దారి నేను తీరం తాను...
రెండక్షరాల కావ్యం ప్రేమ... రెండు హృదయాల స్పందన ప్రేమ
రెండు కళ్ల నిశ్శబ్ద సంభాషణ ప్రేమ... రెండు మనసుల గానం ప్రేమ.
అనంత శ్రీరామ్ తెలుగు ప్రేక్షక హృదయాలలో చెరగని ముద్ర వేశారు.
డైరెక్టర్ గౌతమ్‌మీనన్ నాగచైతన్య హీరోగా ‘సాహసమే శ్వాసగా సాగిపో’ చిత్రం కోసం ఒక ప్రేమ గీతం అనంత శ్రీరామ్‌ని రాయమన్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ చేశారు. ఈ పాటను తమిళంలో భారతియార్ రచించారు. ఆయన భాష చాలా ఉన్నతంగా ఉంటుంది. అంత ఉన్నతమైన భాష, అంత ఉత్తమమైన భావంతో రాస్తే బాగుంటుందని అనంత శ్రీరామ్‌తో అన్నారు దర్శకులు.
వెంటనే ఆయన ‘తాను నేను’ అనే మకుటాన్ని తీసుకుని పాట ప్రారంభించారు. లవ్‌సాంగ్స్ రాయాలంటే మనసు గురించి, ప్రేమ గురించి అద్భుతంగా తెలిసుండాలి. ‘యవ్వనంలో ఉన్న కుర్రాడికి జీవితంలో తాను ఇంతవరకు పొందని అనుభూతి, అపూర్వమైన, అద్భుతమైన ఒక భావం పొందబోతున్నానని ముందుగానే తెలుస్తుంటే ఆ భావమే ప్రేమ’ అన్నారు‡ఇంగ్లీషులో. మరికొంత వివరంగా చెప్పాలంటే ప్రేమలో పడ్డవారికి అన్నీ రివర్సే. కళ్లు మాట్లాడతాయి, పెదాలు వెతుకుతుంటాయి, మనసు స్పందిస్తుంది, ఆలోచిస్తుంది, కాని మెదడు మాత్రం నిశ్చేతనంగా ఉండిపోతుంది. అదే సైన్ ఆఫ్ లవ్, ప్రేమ ప్రారంభమైందని అర్థం. అంత లోతుగా ‘సాహసమే శ్వాసగా సాగిపో’ చిత్రానికి ‘తాను నేను.. ’ అంటూ రాశారు అనంతశ్రీరామ్.
ఈ పాటలో అద్భుతమైన కవిత్వం ఉంది. ఆ పాట నాకు గొప్పగా నచ్చింది. ఎత్తుగడే తాను నేను మొయిలు మిన్ను అన్నాడు. మొయిలు అంటే మేఘం. మేఘానికి వికృతి అది. అంటే ఆకాశంలాంటి నేను, నాలో చెలరేగే ఊహాతీతమైన తీపి భావ సంఘర్షణ ప్రేమ మేఘంలా నాలో పరచుకుంది. నిజంగా ఎంత ఆకాశానికైనా మేఘమే అందం. ఆ వెండి మబ్బులో ఉన్న అందమే అది. ఎలాంటివారి హృదయానికైనా అది అందమే. అలా ప్రారంభించి వెంటనే కిందకు దిగిపోయాడు. నేను అతి చిన్న కొలనుని. ఆ బుజ్జి కొలనులో విరబూసిన కలువ తాను. అందుకని కలువ కొలను అన్నాడు.
తరవాత ప్రేమను పైరు చేను అన్నాడు. అంటే భూమి. తాను ఒక చేను అంతే. దానిలో పచ్చగా పల్లవించిన ప్రేమ తాను. అంటే పైరులాంటిది అన్నాడు. అద్భుతం. ఆ తరవాత నేను మామూలు చెట్టుని కాని అందులో పచ్చగా పల్లవించిన ప్రేమ తాను. అంటే పైరులాంటిది అన్నాడు. ఆ తరవాత– నేను మామూలు చెట్టు్టనే. చెట్టును నిలబెట్టే వేరు తాను. శశి తానైతే నిశి తాను అన్నాడు. అంటే ఎంత రాత్రికైనా అద్భుతమైనది వెన్నెల. ఆ వెన్నెలను ఇచ్చేది చంద్రుడు. చంద్రుడు తానైతే, నేను రాత్రిని అన్నాడు.
మామూలు మొక్కను నేను, నాలో విరబూసిన కుసుమం తాను అన్నాడు. అంతటితో ఆగలేదు. మామూలు కాగడాను నేను అందులో నుంచి వచ్చే వెలుగు దివ్వె తాను అన్నాడు. అంటే వెలుగు తాను అన్నాడు. తాను తెలుగుభాష అయితే అందులోని తీయదనం తాను. తెలుగు భాషయితే అందులో నుంచి పుట్టిన తియ్యదనం తాను. దారి నేను, దూరం తాను అన్నాడు,
వేరైపోనీ పుడమి మన్ను అన్నాడు. మట్టిని భూమిని విడదీయలేం. పుడమి మన్ను వేరైపోయినా మా ప్రేమ ఆగదు... అంటూ గొప్పగా ముందుకెళ్లాడు.
ఈ పాటను అద్భుతం చేసిన తీరు ముఖ్యంగా ఆ భాష, భావం... ఈ రెండింటిలో హిమాలయాల్లో ఉన్నంత ఔన్నత్యం ఉంది. హిందూ మహాసముద్రంలో ఉన్నంత లోతు ఉంది. దూకే జలపాతంలో ఉండే భావావేశం ఉంది. విస్ఫోటనమవుత్ను అగ్ని పర్వతంలా ఉంది భావావేశం. ఉద్రేకం, యవ్వనంలో ఉండే అనుభూతి ఉంది. పంచభూతాల సాక్షిగా రాసుకున్న పాటలా ఉంది ఈ పాట.
– సంభాషణ: డా. వైజయంతి
తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను
శశి తానైతే నిశినే నేను
కుసుమం తావి తాను నేను
వెలుగు దివ్వె తెలుగు తీపి
తాను నేను మనసు మేను
దారి నేను తీరం తాను
దారం నేను హారం తాను
దాహం నేను నీరం తాను
కావ్యం నేను సారం తాను
నేను తాను రెప్ప కన్ను
వేరై పోనీ పుడమి మన్ను
తాను నేను మొయిలుమిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను గానం గమకం
తాను నేను ప్రాయం తమకం
తాను నేను మొయిలు మిన్ను
తాను నేను కలువ కొలను
తాను నేను పైరు చేను
తాను నేను వేరు మాను
శశితానైతే నిశినే నేను
కుసుమం తావి తాను నేను
వెలుగుదివ్వె తెలుగు తీపి
తాను నేను మనసు మేను