. దానికి కంగారు పడకండి. వాళ్లు మరీ ఎక్కువగా పోట్లాడుకున్నప్పుడు మాత్రం కూర్చోబెట్టి మాట్లాడండి. సఖ్యతగా ఎలా ఉండాలో చెప్పడమే కాకుండా, గొడవ వస్తే ఎలా సర్దుబాటు చేసుకోవాలో కూడా వాళ్లకు విడమర్చి చెప్పండి. దీనివల్ల వాళ్ల మధ్య సఖ్యత పెరగడమే కాకుండా, పెద్దయిన తర్వాత గొడవలు పడకుండా ఎలా ఉండాలో, సమస్యలు ఎలా పరిష్కరించు కోవాలో కూడా తెలుస్తుంది. అలాగే గొడవ పడినంత మాత్రాన వాళ్లు మాట్లాడు కోకుండా ఉండకూడదనే విషయాన్ని కూడా చెప్పండి. గొడవపడినా కలిసిపోవాలని, ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని చెప్పండి. పాప చిన్నది కాబట్టి తన బాధ్యతను బాబుకి అప్పగించండి. తనని బాగా చూసుకోవాలని చెప్పండి. అలాగే నువ్వు అన్నయ్యకు సహకరించాలని పాపకు చెప్పండి. అయినా చిన్నప్పుడు కొట్టుకున్నంత మాత్రాన పెద్దయ్యాక కూడా అలానే ఉండాలనేం లేదు. కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకండి. మా బాబు వయసు ఎనిమిదేళ్లు. వాడికో విచిత్రమైన అలవాటు ఉంది. సుద్దముక్కలు, సున్నం, మట్టి తినేస్తున్నాడు. మేం చూస్తే ఆపుతున్నాం. లేదంటే వాడు రహస్యంగా తినేస్తున్నాడు. గోళ్లు కూడా బాగా కొరుకుతున్నాడు. మాన్పించడం మావల్ల కావడం లేదు. ఇది శారీరక సమస్యా మానసిక సమస్యా అన్నది తెలియడం లేదు. ఏం చేయమంటారు? - సావిత్రి, ఆముదాలవలస ఈ అలవాటును ‘Pica'(పైకా) అంటారు. కొంతమంది పిల్లలకు ఐరన్ తక్కువగా ఉంటే కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. ఓసారి బాబును పీడియాట్రీషన్కు చూపించండి. ఏదైనా సమస్య ఉందేమో పరీక్షించి నిర్ధారిస్తారు. దాన్ని బట్టి చికిత్స కూడా చేస్తారు. ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే... ఓ మంచి సైకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లండి. బిహేవియర్ థెరపీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నేనో సింగిల్ మదర్ని. పైగా వర్కింగ్ ఉమన్‌ని. ఉదయం పిల్లలిద్దరూ బడికి వెళ్లాక ఆఫీసుకు వెళ్లిపోతాను. అయితే సాయంత్రం మాత్రం ఆలస్యమవుతూ ఉంటుంది. పిల్లలు నాకంటే ముందే వస్తారు. ఇంతకు ముందు నేను వచ్చేసరికి చక్కగా హోమ్‌వర్క్ చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈ మధ్య అలా చేయడం లేదు. పక్కింటి పిల్లలతో ఆటలాడుతున్నారు. కాసేపు ఆడుకోవడంలో తప్పు లేదు. కానీ హోమ్ వర్క్ చేయడం లేదు. నేను వచ్చాక తిడితే అప్పుడు పుస్తకాలు పట్టుకుంటున్నారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోతోంది. ఇలా అయితే నా ఆరోగ్యంతో పాటు, వాళ్ల చదువు కూడా పాడైపోతుందని భయమేస్తోంది. అలా అని చెప్పినా వాళ్ల తీరు వాళ్లదే. వాళ్లనెలా డీల్ చేయాలో చెప్పండి. ఎందుకంటే కష్టమైనా, నష్టమైనా భరించాల్సింది నేనొక్కదాన్నే కదా! - యు.రేవతి, రాజమండ్రి ముందు పిల్లల బిహేవియర్లో ఈ మార్పు రావడానికి కారణం ఏంటో తెలుసుకోడానికి ప్రయత్నించండి. చుట్టుపక్కల పిల్లలు ఎక్కువగా రావడం లాంటివి ఉంటే అది తగ్గించడానికి ప్రయత్నించండి. లేకపోతే పిల్లలకు క్లియర్‌గా చెప్పేయండి... సాయంత్రం మీరు వచ్చేసరికి హోమ్‌వర్క్ అయిపోవాలని. లేకపోతే టీవీ చూసే వీలు లేకుండా చేయండి. మరుసటి రోజు పిల్లలు ఆటలాడే సమయంలో ఫోన్ చేయండి. హోమ్‌వర్క్ సంగతి గుర్తు చేయండి. లేదంటే మళ్లీ టీవీ చూడనని, ఇక అస్సలు ఆడుకోనివ్వనని చెప్పండి. చేస్తే ఏమిస్తారు, చేయకపోతే ఎలా శిక్షిస్తారో స్పష్టంగా వివరించండి. అన్నిటికంటే ముఖ్యంగా... ఏ మాత్రం వీలున్నా, వాళ్లతో ఒకటి రెండు గంటలు వాళ్ల దగ్గర కూర్చోగలిగేవాళ్లెవరైనా ఉంటే పిల్లల బాధ్యతను వాళ్లకు అప్పగించండి. - డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
ఎక్కువ మాట్లాడడు... ఏదైనా సమస్యా?
