breaking news
Central African Republic
-
తిరుగుబాటుదారుల బీభత్సం.. 30 మంది మృతి
Rebel Attack In Central African Republic: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో తిరుగుబాటుదారులు తీవ్ర బీభత్సం సృష్టించారు. తిరుగుబాటుదారుల దాడిలో 30 మంది మృతి చెందారు. అందులో 28 మంది స్థానిక పౌరులు, ఇద్దరు సైనికులు ఉన్నారని అధికారులు ప్రకటించారు. రాజధాని బాంగూయ్‌కు ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో కామెరూన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కైటా, బేయెన్‌గౌ గ్రామాల్లో తిరుగుబాటుదారులు ఆదివారం ఏకకాలంలో దాడులకు తెగపడ్డారు. చదవండి: కఠిన నిబంధనలు అమల్లోకి.. ఇకపై అలాంటి వేషాలు కుదరవు! దాడులు జరుగుతున్న సమయంలో పలువురు కామెరూన్‌కు పారిపోయారని అధికారులు వెల్లడించారు. 2013లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో తిరుగుబాటుదారుల అంతర్యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా వివాదం సద్దుమణిగినప్పటికీ చాలా భూభాగం తిరుగుబాటుదారుల చేతుల్తోనే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
నెత్తుటేరుల్లో వజ్రాల వేట
యుద్ధ ప్రభువుల దేశంలో సుస్థిరతకు హామీ వజ్రాలను కొల్లగొట్టుకునే హక్కుల వికేంద్రీకరణే. దాన్ని బొజిజే ఉల్లంఘించారు. పైగా విదేశీ వజ్రాల సంస్థలను ముసేయించారు. అప్పటి నుంచే తిరుగుబాటుదార్లకు అత్యాధునిక ఆయుధాలు వెల్లువెత్తుతుండటం, దాడులు పెరగడం కాకతాళీయం కాదు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (కార్)మీద ప్రకృతికి ఎంత ప్రేమోగానీ అర కోటి జనాభా లేని దేశానికి ఉబాంగీ, షారీ అనే రెండు పెద్ద నదులను ప్రసాదించింది. దేశమంతటా వజ్రాలని పిలిచే ‘రక్త పిశాచుల’ను వెదజల్లింది. వాటి రక్త దాహానికి గత డిసెంబర్లోనే వెయ్యి మందికి పైగా హతమైపోయారు. గత మార్చి నుంచి ఇంత వరకు పది లక్షల మంది నిర్వాసితులై అల్లాడుతున్నారు. ‘పెద్ద మనసు’తో శాంతిని పరిరక్షించే బాధ్యతను ఫ్రాన్స్ స్వీకరించింది. దాని 1,600 మంది సైనికులకు తోడు, ఆఫ్రికన్ యూనియన్ పంపిన 6 వేల సైన్యం అక్కడే ఉంది. నెలల గడుస్తున్నాయేగానీ శాంతి, సుస్థిరతలు కనుచూపు మేరలో కనబడటం లేదు. కానీ కార్ సంక్షోభం అసలు మూలాల వేపు కన్నెత్తి చూడటానికి ప్రపంచ పెద్దలు సిద్ధంగా లేరు. ఆఫ్రికన్ ‘నెత్తుటి వజ్రాల’ లాభాల రుచి మరిగిన వారికి ఆఫ్రికా ఖండపు అశాంతి ఎప్పటికీ నిగూఢ రహస్యమే. అంతర్జాతీయ మీడియా చెబుతున్న కార్ కథ ప్రకారం... చాద్, సూడాన్ సరిహద్దులలోని ఉత్తరాది ముస్లిం తెగల తిరుగుబాటుదార్లు గత మార్చిలో అధ్యక్షుడు ఫ్రాంకోయిజ్ బొజిజె ప్రభుత్వాన్ని కూలదోయడంతో ఈ మారణకాండ మొదలైంది. సెలెకా తిరుగుబాటుదార్ల నేత, నేటి తాత్కాలిక అధ్యక్షుడు మైఖేల్ జొటోడియా కథనం ప్రకారం... 