breaking news
Cuts Rates
-
దశాబ్దం కనిష్టానికి కోటక్ మహీంద్రా గృహ వడ్డీ
ముంబై: పండుగల సీజన్లో గృహ రుణ మార్కెట్లో వాటా పెంచుకోవడమే ప్రధాన ధ్యేయంగా ప్రైవేటు రంగంలోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ విభాగంలోని వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గృహ రుణ వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గింది. దీనితో ఈ రుణ రేటు 6.50 శాతం నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ‘ఈ గృహ రుణ రేటు దశాబ్దపు కనిష్ట స్థాయి’ అని కన్జూ్యమర్ అసెట్స్ ప్రెసిడెంట్ అంబుచ్ చందన తెలిపారు. అయితే ఆ ఆఫర్ రెండు నెలలు అంటే నవంబర్ 8వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అత్యధిక క్రెడిట్ స్కోర్ కలిగిన ఉద్యోగులకు మాత్రమే దిగువ స్థాయి రుణ రేటు ఆఫర్‌ను అందిస్తున్నట్లు వివరించారు. బ్యాంక్ గృహ రుణ విభాగం మంచి పనితీరును కనబరుస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
సొంతింటి కల : ఐసీఐసీఐ గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: సొంత ఇల్లు కొనుగోలుచేయాలనుకునే వారికి దేశీయ అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంకు ఐసీఐసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. గృహరుణాలపై వడ్డీ రేటును 6.7 శాతంగానిర్ణయించింది. సవరించిన వడ్డీ రేటు, ఈ రోజు(మార్చి 5, శుక్రవారం) నుండి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఆ తగ్గింపు రేటు అందుబాటులో ఉంటుందని బ్యాంకు ప్రకటించింది. దీంతో హోమ్లోన్లపై బ్యాంకు వసూలుచేస్తున్న వడ్డీరేటు పదేళ్ల కనిష్ఠానికి దిగి రావడం విశేషం. గృహ రుణాల కోసం వినియోగదారులు రూ.75 లక్షలలోపు రుణాలపై వడ్డీరేటు 6.7 శాతంగా ఉంటుంది. రూ.75 లక్షలకు మించినరుణాలపై వడ్డీరేటు మాత్రం 6.75 శాతం నుంచి మొదలవుతుందని ఐసీఐసీఐ సెక్యూర్డ్ అసెట్స్ హెడ్ రవి నారాయణన్ చెప్పారు. గత కొన్ని నెలలుగా గృహాలను కొనాలనుకునే సంఖ్య పెరుగుతోందని, డిమాండ్ తిరిగి పుంజుకుంటున్న నేపథ్యంలో తక్కువ వడ్డీ రేట్లతో వినియోగదారుల సొంత ఇంటి కల నెర వేర్చేందుకు ఇది సరైన సమయంగా తాము భావిస్తున్నామన్నారు. -
ఆర్బీఐ వరమిచ్చినా..
ముంబై: అంచనాలు, విశ్లేషణలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6% నుంచి 5.75%కి తగ్గింది. రెపో రేటు తగ్గించడం జనవరి నుంచీ ఇది మూడవసారి. రెండు నెలలకోసారి జరిగే సమీక్షలో గడిచిన ఆరు నెలల్లో మూడు సార్లు 0.25% చొప్పున రేటును ఆర్బీఐ తగ్గిస్తూ వస్తోంది. తాజా రేటు తగ్గింపుతో రెపో తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లయింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రేటు కోత నిర్ణయం తీసుకుంది. ఇక ముందూ రేటు తగ్గిస్తామనే సంకేతాలను ఇస్తూ, పాలసీ విధానాన్ని ‘తటస్థం’ నుంచి ‘మార్పునకు వీలైన సరళ వైఖరికి’ మార్చింది. ఏంటీ రెపో... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపోగా వ్యవహరిస్తారు. గడిచిన ఆరునెలల్లో ఇది ఏకంగా 0.75 శాతం తగ్గింది. ఇలా తగ్గటం వల్ల ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చౌక వడ్డీకే నిధులు లభ్యమవుతాయి. అప్పుడు బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. అలా చేసినా వాటి లాభాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడదు. కానీ ఇక్కడే జరగాల్సింది సరిగా జరగడం లేదు. స్వయంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఈ విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50% రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం తగ్గింపును మాత్రమే కస్టమర్లకు బదలాయించాయి. అది కూడా కొత్తగా రుణాలు తీసుకునే వారికి మాత్రమే ఈ ప్రయోజనాన్ని అందజేశాయి. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04%. ఈ విషయంపై తాను బ్యాంకర్లతో మాట్లాడతానని కూడా ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. రుణాల్లో వృద్ధే ప్రధాన లక్ష్యంగా తాజా పాలసీ సమీక్ష, నిర్ణయాలు జరిగినట్లు తెలిపారు. రేటు తగ్గింపు పరిస్థితులు చూస్తే... బ్యాంకులకు తగ్గించిన రేటు ప్రయోజనం... సాధారణ వినియోగదారు నుంచి పరిశ్రమల వరకూ అందినప్పుడు అది వ్యవస్థలో రుణ రేటు తగ్గుదలకు తోడ్పడుతుంది. రుణాలపై వడ్డీ తక్కువ కనక రుణాలు ఎక్కువ తీసుకుంటారు. ఇది వృద్ధి మెరుగుదలకు దోహదపడుతుందనేది క్లుప్తంగా ఆర్థిక విశ్లేషణ. ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిపోయింది. మందగమనం చోటు చేసుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో... రెపో రేటు తగ్గింపునకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. ఆ అంశాలను పరిశీలిస్తే... ► అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్బీఐ నిర్దేశిత శ్రేణి 2%కి అటు ఇటుగా 4 శాతం వద్దే కొనసాగుతున్నాయి. ► మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణి పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే మార్చిలో క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది. తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి. వాహన రంగం రివర్స్‌గేర్‌లో ప్రయాణిస్తోంది. ► గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (208–19, జనవరి–మార్చి) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయి 5.8 శాతానికి పడిపోయింది. వాహన, ఆటో, గృహ రుణ రేట్లు తగ్గే చాన్స్... బ్యాంకులు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని గనక వినియోగదారులకు బదలాయిస్తే... దీనికి అనుసంధానమయ్యే వాహన, ఆటో, గృహ రుణాలపై కస్టమర్ నెలవారీ చెల్లించే వాయిదా మొత్తం (ఈఎంఐ) తగ్గుతుంది. కొత్త రుణాలకు సైతం వడ్డీ రేట్లు తగ్గుతాయి. మరోవంక డిపాజిట్లపై చెల్లించే వడ్డీని కూడా బ్యాంకులు తగ్గించేస్తాయి. అసంఘటిత రంగమే అత్యధికంగా ఉండే మన దేశంలో చాలామంది రిటైరైన తరవాత సరైన ఆదాయం కోసం వడ్డీపైనే ఆధారపడుతుంటారు. అలాంటి వారికి ఈ వడ్డీ తగ్గింపులు అశనిపాతం లాంటివే. కొన్నాళ్లుగా బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే... ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే అవి డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించేస్తున్నాయి. అదే స్పీడులో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించటం లేదు. దీనివల్ల బ్యాంకుల లాభాలు పెరుగుతాయి తప్ప కస్టమర్లకు ఒరిగేదేమీ ఉండదు. బ్యాంకుల ఈ వైఖరి వల్ల వృద్ధి రేటు వచ్చే మూడేళ్లు కూడా పెద్దగా పెరిగేదేమీ ఉండకపోవచ్చనేది రేటింగ్ ఏజెన్సీల అంచనా. పాలసీ ప్రధానాంశాలు... ► రెపో రేటును పావుశాతం తగ్గించడం వరుసగా ఇది మూడవసారి. ఇంతక్రితం వరుసగా రెండు దఫాలుగా తగ్గిన అరశాతంసహా తాజా పావుశాతం తగ్గింపుతో ఈ రేటు 5.75 శాతానికి దిగివచ్చింది. ఇది తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయి. ► రివర్స్ రెపో రేటు 5.50 శాతంగా ఉంది. ► మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6%. ► పాలసీ వైఖరిని ‘తటస్థం’ నుంచి ‘తగిన విధం గా మార్చుకునే సరళ విధానం’ వైపు మార్పు. ► జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు. ► ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 3 నుంచి 3.1 శాతం శ్రేణిలో ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ రేటు 3.4–3.7 శ్రేణిలో ఉంటుంది. ► వర్షపాతం విషయంలో అనిశ్చితి, క్రూడ్ ఆయి ల్ ధరలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలు ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతాయి. ► డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చార్జీల రద్దు. ► బ్యాంకులు విధించే ఏటీఎం చార్జీలు, ఫీజుల సమీక్షకు కమిటీ నియామకం. ► నిర్దిష్టకాల పరిమితితో సంబంధం లేకుండా, ఎప్పటికప్పుడు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల లైసెన్సుల జారీకి సంబంధించి ఆగస్టు నాటికి ముసాయిదా మార్గదర్శకాల జారీ. ► పెట్టుబడుల్లో తీవ్ర మందగమనం, ప్రైవేటు వినియోగ వృద్ధి నెమ్మదించడం వంటి అంశాలపై ఆందోళన. ► పావుశాతం రేటు తగ్గింపునకు సానుకూలంగా మొత్తం ఆరుగురు సభ్యుల ఏకగ్రీవ ఓటు. ► జూన్ ప్రారంభంనాటికి