dma
-
కార్పొరేట్ సంస్థలకు కళ్లెం
ప్రభుత్వాల హవా తగ్గి కార్పొరేట్లు, గుప్పెడుమంది వ్యక్తులు రాజ్యాన్ని శాసించే స్థితి ప్రపంచమంతటా వచ్చి చాన్నాళ్లవుతోంది. ఇలాంటి స్థితిలో డిజిటల్ మార్కెటింగ్ చట్టం (డీఎంఏ) ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెరికన్ బడా టెక్ సంస్థలు యాపిల్, మెటా (ఫేస్బుక్)లకు భారీయెత్తున జరిమానా విధించి యూరోపియన్ యూనియన్ (ఈయూ) కొంత సాహసాన్ని ప్రదర్శించిందనే చెప్పాలి. యాపిల్ సంస్థకు 57 కోట్ల డాలర్లు (రూ. 4,868 కోట్లుపైగా), మెటా సంస్థకు దాదాపు 23 కోట్ల డాలర్లు (రూ. 1,965 కోట్లు) ఈయూ పెనాల్టీ విధించింది. వచ్చే జూన్ చివరికల్లా యాపిల్ ఈయూ నిబంధనలకు భిన్నంగావున్న తన యాప్ స్టోర్ నిబంధనల్లో సవరణలు చేయకపోతే రోజువారీ జరిమానాలు మొదలవుతాయి. మెటా సంస్థ నిరుడు ఈయూ నోటీసు అందుకున్నాక దారికొచ్చి యాప్ స్టోర్‌లో మార్పులు తెచ్చింది. అందువల్ల పాత తప్పులకు మాత్రమే జరిమానా పడింది. ఈయూ తమపై కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నదని ఆ రెండు సంస్థలూ ఆరోపిస్తున్నాయి. నిజానికి ఈ రెండు సంస్థలకు విధించిన జరిమానాలూ చాలా తక్కువన్న అభిప్రాయం యూరప్ ప్రజల్లోవుంది. మ్యూజిక్ స్ట్రీమింగ్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ నిరుడు యాపిల్ సంస్థకు 205 కోట్ల డాలర్ల (రూ. 17,500 కోట్లపైమాటే), మెటా సంస్థకు 90 కోట్ల డాలర్ల (రూ. 7,685 కోట్లకుపైగా) జరిమానాలు విధిస్తున్నట్టు ఈయూ ప్రకటించింది. ఏడాదిగా ఆ సంస్థల వివరణను పరిశీలించే పేరిట తాత్సారం చేసి చివరకు తుది తీర్పు ప్రకటించింది. ఆ సంస్థలు మాత్రం ఇది కూడా అన్యాయమేనన్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నాయి.వర్తమాన పరిస్థితుల్లో ఈయూ ఈ స్థాయి జరిమానాలు విధించటం ఒకరకంగా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిష్ఠించాక లెక్కలు మారిపోయాయి. సర్వరోగ నివారిణిగా ఆయన అధిక సుంకాల మోతమోగిస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రత్యేకించి అమెరికన్ టెక్ కంపెనీల జోలికి ఎవరొచ్చినా తాట తీస్తామంటున్నారు. మొన్న ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన కృత్రిమ మేధ సదస్సు సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈయూపై బాహాటంగానే అక్కసు వెళ్లగక్కారు. ఏఐ ప్రగతిని అడ్డుకునేలా యూరప్ వ్యవహ రిస్తున్నదని, అమెరికా బడా సంస్థలను అతిగా నియంత్రించే పోకడలు మానుకోవాలని హెచ్చరించారు. ఆయన ప్రత్యేకించి డీఎంఏ, డిజిటల్ సర్వీసెస్ చట్టం (డీఎస్ఏ)లను ప్రస్తావించారు కూడా. జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) సైతం తమకు సమ్మతం కాదని తెలిపారు. యూరప్ దేశాల్లో నిబంధనలు తమ వ్యాపార విస్తరణకూ, లాభార్జనకూ ఆటంకం కలిగిస్తున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నట్టు వాన్స్ వివరించారు. ఈ పోకడల్ని సహించబోమన్నారు. ఇదంతా గుర్తుంచుకుంటే ఈయూ తాజా నిర్ణయంలోని ఆంతర్యమేమిటో బోధపడుతుంది. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు ఏటా కోట్లాది డాలర్లు పన్నుల రూపంలో చెల్లిస్తున్న తమ బడా సంస్థలంటే అమెరికాకు అభిమానంవుండొచ్చు. కానీ ఆ సంస్థలు రకరకాల నిబంధనల పేరిట సాధారణ వినియోగదారుల్ని పీల్చి పిప్పి చేస్తున్నా, దివాలా తీయిస్తున్నా వేరే దేశాల వారెవరూ మాట్లాడకూడదని ట్రంప్, వాన్స్ భావించటం తెంపరితనం తప్ప మరోటి కాదు. యాపిల్ యాప్ స్టోర్‌లో లభించే మ్యూజిక్ యాప్ తదితరాలపై అధికంగా వసూలు చేస్తున్నారని భావించే వినియోగదారులు నేరుగా తమ వద్ద కొనుగోలు చేయొచ్చని