రూ.1.23 కోట్లకు ఎసరు !
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ధాన్యం కొనుగోలులో జిల్లా పౌర సరఫరాల సంస్థ కుంభకోణానికి పాల్పడింది. ఐకేపీ (ఇందిర క్రాంతి పథం), జిల్లా మార్కెంటింగ్ సొసైటీ, మిల్లర్లు, జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారులు సిండికేట్‌గా ఏర్పడి ప్రభుత్వ నిధులు స్వాహా చేసేందుకు ప్రయత్నించారు. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)విధానంలో రైతు తన సొంత ఖర్చుతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి చేర్చాలి. అక్కడి నుంచి మిల్లులకు రవాణా చేయడానికి పౌరసరఫరాల సంస్థ ఓ కాంట్రాక్టరును ఏర్పాటు చేయాలి.
దాన్యం రవాణా చేసినందుకు ఆ కాంట్రాక్టరుకు పౌర సరఫరాల సంస్థ డబ్బు చెల్లిస్తుంది. అయితే పౌర సరఫరాల సంస్థ అధికారులు రైతులతోనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించకుండా నేరుగా మిల్లులకు రవాణా చేయించారు. ఆ తరువాత కాంట్రాక్టరే ఆ ధాన్యాన్ని రవాణా చేసినట్టుగా రికార్డుల్లో చూపారు. ఇలా మొత్తం 1,35,909 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రవాణా చేశారని, ఆ కాంట్రాక్టరుకు రూ.1.23 కోట్లు చెల్లించాలని బిల్లులు పెట్టారు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే... రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం 21 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఐకేపీ 11, జిల్లా మార్కెటింగ్ సొసైటీ 10 కేంద్రాలను మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేశాయి. గత అక్టోబరు నుంచి ఈ రబీ సీజను పూర్తయ్యే వరకు బాపట్ల, పొన్నూ రు, పిడుగురాళ్ల, తెనాలి, వినుకొండ తదితర మార్కెట్‌యార్డుల్లో 1,35,909 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. తొలిదశలో ధాన్యం మార్కెట్‌యార్డుకు రావాలి. పొలం నుంచి కొనుగోలు కేంద్రానికి ధాన్యం చేర్చడానికి అయ్యే ఖర్చును రైతే భరించాలి.
కొనుగోలు కేంద్రానికి చేరిన ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ నియమించిన కాంట్రాక్టరు మిల్లుకు తరలిస్తే, ఆ రవాణా ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది.
అయితే పౌరసరఫరాల సంస్థ అధికారులు బినామీ కాంట్రాక్టరును సృష్టించి, అతనే కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు ధాన్యం రవాణా చేసినట్టు రికార్డులు సృష్టించారు. ఇలా మొత్తం ఎనిమిది నెలల కాలంలో 1,35,909 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేశాడని, బస్తాకు రూ.14 చొప్పున రూ.1.23 కోట్లు రవాణా చార్జీలు చెల్లించాలని బిల్లులు పెట్టుకున్నారు. నగదు చెల్లింపులకు రంగం సిద్ధమైన తరుణంలో జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు అందాయి. రైతులను మోసం చేసి ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించేలా చేశారనీ అందులో పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారమే బిల్లులు...
ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారి రంగకుమారిని ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా, క్షేత్రస్థాయిలో జరిగింది తనకు తెలియదని, అందుకు అసిస్టెంట్ మేనేజరు (టెక్నికల్) ఆర్. వెంకట్రావ్ బాధ్యులని వివరించారు. ఈ విషయమై వెంకట్రావ్‌ను వివరణ కోరగా, నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు, రవాణా చార్జీల చెల్లింపులకు బిల్లులు చేసినట్టు తెలిపారు.
ముందుకురాని కాంట్రాక్టరు ..
అధికారులు చెబుతున్నట్టుగా 1,35,909 మెట్రిక్ టన్నుల ధాన్యం రవాణా చేసిన కాంట్రాక్టరు బిల్లులు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దాదాపు ఎనిమిది నెలలపాటు రవాణా చేసి బిల్లులు తీసుకోడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? ఎవరా కాంట్రాక్టరు? అతని పేరు, వివరాలు అడిగితే అధికారులు సమాధానం దాటవేస్తున్నారు.