breaking news
censure resolution
-
జడ్జీల నియామకం మాకొదిలేయండి: సుప్రీం
న్యూఢిల్లీ: జడ్జీల నియామకం అంశాన్ని తమకు విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థకు సంబంధించి దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సీజేఐ జస్టిస్ మిశ్రా అభిశంసన తీర్మానంపై సంతకాలు చేసిన న్యాయవాదులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారించింది. ‘ఇది జడ్జీల నియామకానికి సంబంధించిన అంశం. దీనిని మాకు విడిచిపెట్టండి. ఆ విషయాన్ని మేం చూసుకోగలం. ఇలాంటి పిటిషన్లను మేం పరిగణనలోకి తీసుకోం’ అంటూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. -
సీజేఐపై అభిశంసనకు వెనక్కి తగ్గుతున్న విపక్షాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం కోసం కాంగ్రెస్ ప్రారంభించిన సంతకాల ఉద్యమం క్రమంగా చల్లారిపోతోంది. సైద్ధాంతికంగా ఆ పార్టీతో కలిసొచ్చే కొన్ని పార్టీలే ఈ అంశంపై వెనక్కితగ్గాయి. కాంగ్రెస్ తీర్మానంపై బుధవారం ముగ్గురు డీఎంకే ఎంపీలు సంతకం చేయగా.. పార్టీ నాయకత్వం ఆదేశాలతో వారు మద్దతును వెనక్కి తీసుకున్నారు. తీర్మానంపై సమాజ్‌వాదీ పార్టీ సంతకాలు చేసినా తరువాత ఉపసంహరించుకుంది. పార్లమెంట్లో కాంగ్రెస్‌తో కలిసి పోరాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇతర ప్రతిపక్ష పార్టీలు సంతకం చేశాకే నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో మమతా బెనర్జీ ఉన్నట్లు సమాచారం. -
సీజేఐపై కాంగ్రెస్ అభిశంసన!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. అందుకోసం వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీల నుంచి కాంగ్రెస్ పార్టీ సంతకాలు సేకరిస్తోందని ఎన్సీపీ నేతలు వెల్లడించారు. ఈ అంశంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించగా.. ఎన్సీపీ ఎంపీ మజీద్ మెమన్ మాట్లాడుతూ ‘భారతదేశ ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన కోసం ప్రక్రియను కాంగ్రెస్ మొదలుపెట్టింది. నోటీసుపై నేను సంతకం చేశాను. ఎంత మంది సంతకం చేశారన్న విషయాన్ని కాంగ్రెస్‌నే అడగండి’ అని సమాధానమిచ్చారు. మరో ఎన్సీపీ ఎంపీ డీపీ త్రిపాఠీ మాట్లాడుతూ.. ‘నోటీసుపై నాతో పాటు ఇతరులు కూడా సంతకాలు చేశారు. ప్రక్రియ కొనసాగుతోంది’ అని చెప్పారు. సంతకాలు చేసిన వారిలో ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీల ఎంపీలు ఉన్నారని, కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సంతకం చేశారని తెలిపారు. సీజేఐకి వ్యతిరేకంగా పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే నోటీసుపై లోక్‌సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలు అవసరం. రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కార్యాలయంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యి అభిశంసన అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు నిరాకరించారు. -
ఇదెంత న్యాయమో!
హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డిపై పార్లమెంట్లో రెండోసారి అభిశంసన తీర్మానం తీసుకరావడానికి విఫలయత్నం జరిగినట్లు తెల్సింది. కొద్ది మంది రాజకీయ నాయకుల కారణంగా నాగార్జున రెడ్డి రుజువర్తన ప్రశ్నార్థకమవడం శోచనీయం. ఇది ఆయన ఒక్కరిని శంకించడం కాదు, సమస్త న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని శంకించడమే అవుతుంది. ఓ న్యాయమూర్తిపై అభిశంస తీర్మానం తీసుకరావడం మామూలు విషయమూ కాదు, ఆషామాషీ వ్యవహారమూ కాదు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌లోని ఉభయసభలు మూడింట రెండు వంతల మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఇంత వ్యవహారం అంత ఈజీ కాదని తెల్సినా అభిశంసన తీర్మానానికి, అందులో రెండోసారి కూడా ప్రయత్నించడమంటే బురద చల్లడం, ఆయన రాజ్యాంగ విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకే అన్న విషయం ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. సమస్యకు తెరపడకుండా సజీవంగా ఉంచేందుకు ప్రయత్నించడమే. సస్పెండయిన ఓ దళిత జూనియర్ న్యాయమూరి ఓ కేసు విషయంలో తనపై ఒత్తిడి తెచ్చారంటూ, కింది కోర్టు సిబ్బందిని వేధిస్తున్నారంటూ, తనను దూషించారంటూ జస్టిస్ నాగార్జున రెడ్డిపై పెట్టిన రిట్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసినప్పటికీ కూడా రెండోసారి అభిశంసన ప్రయత్నం జరగడం విచారకరం. ఈ వివాదానికి సంబంధించి 13- 02-2013లో నాగార్జున రెడ్డిపై ఫిర్యాదు చేశానని, దళిత జడ్జీ మొదట చెప్పడం, ఆ తర్వాత 18–02–2013లో 14–02–2013 తేదీలతో ఫిర్యాదులు చూపడం అంతా కట్టుకథ అని ఎప్పుడో తేలిపోయింది. 95 శాతం ఒళ్లు కాలిన వ్యక్తి నుంచి జస్టిస్ నాగార్జున రెడ్డి మరణ వాంగ్మూల తీసుకున్నట్లు కూడా సదరు జడ్జీ ఆరోపించారు. 95 శాతం కాలిన గాయాలతో ఎవరైనా స్పహలో ఉంటారా? అందుకు డాక్టర్ అంగీకరిస్తారా? జస్టిస్ నాగార్జున రెడ్డికి వ్యతిరేకంగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి తొలిసారి ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని తప్పు తెలసుకొని రాజ్యసభ సభ్యులు గతేడాది డిసెంబర్లోనే వెనక్కి తీసుకున్నప్పుడు మళ్లీ రెండోసారి తీర్మానం ఇచ్చేందుకు ప్రయత్నం ఎందుకు జరిగిందన్నది ఇక్కడ ముఖ్య ప్రశ్న కాదా? కొంతమంది మాయ మాటలు నమ్మి పొరపాటు చేశామని నాడు 61 మంది సంతకాలు చేసిన తీర్మానాలను వెనక్కి తీసుకున్నారు. నాడు జస్టిస్ నాగార్జున రెడ్డికి మద్దతుగా ఆయన రుజువర్తన గురించి తెలియజేస్తూ ఏకంగా 1050 మంది న్యాయవాదులు రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రాలు పంపించారు. ఆ తర్వాత జస్టిస్ రామకష్ణ దాఖలు చేసిన రిట్ పిటిషన్లను గత మార్చి నెలలో హైకోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ మరోసారి అభిశంసనకు ప్రయత్నం జరిగిందంటే ఏమనుకోవాలి? కొందరు విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటపోట్లను తేలిగ్గానే తీసుకోవచ్చు. అసలు పట్టించుకోకపోవచ్చు. న్యాయవ్యవస్థ స్వతంత్రను కోరుకునే జస్టిస్ నాగార్జున రెడ్డి లాంటి వారు ఇలాంటి అంశాల పట్ల సున్నితంగా స్పందిస్తారు. ఈ న్యాయవ్యవస్థ స్వతంత్రను పార్లమెంట్ సభ్యుల సంఖ్యకు అప్పగిస్తే బాగుంటుందా? ప్రధాన న్యాయమూర్తి నియమించే జుడీషియల్ కమిటీ న్యాయ వ్యవస్థ స్వతంత్య్రను కాపాడుతుందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ నైతిక విలువల పట్ల ఉన్న గౌరవంతోనైనా జస్టిస్ నాగార్జున రెడ్డి లాంటి వాళ్లను విధులకు దూరంగా ఉంచడమంటే ఏమిటీ? ఇలాంటి అంశాల పట్ల అధికారంలో ఉన్న వాళ్లు ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్దం కాదు, వారు ఈ వ్యవస్థలో భాగమయ్యారేమో, ఇలాంటి వ్యవస్థకు న్యాయవ్యవస్థ కూడా అతీతం కాదుకదా! -
దించేస్తారా?
