breaking news
chintakindi Ganesh
-
వెండితెరపై చేనేత కార్మికుడి విజయగాథ
సాక్షి, భూదాన్‌పోచంపల్లి: ఓ సామాన్య చేనేత కార్మికుడి విజయగాథను వెండితెరపై ఆవిష్కరించడంతో చేనేత కళాకారుడి కష్టాలు, కళానైపుణ్యాలు మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. ఆసుయంత్ర సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత విజయగాథను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఆర్. రాజ్ మల్లేశం సినిమా రూపొందించగా, ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వర్గాల ఆదరణ పొందింది. సినిమా ఆసాంతం పోచంపల్లి మండలంలో నిర్మించడం విశేషం. చిత్ర యూనిట్ మూడు నెలల పాటు ఇక్కడే ఉండి రేవనపల్లి, శివారెడ్డిగూడెం, ఇంద్రియాల, జలాల్పురం గ్రామాల్లో నిరంతరాయంగా సినిమా షూటింగ్ చేశారు. చేనేత కార్మికుడి ఇతిబాధలు వాస్తవానికి దగ్గరగా ఉండేందుకు చేనేత కార్మికుల జీవనస్థితిగతులపై ఆధ్యయనం చేసి ఈ సినిమాను కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఆత్మహత్యలు వద్దనే సందేశంతో... ప్రస్తుతం చేనేతలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి కార్మికుడి శ్రమభారం తగ్గించి వస్త్ర ఉత్పత్తి పెంచిన ఆసుయంత్రం రూపకల్పనకు దారితీసిన పరిస్థితులు, కష్టాలను ఎదురీది సాధించిన విజయం, అప్పులబాధ వెంటాడిన ధైర్యంతో సమస్యలను అధిగమించాలని, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం చూపవని దర్శకుడు చేనేత కార్మికులకు సందేశాన్ని అందించారు. మెరిసిన స్థానికులు.. మల్లేశం సినిమాలో నటించేందుకు ఆసక్తి కల్గిన స్థానికులకు దర్శకుడు అవకాశం కల్పించాడు. పోచంపల్లికి చెందిన తడక రజని హీరో ప్రియదర్శ్‌కు అక్క పాత్రలో నటించింది. అలాగే తడక అతిథి లక్ష్మి, ఈపూరి వరుణ్‌సాయి హీరోకు మేనల్లుడి పాత్రలో నటించి మెప్పించారు. పోచంపల్లిలో పద్మశాలి, చేనేత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల సన్మానసభను ఏర్పాటుచేసి మల్లేశం చిత్ర యూనిట్‌కు సన్మానించారు. వెండితెరపై చేనేతలు.. ముప్పై ఏళ్ల క్రితమే శ్యామ్‌బెనగల్ దర్శకత్వంలో చేనేత నేపథ్యంలో ‘సుష్మాన్’ సినిమాను నిర్మించారు. మమ్ముట్టి హీరోగా మళయాల సినిమా, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’, నీలకంఠ దర్శకత్వంలో ‘మాయ’, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘గల్ఫ్’ చిత్రాలు చేనేత కార్మికులను తెరకెక్కించారు. ప్రభుత్వం కూడా ప్రముఖ సినీనటి సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మిఠాకూర్‌ను ఇక్కత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. గతేడాది జాతీయ చేనేత దినోత్సవం రోజున పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో ఫ్యాషన్‌షో నిర్వహించారు. పోచంపల్లికి చెందిన ప్రముఖ యాంకర్ అనసూయ పలువేదికలో ఇక్కత్ వస్త్రాలను ధరిస్తూ పోచంపల్లికి ఇక్కత్‌ను తనవంతుగా ప్రమోట్ చేస్తుంది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది మల్లేశం సినిమా ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇప్పటి వరకు సామాన్య చేనేత కార్మికుడి సినిమా రాలేదు. మొదటిసారిగా తన విజయగాథను తెరకెక్కించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆసుయంత్రం తయారు చేయడానికి పడిన కష్టాలు, చివరగా చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని చెప్పే సందేశం నచ్చింది. ఈ సినిమా ద్వారా చేనేత కార్మికుడికి గుర్తింపు వచ్చింది. చేనేత దినోత్సవం నిర్వహిస్తూ ప్రధాని మోదీ చేనేత కళాకారులకు గుర్తింపు తీసుకువచ్చారు. – చింతకింది మల్లేశం -
సంస్కరణల్లో ‘విద్యా’ భారతం!
చింతకింది గణేష్ - సాక్షి, హైదరాబాద్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చాక విద్యా రంగంలో అనేక మార్పులు వచ్చాయి.. అనేక సంస్కరణలు అమల్లోకి తెచ్చారు. ప్రధానంగా 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య, అందరికి సమాన అవకాశాలు లక్ష్యంగా ఎన్నెన్నో మార్పులకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. స్వాతంత్య్రం నాటికి దేశంలో అక్షరాస్యత 12.2 శాతమే.. ప్రస్తుతం అక్షరాస్యత 74.04 శాతంగా ఉంది. తొలుత సంపన్నుల కోసమే.. బ్రిటిష్ కాలంలో పాఠశాలలను గురుకులాలని పిలిచేవారు. అప్పట్లో అవి సంపన్నులకు, ఉన్నత సామాజిక వర్గాల వారి కోసమే పనిచేసేవి. తర్వాత బ్రిటిష్ వారు ఇంగ్లిషు మీడియం ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించారు. అలా 1947 నాటికి దేశవ్యాప్తంగా 1,34,866 స్కూళ్లను ప్రారంభించగా.. 1,05,25,943 మంది వరకు చదువుకున్నట్లు అంచనా. స్వాతంత్య్రానంతరం 6 నుంచి 16 ఏళ్ల వారికి ఉచిత విద్య అందించేలా చర్యలు చేపట్టారు. తర్వాత ప్రభుత్వాలు కూడా స్వల్ప మార్పులతో ఆ విధానాలను కొనసాగించాయి. అందులో భాగంగా వచ్చినవే డిపెప్, ఆపరేషన్ బ్లాక్ బోర్డు, సర్వ శిక్షా అభియాన్ వంటి ప్రతిష్టాత్మక పథకాలు. ప్రస్తుతం దేశంలో 14,25,564 పాఠశాలలు ఉన్నాయి. దేశంలోని అన్ని రకాల విద్యా సంస్థల్లో కలిపి 31.50 కోట్ల మంది చదువుతుండగా.. పాఠశాలల్లోనే 25,48,83,400 మంది అభ్యసిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలో 21 విశ్వవిద్యాలయాలు, 496 కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూనివర్సిటీల సంఖ్య ఏకంగా 761కి పెరిగింది. వాటి పరిధిలో 36,671 కాలేజీలు, 11,445 ప్రత్యేక విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. దేశంలో 1947కు ముందు 38 ఇంజనీరింగ్ కాలేజీలు, 53 పాలిటెక్నిక్ డిప్లొమా కాలేజీలు ఉండేవి. ప్రస్తుతం దేశంలో 3,345 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అవసరమైనా పెరగని వైద్య విద్య స్వాతంత్య్రం సమయంలో దేశవ్యాప్తంగా కేవలం 19 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ తర్వాత దేశ జనాభా భారీగా పెరిగినా.. అవసరానికి తగినట్లుగా వైద్య విద్య కాలేజీలు పెరగలేదు. ప్రస్తుతం దేశంలో 381 వైద్య విద్యా కాలేజీలు ఉన్నాయి. వాటి నుంచి ఏటా 30 వేల ఎంబీబీఎస్ విద్యార్థులు, 18 వేల మంది స్పెషలిస్టులు, మరో 30 వేల మంది ఆయుష్ కోర్సులు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తంగా 9.36 లక్షల మంది వైద్యులు ఉన్నట్లు అంచనా. 70 ఏళ్లలో కీలక మార్పులు దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా ఆజాద్.. ప్రాథమిక విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఉన్నత విద్యా విధానంలో మార్పులు తెచ్చేందుకు 1948-1949లో కేంద్రం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, 1952-1953లో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్లను ఏర్పాటు చేసింది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు నెహ్రూ ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లను నెలకొల్పింది. విద్యా విధానాల మెరుగుదల, అమలు కోసం జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలిని ఏర్పాటు చేశారు. 1968లో మొదటిసారిగా జాతీయ విద్యా విధానాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టారు. 14 ఏళ్లలోపున్న పిల్లలందరికీ తప్పనిసరిగా విద్యను అందించడం ప్రధాన లక్ష్యంగా దీనిని ప్రకటించారు. 1986లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ అందరికి సమాన విద్యా అవకాశాలు కల్పించడం లక్ష్యంగా మరో నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రాథమిక విద్యను నిరుపేదలకు మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకాన్ని చేపట్టారు. 1985లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఓపెన్ యూనివర్సిటీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వం 1986 జాతీయ విద్యా విధానంలో పలు సవరణలు చేసింది. 1994లో జిల్లా ప్రాథమిక విద్యా పథకం (డిపెప్) అమల్లోకి వచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల హాజరును పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తెచ్చారు. 2000 సంవత్సరంలో సర్వ శిక్షా అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. 2005లో నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్-2005 పేరుతో విద్యా బోధన, ఇతర విధానాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు.