breaking news
chenchu
-
మన 'సారా' ఒక్కటై.. అడవంతా ఆదర్శమై!
నాగరికతకు ఎంతో దగ్గరగా ఉన్న చెంచు గిరిజనులు ఇంకా ఆదిమ సంస్కృతి, సంప్రదాయా లు పాటిస్తున్నారు. ప్రకృతితో కలసి జీవనం సాగిస్తుండటంతో వారి ఆచారాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటున్నాయనడంలోసందేహం లేదు. ముఖ్యంగా వివాహ సమయంలో ఇప్పటికీ వరకట్నం లేకపోవడం.. యువతీ యువకుల అభిప్రాయాలకు పెద్దపీట వేయడం.. నిరాడంబరంగా తంతు ముగించడం విశేషం. ప్రకృతి ఒడిలో ఒక్కటై పచ్చని బంధానికి బలమైన పునాది వేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాలం మారుతోంది. కొన్ని కులాలు, మతాల్లో ఆచారాలు కనుమరుగు అవుతున్నా.. ఆదిమ గిరిజనులైన చెంచులు తమదైన నాటి ఆచారాలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వారి వివాహ పద్ధతి నాటి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జరపడం విశేషం. చెంచు గిరిజన పెద్దలు తమ పిల్లల వివాహ విషయాల్లో వారి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యతన్యత ఇస్తున్నారు. ఒకరినొకరు ఇష్ట పడి ఆ విషయాన్ని పెద్దలకు చెబితే చాలు.. వెంటనే వివాహ యత్నాలు మొదలవుతాయి. గూడెం పెద్దలతో కలిసి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి ఇంటికి వెళ్తారు. అబ్బాయి తరుఫు వాళ్లు తీసుకు వచ్చిన ఐదు సీసాల సారాయిని వారి ఎదురుగా ఉంచితే అమ్మాయి తరుఫు వారు మూడు సీసాల సారాను వరుడి వైపు వారు తెచ్చిన సారాయితో కలుపుతారు. ఇది రెండు కుటుంబాల కలయికకు, నూతన బంధానికి చిహ్నంగా భావిస్తారు.అలా ఒకటైన సారాయిని వచ్చిన పెద్దలకు తలా ఇంతా పంచుతారు. ఆ సమయంలోనే వివాహ దినాన్ని పెద్దలు నిర్ణయిస్తారు. చెంచుల వివాహాల్లో వరకట్నం అన్న సాంఘిక దురాచారం కనపడదు. కొద్దిపాటి కన్యాశుల్కం ఉంటుంది. అది కూడా పూర్వపు రోజుల్లో అయితే అణాలలో ఉండేది. ఇప్పుడిప్పుడే రూ.11 దాకా పెరిగింది. ఈ మొత్తాన్ని వివాహ సమయంలో వరుడు వధువుకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా పెళ్లి కూతురింటిలో జరిగే తంతుకు కావాల్సినదంతా పెళ్లి కొడుకు తీసుకు రావాల్సిందే. పెళ్లి కూతురికి రెండు చీరలు, పెళ్లి కూతురికి తల్లికి ఒక చీరను తీసుకెళ్లాలి. వధువు తల్లిదండ్రులకు ఆరోజు పెట్టే పప్పన్నం మాత్రమే ఖర్చు. చెంచుల పురోహితుడు ‘కోలగాడు’ .. ఇరువురిని ఒకటి చేసి వారు దంపతులని సమాజానికి ప్రకటించే తంతే వివాహం. చెంచుల్లో వివాహం జరిపించేందుకు ప్రతి గూడెంలోనూ కోలగాడు అని పిలవబడే పురోహితుడుంటాడు. సగోత్రికులలో వివాహం నిషిద్ధమైన చెంచుల్లో పలు గోత్రనామాలు కలిగిన గుంపులుంటాయి. వాటిలో ఉత్తలూరు, పులిచర్ల, గుళ్ల, దాసరి, మాండ్ల, చిగుళ్ల, జళ్లి, భూమని, కుడుముల వంటి గోత్రాలు వాటిలో కొన్ని. వీటిలోని ఉత్తలూరు గోత్రానికి చెందిన వారిలో ఒకరిని ఆయా గూడేలలో పెళ్లి తంతు జరిపే పురోహితునిగా ఎంచుకుంటారు. చెంచు పురోహితున్ని ‘కోలగాడు’ అనిపిలుస్తారు. ప్రకృతి