breaking news
chikkala
-
ఎమ్మెల్సీగా చిక్కాల ఏకగ్రీవం
ధ్రువీకరణ పత్రం అందజేసిన రిటర్నింగ్ అధికారి కాకినాడ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తెలుగుదేశం అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఎన్నికల ప్రత్యేకాధికారి కరికాల వల్లభన్ సమక్షంలో ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని చిక్కాలకు అందజేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్. చెన్నకేశవరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, డీసీసీబీ చైర్మన్ వరుపులరాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్.వీర్రెడ్డి, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు పాల్గొన్నారు. ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం చిక్కాల రామచంద్రరావు కలెక్టరేట్ నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. చిక్కాలకు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప స్వీట్ తినిపించి అభినందించారు. -
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం
చిక్కాల ఎన్నిక ఇక లాంఛనమే.. కాకినాడ సిటీ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే దీనిని అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బుధవారం నామినేషన్ల పరిశీలనలో చివరికంటా ఉత్కంఠ రేపిన స్వతంత్ర అభ్యర్థి యాట్ల నాగేశ్వరరావు గురువారం తన నామినేష¯ŒSను ఉపసంహరించుకున్నారు. ఈమేరకు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణకు ఉపసంహరణ పత్రాన్ని అందజేశారు. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం గడువు ముగియనుండగా ఒక రోజు ముందుగానే యాట్ల బరి నుంచి తప్పుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేష¯ŒS వేసిన చిక్కాల రామచంద్రరావు ఒక్కరే మిగిలారు. దీంతో ఆయన శాసనమండలికి ఎన్నిక కావడం ఇక లాంఛనమే కానుంది. -
చిక్కాలకే చిక్కింది
- రామచంద్రరావుకే దక్కిన ‘స్థానిక’ ఎమ్మెల్సీ టిక్కెట్టు - చంటిబాబుకు, బొడ్డుకు భంగపాటు - టీడీపీలో రాజుకున్న అసంతృప్తి - నామినేషన్లకు నేడే చివరి రోజు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో అగ్గి రాజేశాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు రెండోసారి టిక్కెట్టు ఆశించారు. టీడీపీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబుకు కూడా టిక్కెట్టు రావచ్చనే ప్రచారం జరిగింది. చివరకు అకస్మాత్తుగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఆ టిక్కెట్టును ఎగరేసుకుపోయారు. దీంతో టిక్కెట్టు ఆశించి భంగపడ్డ నేతలు అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : మార్చి 17న జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి టిక్కెట్టు ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావుకు భంగపాటు ఎదురైంది. అధినేత చంద్రబాబు నుంచి ఆయన అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని రెండో రోజుల క్రితం వరకూ విస్తృత ప్రచారం జరిగింది. జిల్లాకు చెందిన మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప కూడా సానుకూలంగా ఉండటంతో భాస్కర రామారావుకు రెండోసారి బెర్త్ ఖాయమనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా వినిపించింది. అంతలోనే సీన్ మారిపోయింది. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పేరును సోమవారం అకస్మాత్తుగా ఖాయం చేశారు. అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ మేరకు పార్టీ అధినేత నుంచి సోమవారమే చిక్కాలకు వర్తమానం అందింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం ఉదయం 11.27 గంటలకు నామినేషన్ వేసేందుకు ఆయన ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నేతలు కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయానికి ఉదయం హాజరు కావాల్సిందిగా నేతలు కబుర్లు పంపిస్తున్నారు. చిక్కాల అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తారని సోమవారం రాత్రి వరకూ ఎదురు చూశారు. కానీ పార్టీలో అసంతృప్తి రేగిన నేపథ్యంలో నేతలను బుజ్జగించే పనిలో ఉండడంతో ఈ ప్రకటనలో జాప్యం జరిగిందని అంటున్నారు. మంగళవారం ఉదయానికి అసంతృప్తిని చల్లార్చిన తరువాత ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేగిన అసంతృప్తి మాజీ మంత్రి చిక్కాలకు బెర్త్ ఖాయం చేయడంపై అటు మెట్ట, ఇటు కోనసీమ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, వివాదరహితుడనే పేరుండటంతో ఆయన అభ్యర్థిత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ ఎమ్మెల్సీ ఆశలు కల్పించి, తీరా చివరి నిమిషంలో తరువాత చూద్దామని ముఖం చాటేయడం ఎంతవరకూ సమంజసమని సీటు ఆశించి భంగపడ్డ నేతలు అధినేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలో టీడీపీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబుకు చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. గడచిన రెండు ఎన్నికల్లోనూ పార్టీ కోసం సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేసినందుకు చంద్రబాబు సరైన గుణపాఠమే చెప్పారని చంటిబాబు వర్గీయులు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యే కాలేకపోయినా కనీసం జగ్గంపేట పార్టీ ఇన్ఛార్జిగానైనా ఒకప్పుడు ఆయనకు గౌరవం ఉండేది. వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నాక అది కూడా లేకుండా పోయిందని ఆ వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. చంటిబాబు ఆశించకున్నా ఆయన పేరును పరిశీలనలోకి తీసుకున్నట్టు ప్రచారంలో పెట్టి ఇప్పుడు అవమానించారని ఆ వర్గం కారాలూమిరియాలూ నూరుతోంది. భాస్కరరామారావుకు చుక్కెదురు వెనుక.. ఇద్దరు మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినా సిట్టింగ్ ఎమ్మెల్సీ భాస్కర రామారావుకు చుక్కెదురవ్వడం వెనుక ఆయన వ్యతిరేక వర్గం చేసిన గట్టి ప్రయత్నమే కారణమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భాస్కర రామారావుకు తిరిగి ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇచ్చేస్తే 2019 ఎన్నికల్లో పెద్దాపురం నుంచి ఏకుమేకవ్వకుండా నిలువరించవచ్చని చినరాజప్ప భావించారు. అయితే ఆయన వ్యూహం బెడిసికొట్టింది. అంతెందుకు? చంటిబాబు విషయంలో నెహ్రూ కూడా ఇలానే అనుకున్నారట. చంటిబాబుకు ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇస్తే వచ్చే ఎన్నికల్లో జగ్గంపేటలో తనకు అనుకూలంగా పని చేస్తారని ఆయన ఆశించారని, ఆయన ఎత్తుగడ కూడా ఫలించలేదని అంటున్నారు. మరికొందరు ఆశావహులకూ మొండిచేయి కోనసీమ నుంచి మాజీ మంత్రి దివంగత మెట్ల సత్యనారాయణరావు తనయుడు, కాకినాడ ఎంపీ తోట నరసింహం బావమరిది మెట్ల రమణబాబు కూడా ఎమ్మెల్సీ టిక్కెట్టు రేసులో ఉన్నారు. ఆయనకు కూడా భంగపాటే ఎదురైంది. రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం తామరపల్లికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు నెక్కంటి బాలకృష్ణ అయితే తన అనుచరులతో కలిసి నేరుగా విజయవాడ చంద్రబాబు వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 70 కార్లు, బస్సుల్లో తరలివెళ్లి ‘పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను. సామాజిక అంశాలు చూసుకుంటే ఎలా? స్థానిక సంస్థల కోటా కదా!’ అంటూ ఆయన బాబును ప్రశ్నించగా తరువాత చూద్దామని తిప్పి పంపించేశారని తెలిసింది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పని చేసినా గుర్తింపు ఇవ్వలేదంటూ ఆయన తీవ్ర మనస్తాపంతో తిరిగొచ్చేశారని బాలకృష్ణ అనుచరులు అంటున్నారు.