breaking news
chilli seeds
-
ఈ ఏడాదీ ఆర్బీకేల్లో మిరప విత్తనం.. 35 కంపెనీలతో ఏపీ సీడ్స్ ఒప్పందం
సాక్షి, అమరావతి: ఏపీలో ప్రధాన వాణిజ్య పంట అయిన మిరప సాగు గత నాలుగేళ్లుగా పెరుగుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్తు నుంచి మార్కెటింగ్ వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా నాణ్యమైన దిగుబడులు పెరిగి, మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయి. దీంతో మిరప సాగుకు రైతులు ముందుకు వçస్తుండటంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గతంలో ప్రతి ఏటా మిర్చి రైతులకు బ్లాక్ మార్కెట్, అధిక ధరలు, నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాలు పెద్ద సమస్యగా ఉండేవి. రైతులను ఆర్థికంగా దెబ్బతీసేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విత్తనాలను అందించడం నుంచి పంటను అమ్ముకొనే వరకు రైతులకు అండదండగా నిలుస్తోంది. దీంతో విత్తనాలు, ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, నకిలీ, కల్తీల బారి నుంచి అన్నదాత బయటపడ్డాడు. ఈ ఖరీఫ్‌లో కూడా మిర్చి రైతులకు కల్తీ, నకిలీ విత్తనాలు, బ్లాక్ మార్కెట్ బెడద లేకుండా ఈ ఏడాది కూడా ఆర్బీకేల ద్వారా సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా విత్తనాల కంపెనీలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంటోంది. డిమాండ్ ఉన్న విత్తన రకాలను మార్కెట్లో అందుబాటులో ఉంచుతోంది. డీలర్లు అక్రమాలకు పాల్పడకుండా టాస్క్‌ఫోర్స్ బృందాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతులు సాధారణంగా మేలో విత్తనాలు కొని జూన్, జూలైలో నారుపోస్తారు. సాగు విస్తీర్ణంలో 30 శాతం ఓపీ (ఓపెన్ పొలినేటెడ్), 70 శాతం హైబ్రీడ్ విత్తనం వేస్తారు. సీజన్లో 2.57 కిలోల ఓపీ, 35 వేల కిలోల హైబ్రీడ్ విత్తనం అవసరం. ఓపీ విత్తనానికి ఢోకా లేకున్నప్పటికీ, హైబ్రీడ్ విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది 9 వేల ప్యాకెట్లు ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేశారు. వచ్చే ఖరీఫ్‌లో డిమాండ్ ఉన్న రకాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ సీడ్ యాక్టు కింద 35 విత్తన కంపెనీలతో ఏపీ సీడ్స్ ఎంవోయూ చేసుకుంది. అగ్రి ల్యాబ్స్‌లో జర్మినేషన్ టెస్ట్, నాణ్యతను పరీక్షించిన తర్వాతే ఆర్బీకేల ద్వారా కంపెనీలు నిర్దేశించిన ధరలకే రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. నకిలీ విత్తనాలు, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణకు టాస్క్‌ఫోర్స్ సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో విత్తనాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మేవారు, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ ద్వారా అధిక ధరలకు విక్రయించే డీలర్లు, వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ టీంలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జిల్లాలవారీగా వ్యవసాయ, ఉద్యాన శాఖల సిబ్బందితో ఏర్పాటు చేస్తున్న ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాయి. ఎవరైనా కల్తీ, నకిలీ విత్తనాలు విక్రయించినా, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటాయి. మరో వైపు నకిలీ నారు కట్టడికిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 50 శాతం మంది మార్కెట్లో కొన్న విత్తనాన్ని నారు కోసం షేడ్‌నెట్స్‌కు ఇస్తారు. మిగిలిన 50 శాతం రైతులు షేడ్‌నెట్స్ నుంచి నేరుగా నారు కొంటారు. నర్సరీలతో పాటు షేడ్‌నెట్స్‌ను కూడా నర్సరీ యాక్టు పరిధిలోకి తేవడంతో విధిగా సీడ్ రిజిస్టర్లు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. నారు అమ్మే ముందు నారుకు ఉపయోగించిన విత్తనం ఏ కంపెనీదో లాట్ నంబర్లతో సహా చెప్పాల్సి ఉంటుంది. నాణ్యమైన విత్తనం వాడలేదని తనిఖీల్లో తేలితే షేడ్‌నెట్స్ లైసెన్సులను రద్దు చేస్తారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణం రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో మిరప సాగవుతోంది. అత్యధికంగా పల్నాడులో 1.42 లక్షల ఎకరాలు, ప్రకాశంలో 91,347 ఎకరాలు, గుంటూరులో 67,500 ఎకరాల విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. గత సీజన్లో గుంటూరు మిర్చి యార్డులో క్వింటాలు ధర రూ.27వేలకు పైగా, వరంగల్‌లో ఏకంగా రూ.50 వేలకు పైగా పలికింది. దీంతో ప్రభుత్వ ప్రోత్సాహంతో పత్తి, వేరుశనగ రైతులు కూడా పెద్ద ఎత్తున మిరప వైపు మళ్లుతున్నారు. 