breaking news
Deputy Chief chinarajappa
-
ఇసుక మాఫియాను నియంత్రించండి
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆదేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష కర్నూలు: రాజకీయ ఒత్తిడులు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఇసుక మాఫియాను కట్టడి చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి చినరాజప్ప, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై ప్రచారం చేసి పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ మేరకు గురువారం చీఫ్ సెక్రటరీ టక్కర్‌తో కలిసి విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ, జేసీ హరికిరణ్, మైనింగ్ ఏడీ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇసుక మాఫియా గ్రూపులను పూర్తిస్థాయిలో నియంత్రించి ఉచితంగా ఇసుక పంపిణీ చేయడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక బాగా లభ్యమయ్యే ప్రదేశాల్లో రీచ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టాలన్నారు. పర్యావరణం దెబ్బతినకండా వీలైనన్ని అధిక రీచ్‌లు ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు ఇసుక ఇబ్బందులు తీర్చాలని ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, ఇసుక మాఫియా నియంత్రణ, సీజ్ చేసిన వాహనాలు, నమోదు చేసిన కేసులపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టక్కర్ అన్ని జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 9 చెక్‌పోస్టులు గుర్తించామన్నారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు ఇసుక రీచ్‌లు ఉన్నట్లు సీఎస్ దృష్టికి తెచ్చారు. -
5 వేలమంది పోలీసుల నియామకానికి రంగం సిద్ధం
డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆత్రేయపురం: రాష్ట్రంలో 5వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించేందుకు రంగం సిద్ధమైందని, సంబంధిత ఫైల్ సీఎం చంద్రబాబు వద్ద ఉందని డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో మండల టీడీపీ అధ్యక్షుడు ముళ్లపూడి భాస్కరరావు ఇంట జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో టూరిజం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అరటికి గిట్టుబాటు ధర కల్పించేందుకు తన వంతు ప్రయత్నిస్తానన్నారు. ఆలమూరు వద్ద గోదావరిలో పడి మృతిచెందిన కుటుంబాలకు త్వరలో పరిహారం అందిస్తామన్నారు.