breaking news
College selection
-
NEET 2021: నీట్ రాసారా.. ఇది మీ కోసమే!
నీట్–యూజీ–2021. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల(సెప్టెంబర్) 12న జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్ష! ఇందులో ర్యాంకు ఆధారంగా.. మెరిట్ లిస్ట్, ఫైనల్ కటాఫ్‌లను నిర్ణయించి.. ఆల్ ఇండియా కోటా.. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో కన్వీనర్ కోటా విధానంలో సీట్లు భర్తీ చేస్తారు!! నీట్ యూజీ ఈసారి క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు..పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు లభించే అవకాశం ఉందని భావించే విద్యార్థులు! మరోవైపు.. పరీక్ష సరిగా రాయలేక పోయామని.. ఆశించిన ర్యాంకు రాకపోవచ్చని ఆవేదన చెందే విద్యార్థులు! ఫలితాలు వెలువడటానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. నీట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిపుణుల సలహాలు.. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ 2021కు దాదాపు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నీట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 59,951 మంది, తెలంగాణ నుంచి 59,069 మంది దరఖాస్తు చేసుకున్నారు. ‘గత ఏడాదితో పోల్చితే నీట్ ఈసారి క్లిష్టంగా ఉంది. 450 మార్కులకు పైగా వచ్చిన వారికి సీటు లభించే అవకాశం ఉంది’ అని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్) 450 కంటే ఎక్కువ నీట్‌ను మొత్తం 720 మార్కులకు నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరై.. 450 కంటే ఎక్కువ మార్కులు వస్తాయని భావిస్తున్న విద్యార్థులు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలోని మెడికల్, డెంటల్ కళాశాలల వివరాలు తెలుసుకోవడంపై దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ఫలితంగా కౌన్సెలింగ్ సమయంలో ప్రాథమ్యాలుగా పేర్కొనాల్సిన కాలేజీలపై స్పష్టత వస్తుంది. కౌన్సెలింగ్‌కు సన్నద్ధం నీట్లో మెరుగైన ప్రతిభ చూపామని, సీటు ఖాయమని భావించే విద్యార్థులు.. కౌన్సెలింగ్‌కు సన్నద్ధమవ్వాలి. కౌన్సెలింగ్ సమయంలో అవసరమయ్యే అన్ని రకాల ధ్రువ పత్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తదితర ధ్రువ పత్రాలను వీలైనంత ముందుగా ఫలితాలు వెలువడేలోపు పొందేందుకు కసరత్తు చేయాలి. (ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు...) ముందుగా ఆల్ ఇండియా కోటా ప్రస్తుతం నీట్–యూజీ ప్రవేశాలను ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అనే రెండు విధానాల్లో నిర్వహిస్తున్నారు. ముందుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాలో.. అన్ని రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. వీటికి స్థానికత, పుట్టిన రాష్ట్రం తదితర అంశాలతో సంబంధం లేకుండా.. ఏ రాష్ట్ర విద్యార్థులైనా దరఖాస్తు చేసుకొని..ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. గతేడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం–ఆల్ ఇండియా కోటాలో దాదాపు 6,700 ఎంబీబీఎస్ సీట్లు; నాలుగు వేల బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కౌన్సెలింగ్ సమయానికి ఈ సంఖ్యలో మార్పులు,చేర్పులు జరిగే అవకాశముంది. (చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!) రాష్ట్రాల స్థాయిలో కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ముగిశాక.. రాష్ట్రాల స్థాయిలో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల హెల్త్ యూనివర్సిటీలు వేర్వేరుగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. వీటికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు పేర్కొన్న కాలేజ్, సీటు ప్రాథమ్యాలు; వారు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తారు. కాలేజ్ ఎంపిక ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల విషయంలో ఏ కాలేజ్‌లో సీటు వచ్చినా ఓకే అనుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కారణం..