చెప్పే డెవలపర్ల సందేశం కనబడకుండా, ఆ యాప్‌కు నేరుగా తీసుకెళ్లే లింక్‌లు పనిచేయకుండా యాపిల్ నిరోధిస్తున్నది. ఇక మెటా అయితే తన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లభ్యమయ్యే యాప్‌లు కావాలంటే వినియోగదారుల వ్యక్తిగత డేటా ఉపయోగించుకోవటానికి అనుమతించాలని షరతు విధిస్తోంది. అంగీకరించనివారికి ఆ యాప్‌లలో వాణిజ్య ప్రకటనలు కనబడేలా చేస్తోంది. అవి వద్దనుకుంటే నెలవారీ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. సాంకేతికతలు ఎంతగానో విస్తరించిన ఈ తరుణంలో బడా కార్పొరేట్ సంస్థలు వాటిపై ఆధారపడకతప్పని స్థితి జనాలకు కల్పించి చెల్లిస్తారా... చస్తారా అన్నట్టు పీక్కుతింటున్నాయి. ఈ స్థితిలో కీలెరిగి వాతపెట్టిన చందాన డీఎంఏ రంగప్రవేశం చేసింది. టెక్ కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడితే ఆ సంస్థల ప్రపంచ టర్నోవర్‌లో 10 శాతం, పదే పదే ఆ తప్పులు చేస్తూ పోతే ప్రపంచ టర్నోవర్‌లో 20 శాతం మేర జరిమానాలు విధించాలని చట్టం నిర్దేశిస్తోంది. కార్పొరేట్ సంస్థలకు వాతలుపెట్టి అనవసరంగా ట్రంప్ ఆగ్రహాన్ని చవిచూడటమెందుకని ఈయూ జంకుతున్న వైనం తాజా నిర్ణయంలో స్పష్టంగా కనబడుతోంది. వాటిపై చర్య తీసుకుంటున్నామన్న అభిప్రాయం యూరప్ ప్రజల్లో కలగాలి... అదే సమయంలో ట్రంప్ చేత చీవాట్లు తినకుండా, ఆయనగారిని మరీ నొప్పించకుండా గండాన్ని గట్టెక్కాలి అని ఈయూ భావిస్తోంది. అయితే మనకన్నా ఈయూ ఎంతో నయం. గుత్తాధిపత్య వ్యాపార ధోరణులను అరికట్టడానికున్న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కఠినంగా ఉండలేకపోతున్నది. గూగుల్ సంస్థ పోకడలను అరికట్టడంలో ఎంతో కొంత విజయం సాధించినా అది చాలినంతగా లేదు. వినియోగదారులూ, స్థానిక పరిశ్రమలూ నిలువుదోపిడీకి గురికాకుండా... టెక్ సంస్థలైనా, మరే ఇతర సంస్థలైనా ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకు కావలసిన చట్టాలు తీసుకురావాలి. అనారోగ్యకర వ్యాపార పోకడలపై కఠినచర్యలుండాలి. బడా కార్పొరేట్ సంస్థలు తమ లాభాలను అపారంగా పెంచుకోవటం, అవి ప్రభుత్వాల్ని శాసించే స్థితికి ఎదగటం ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది. అందుకే ఈయూ చర్యల్ని స్వాగతించాలి. -
ఢిల్లీలో వీకేండ్ కర్ఫ్యూ
-
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: భారత్‌లోనూ రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. వరసగా 8వ రోజు కేసుల సంఖ్య పెరిగింది. దేశ రాజధానిఢిల్లీలో ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతంగా వ్యాపిస్తూ ఉండడంతో శని, ఆదివారాల్లో కర్ఫ్యూ విధించాల ని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్టుగా ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం తెలిపారు. బస్సులు, మెట్రో రైళ్లు తిరిగి 100 శాతం సామర్థ్యంతో పని చేస్తాయన్నారు. బస్సులు, మెట్రోల కోసం వేచి చూసే వారు సూపర్ స్ప్రెడర్లుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.37%కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటూ ఉండడంతో కరోనా సోకింది. మరోవైపు పంజాబ్ రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలన్నీ మూసివేసింది. సినిమా హాల్స్, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. యూపీలో జనవరి 15 వరకు విద్యాసంస్థలను మూసివేశారు. 1892కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు గత 24 గంటల్లో దేశంలో 37,379 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య 1,892కి చేరుకుంది. -
పాలకుల పాపం.. అధికారులకు శాపం!
