‘ఉపాధి’ హామీ ఎక్కడ?
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ‘ఉపాధి’ దొరికిందని సంబరపడ్డారు. నాలుగు డబ్బులు వస్తాయన్న ‘హామీ’ ఉందని ఆశపడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకున్నారు. పొట్టకూటి కోసం మండే ఎండలను తట్టుకున్నారు. చెమటోడిస్తే నాలుగువేళ్లు నోట్లోకెళ్తాయని భావిం చారు. మిట్టమధ్యాహ్నం వరకు కష్టపడి పనిచేశారు. పచ్చనోటుతో ఇంటికి వెళ్తామనుకున్న వారు వట్టి చేతుల్తో ఇంటిముఖం పడుతున్నారు. పనులు చేసినా కూలి డబ్బు అందక పస్తులుంటున్నారు. గత నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
ప్రభుత్వం ఆల స్యంగా డబ్బులు విడుదల చేసినా వాటి చెల్లిం పుల్లో అడ్డంకులు కూలి బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. వలసలను నివారించి ఎక్కడి వారికి అక్కడే ఉపాధి కల్పిం చాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్) వారికి నిరుపయోగంఆ మారింది. జిల్లాలో ఈ పథకం కూలీల బతుకుల్లో వెలుగు నింపలేకపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 2.5 లక్షల కుటుంబాలకు సంబంధించి 4.50 లక్షల కూలీలకు సగటున కుటుంబానికి 46 రోజులు చొప్పున పనిదినా లు కల్పించారు. రూ. 130.35 కోట్లు వేతనాలుగా చెల్లించారు. వీరి లో 17,403 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని కల్పిం చేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయి తే ప్రణాళికా లోపం కారణంగా ఈ లక్ష్యం పూర్తి కాలేదు.
నాలుగు నెలలుగా వేతనాలు లేవు
జిల్లాలో గత నాలుగు నెలలుగా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసిన వారికి వేతనాలు చెల్లించలేదు. చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మార్గదర్శకాలు కూలీల కు ప్రతిబందకాలుగా మారుతున్నాయి. పథకంలో అక్రమాలను నిరోధించడానికి కూలీల వేలి ముద్రలను సేకరించే ప్రక్రియను చేపట్టారు. ఫలితంగా రెండు నెలలు చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ ప్రక్రియ కొన్నిచోట్ల పూర్తయినప్పటికీ చాలా మంది వేలి ముద్రలు సరిపోవడం లేదు. దీంతో వారికి చెల్లింపులు జరగడం లేదు. ఈ లోపాలు కారణంగా గత నాలుగు నెలలుగా కూలీలకు జీతాలు ఇవ్వడం లేదు. అలాగే ప్రభుత్వం కూడా సక్రమంగా నిధులను విడుదల చేయడం లేదు. డబ్బులు కోసం కూలీలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితంగా ఉండడం లేదు. ఇటీవలే ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసినప్పటికీ చెల్లింపుల విషయంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి.
పీడీ లేకపోవడంతో పర్యవేక్షణ లోపం
ఉపాధి హామీ పథకంలో భాగంగా లక్షల మంది ఉపాధి కల్పించడంతో పాటు వేల కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. అంతటి ప్రా ముఖ్యమైన పథకానికి ప్రాజెక్టు డెరైక్టర్ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. గతంలో డుమా పీడీగా పనిచేసిన సత్యసాయి శ్రీనివాస్‌కు బదిలీ అయింది. ఆయన స్థానంలో ఇప్ప టి వరకు ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. గత ఆరు నెలలుగా ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఫలితంగా ఇన్ఛార్జ్ పీడీగా జిల్లా పరిషత్ సీఈ ఓ డి.వెంకటరెడ్డి వ్యవహరిస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేని కారణంగా పథకం తీరు తెన్నులు అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటి వరకు ఎంత మేర జీతాలు చెల్లించాలి, ఎంత వరకు చెల్లించారో అధికారులే స్పష్టంగా చెప్పలేకపోతుండడం గమనార్హం. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్ది కూలీలకు సక్రమంగా వేతనాలు చెల్లించని పక్షంలో జిల్లాలో వలసలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.