సీట్ల పరిమితే! కానీ నీట్లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కళాశాలలో చేరేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు నాణ్యమైన ఇన్స్టిట్యూట్లో చేరేలా ప్రాథమ్యాలను ఇవ్వాలి. ప్రత్యామ్నాయ మార్గాలు నీట్ పరీక్షను ఆశించిన విధంగా రాయలేదని భావిస్తున్న విద్యార్థులు.. ప్రత్యామ్నాయ కోర్సులవైపు దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీరు వైద్య అనుబంధ కోర్సులుగా పేర్కొనే ఆయుష్‌తోపాటు మరెన్నో కోర్సులను ఎంచుకోవచ్చు. ఆయుష్ కోర్సులూ నీట్‌తోనే ► ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు దక్కని విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఆయుష్ కోర్సులు. బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, యునానీ(బీయూఎంఎస్), బీఎన్‌వైఎస్ వంటి కోర్సులను పూర్తి చేసుకుంటే.. డాక్టర్ కల సాకారం అవుతుంది. ► ఆయుష్ కోర్సుల సీట్లను కూడా నీట్ స్కోర్ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత.. ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తెలంగాణలో కేఎన్ఆర్యూహెచ్ఎస్, ఏపీలో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు ఈ ప్రక్రియను చేపడతాయి. బీహెచ్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్ఎంఎస్).గత కొన్నేళ్లుగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటున్న కోర్సు ఇది. బీహెచ్ఎంఎస్ పూర్తి చేసిన వారికి ప్రస్తుతం అవకాశాలకు కొదవ లేదు. రోగుల్లో ఈ వైద్య విధానంపై ఆసక్తి పెరగడం, పలు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏపీలో నాలుగు కళాశాలల్లో,తెలంగాణలో అయిదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఏఎంఎస్ మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కళాశాలల్లో, తెలంగాణలో రెండు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉన్నత విద్యపరంగా ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. యునానీ (బీయూఎంఎస్) ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో కోర్సు.. బీయూఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎన్‌వైఎస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్.. బీఎన్‌వైఎస్. బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక కళాశాలలో అందుబాటులో ఉంది. బీవీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ). ఈ కోర్సు ద్వారా.. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. పౌల్ట్రీ ఫారాలు, పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు,వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ బీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అవకాశాలు అందించే మరో కోర్సు.. అగ్రికల్చర్ బీఎస్సీ. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లుగా కొలువులు దక్కించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో.. ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ(ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. హార్టికల్చర్ సైన్స్ బైపీసీ విద్యార్థులు బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్‌ను ఎంచుకోవచ్చు. వీరికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ వంటి వాటిల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎఫ్ఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్.. సంక్షిప్తంగా బీఎఫ్ఎస్సీ. బైపీసీ విద్యార్థులు ఈ కోర్సు ద్వారా చేపల పెంపకంపై ప్రత్యేక నైపుణ్యాలు పొందొచ్చు. వీరికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు. తెలంగాణలో పి.