- నగర పాలక సంస్థ అభివృద్ధి పనుల్లో అక్రమాలు - గత ఏడాది 172 పనులపై విచారణ - విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్న డీఎంఏ - బాధ్యులైన అధికారులపై వేటు పడే అవకాశం - పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి..బలవుతున్న అధికారులు అనంతపురం న్యూసిటీ : అనంతపురం నగర పాలక సంస్థలో పాలకులు చేస్తున్న పాపాలు అధికారుల మెడకు చుట్టుకుంటున్నాయి. పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి తీసుకున్న నిర్ణయాల కారణంగా అధికారులు బలయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గత ఏడాది కార్పొరేషన్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో అక్రమాలపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు.. ప్రస్తుతం విచారణ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాధ్యులైన అధికారులపై వేటు పడే అవకాశాలున్నాయి. నగర పాలక సంస్థ ప్రస్తుత పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా అభివృద్ధి పనుల పేరిట రూ.70 కోట్ల వరకు ఖర్చు చేశారు. వీటిలో గత ఏడాది చేపట్టిన పనులు వివాదాస్పదమయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో సోమనారాయణ కమిషనర్‌గా ఉన్నప్పుడు రూ.3 కోట్ల బిల్లులను తెరపైకి తెచ్చారు. ఆయన రిలీవ్ కాగానే వాటిని ఒక్కసారిగా రూ.10 కోట్లకు పెంచారు. దీనిపై ఈ ఏడాది జనవరి 10న ‘సాక్షి’ దినపత్రిక ‘డబ్బుల్ పనులు’ శీర్షికతో కథనం ప్రచురించింది. 134 టెండర్ పనులకు రూ.4 కోట్ల 25 లక్షల 95 వేల 247, అలాగే 59 నామినేషన్ పనులకు రూ.87,67,998లు, 158 డిపార్ట్మెంటల్ పనులకు రూ 2 కోట్ల 59 లక్షల 38 వేల 753, బాక్స్ టెండర్లకు సంబంధించి 281 పనులకు రూ.2.55 కోట్ల బిల్లులు పెట్టిన విషయాన్ని కథనంలో పేర్కొంది. అప్పటి కమిషనర్ సురేంద్రబాబు సైతం రూ.2 కోట్ల దొంగ బిల్లులు ఉన్నాయని మీడియా సమావేశంలోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ కోన శశిధర్ బిల్లులను ఆపాలని, మొత్తం పనులపై విచారణ చేపట్టాలని పబ్లిక్‌హెల్త్ ఎస్ఈ శ్రీనాథ్ రెడ్డిని ఆదేశించారు. అయితే..నగర పాలక సంస్థ అధికారులు 172 పనులకు సంబంధించిన రికార్డులను మాత్రమే ఎస్ఈకి అప్పగించారు. వాటిపై విచారణ చేపట్టిన ఎస్ఈ జిల్లా కలెక్టర్‌కు ఈ ఏడాది మార్చిలో నివేదికను అందజేశారు. కలెక్టర్ ఆ నివేదికను డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ)కు 15 రోజుల క్రితం పంపించారు. బిల్లుల్లో చాలావరకు ‘బోగస్’ అనే విషయాన్ని విచారణ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నామినేషన్, డిపార్ట్మెంటల్ పనులు అత్యవసర నిమిత్తమే చేయాల్సి ఉండగా.. నిబంధనలను ఎలా ఉల్లంఘించారన్న విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ విషయంపై డీఎంఏ కన్నబాబు కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటూ మూడు, నాలుగు రోజుల్లో ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని నగర పాలక సంస్థ వర్గాలు అంటున్నాయి. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పాలకుల ఒత్తిళ్లతోనే తాము చేయాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. అలాగే వేటు నుంచి తప్పించుకునేందుకు కొందరు ఇప్పటికే ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. -
