భద్రతకు ప్రాధాన్యం
♦ డీఐజీ అకున్ సబర్వాల్
♦ శంకర్పల్లి పోలీస్‌స్టేషన్ సందర్శన
శంకర్పల్లి: గ్రామాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, దీంట్లో భాగంగానే శంకర్పల్లి, చేవెళ్ల, షాబాద్ పోలీస్స్టేషన్లను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కలపనున్నామని డీఐజీ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. శంకర్పల్లి పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని 15 పోలీస్స్టేషన్లను కూడా త్వరలో సైబరాబాద్ కమిషనరేట్‌లో కలపనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మరో రెండు రోజుల్లో వెలువడనున్నాయని చెప్పారు.
హెచ్ఎండీఎ పరిధిలోని పోలీస్స్టేషన్లను సైబరాబాద్ కమిషనరేట్‌లో కలపడం ద్వారా ప్రజలకు మరింత భద్రత కల్పించడానికి వీలవుతుందని దాంతోపాటు స్టేషన్‌కు వచ్చే బాధితులకు వెంటనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా సైబరాబాద్ పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి రూరల్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లు పరిశీలించారన్నారు. స్టేషన్ విస్తీర్ణత, సిబ్బందికి కావల్సిన సదుపాయలు, నివాసాలు, కేసుల వివరాలు, పురోగతి వివరాలు తీసుకున్నామన్నారు. అయితే కొంతమంది సిబ్బందికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వెళ్లడానికి ఇష్టం ఉందో..? లేదా అనే విషయమై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అభిప్రాయాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కలపడం ద్వారా సిబ్బంది పెరుగుతారని, సౌకర్యాలు కూడా కల్పిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్లలోకన్నా.. సైబరాబాద్ పోలీస్స్టేషన్లలో నిబంధనలు కొంచెం వేర్వేరుగా ఉంటాయన్నారు. సైబరాబాద్‌లో అమలయ్యే ప్రతి నిబంధన ఇక్కడ అమలు చేస్తామన్నారు. ఆయన వెంట రూరల్ ఎస్పీ నవీన్‌కుమార్, డీఎస్పీ స్వా మి, సీఐ ఉపేందర్, ఎస్ఐలు సంతోష్, రామేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.