వి. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇతర కోర్సులు కూడా బైపీసీ విద్యార్థులు ఆసక్తి ఉంటే.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ అనస్థీషియా టెక్నాలజీ వంటి కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత నీట్ కౌన్సెలింగ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఆన్లైన్ కౌన్సెలింగ్, ఛాయిస్ ఫిల్లింగ్ విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ముందస్తు కసరత్తు ప్రారంభించాలి. నిర్దిష్టంగా కాలేజీ, కోర్సు విషయంలో స్పష్టత వచ్చాక.. దానికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలు పేర్కొనాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ పత్రాలు దగ్గర ఉండేలా చూసుకోవాలి. – డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి, వైస్ ఛాన్స్లర్, కేఎన్ఆర్యూహెచ్ఎస్ నీట్–2021– ముఖ్యాంశాలు ► జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌కు దాదాపు 16 లక్షల మంది హాజరు. ► దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో 83 వేలు, బీడీఎస్‌లో 27 వేల సీట్లు. ► నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం–ఏపీలో 5,210 ఎంబీబీఎస్ సీట్లు, తెలంగాణలో 5,240 ఎంబీబీఎస్ సీట్లు. ► గత ఏడాది హెల్త్ యూనివర్సిటీల నోటిఫికేషన్ గణాంకాల ప్రకారం– ఏపీలో 1440 బీడీఎస్ సీట్లు , తెలంగాణలో 1140 బీడీఎస్ సీట్లు. ► 450పైగా స్కోర్ వస్తుందనుకునే విద్యార్థులు కౌన్సెలింగ్‌కు సన్నద్ధంగా ఉండాలి. ► కౌన్సెలింగ్‌కు అవసరమైన అన్ని ధ్రువ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ► ఎంబీబీఎస్, బీడీఎస్‌కు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న ఆయుష్, ఏజీ బీఎస్సీ, బీవీఎస్సీ, ఫిషరీస్ తదితరాలు. -
ఎంబీఏ.. మెరుగైన కాలేజీ ఎంపిక ఎలా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐసెట్ ముగిసింది.. ఫలితాలు సైతం వెలువడ్డాయి. మరికొద్ది రోజుల్లో కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఐసెట్ ర్యాంకుతో ఎంబీఏలో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ఇప్పుడు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న.. మంచి కాలేజీని ఎంపికచేసుకోవడం ఎలా?! కాలేజీ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రమాణాలేంటి? ఈ క్రమంలో ఎంబీఏ కాలేజీ ఎంపికపై నిపుణుల సలహాలు... ఏఐసీటీఈ ప్రమాణాలు కళాశాల ఎంపికలో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు- ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ సంఖ్య, ఫ్యాకల్టీ అర్హతలు, ఫ్యాకల్టీ సైటేషన్స్, మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, ఈ-జర్నల్స్ సదుపాయం, అందుబాటులో ఉన్న రియల్ కేస్ స్టడీస్. * ఫ్యాకల్టీ - స్టూడెంట్ నిష్పత్తి: 1:15 * ఫ్యాకల్టీలో 80 శాతం మంది శాశ్వత ప్రాతిపదికన నియమితులై ఉండాలి. * ఫ్యాకల్టీ హోదాల పరంగా ప్రొఫెసర్; అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలు ఉండాలి. వీరి నిష్పతి 1:2:6గా ఉండాలి. * లైబ్రరీలో కనీసం ఆరు వేల జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ అందుబాటులో ఉండాలి. * వీటిలో 25 శాతం జర్నల్స్‌ను డిజిటైజేషన్ విధానంలో ఈ-జర్నల్స్గా అందుబాటులో ఉంచాలి. * కంప్యూటర్స్ పరంగా నలుగురు విద్యార్థులకు ఒక కంప్యూటర్ చొప్పున అందుబాటులో ఉండాలి. * ఇవన్నీ ఉంటేనే ఒక కళాశాలలో పరిపూర్ణమైన బోధన లభిస్తుందని ఏఐసీటీఈ అంచనా. ఫ్యాకల్టీ.. ప్లేస్‌మెంట్స్ ఎంబీఏ మొదటి సంవత్సరం అందరికీ కామన్‌గా ఉంటుంది. కాబట్టి రెండో సంవత్సరంలో స్పెషలైజేషన్‌కు అనుగుణంగా సంబంధిత అర్హతలున్న ఫ్యాకల్టీ వివరాలు తెలుసుకోవాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ప్లేస్‌మెంట్స్ పరంగా గత నాలుగేళ్ల సమాచారం సేకరించాలి. ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొంటున్న కంపెనీలు, వాటి ప్రొఫైల్స్, అవి ఆఫర్ చేసిన ఉద్యోగాలు తదితరాల గురించి తెలుసుకోవాలి. గత మూడేళ్ల కాలంలో కళాశాలలో ఉత్తీర్ణత శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బీటెక్ కళాశాలల్లో ఎంబీఏ వివిధ ఇంజనీరింగ్ కళాశాల్లో ఎంబీఏ కోర్సు కూడా ఉంది. ఒక రకంగా ఇది ఎంబీఏ విద్యార్థులకు అనుకూలమని చెప్పొచ్చు. కారణం.. బీటెక్ స్థాయిలో పేరున్న కళాశాలలకు ఇండస్ట్రీ వర్గాల గుర్తింపు ఉంటుంది. ప్లేస్‌మెంట్స్ పరంగా ఇవి ముందుంటాయి. ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించే ప్లేస్మెంట్లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులే కాకుండా.. ఎంబీఏ అభ్యర్థులు సైతం అవకాశాలు అందుకోవచ్చు. కాబట్టి ఇంజనీరింగ్ కోర్సులను ఆఫర్ చేసే కళాశాలలో ఎంబీఏ కూడా ఉంటే అది సానుకూల అంశమే! ప్రత్యక్ష పరిశీలన వివిధ సర్వే సంస్థలు కాలేజీలకు ఇస్తున్న ర్యాంకుల్లో తేడాలు ఉంటున్నాయి. వీటివల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి, అక్కడి సీనియర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం మేలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, కోర్సులను అందిస్తున్న కళాశాలల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లకు ప్రాధాన్యమిస్తున్న కళాశాలలపై దృష్టిసారించాలి. స్పెషలైజేషన్ కళాశాల ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో అంశం.. స్పెషలైజేషన్లు. ప్రస్తుతం అన్ని కళాశాలల్లో ప్రధాన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, సదరు స్పెషలైజేషన్‌కు సంబంధించి రియల్ కేస్ స్టడీస్ అందుబాటులో లేకపోవడం, కేస్ అనాలిసిస్ చేస్తూ బోధించే అధ్యాపకులు లేకపోవడం సమస్యగా మారింది. ఇలాంటి సమస్యలకు తావు లేని కళాశాలలను ఎంపిక చేసుకోవాలి. పరిశ్రమ వర్గాలతో ఒప్పందాలు కళాశాల ఎంపిక విషయంలో మరో ముఖ్యమైన అంశం.. పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలు. ఇలాంటి ఒప్పందాలున్న కళాశాలల ద్వారా ఆయా కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యల్ని ఫ్యాకల్టీ ద్వారా కేస్ అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఎంబీఏ కాలేజీలు ఇలాంటి ఏర్పాట్లపై దృష్టిసారిస్తున్నాయి. కొన్ని కళాశాలలకు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, ఫ్యాప్సీ తదితర మేనేజ్మెంట్ అసోసియేషన్స్‌తో సంబంధాలు ఉంటున్నాయి. ఇలాంటి వాటిని ఎంపిక చేసుకోవడం వల్ల క్షేత్రస్థాయి నైపుణ్యాలు లభిస్తాయి. ఐసెట్ 2015 గణాంకాల ప్రకారం.. ఏపీలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు కళాశాలలు: 384 సీట్లు: 45,965 తెలంగాణలో ఎంబీఏ కళాశాలలు, సీట్లు కళాశాలలు: 347 సీట్లు: 41,796 ఐసెట్ కౌన్సెలింగ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే కళాశాల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. చివరి ర్యాంకులు, వెబ్సైట్ సమాచారం, సర్వే రిపోర్టులకే పరిమితం కాకుండా.. ప్రత్యక్షంగా కళాశాలలను సందర్శించి వివరాలు తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో విద్యార్థులు కళాశాల ఎంపికతో పాటు రెండో సంవత్సరంలో తీసుకోవాల్సిన స్పెషలైజేషన్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. - ప్రొ॥ఓం ప్రకాశ్, టీఎస్ ఐసెట్ కన్వీనర్. గత కౌన్సెలింగ్ ‘చివరి ర్యాంకులు’ ఆధారంగా కళాశాలలపై ప్రాథమికంగా ఒక అంచనాకు రావొచ్చు. ఔత్సాహికులు తమ ప్రాథమ్యాల వారీగా కళాశాలలను ప్రత్యక్షంగా సందర్శించి, నిర్ణయం తీసుకోవడం మంచిది. కళాశాలల ఎంపికలో వాటికి పరిశ్రమ వర్గాలతో ఉన్న ఒప్పందాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదే విధంగా విద్యార్థులు కోర్సులో భాగంగా ఇంటర్న్షిప్స్, రియల్‌టైం ప్రాజెక్ట్వర్క్కు ప్రాధాన్యమివ్వాలి. - ప్రొ॥కట్టా రామమోహన్ రావు, ఏపీ ఐసెట్ కన్వీనర్.