breaking news
Debt relief and three farmers suicide
-
కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్నాం..
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామానికి చెందిన రైతు మచ్చల ఈరన్న అప్పుల బాధ భరించలేక 2017 అక్టోబరు 18న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని భార్య శ్యామల, నలుగురు పిల్లల జీవితం వేదనా భరితంగా మారింది. ప్రభుత్వం నుంచి చంద్రన్న బీమా సహా ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో చెప్పడానికి కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్న శ్యామల, నలుగురు పిల్లల వేదనా భరిత జీవితమే నిదర్శనం. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మా సొంతూరు జాలిమంచి. పదేళ్ల క్రితం ఈరన్నతో పెళ్లి అయింది. నా భర్త పేరు మీద 3 ఎకరాల భూమి ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సకాలంలో వర్షాలు కురవడంతో పంటలు బాగా పండాయి. మా కాపురం ఎంతో సంతోషంగా కొనసాగింది. మాకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. మా అమ్మ, నాన్న, అత్త, మామ చనిపోయారు. నా భర్త సొంత భూమితోపాటు మరికొంత భూమి కౌలుకు తీసుకుని సేద్యం చేశారు. అతివృష్టి, అనావృష్టి కల్లోలం రేపడంతో పెట్టుబడి పెట్టడం తప్ప రాబడి లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం ఉల్లి, పత్తి వేశాం. వానలు ఎక్కువై పంటలు పోయాయి. తెలిసిన వారి దగ్గర చేసిన అప్పు రూ. 3 లక్షలతో పాటు ఆదోని ఆంధ్రా బ్యాంకులో తీసుకున్న అప్పు రూ.1.5 లక్షలు కట్టలేక పోయాం. పోయినేడు వానలే లేవు. మా పొలంలో సాగు చేసిన పత్తి దిగుబడి విత్తనాల ఖర్చుకు కూడా రాలేదు. గర్భవతిని కావడంతో తొమ్మిదో నెలలో పుట్టినిల్లు జాలిమంచిలో మా చిన్నాన్న ఇంటికి పురిటికి వెళ్లాను. ఒంటరిగా ఉన్న నా భర్త ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చనిపోయిన వారంలో మగ పిల్లోడు పుట్టాడు. నెలలోపే దొడ్డనగేరికి వచ్చేశాను. విఆర్ఓ సురేష్ వివరాలు సేకరించుకు వెళ్లారు. ఏడాది దాటినా ఒక్క పైసా సాయం అందలేదు. ఈ ఏడు తీవ్ర కరువు వచ్చింది. మా పొలంలో పత్తి వేసినా దిగుబడి పెద్దగా రాలేదు. బోరు బావుల కింద కూడా పంటలు లేవు. ఉపాధి పనులు పెట్టలేదు. కూలి పనికి పిలిచే వారు కూలీలుగా మారారు. వారానికి రెండు రోజులు కూడా కూలి పనులు దొరకటం లేదు. డీలరు వేసే బియ్యంతో నెలలో సగం రోజులు ఒక పూట గడచిపోతోంది. మిగిలిన రోజుల్లో కూలి పనులు దొరికితే ఒక పూట కడుపు నింపుకుంటున్నాం. లేదంటే మంచి నీళ్లతోనే ఆకలిని సంపుకుంటున్నాం. ప్రభుత్వం ఏదో ఒక రోజు ఆదుకుంటుందన్న ఆశతోనే రోజులు వెళ్లదీస్తున్నా..’ – కె.బసవరాజు, సాక్షి, ఆదోని, కర్నూలు జిల్లా -
ముగ్గురు రైతుల ఆత్మహత్య
సాక్షి నెట్వర్క్: అప్పుల బాధ తాళలేక వేర్వేరు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టకు చెందిన రైతు నక్క కుమారస్వామి(40) కూతురి పెళ్లి కోసం, పంటల కోసం రూ. 4 లక్షల అప్పు చేశాడు. పంటలు ఎండిపోవడంతో అప్పు ఎలా తీర్చాలనే బెంగతో ఈ నెల 5న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురానికి చెందిన కౌలు రైతు మిలుకూరి శశికుమార్(28) గతేడాది మిర్చి మీద రూ. 4 లక్షల వరకు అప్పులయ్యాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోతుండడంతో మనస్తాపం చెందాడు. సోమవారం పురుగులు మందు తాగాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వాలు తండాకు చెందిన మహిళా రైతు దీరవత్ చాందీ(50) పంటల పెట్టుబడి కోసం కొంత అప్పు చేసింది. పొలం ఎండిపోవడంతో చాందీ మనస్తాపం చెంది గుళికల మందు తాగింది.