breaking news
commercial offices
-
ఆఫీస్ స్పేస్ డిమాండ్ అంతంతే
ముంబై: వాణిజ్య కార్యాలయ స్థలాల లీజు (ఆఫీస్ స్పేస్) మార్కెట్లో డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్తబ్దుగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. 32–34 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజు నమోదు కావచ్చని పేర్కొంది. అదే సమయంలో, దేశీయంగా వాణిజ్య రియల్టీ మార్కెట్లో ఉన్న సహజ బలాలు, ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చి పని చేస్తుండడం అన్నవి మధ్య కాలానికి భారత్‌లో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్‌ను పెంచుతాయని తెలిపింది. దేశీ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు 42–45 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. బహుళజాతి సంస్థలకు చెందిన అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (జీసీసీ) సైతం గడిచిన కొన్ని సంవత్సరాల్లో కిరాయిదారులకు కీలక విభాగంగా మారినట్టు తెలిపింది. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్లో జీసీసీల వాటా మూడింట ఒక వంతుగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఆఫీస్ స్పేస్ నికర లీజు పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు అంశాల వల్ల ప్రభావితమవుతుంది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో నికర ఉద్యోగుల నియామకాలు నిలిచాయి. ఆదాయం తగ్గి, లాభదాయకతపై ఒత్తిళ్ల నెలకొన్నాయి. ఈ రంగం వ్యయ నియంత్రణలపై దృష్టి సారించొచ్చు. యూఎస్, యూరప్‌లో స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో జీసీసీలు దేశీయంగా పెద్ద స్థాయి లీజింగ్ ప్రణాళికలను వాయిదా వేయవచ్చు’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి వివరించారు. దేశీయంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్, కల్సలి్టంగ్, ఇంజనీరింగ్, ఫార్మా, ఈ కామర్స్ విభాగాలు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో మిగిలిన వాటా ఆక్రయమిస్తాయని చెబుతూ.. వీటి నుంచి డిమాండ్ కారణంగా 2023–24లో 32–34 మిలియన్ చదరపు అడుగుల లీజ్ నమోదు కావచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. ఉద్యోగుల రాక అనుకూలం.. కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పని చేయాలని కోరుతుండడం ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్‌కు ప్రేరణగా క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు ఇంటి నుంచే పనికి వీలు కల్పించిన కంపెనీలు, ఇప్పుడు వారంలో ఎక్కువ రోజులు కార్యాలయాలకు రావాలని కోరుతుండడాన్ని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు కార్యాలయాలకు రాక 40 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65–70 శాతానికి చేరుతుందని వివరించింది. సమీప కాలంలో సమస్యలు నెలకొన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్ 10–12 శాతం వృద్ధితో 36–38 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డేరెక్టర్ సైనా కత్వాల తెలిపారు. మధ్య కాలానికి వృద్ధి ఇదే స్థాయిలో ఉంటుందన్నారు. తక్కువ వ్యయాల పరంగా ఉన్న అనుకూలత, నైపుణ్య మానవ వనరుల లభ్యత నేపథ్యంలో జీసీసీలు ఆఫీస్ స్పేస్ లీజు మార్క్‌ను ముందుండి నడిపిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ఎంఎంఆర్‌లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ 2023 మార్చి నాటికి 705 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు తెలిపింది. ఆసియాలోని ప్రముఖ పట్టణాలతో పోలిస్తే భారత్‌లోని పట్టణాల్లోనే సగటు ఆఫీస్ స్పేస్ లీజు ధర తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. -
పెద్ద భవనాల్లో నీటిశుద్ధి ప్లాంట్లు
సాక్షి, ముంబై: పరిశ్రమలు, వాణిజ్య కార్యాలయాలు, నివాస సముదాయాల్లో (నీటిని శుద్ధి చేసి పునర్వినియోగానికి అనువుగా తీర్చిదిద్దడం) రీసైక్లింగ్ వాటర్ప్లాంట్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) భావిస్తోంది. ముంబైలో రోజురోజుకూ నీటి వినియోగం తీవ్రతరమవుతోంది. జలాశయాల్లో మాత్రం తగినన్ని నీటి నిల్వలు లేకపోవడంతో సరఫరాలు అరకొరగానే ఉంటున్నాయి. భవిష్యత్‌లో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చేందుకు ఆస్కారముందని గ్రహించిన బీఎంసీ ప్రత్యామ్నాయాల అన్వేషణలో పడింది. రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుపై గతంలోనే అనేక ప్రకటనలు చేసింది. ప్రజల నుంచి తగినంత స్పందన రాకపోవడంతో ఆ ఆలోచన మానుకుంది. ఈ విషయాన్ని ఇప్పడు తీవ్రంగా పరిగణిస్తున్న బీఎంసీ నీటిశుద్ధి ప్లాంట్లను ఏర్పాటును తప్పనిసరి చేయాలని అనుకుంటోంది. వీటి ప్రాధాన్యం గురించి అపార్టుమెంట్లు, భారీ భవనాల వాసులకు అవగాహన కలిగించాలని నిర్ణయించింది. ప్రతిరోజు ముంబైకర్లకు సరఫరా అవుతున్న దాంట్లో కేవలం 20-30 శాతం నీటిని తాగేందుకు వాడుతున్నారు. మిగతా 70-80 శాతం నీరు వివిధ అవసరాలకు వాడుతున్నట్లు బీఎంసీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో 50 శాతం నీటిని శుద్ధి చేసుకొని తాగడం మినహా ఇతర పనులకు వినియోగిస్తే భవిష్యత్‌లో నీటి కొరత సమస్య తలెత్తే ఆస్కారముండబోదని బీఎంసీ భావిస్తోంది. ముఖ్యంగా పరిశ్రమలు, వాణిజ్య, కార్పొరేట్ కార్యాలయాల్లో కొన్ని మాత్రమే ట్యాంకర్ల నీటిని ఇతర అవసరాలకు వాడుతున్నాయి. మెజారిటీ సంస్థలు బీఎంసీ సరఫరా చేస్తున్న నీటినే తాగేందుకు ఉపయోగిస్తున్నాయి. బాత్రూమ్లు, టాయ్లెట్లు, పరిశ్రమల్లో డయింగ్ పనులకు కూడా వినియోగిస్తున్నాయి. ప్రతిరోజు మిలియన్ లీటర్ల నీరు ఇలా వివిధ పనులకు వాడుకోవడంవల్ల జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. వేసవిలో నీటి కొరత తలెత్తడంతో గత్యంతరం లేక బీఎంసీ సరఫరాలో కోతలు విధిస్తోంది. ఇదిలా ఉండగా రెండు వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉండే కాలనీలు, లేదా 80కిపైగా కుటుంబాలు లేదా రోజుకు 60 వేల లీటర్ల నీరు సరఫరా అయ్యే కాలనీల్లో నీటిశుద్ధి ప్లాంటు ఏర్పాటును కచ్చితం చేయనున్నారు. భవనాల బెస్మెంట్లు లేదా డాబాలపై ఈ ప్లాంట్లు ఏర్పాట్లు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ.ఐదు లక్షల వరకు ఖర్చవుతుంది. వీటితో శుద్ధి చేసిన నీటిని తాగేందుకు మినహా స్నానాలకు, బాత్రూమ్లు, టాయిలెట్లో, వాహనాలు శుభ్రం చేసేందుకు, నేలను కడిగేందుకు, భవనాల ఆవరణలో ఉన్న ఉద్యానవనాల్లో వివిధ పనులకు వాడుకునేందుకు ఉపయోగించుకోవచ్చని బీఎంసీ పేర్కొంది.