మాది వాటర్ విజన్...
l గ్రేటర్లో తాగునీటికి అత్యంత ప్రాధాన్యం
l ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తాం..
l జూన్ నుంచి రోజూ నీళ్లిచ్చేందుకు యత్నం
l మంత్రి కేటీఆర్ వెల్లడి
సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించాలన్న ముఖ్యమంత్రి సంకల్పం మేరకు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, ప్రతి రోజూ నీటి సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తాగునీటికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సకాలంలో వర్షాలు కురిస్తే ఈ ఏడాది జూన్ నుంచి గ్రేటర్ నగరంలో రోజూ నీటి సరఫరా చేస్తామన్నారు. నగరవాసులకు స్వచ్ఛమైన తాగునీరందించేందుకు రూ.1900 కోట్ల హడ్కో నిధులతో శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, 1800 కి.మీ మార్గంలో తాగునీటి పైప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గురువారం కేపీహెచ్‌బీ ఫేజ్–4, హుడా మియాపూర్, నల్లగండ్ల, గోపన్‌పల్లి ప్రాంతాల్లో జలమండలి ఆధ్వర్యంలో ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్) నిర్మించిన భారీ స్టోరేజి రిజర్వాయర్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వీటిలో 12 రిజర్వాయర్లను, 1200 కి.మీ మేర పైప్‌లైన్ పనులను నిర్దేశిత గడువుకంటే 11 నెలల ముందుగానే పూర్తిచేసిన జలమండలి ఎండీ ఎం.దానకిశోర్, ఇతర అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జూన్ నాటికి మరో 44 రిజర్వాయర్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు.
ఈ సందర్భంగా మియాపూర్‌లో బహిరంగ సభలో ఆతరవాత నల్లగండ్లలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నగరవాసులకు ఒక్కొక్కరికీ నిత్యం 150 లీటర్ల తాగునీటిని (లీటర్పర్ క్యాపిట డైలీ)అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నగరంలో 160 బస్తీలకు రోజూ నీటిసరఫరా అందిస్తున్నామన్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డుకు లోపలున్న 187 గ్రామపంచాయతీలు,7 నగరపాలక సంస్థలకు రూ.628 కోట్ల అంచనావ్యయంతో రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
నగరానికి మంజీరా నీటిసరఫరా నిలిచిపోవడంతో గోదావరి జలాలను పటాన్చెరు, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలకు తరలించేందుకు ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఆనుకొని రూ.400 కోట్ల అంచనా వ్యయంతో 48 కి.మీ మార్గంలో రింగ్‌మెయిన్ పైప్‌లైన్ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ పనులకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. ఎండాకాలం వచ్చిందంటే గతంలో విద్యుత్‌కోతలు, నీటి కష్టాలతో జనం విలవిల్లాడేవారని..ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద ఖాళీ కుండలతో ఆందోళనలు..పోలీసుల లాఠీఛార్జీ వంటి ఘటనలు చోటుచేసుకునేవని..తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ వ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాతోపాటు మంచినీటి సరఫరాను గణనీ యంగా మెరుగుపరిచామని స్పష్టంచేశారు.
అన్నదాతలకు సైతం పగటి వేళల్లో 9 గంటలపాటు నాణ్యమైన కరెంట్ సరఫరా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రజల కనీస ప్రాథమిక హక్కు అయిన మంచినీటిసరఫరాకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టామన్నారు. ఈరెండు పథకాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి సకాలంలో ఇంటింటికీ నల్లా ఏర్పాటుచేస్తామని కేటీఆర్ తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో నగరానికి తరలిస్తున్న నీటిలో 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు తరలించి పారిశ్రామిక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో జలమండలికి రూ.1400 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.1000 కోట్లు మేర బడ్జెట్ కేటాయించడం చరిత్రలో ఇదే ప్రథమం అన్నారు. వీటికి అదనంగా రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో నగరంలో మూసీ సుందరీకరణ, తీరైన రహదారులు, పార్కులు, వాక్‌వేల అభివృద్ధికి సరికొత్త ప్రణా ళికలు అమలు చేస్తున్నామన్నారు. రాజధాని నగరాన్ని క్లీన్ అండ్‌గ్రీన్ నగరంగా..నేరాలకు తావులేని రీతిలో సేఫ్ అండ్స్మార్ట్సిటీగా అభివృద్ధిచేస్తామని ప్రకటించారు.
గ్రేటర్‌పరిధిలో సీవరేజి మాస్టర్‌ప్లాన్ అమలుకు రూ.11 వేల కోట్ల నిధులు అవసరమని..ఈ స్థాయిలో నిధులు వెచ్చించడం ఇప్పట్లో సాధ్యపడదని మంత్రి స్పష్టంచేశారు. మంచినీటి సరఫరాకే అధిక ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. నగరంలో 398 కి.మీ మేర విస్తరించిన నాలాల్లో నెలకొన్న 12 వేల అక్రమనిర్మాణాలను దశలవారీగా తొలగిస్తామని..చెరువులను కాలుష్యకాసారంగా మారకుండా, కబ్జాల పాలు కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మురికివాడలకు ఉచితంగా నీళ్లిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. అంతకుముందు కూకట్పల్లి ఉషా ముళ్లపూడి వద్ద నూతనంగా నిర్మించిన నాలా బ్రిడ్జిని ప్రారంభించారు. నల్లగండ్ల, మల్కం చెరువులను పరిశీలించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు.
కేశవాపూర్భారీ రిజర్వాయర్‌కు త్వరలో టెండర్లు..
రాజధాని హైదరాబాద్ నగర జనాభా భవిష్యత్‌లో ఐదు రెట్లు పెరిగినప్పటికీ నగర తాగునీటి అవసరాలకు ఢోకా లేకుండా శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లో రూ.7700 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల గోదావరి నీటినిల్వ సామర్థ్యంతో భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ పనులకు అవసరమైన అటవీ, ఇతర భూములను సేకరిస్తామన్నారు. ఈపనులకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.
జలమండలికున్న 40 శాతం మేర ఉన్న సరఫరా నష్టాలను తగ్గించుకోవడం ద్వారా స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. నల్లాలకు మీటర్ల ఏర్పాటు, లీకేజీల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ పాల్గొన్నారు.