వ్యవస్థలో సగటు రోజువారీ ద్రవ్యలభ్యత రూ.66,000 కోట్లు. ► దేశంలో మే 31వ తేదీ నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 421.9 బిలియన్ డాలర్లు. ► మొండిబకాయిల పరిష్కారం దిశలో 3, 4 రోజుల్లో కొత్త నిబంధనలు ► ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల సవాళ్లను ఎదుర్కొనడంలో సహకారం. ► తదుపరి విధాన సమీక్ష ఆగస్టు 7. బ్యాంకర్లూ... మీరెంతో చేయాలి! ఆర్బీఐ రేటు తగ్గించినా... ఆ ప్రయోజ నాన్ని బ్యాంకర్లు వ్యవస్థలోకి బదలాయించకపోవడంపట్ల గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు మరెంతో చేయాల్సి ఉందని ఆయన సూచిం చారు. పాలసీ అనంతరం శక్తికాంతదాస్ పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూస్తే... ‘‘గతంలో ఆర్బీఐ పాలసీ రేటు తగ్గింపు నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రభావం వ్యవస్థలో ప్రతిబింబించడానికి నాలుగు నుంచి ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50 శాతం రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం కస్టమర్లకు బదలాయించాయి. కొత్త రుణ గ్రహీతలకే ఈ మొత్తం ప్రయోజనం దక్కింది. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04% మాత్రమే. రేటు తగ్గింపు ప్రయోజనం మరింతమేర, మరింత వేగంగా అందాలన్నది మా అభిప్రాయం. వినియోగదారులకు, ద్విచక్ర వాహన గ్రహీతలకు అందరికీ ఈ ప్రయోజనం అందాలి. రేటు ప్రయోజనం బదలాయింపు ఏ మేర జరుగుతోందన్న విషయాన్ని ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రేటు ప్రయోజనం ఎంతో కీలకం. బ్యాంకులతో ఈ విషయంపై చర్చిస్తాం. చేయాల్సినదంతా చేస్తాం. ఏప్రిల్‌లో పావుశాతం రేటు తగ్గించాం. అయితే కొన్ని బ్యాంకులు కేవలం 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల రేటు కోత నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే మరింత రేటు ప్రయోజన బదలాయింపు జరగాలి. రుణ డిమాండ్, ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు ఇది ఎంతో అవసరం’’ – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ -
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంచలన నిర్ణయం
లండన్ : బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలసీ సమీక్ష నిర్వహించిన ఇంగ్లండ్ కేంద్ర బ్యాంకు వడ్డీ రేటులో 0.25 శాతం మేర కోత పెట్టింది. దీంతో ప్రామాణిక వడ్డీ రేటు 0.25 శాతానికి చేరింది. సహాయక ప్యాకేజీకింద 10 బిలియన్ పౌండ్లతో యూకే కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్టు గురువారం వెల్లడించింది. మానిటరీ పాలసీ రివ్యూ నిర్వహించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మార్క్ కార్నేఈ వివరాలను ప్రకటించారు. సుదీర్ఘ కాలం తరువాత 2009 తరువాత మొట్టమొదటి సారి వడ్డీ రేట్లు కట్ చేసింది. మార్కెట్ అంచనాలను అనుగుణంగా తన ముఖ్య లెండింగ్ రేటు తగ్గించింది. వడ్డీరేట్లను0.5 శాతం నుంచి 0.25 శాతానికి తగ్గించింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 2016 సం.రంలో ఆర్థిక స్థిరంగా ఉంటుందని, అయితే వచ్చే ఏడాదంతా బలహీనమైన వృద్ధి ఉండనుందని సెంట్రల్ బ్యాంక్ వ్యాఖ్యానించింది. దీంతోపాటు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగిన పరిణామాలనుంచి బయటపడడానికి 60 బిలియన్ పౌండ్ల ప్రభుత్వం రుణం కొనుగోలు చేయనున్నట్టు చెప్పింది. జూన్ 23 బ్రెగ్జిట్ పరిణామంతో స్టెర్లింగ్ పౌండ్ విలువ భారీ పతనం, గణనీయింగా పెరిగిన ద్రవ్యోల్బణం కారణాలతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటుగా కొన్ని కొత్త పథకాలను ప్రకటించింది. బ్యాంకుల స్థిరీకరణ కోసం వంద బిలియన్ పౌండ్లు, పది బిలియన్ పౌండ్ల కార్పొరేట్ బాండ్ల కొనుగోలు తదితర అంశాలను ప్రకటించింది. కాగా ఆర్థిక వేత్తల సహా, పోర్బ్స్ కూడా కార్పొరేట్ రుణ కొనుగోళ్లకు వ్యతిరేకంగా స్పందించారు. 2009 సం.రం తరువాత మొట్టమొదటి వడ్డీరేట్లలో కోత పెట్టిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు కేంద్ర బ్యాంక్ ప్రకటనతో పౌండ్ విలువమరింత క్షీణించింది. ఒక శాతానికిపైగా నష్టపోయింది.