కిడ్స్ మైండ్స్ మా బాబు రెండో తరగతి చదువుతున్నాడు. తెలివైనవాడే. కానీ ఎక్కువ మాట్లాడడు. అల్లరి కూడా చేయడు. ఈ రోజుల్లో తన వయసు పిల్లలు ఎలా ఉంటున్నారు! వాళ్లతో పోలిస్తే వీడు డల్‌గా ఉన్నాడేమిటా అనిపిస్తుంది. మా బాబుకి ఏదైనా సమస్య ఉందేమో అని కూడా అనిపిస్తోంది. నా అనుమానం నిజమేనా? - రాఘవ, భీమడోలు బాబు బాగా చదువుతాడంటున్నారు కదా! కొంచెం తక్కువ మాట్లాడినా ఫర్వా లేదు. కొంతమందికి ఎక్కువగా మాట్లా డని తత్వం ఉంటుంది. అదేం సమస్య కాదు. తక్కువ మాట్లాడినా, మిగతా పిల్లలతో స్నేహితులతో ఆడుకుంటూంటే ఫర్వాలేదు. అలా లేకపోతే మాత్రం మీరు తనపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అందరి తోనూ కలవాలంటూ ఎంకరేజ్ చేయండి. సాయంత్రం ఆడుకోవడానికి ఇతర పిల్లల దగ్గరకు పంపించండి. ఫంక్షన్స్‌కి తీసుకెళ్తూ ఉండండి. ఎప్పుడూ మీతోనే ఉంచుకో కుండా అప్పుడప్పుడూ మిగతావాళ్ల దగ్గర కాసేపు వదిలిపెడుతూ ఉంటే, అందరి తోనూ కలిసిపోవడం అలవాటవుతుంది. మా పాపకి పద్నాలుగేళ్లు. కానీ తన ప్రవర్తన మాత్రం పెద్దవాళ్లలా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తుంది. నువ్వు చిన్న పిల్లవి కదమ్మా అంటే తనకి కోపమొచ్చేస్తుంది. నేనేం చిన్నపిల్లను కాదు, నాకు అన్నీ తెలుసు అంటుంది. పైగా ప్రతి విషయం గురించీ తర్కిస్తుంది. తనిలా పెద్దదానిలా ఫీలవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలొస్తాయో అని భయం వేస్తోంది. నేనేం చేయాలి? - సుష్మ, మచిలీపట్నం పాప పెద్దవాళ్లలాగా బాధ్యతగా ఉంటే ఇబ్బందేమీ లేదు. కానీ తన వయసుకు మించి తర్కించినా, పెద్దవాళ్ల విషయాల్లో కల్పించుకుంటున్నా మాత్రం మంచిది కాదు. అలా చేసినప్పుడు మెల్లగా వారించండి. పిల్లలు కల్పించుకోకూడని విషయాలు ఉంటాయని నచ్చజెప్పండి. తనకి కోపం వచ్చినా చెప్పడం మానకండి. అలాగే తన వయసుకు తగ్గట్టుగా తను మెచ్యూర్డ్‌గా ఆలోచించి, రెస్పాన్సిబుల్‌గా ఉనప్పుడు తప్పక అప్రిషియేట్ చేయండి. పిల్లలు బాధ్యతగా ఉండటం మంచిదే. కాబట్టి కోప్పడకుండా తన పరిధి ఏంటో నెమ్మదిగా తనకు తెలియజేస్తే, మెచ్యూర్డ్‌గా ఆలోచించే పిల్ల కాబట్టి తనే అర్థం చేసుకుంటుంది. మా బాబుకి అయిదేళ్లు. వాడితో ఓ విచిత్రమైన సమస్య ఎదురవుతోంది నాకు. యూరిన్‌కి గానీ, మోషన్‌కి గానీ బాత్రూమ్కి వెళ్లడం ఇష్టముండదు వాడికి. బయటకు తీసుకెళ్లాలి. బాత్రూమ్కి తీసుకెళ్తే ఏడ్చేస్తాడు. వాడికి మూడో యేడు వచ్చినప్పట్నుంచీ ప్రయత్నిస్తున్నా నావల్ల కావడం లేదు. పరిష్కారం