2003లో బొజిజె అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సంఘర్షణ కొనసాగుతోంది. బహు తెగల నిలయమైన కార్లో బొజిజె తన గబయా తెగను ఆదరించి మిగతా తెగలను నిర్లక్ష్యం చేశారు. తిరుగుబాటుదార్లతో శాంతి ఒప్పందాలను ఉల్లంఘించారు. బొజిజె దేశ వజ్రాల పరిశ్రమను పిడికిట పట్టారు. యుద్ధ ప్రభువుల కలహాలకు ఆలవాలంగా ఉన్న దేశంలో సుస్థిరతకు హామీ వజ్రాలను కొల్లగొట్టుకునే హక్కుల వికేంద్రీకరణే. దాన్ని బొజిజే ఉల్లంఘించారు. పైగా 2008లో వజ్రాల ఎగుమతుల విదేశీ వ్యాపార సంస్థలన్నిటినీ ముసేయించారు. అప్పటి నుంచే కార్ తిరుగుబాటుదార్ల చేతుల్లోకి అత్యాధునిక ఆయుధాలు వెల్లువెత్తుతుండటం, వారి దాడులు పెరగడం కాకతాళీయం కాదు. వజ్రాల విలువ తెలియని అనాగరిక తెగల దేశానికి ‘నాగరిక ప్రపంచం’ యూరప్ మధ్య యుగాలలోనే వ్యాపారులను పంపింది. 16-19వ శతాబ్దాలలో కార్ ప్రజలను పట్టి, బంధించి బానిసల ఎగుమతి వ్యాపారం సాగించింది. నేడు కార్ శాంతి పరిరక్షణకు పూనుకున్న ఫ్రాన్స్ వలస గుత్తాధిపత్యం నెరపింది. 1960లో అది స్వతంత్ర దేశమయ్యాక అధ్యక్షుడు డేవిడ్ డాకోకు వ్యతిరేకంగా 1965లో తొలి సైనిక తిరుగుబాటు జరిగింది. దానికి సూత్రధారి ఫ్రాన్సే. నాటి నుంచి సాగుతున్న అస్థిరత, తెగల కలహాల చరిత్ర పాశ్చాత్య వజ్రాల వ్యాపార సంస్థలకు బహు లాభసాటిగా మారింది. అది కార్కే పరిమితం కాదు. ప్రపంచ వజ్రాల ఎగుమతుల్లో 50 శాతం మధ్య, దక్షిణ ఆఫ్రికాల నుంచి జరుగుతున్నవే. అంతర్జాతీయ సంస్థలు కారు చౌకకు వజ్రాలను కొల్లగొట్టడం కోసం అంతర్గత కలహాలను రాజేస్తూనే ఉన్నాయి. తిరుగుబాటుదార్లకు ఆయుధాలు అందిస్తున్నాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియర్రా లియోన్ అంగోలా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కోటే డి ఐవరీ లైబీ రియా, జింబాబ్వే తదితర దేశాలన్నీ నెత్తుటి వజ్రాల వ్యాపారానికి బలైనవే. డి.ఆర్.కాంగో, సియర్రా లయోన్, అంగోలా ముడింటిలోనే ఈ ‘రాజకీయాలకు’ 35 లక్షల మంది బలైపోయారు. కార్లో ఆ కథ నేడు తీవ్ర స్థాయికి చేరింది. ప్రపంచ పెద్దల జోక్యంతో జొటోడియా గద్దె దిగడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. బొజోజీ, జొటోడియాల మధ్య సయోధ్య కుదిరితే ఆ ‘శాంతి ఒప్పందం’తో పాటే కార్ వజ్రాల గనుల పరిశ్రమలోకి బహుళజాతి సంస్థల ప్రవేశానికి తలుపులు కూడా తెరుచుకుంటాయి. - పిళ్లా వెంకటేశ్వరరావు -
బంగూయిలో విధ్వంసకాండ: 300 మంది మృతి
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లికన్ రాజధాని బంగూయిలో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న విధ్వంసకాండలో దాదాపు 300 మంది మరణించారని రెడ్ క్రాస్ సొసైటీ శనివారం ఇక్కడ వెల్లడించింది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మృతదేహలను ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది. శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో భాగంగా ఇప్పటికే ఫ్రెంచ్ దళాలకు చెందిన వేలాది మంది భద్రత సిబ్బంది ఇప్పటికే బంగూయి చేరుకున్నారని వివరించింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్న్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ బొజీజ్ను ఇటీవల పదవి నుంచి తొలగించారు. దాంతో ఫ్రాంకోయిస్ అనుకూల వర్గానికి, వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీబీసీ శనివారం వెల్లడించింది.