2021–22 లో రికార్డు స్థాయిలో 5.62 లక్షల ఎకరాలు, 2022–23లో 5.77 లక్షల ఎకరాల్లో మిరప సాగైంది. రానున్న ఖరీఫ్‌లో మిరప సాగు విస్తీర్ణం 6 లక్షల ఎకరాలు దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. విత్తనం కొరత రానీయం రైతులకు సరిపడా హైబ్రీడ్ మిరప విత్తనాన్ని అందుబాటులో ఉంచుతున్నాం. డిమాండ్ ఉన్న విత్తన రకాలను రైతులకు అందిస్తాం. ఎక్కడైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్సులు కూడా రద్దు చేస్తాం. బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ ఆర్బీకేల ద్వారా విత్తనం సరఫరా విత్తనాల కోసం 35 కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నాం. సర్టిఫై చేసిన తర్వాతే ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తాం. గతేడాది 9 వేల ప్యాకెట్లు ఆర్బీకేల ద్వారా విక్రయించాం. ఈ ఏడాది కూడా డిమాండ్ ఉన్న హైబ్రీడ్ రకాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. 29 రకాల విత్తనాలు 115 క్వింటాళ్లు అవసరమని ఉద్యాన శాఖ నుంచి ఇండెంట్ ఇచ్చింది. ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. –డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ సీడ్స్ అధిక ధరలకు కొనొద్దు మిరప, పత్తి విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఆతృతపడి అధిక ధరలకు కొనుగోలు చేయవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతులకు సూచించారు. కల్తీ, నకిలీ విత్తనాలను, బ్లాక్ మార్కెట్‌ను నిరోధించేందుకు జిల్లాలవారీగా టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మిరప, పత్తి విత్తనాలను గ్రామ స్థాయిలో ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. విత్తనం దొరకదన్న ఆందోళన అవసరం లేదని, డిమాండ్ ఉన్న రకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. – రైతులకు మంత్రి కాకాణి సూచన -
రైతులను ముంచిన నకిలీ మిర్చి విత్తనాలు
పూత, కాత సక్రమంగా రాని వైనం నష్టపోయామంటున్నా గరిడేపల్లి రైతులు విత్తన దుకాణం ముందు ఆందోళన..అందుబాటులో లేని విత్తన వ్యాపారి ఖమ్మం వ్యవసాయం: ఈ ఏడాది మిర్చి పంట సాగు చేయాలనే సంకల్పంతో మార్కెట్లో విక్రయించే విత్తనాలు అసలీవా..? నకిలీవా..? అనే విషయం రైతులకు తెలియక దుకాణదారుల మాటలు నమ్మి విత్తనాలు కొనుగోలు చేశారు.తీరా అవి నకిలీవి అని తేలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నకిలీ మిర్చి విత్తనాలు నిండాముంచడంతో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కామేపల్లి మండలం గరిడేపల్లి గ్రామానికి చెందిన సుమారు 30 మంది రైతులు ఖమ్మం నగరంలోని హరి ఆగ్రో ఏజెన్సీస్‌లో జేకే హెచ్‌పీహెచ్–178, జేకే దివ్య ఎఫ్–1 హైబ్రిడ్ చిల్లీ మిరప విత్తనాలను ఒక్కో విత్తన ప్యాకెట్‌ను రూ.370 కి కొనుగోలు చేశారు.అనంతరం నెల నారు పెంచి నెల క్రితమే సుమారు వంద ఎకరాల్లో విత్తారు. ఒక్కో రైతు ఎకరం నుంచి ఐదెకరాల వరకు సాగు చేస్తున్నారు. విత్తనాలు నారు దశలో బాగానే ఉన్న ఎదుగదల విషయంలో మాత్రం ఆశించిన విధంగా లేదని రైతులు వాపోయారు.తోటలు వేసి నెల రోజులు కావస్తున్న ఇప్పటి వరకు ఆశించిన పూత, కాత రాలేదు. అక్కడక్కడ వచ్చిన కాత గిడసబారి, దుకాణ యజమాని చెప్పినట్లు కాకుండా కాయ లావుగా పొట్టిగా ఉండటంతో రైతుల్లో అనుమానం కలిగింది. కాయ బారుగా ఉండాల్సి ఉండగా లావుగా గిడసబారి ఉండటంతో రైతులు తమకు మోసం జరిగిందని గుర్తించారు. విషయాన్ని తెలుసుకున్న దుకాణ యజమాని శుక్రవారం కంపెనీ వాళ్లతో గ్రామానికి వెళ్లి పంటలను చూశారు. పంటలను చూశారు..టిఫిన్ చేసి వస్తామన్నారు.. పంటల స్థితిని చూసి టిఫిన్ చేసి వస్తామని గ్రామం నుంచి ఉడాయించారని రైతులు చెబుతున్నారు. దీంతో రైతులంతా ఖమ్మం హరి ఆగ్రో ఏజెన్సీస్lదుకాణం ఎదుట ఆందోళన చేశారు. యజమాని మాత్రం దుకాణాన్ని మూసి అందుబాటులో లేకుండా పోయారు. రైతులు దుకాణం ఎదుట ఆందోళన చేస్తున్న సమాచారంతో అక్కడికి చేరుకున్న ఖమ్మం త్రీటౌన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నకిలీ విత్తనాలు అంటగట్టారు: దారావత్ రాందాస్ రైతు పంట దిగుబడి బాగుంటుందని దుకాణ యజమాని నకిలీ విత్తనాలను అంటగట్టారు. రెండెకరాల్లో పంట వేశా. ఇప్పటికే వడ్డీకి తెచ్చి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. ఆశించిన స్థాయిలో పైరు లేదు. నాలుగు ఎకరాల్లో పంట వేశాం: ధరావత్ బుజ్జి రెండెకరాలు సొంత భూమి, మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని నాలుగు ఎకరాల్లో మిర్చి వేశాం. దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశాం. జేకే సీడ్స్ దిగుబడి బాగుంటదని వ్యాపారి చెప్పటంతో ఈ రకం వేశాం. పూత, కాత లేదు. న్యాయం చేయాలి: మూడ్ హరిసింగ్ నకిలీ విత్తనాలను అంట గట్టారు.పంటను పరిశీలించి తగిన న్యాయం చేయాలి. అధికారులు జోక్యం చేసుకొని మాకు తగిన న్యాయం చేయాలి.