చెప్పండి. - మాళవిక, గండిపాలెం, నెల్లూరు జిల్లా తనకి అవసరమైనప్పుడే కాకుండా, ఏదో ఒక పని చెప్పి బాబుని బాత్రూమ్ లోకి పంపిస్తుండండి. మగ్ తెమ్మనో, మరే దైనా అక్కడ పెట్టి రమ్మనో... ఏదో ఒకటి చెప్పి పంపండి. తను ఆ పని చేసినప్పుడు మెచ్చుకోండి. దాంతో తనకి బాత్రూమ్ అంటే ఉన్న భయం, అయిష్టత పోతాయి. తర్వాత మెల్లగా తను బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు తీసుకెళ్లడం మొదలెట్టండి. ఏడ్చినా పట్టించుకోకండి. తద్వారా మెల్లగా అలవాటు పడతాడు. ఏడుస్తు న్నాడు కదా అని బయటకు తీసుకెళ్తూనే ఉంటే ఆ అలవాటు ఎప్పటికీ పోదు. ఒకవేళ మీరు డీల్ చేయలేకపోతే కౌన్సెలర్ దగ్గరకు తీసుకెళ్లండి. వాళ్లే తనను ప్రిపేర్ చేస్తారు. మా అబ్బాయి నాలుగో తరగతి చదువుతున్నాడు. చాలా బాగా చదువు తాడని, క్రమశిక్షణతో ఉంటాడని వాళ్ల టీచర్లు కూడా చెబుతుంటారు. అయితే ఈ మధ్య నాకు వాడి ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. వాళ్ల నాన్న జేబులోంచి అడక్కుండా డబ్బులు తీసుకున్నాడు. అది నేను చూశాను. మావారికి చెబితే, పోనీలే ఏదో అవసరం అయ్యుంటుంది అన్నారు. దాంతో వదిలేశాను. ఈ మధ్య నా పర్సులోంచి కూడా డబ్బులు తీసుకోవడం గమనించాను. అడుగుతానంటే మావారు ఒప్పుకోవడం లేదు. మన పిల్లాడే కదా, తప్పేముంది, పిల్లలకి ఆ మాత్రం ఫ్రీడమ్ ఉండాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఈ అలవాటు మంచిది కాదని నా మనసు చెబుతోంది. ఈ అలవాటు వాణ్ని ఎలా తయారు చేస్తుందోనని భయం వేస్తోంది. ఏం చేయాలో చెప్పండి. - రాజ్యలక్ష్మి, తాటిపూడి తల్లిదండ్రుల్ని అడక్కుండా పిల్లలు డబ్బు తీయడం తప్పు. వాళ్లకు ఫ్రీడమ్ ఇవ్వాలి. కానీ ఆ వయసు వాళ్లకు మంచికీ చెడుకూ తేడా తెలియదు. వాళ్లు చేస్తోంది మంచా చెడా అన్నది గమనించి, తప్పులు సరిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత. డబ్బులు ఎందుకు తీశావని బాబును అడ గండి. కొట్టాల్సిన, తిట్టాల్సిన అవసరం లేదు. చెప్పకుండా డబ్బులు తీయడం తప్పని కూల్‌గానే చెప్పండి. మీరు, మీ వారు అనునయంగా చెబితే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఒక్కసారి చేసినప్పుడు ఏ తప్పునైనా దిద్దడం సులభం. అలా దిద్దకుండా వదిలేస్తే వాళ్లు పదే పదే ఆ తప్పు చేస్తారు. దానికి అలవాటు పడి పోతారు. ఆ స్థితికి చేరుకున్నాక వాళ్లను మార్చడం అంత తేలిక కాదు. కాబట్టి బాబును ఇప్పుడే మార్చండి. - డా.పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్