ఒడిలోనే ఏకాంతం.. పెళ్లయిన వధూవరులకు అనంతరం జరిగే శోభన కార్యక్రమం నాలుగు గోడల మధ్య జరగడానికి చెంచుల ఆచారాలు అనుమతించవు. పెళ్లయిన వధూవరులు ఆహార సేకరణ కోసం అడవుల్లోకి వెళతారు. అక్కడ ప్రకృతి ప్రసాదించిన ఏకాంతం, పచ్చటి పొదరింటి శయ్యాగృహమే నూతన వధూవరులకు శోభన వేదిక అవుతుంది. నూతన వధూవరులే కాదు.. ఏ చెంచు జంటకైనా రాత్రి శృంగారం నిషిద్ధం. విహారమైనా.. ఆహార సేకరణ అయినా.. శృంగారమైనా పగటి పూటే చెంచులకు ఆనవాయితీ. పాత ఆచారాలు మరచిపోలేం నాగరికతకు ఎంత దగ్గరైనా మా చెంచు వాళ్లు మాత్రం పాత పద్ధతులు, ఆచారాలు వదలుకోలేదు. ఇప్పటికీ మా పెద్దోళ్లు చెప్పిన పద్ధతిలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నాం. పద్ధతులు మారిస్తే మా పెద్దోళ్లు పైనుంచి కోపగించుకుంటారనే భయమూ ఉంది.పెళ్లంటే అన్ని ఖర్చులు మగపెళ్లి వాళ్లే పెట్టుకుంటారు. ఆడపెళ్లి వాళ్లకు ఎలాంటి ఖర్చు లేదు. – ఉత్తలూరి అంకన్న, కోలగాడు, నాగలూటి గూడెం పిల్లల ఇష్టాలతోనే మా గూడేల్లోకి చర్చలు, ఆలయాలు వచ్చినా.. మా దేవుళ్లు అయిన ఈదన్న, గుగ్గిళ్ల బయ్యన్న, మంతనాలమ్మలను కొలవడంలో మాత్రం మార్పులేదు. అట్టాగే పెళ్లిళ్లు కూడా సంబరంగా జరుపుకుంటారు. పిల్లగాళ్ల ఇష్టాలతోనే పెద్దవాళ్లు జత కట్టిస్తారు. – వెంకటేశ్వర్లు, చెంచు దేవతల పూజారి, బైర్లూటి చెంచుల పెళ్లింట విశేషాలు..వివాహానికి ముందు రోజు సాయంత్రం పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కుమారుడు తరఫు బంధువులంతా చేరుకుంటారు. పుట్ట మన్నుతో వివాహ వేదికను తయారు చేసి అక్కడ బాణాలను ఉంచుతారు. కొన్ని చోట్ల గంజి కావడి తెచ్చి వచ్చిన వారికి అందిస్తారు. ఆ రాత్రి వధూవరులకు నలుగు కార్యక్రమం ఉంటుంది. ఒక వైపు నలుగులు జరుగుతుంటే మరోవైపు అందరు కలసి నాట్యం చేస్తారు. ఈ నాట్యానికి చెంచులకు ఇష్టమైన తప్పెట వాదన ఉండనే ఉంటుంది. గూడెంలోని ఆడవారంతా తెల్లవారుజామునే వధూవరులను కోలగాడి (పురోహితుడు) సమక్షంలో స్నానాల బండ వద్దకు తీసుకెళ్తారు. పుక్కిట పట్టిన నీళ్లు కూడా ఒకరిపై మరొకరు పుక్కిలించుకుంటారు. (ఈ తంతు అంతా వధూవరుల మధ్య బిడియం తగ్గి పోవడానికే). అనంతరం కోలగాడు వధూవరులిద్దరికీ నూతన వస్త్రాలను అందించడంతో వివాహానికి సిద్ధమవుతారు. కోలగాడు దారంతో నూలుపోగు తయారు చేసి పసుపు కొమ్మును కట్టి మంగళసూత్రంగా త యారు చేస్తాడు. వరుడు పెద్దలందరికీ చూపు తూ అందరి చప్పట్ల మధ్య వధువు మెడలో కట్టడంతో వివాహ క్రతువు ముగుస్తుంది. పెళ్లి జరిగిన రోజు వధువు ఇంటిలో పెండ్లికి వచ్చిన వారికి పప్పన్నాన్ని మాత్రమమే వడ్డిస్తారు. అయితే వధూవరులు వరుడి ఇంటికి వచ్చిన రోజున మాంసాహారంతో విందు చేస్తారు. సారాయి సరేసరి. స్థోమతను బట్టిసంబరం జోరుగుంటుంది. పెళ్లి క్రతువును ఏమాత్రం భరించే శక్తి లేని వధూవరులను ఒక చోటకు చేర్చి కోలగాడు వారి కొంగులు ముడి వేసి వారి పెళ్లి అయ్యిందని ప్రకటించడంతో వారి వివాహ జీవితం ప్రారంభమవుతుంది. -
నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు.. చెంచులదే కీలకపాత్ర
అది దట్టమైన నల్లమల అడవి.. అందులో నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు వ్యక్తులు ఏవో పాదముద్రలు చూసి ఆగిపోయారు. అవేమిటని నిశితంగా పరిశీలించారు. పెద్దపులి అడుగులుగా (పగ్ మార్క్) నిర్ధారించారు. అంటే దగ్గర్లోనే పులి ఉన్నట్లు గ్రహించారు. ఇంకా ముందుకెళ్తే ప్రమాదమని భావించి అక్కడే ఆగిపోయారు. ఆ అడుగుల ముద్ర చుట్టూ చిన్నచిన్న రాళ్లు పెట్టి వాటిపైన ఒక పారదర్శక అద్దం పెట్టారు. దానిపై స్కెచ్‌తో ఆ అడుగుల్ని గీశారు. అలాగే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కూడా ఆ పాదముద్రను సేకరించి వెనుదిరిగారు. – నల్లమల నుంచి సాక్షి ప్రతినిధి ఆ ఐదుగురు ఎవరో కాదు.. పులుల రక్షకులు. నల్లమలలో జీవించే చెంచులు వారు. వన్యప్రాణుల మధ్యే వారి జీవనం. వాటితో తరతరాల అనుబంధం వారిది. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని రోళ్లపెంట బేస్ క్యాంపు వద్ద వాళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేర్లు.. దంసం గురవయ్య, దాసరి నాగన్న, దంసం మొగిన్న, దార బయన్న, అంజి నాయక్. దేశంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టులో పులుల సంఖ్య ఏటా పెరుగుతుండటంలో అటవీ శాఖతోపాటు నల్లమల చెంచుల పాత్ర ఎంతో కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా పులుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఇక్కడ అవి సురక్షితంగా ఉండడానికి ఈ చెంచులే ప్రధాన కారణం. 4 జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో పులుల రక్షణ బాధ్యత వారిదే. ఏడేళ్ల క్రితం అక్కడ 37 మాత్రమే పులులుండగా, ఇప్పుడవి 73కి పెరిగాయి. అటవీ శాఖ తాజా పులుల గణనలో ఈ విషయం తేలింది. 63 బేస్‌క్యాంపుల బాధ్యత వీరికే.. అడవిలోనే పుట్టి పెరిగే చెంచులకు అక్కడి దారులు, నీటి చెలమలు, పులులు, మిగిలిన వన్యప్రాణులు, వాటి జీవన విధానం గురించి పూర్తిగా తెలుసు. పులుల్ని వారు పెద్దమ్మ గా భావిస్తారు. అందుకే వాటిని సంరక్షిస్తారు. ఆంధ్రా ప్రాంతంలో ద్రవిడుల కంటే ముందు నుంచి చెంచులు నివసిస్తున్నారనే వాదన ఉంది. అనాదిగా నల్లమలలో వన్యప్రాణులతో కలిసి వారు జీవిస్తున్నారు. అడవి ఉంటేనే తమ మనుగడ ఉంటుందని వారు నమ్ముతారు. అందుకే అడవిని, అందులోని వన్యప్రాణుల్ని సంరక్షిస్తారు. వీరికి అడవి ఆనుపానులు తెలుసు కనుకే వారి ద్వారానే అటవీ శాఖ పులుల సంరక్షణను చేపట్టింది. ఇందులో భాగంగా ఆత్మకూరు, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల అటవీ డివిజన్లలోని 63 బేస్ క్యాంపుల బాధ్యతను వారికే అప్పగించింది. అక్కడి నుంచే పులులు, ఇతర వన్యప్రాణులు, అటవీ సంరక్షణ చేపడుతున్నారు. ప్రతి బేస్ క్యాంపులో ఐదుగురు చెంచులతో ఒక బృందం ఏర్పాటుచేశారు. వీరిని పంచ పాండవులుగా పిలుస్తారు. అనేక తరాలుగా పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణలో చెంచులు భాగమయ్యారు. ఫ్రంట్లైన్లో ఉండి దట్టమైన అడవుల్లో పులులు, ఇతర జంతువులను ట్రాక్ చేయడంతోపాటు వాటి రక్షణ, అడవిలో పెట్రోలింగ్, సమాచారం సేకరించడానికి పనిచేస్తున్నారు. బేస్ క్యాంపులు వచ్చాక అంతకుముందు కూడా అటవీ శాఖాధికారులు వీళ్ల ద్వారానే నల్లమలలో పెట్రోలింగ్ చేస్తున్నారు. చెంచులు ఏం చేస్తారంటే.. ►చెంచులకు అటవీ శాఖ శిక్షణనిచ్చింది. మొబైల్లో జీపీఎస్ ద్వారా అడవిలో తిరగడం, చెట్లకు కెమెరా ట్రాప్‌లు అమర్చడం, పులుల అడుగులు గుర్తించి ఆ ముద్రలను సేకరించడం వీరి ప్రధాన విధులు. ►ప్రతిరోజు తమ బేస్ క్యాంపు పరిధిలో 5 నుంచి 7 కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ చేస్తారు. ►ఎం–స్ట్రైప్ అప్లికేషన్ ద్వారా జంతువుల ఫొటోలు తీస్తారు. వాటిని ప్రతి 10 రోజులకు అటవీ శాఖాధికారులకు ఇస్తారు. ►బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా? పులులు, ఇతర జంతువులకు ఏమైనా ఉచ్చులు వేశారా? స్మగ్లింగ్ వంటి సమాచారాన్ని సేకరించి ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైర్లెస్ సెట్లో అధికారులకు సమాచారమిస్తారు. ►అడవిలో జరిగే ప్రతి కదలిక తెలిసేలా ఈ చెంచుల ఫ్రంట్‌లైన్ టీమ్ పనిచేస్తుంది. ►మొత్తం 300 మంది ఈ టీముల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు ప్రతి క్యాంపులో మరో ముగ్గురు చెంచుల్ని ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల ఏరివేతకు నియమించారు. ►ఈ పని ద్వారా అడవులు, పులుల సంరక్షణతోపాటు వారికి అటవీశాఖ ఉపాధి కల్పిస్తోంది. ►ఇక వీరి సేవలను గుర్తించిన నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ (ఎన్టీఎస్ఏ) గతంలోనే బెస్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఇచ్చింది. ►ఆ తర్వాత దేశంలోని మిగిలిన అటవీ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో స్థానిక గిరిజన జాతుల్ని అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వామ్యం చేస్తున్నారు. పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఈ రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇందులో చెంచుల పాత్ర ముఖ్యమైనది. తాజా లెక్కల ప్రకారం 73 పులులు ఉన్నాయి. ఇది ఏడేళ్లలో ఊహించని పెరుగుదల. తమ శాఖ ప్రణాళికాబద్ధంగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇది సాధ్యమైంది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్టులో విస్తీర్ణపరంగా దేశంలోనే ఇది అతిపెద్దది. ఇక్కడ పులుల సంఖ్య పెరుగుదలను బట్టి ఈ అభయారణ్యం ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. –శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ కన్జర్వేటర్–డైరెక్టర్, టైగర్ ప్రాజెక్టు చెంచులది కీలకపాత్ర పులుల సంరక్షణలో చెంచులు కీలకంగా ఉన్నారు. బేస్ క్యాంపుల్లో వాళ్లు ఐదుగురు చొప్పున ఉంటారు. వారు పెట్రోలింగ్ చేస్తూ పులుల్ని ట్రాక్ చేస్తారు. పులుల గురించి అన్నీ తెలిసిన వారికే వాటి సంరక్షణలో భాగస్వాముల్ని చేశాం. తద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం. – సందీప్‌రెడ్డి, సబ్ డీఎఫ్ఓ, ఆత్మకూరు ఫారెస్టు డివిజన్ పులి కనపడితే నిశ్శబ్దంగా ఉండిపోతాం ప్రతిరోజు 5–7 కిలోమీటర్ల మేర అడవిలో తిరుగుతాం. పులి, ఇతర జంతువుల్ని గమనిస్తూ ఉంటాం. అడుగుల్ని బట్టి అవి ఎటు వెళ్తున్నాయో తెలుసుకుంటాం. ఒకవేళ పులి ఎదురైతే నిశ్శబ్దంగా ఉండిపోతాం. దీంతో అది మా వైపు చూసినా వెళ్లిపోతోంది. హడావుడి చేస్తే దాడిచేస్తుంది. – దార బయన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ మంచినీటి కోసం సాసర్ పిట్లు కడతాం మా క్యాంపు చుట్టూ నాలుగైదు రూట్లలో తిరుగుతాం. ఒక్కో రోజు ఒక్కో రూట్లో వెళ్తాం. ఎండాకాలం జంతువులు నీటి కోసం అలమటిస్తాయి. వాటికోసం అడవిలో ఆఫీసర్లు చెప్పినట్లు సాసర్ పిట్లు కట్టి అందులో నీళ్లు నింపుతాం. పులులు, ఇతర జంతువులు వచ్చి ఆ నీటిని తాగుతాయి. – దంసం మొగిన్న, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ పులుల క్రాసింగ్ టైమ్‌లో జాగ్రత్తగా ఉంటాం పులుల క్రాసింగ్ టైమ్ లో చాలాజాగ్రత్తగా ఉంటాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో అవి కలిసే(మేటింగ్) సమయం. అప్పుడు ఎవరైనా కనపడితే విరుచుకుపడిపోతాయి. వేటాడే ట ప్పుడూ పులికి కనపడకూడదు. తనను అడ్డుకుంటున్నారని దాడి చేస్తుంది. మిగిలిన సమయాల్లో మనుషుల్ని చూసినా వెళ్లిపోతుంది. – అంజి నాయక్, చెంచు యువకుడు, రోళ్లపెంట క్యాంప్ -
చెంచు గూడేలకు సోలార్ వెలుగులు
కర్నూలు(రాజ్‌విహార్): చెంచు గూడేలకు సోలార్ ద్వారా విద్యుత్ వెలుగులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌కో సీఎండీ, జెన్కో ఎండీ కె. విజయానంద్ తెలిపారు. వనం–మనం కార్యక్రమంలో భాగంగా స్థానిక విద్యుత్ భవన్లో, దిన్నెదేవరపాడు రోడ్డులోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలు నాటడంతో పాటు ఉద్యోగులందరితోనూ ఆయన నాటించారు. అనంతరం సిబ్బంది, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో ఉన్న చెంచు గూడెలకు చెట్లు అడ్డు ఉన్న కారణంగా ఇప్పటి వరకు విద్యుత్ సౌకర్యం ఇవ్వలేదని, దీనికి అటవీ శాఖ అనుమతులూ పొందాల్సి ఉందన్నారు. దీంతో స్థానికంగా సోలార్ సిస్టంను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను అందిస్తామని చెప్పారు. విద్యుత్ సబ్స్టేషన్లను హరిత వనంలా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, వనం–మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి సబ్‌స్టేషన్‌ను హరిత వనంలా మారుస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈఓ ఎ. చంద్రశేఖర్ రెడ్డి, ట్రాన్స్‌కో కడప జోన్ సీఈ శ్రీరాములు, ఎస్ఈ చంద్రశేఖర్, ఎస్పీడీసీఎల్ కర్నూలు జోన్ సీఈ పీరయ్య, ఆపరేషన్స్ ఎస్ఈ భార్గవ రాముడు తదితరులు పాల్గొన్నారు.