► దించే దాకా వెళతారా? ► ట్రంప్‌పై అభిశంసన తీర్మానం పెట్టాల్సిందేనని డిమాండ్లు అత్యంత రహస్యమైన నిఘా సమాచారాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు చెప్పేసి... ఇరకాటంలో పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం పెట్టాల్సిందేననే డిమాండ్లు డెమొక్రాట్ల నుంచి వినపడుతున్నాయి. ప్రతినిధుల సభ, సెనెట్.. రెండింటిలోనూ రిపబ్లికన్ పార్టీకే (ట్రంప్ పార్టీ) మెజారిటీ ఉంది. కాబట్టి అభిశంసన తీర్మానం నెగ్గడం అంత సులభం కాదు. అయితే ప్రజాభిప్రాయం కూడా వేగంగా ట్రంప్‌నకు వ్యతిరేకంగా మారుతోంది. ప్రైవేటు సంస్థ ‘పబ్లిక్ పాలసీ పోలింగ్ (పీపీపీ)’మంగళవారం విడుదల చేసిన సర్వేలో... ఏకంగా 48 శాతం మంది ట్రంప్‌ను అభిశంసించాల్సిదేనన్నారు. అభిశంసనకు వ్యతిరేకమన్న వారు 41 శాతం. ట్రంప్ బృందం పనితీరు బాగుందన్న వారు 40 శాతమే కాగా, పాలనపై పెదవి విరిచిన వారు ఏకంగా 54 శాతం మంది ఉండటం గమనార్హం. ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని అర్ధంతరంగా పదవి నుంచి తొలగించాక జరిగిన సర్వే ఇది. ఈ నెల 12 నుంచి 14 మధ్య జరిగింది. సర్వే జరిగాక ట్రంప్ తప్పులు మరో రెండు బయటకు వచ్చాయి. ఒకటి చిరకాల ప్రత్యర్థి రష్యాతో నిఘా సమాచారాన్ని పంచుకోవడం, రెండోది... మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్‌పై విచారణను ఆపేయాల్సిందిగా ట్రంప్ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కోమీని కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక బయటపెట్టింది. తాజా పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొంటే ప్రజాభిప్రాయంలో మరింతగా తేడా రావొచ్చు. ప్రజా వ్యతిరేకత ఇంకా పెరిగితే రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యులు కూడా ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికే పరిస్థితులు తలెత్తవచ్చు. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేం గాని... ఒకవేళ ట్రంప్‌ను దించేదాకా పరిస్థితి వస్తే... ఆయనపై మోపే అభియోగాలేమిటి, అభిశంసన ప్రక్రియ ఎలా ఉంటుంది, ఇతర మార్గాలేమిటనేది చూద్దాం... అభియోగాలు... న్యాయ ప్రక్రియకు అడ్డు తగలటం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ బృందం రష్యాతో... ముఖ్యంగా అమెరికాలో ఆ దేశ రాయబారి సెర్గీ కిస్లయాక్తో సంబంధాలు నెరిపిందనే ఆరోపణలు ఉన్నాయి. హిల్లరీ, ఇతర డెమొక్రాటిక్ నేతల ఈ మెయిల్స్‌ను లీక్ చేయడం ద్వారా రష్యా పరోక్షంగా ట్రంప్ విజయానికి దోహదపడిందని ఆరోపణ.పుతిన్‌తో కలిసి పనిచేస్తానని ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ పలుమార్లు చెప్పడం... వీరిమధ్య ఏదో ఉందనే అనుమానాలకు తావిచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రష్యా ప్రభావం మీద విచారణ కోసం ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్‌ను ప్రత్యేక కౌన్సిల్‌గా నియమించారు. దీన్ని మొదట స్వాగతించిన ట్రంప్... తరువాత గురువారం వేకువజామున ఇది అత్యంత ప్రతీకారేచ్ఛ చర్యని ట్వీట్ చేశారు. దీన్నిబట్టి ట్రంప్ బృందం ఆందోళనకు గురవుతుందనేది అర్థమవుతుంది. రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్తో తను సంభాషించిన విషయాలపై ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను తప్పుదోవ పట్టించినందుకు జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్ నెలరోజుల్లోనే (ఫిబ్రవరి 13న) పదవికి రాజీనామా చేశారు. రష్యాతో ఫ్లిన్కు గల సంబంధాలపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) విచారణ జరుపుతోంది. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా ప్రభావితం చేసిందనే ఆరోపణలపైనా విచారణ జరుగుతోంది. ఈ తరుణంలో అకస్మాత్తుగా ఈ నెల 9న ఎఫ్‌బీఐ డైరక్టర్ జేమ్స్ కోమీని పదవి నుంచి తప్పించారు ట్రంప్. పైగా ఒక ఇంటర్వ్యూ లో ఈ నిర్ణయం తీసుకునేటపుడు రష్యా వ్యవహారం కూడా తన మదిలో ఉందని ట్రంప్ స్వయంగా చెప్పారు. అంతకుముందే ఫ్లిన్‌పై విచారణను నిలిపివేయాల్సిందిగా కోమీని ట్రంప్ కోరినట్లు మంగళవారం బయటపడింది. ఈ రెండు సందర్భాల్లోనూ అధ్యక్షుడు పరిధిని దాటి న్యాయ ప్రక్రియకు అడ్డు తగిలినట్లేనని కొందరు నిపుణుల విశ్లేషణ. ‘తీవ్ర నేరాలు, ఇతర స్వల్పకాలిక శిక్షార్హమైన నేరాలు’చేస్తే అధ్యక్షుడిని అభిశంసించవచ్చని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. న్యాయ ప్రక్రియకు అడ్డు తగలడం దీని కిందకే వస్తుందని వీరి వాదన. ప్రమాణాన్ని ఉల్లంఘించడం మిత్ర దేశం అందించిన అత్యంత రహస్య నిఘా సమాచారాన్ని ట్రంప్ రష్యాతో పంచుకున్నాడనేది వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టడంతో పెద్ద దుమారమే రేగింది. అధ్యక్షుడిగా ఆ మేరకు తనకు సంపూర్ణ అధికారం ఉందని ట్రంప్ సమర్థించుకున్నారు. నిజమే... రాజ్యాంగం ప్రకారం అమెరికా అధ్యక్షుడు తన విచక్షణ మేరకు ఎంత గోప్యమైన సమాచారాన్నైనా ఎవరితోనైనా పంచుకోవచ్చు. అది చట్ట ఉల్లంఘన కిందకు రాదు. అయితే దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే ముందు... ‘అమెరికా అధ్యక్ష బాధ్యతలను పూర్తి నిష్ఠతో నిర్వర్తిస్తానని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, కాపాడతానని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను’అని ప్రమాణం చేస్తారు. ప్రత్యర్థి దేశమైన రష్యాకు కీలక నిఘా సమాచారాన్ని నిర్లక్ష్యంగా వెల్లడిం చడం కూడా నిష్ఠతో బాధ్యతల నిర్వహణ కిందకు వస్తుందని సమర్థించుకోవడం సాధ్యం కాదని లాఫేర్ అనే న్యాయనిపుణుల బ్లాగ్‌లోని ఆరుగురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అంటే... ప్రమాణాన్ని ట్రంప్ ఉల్లంఘించినట్లేనని వీరి ఉద్దేశం. అభిశంసన ప్రక్రియ... ఎలా మొదలవుతుందంటే: అమెరికాలో అభిశంసన ప్రక్రియను మొదలుపెట్టే అధికారం ప్రతి నిధుల సభకు మాత్రమే ఉంది. న్యాయ శాఖ, స్వయంగా ప్రతినిధుల సభ, ప్రత్యేకంగా నియమించిన న్యాయవాది... వీరిలో ఎవరో ఒకరు మొదట స్వతంత్ర విచారణ జరుపుతారు. అభియోగాలకు గల ఆధారాలను హౌస్ జ్యుడీషియరీ కమిటీకి సమర్పిస్తారు. ఈ కమిటీ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి అభిశంసన తీర్మానానికి ఆర్టికల్స్‌ను రాస్తుంది. దీనిపై చర్చ జరిగాక ఓటింగ్ చేపడతారు. ప్రతినిధుల సభలో సాధారణ మెజారిటీతో నెగ్గితే అధ్యక్షుడు అభిశంసనకు గురైనట్లే. అంతమాత్రాన పదవి పోదు. తదుపరి ఇది సెనేట్‌కు చేరుతుంది. అసలు ఘట్టం: అభిశంసన తీర్మానం సేనేట్‌కు చేరాక విచారణ మొదలవుతుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిగా, సెనెట్ జ్యూరీగా విచారణ జరుగుతుంది. అధ్యక్షుడు తన వాదనలు వినిపించుకోవచ్చు. హౌస్ జ్యుడీషియరీ కమిటీ ప్రాసిక్యూషన్‌గా వ్యవహరిస్తుంది. సెనేట్‌లో మూడింట రెండొంతుల మంది సభ్యులు (67 మంది, మొత్తం సెనెట్ బలం 100) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటేస్తే పదవి ఊడుతుంది. బలాబలాలు: ప్రతినిధుల సభలో సాధారణ మెజారిటీ వస్తే అభిశంసన తీర్మానం ఆమోదం పొందినట్లే. 435 మంది సభ్యులుండే ప్రతినిధుల సభలో 4 ఖాళీలున్నాయి. రిపబ్లికన్ల బలం 238 కాగా, డెమొక్రాట్ల బలం 193. సాధారణ మెజారిటీకి 216 ఓట్లు వస్తే చాలు. అంటే డెమొక్రాట్లు ట్రంప్‌పై అభిశంసన పెడితే అది నెగ్గడానికి... కనీసం 23 మంది రిపబ్లికన్ల మద్దతును కూడగట్టాలి. సెనేట్ విషయానికి వస్తే 100 మంది సభ్యుల్లో రిపబ్లికన్లు 52, డెమొక్రాట్లు 46, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. అభిశంసన నెగ్గాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. 67 ఓట్లు కావాలి. అంటే డెమొక్రాట్లు మరో 21 మంది మద్దతు సంపాదించాలి. ట్రంప్ తొలి 2నెలల పాలనానంతరం కేవలం 38 శాతం ప్రజల మద్దతు పొందారు. తొలిసారి అధ్యక్ష పదవిని చేపట్టిన వారితో పోల్చినపుడు ఇది సగటున 20 పాయింట్లు తక్కువ. ట్రంప్ మరిన్ని పొరపాట్లు చేసి అపఖ్యాతి పాలైతే. అధ్యక్షుడిపై ప్రజా వ్యతిరేకత మరింత బలపడితే... రిపబ్లికన్లూ పునరాలోచించక తప్పదు. ఒకవేళ ఇప్పుడు అభిశంసన తేలేకపోతే 2018లో డెమొక్రాట్లకు మరో మంచి అవకాశం ఉంటుంది. ప్రతినిధుల సభకు 2018లో ఎన్నికలున్నాయి. ఒకవేళ డెమొక్రాట్లు మెజారిటీ సాధిస్తే... మొదటి అంకం వారికి సులువవుతుంది. ఇతర మార్గాలూ ఉన్నాయి అనారోగ్య కారణంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని అధికారాన్ని ఉపాధ్యక్షుడికి అప్పగించడానికి అమెరికా రాజ్యాంగం వీలు కల్పిస్తోంది. అలాగే అధ్యక్షుడి వైకల్యం లేదా అసమర్థత కారణంగా ఆయన్ను పదవి నుంచి బలవంతంగా తప్పించేందుకూ ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యక్షుడు, కేబినెట్లోని 15 మంది కీలక మంత్రులు నిర్ణేతలవుతారు. ఉపాధ్యక్షుడు, మంత్రుల్లో మెజారిటీ సభ్యులు ‘అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వర్తించే స్థితిలో లేరని భావిస్తే’ఈ మేరకు ప్రతినిధుల సభ స్పీకర్‌కు, సెనేట్ ప్రెసిడెంట్‌కు లిఖితపూర్వక సమాచారమిస్తే... సదరు అధ్యక్షుడు పదవికి దూరమవుతాడు. ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేయవచ్చు. అయితే తొలగించిన అధ్యక్షుడిని శాశ్వతంగా పదవికి దూరంగా ఉంచాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమవుతుంది. అధ్యక్ష అభ్యర్థి పేరు మీదే ప్రజలు ఓట్లు వేస్తే అమెరికాలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది కాబట్టి... ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడిని ఈ తరహాలో దించిన సంఘటనలు అమెరికా చరిత్రలో చోటుచేసుకోలేదు. అయితే ప్రజావ్యతిరేకత పెరిగి... నిలకడలేని ట్రంప్‌ను వదిలించుకోవాల్సిన పరిస్థితి వస్తే... రిపబ్లికన్లకు ఇది కూడా ఒక మార్గం అవుతుందనే ఊహాగానాలు సాగుతున్నాయి. అమెరికా చరిత్రలో అభిశంసనలు 1865 నుంచి 1869 దాకా అధ్యక్షుడిగా ఉన్న అండ్రూ జాన్సన్ మాజీ బానిసలకు పౌర హక్కులను కల్పించడాన్ని వీటో చేసి 1968లో అభిశంసన ఎదుర్కొన్నారు. అయితే ప్రతినిధుల సభలో నెగ్గినా... సెనెట్ తిరస్కరించడంతో పదవీకాలం పూర్తిచేసుకున్నారు. రిచర్డ్ నిక్సన్ 1974 వాటర్‌గేట్ కుంభకోణంలో పాత్రకుఅభిశంసనను ఎదుర్కొన్నారు. అయితే ప్రతినిధుల సభలో ఓటింగ్‌కు రాకముందే నిక్సన్ రాజీనామా చేశారు. మోనికా లూయిన్‌స్కీతో అక్రమ సంబంధాన్ని నెరిపి... దాన్ని దాచిపెట్టినందుకు బిల్ క్లింటన్ 1998లో అభిశంసనను ఎదుర్కొన్నారు. ప్రతినిధుల సభలో ఆయన అభిశంసన నెగ్గినా... సెనెట్ తిరస్కరించింది. ఈ ముగ్గురిపైనా అభిశంసన తీర్మానం పెట్టింది... ప్రమాణాన్ని ఉల్లంఘించారనే అభియోగం పైనే కావడం గమనార్హం. – సాక్షి నాలెడ్జ్ సెంటర్