నీటి చౌర్యానికి ఇక అడ్డుకట్ట
న్యూఢిల్లీ: నీటి చౌర్యానికి ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) ఇక అడ్డుకట్ట వేయనుంది. ఇందులోభాగంగా ఆయా ప్రాంతాలకు సరఫరా అవుతున్న నీరు, బిల్లు రూపంలో లెక్కలోకి వస్తున్న నీటి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ‘కొత్త వ్యవస్థలో భాగంగా జిల్లా మీటరింగ్ ఏరియా (డీఎంఏ)లను ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాం తాలకు సరఫరా అవుతున్న నీటి పరిమాణంపై నిఘా ఉంచుతాం. మీటర్ల ద్వారా సరఫరా అవుతు న్న నీటి పరిమాణం లెక్కల్లోకి వస్తుందన్నారు. అయితే ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా కోసం ఏర్పాటుచేసిన కనెక్షన్లలను కూడా ఇకమీదట పరిగణనలోకి తీసుకుంటాం. ఇందువల్ల ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలిసిపోతుంది. తద్వారా ఎంత నీరు చౌర్యానికి గురవుతున్నదనే విషయం కూడా తేలిగ్గా అర్థమవుతుందన్నారు. చౌర్యానికి గురవుతున్న నీటిని నాన్ రెవెన్యూ వాటర్ (ఎన్ఆర్డబ్ల్యూ) కింద తాము పరిగణిస్తామన్నారు. ఢిల్లీలాంటి మహానగరంలో ఎన్ఆర్డబ్ల్యూ అనేది అత్యంత కీలకమైనదన్నారు. ఇటువంటి నగరాల్లో ప్రజలకు అవసరమైన నీటి పరిమాణం, సరఫరాల మధ్య వ్యత్యాసం ఎంతో ఉంటుందన్నారు. ఆ డిమాండ్‌ను అందుకోవడం అంత తేలికైన విషయం కాదన్నారు. ద్వారక లాంటి కీలక ప్రాంతాలు కూడా నీటి కొరతతో సతమతమవుతున్నాయన్నారు. ముడి జలాల కొరతే ఇందుకు కారణమన్నారు.ముడిజలాల కోసం పరిసర రాష్ట్రాల్లోని జలాశయలపై ఆధారపడక తప్పడం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో 11 నుంచి 12 శాతం నీరు సరఫరా సమయంలో వథా అవుతుందన్నారు. ట్యాం కులు నిండిపోయిన సమయంలో కూడా నీరు వృ థా అవుతుందని, మరో 40 శాతం జలాలు చౌర్యానికి గురవుతున్నాయన్నారు. డీజేబీ గణాంకాల ప్రకారం నగరానికి ప్రతిరోజూ 1,080 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. అయితే ఆయా జలశుద్ధీకరణ కేంద్రాల్లో ప్రతిరోజూ 850 మిలియన్ గ్యాలన్లనీటిని సంబంధిత సిబ్బంది శుద్ధి చేస్తారు. అయితే శుద్ధి చేసి సరఫరా చేస్తున్న జలాల్లో సగం మేర కూడా రాబడి రావడం లేదు. ఆయా ప్రాంతాల్లో డీఎంఏలను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించామన్నారు. నగరంలో 5.25 లక్షల ఆటోమేటిక్ మీటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి.2015 నాటికి వీటి సంఖ్యను ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలకు పెంచాలనేది తమ లక్ష్యమన్నారు. కొంతమంది వినియోగదారులకు రెండు కనెక్షన్లు కూడా ఉన్నాయన్నారు. అందులో ఒకటి మీటర్ కలిగినది కాగా మరొకటి మీటర్ లేనిదని అన్నారు. ఈ తరహా వినియోగదారులు అనేకమంది ఉన్నారన్నారు. నిరుపేదలు నివసించే కాలనీల్లోనే కాకుండా ధనవంతులు జీవించే ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు.