breaking news
cekdyam
-
‘జలసిరి’ని వేగవంతం చేశాం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించిన జిల్లా కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలో ఎన్టీఆర్ జలసిరి-2 పథకం కింద బోర్లు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకు వివరించారు. ముఖ్యమంత్రి బుధవారం విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జలసిరి పథకం కింద జిల్లాకు 10223 బోర్లు మంజూరయ్యాయన్నారు. వీటికి అర్హులైన రైతులను గుర్తించే పనులను వేగవంతం చేసినట్లు వివరించారు. గతంలో మూడువేల చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయించామన్నారు. దీంతో తాగునీటి సమస్యలను తీర్చగలుగుతున్నామని వివరించారు. జిల్లాలో నెలకొన్న నీటి సమస్యలను తీర్చేందుకు మెటీరియల్ కాంపోనెంటు కింద ఎక్కువ నిధులు వ్యయం చేసినట్లు వివరించారు. 11 వేల ఫాంపాండ్స్ పనులను చేపట్టామన్నారు. రానున్న ఐదునెలల్లో లక్ష ఫాంపాండ్స్ తవ్విస్తామని తెలిపారు. విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రతి అధికారి అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకొని, స్థానిక వనరులను గుర్తించి ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో పనులు చేపట్టాలని కోరారు. గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగు దొడ్లు, నీరు-చెట్టు అమలు, నీటి సంరక్షణ పనులు తదితర వాటిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కర్నూలు నుంచి కలెక్టర్‌తో పాటు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జొవహర్రెడ్డి, జేసీ హరికిరణ్, డీ ఆర్ఓ గంగాధర్‌గౌడ్, సీపీఓ ఆనంద్‌నాయక్, డ్వామా పీడీ పుల్లారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు. -
ఖరీఫ్‌లో నీటి కష్టాలు
=పాడైన నిర్మాణాలు =రైతులకు సాగునీటి కష్టాలు =నిరుపయోగంగా నిధులు =ఎస్ఎంఐ శాఖ నిర్లక్ష్యం ఖరీఫ్‌లో నీటి కష్టాలు ఎలాగూ తప్పలేదు. కనీసం రబీలోనైనా సమస్య ఉండబోదనుకున్న గిరిజన రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఏజెన్సీలో నిర్మించిన చెక్‌డ్యాంలు శిథిలం కావడంతో వేలాది ఎకరాల్లోని భూములకు సాగునీరందక గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి మొదలైతే పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. పాడేరు/అరకులోయ, న్యూస్‌లైన్: ఖరీఫ్ ముగిసిపోవడంతో ఇప్పటికే కొన్ని గ్రామాల గిరిజన రైతులు రబీ సాగుపై దృష్టి కేంద్రీక రించారు. చెక్‌డ్యామ్‌లు పాడైపోవడంతో లబోదిబోమంటున్నారు. పాడేరు డివి జన్‌లోని 11 మండలాల పరిధిలో 615 చెక్‌డ్యాంలు ఉన్నాయి. వీటిలో 476 ప్రస్తుతం మరమ్మతులకు గురయ్యాయి.139 చెక్‌డ్యాంలు మాత్రమే సాగునీటిని అందిస్తున్నాయి. వీటిలో బూదరాళ్ల, తాబేలుగుమ్మి చెక్‌డ్యాంలు పెద్దవిగా గుర్తింపు పొందాయి. ఇవి కూడా శిథిల దశకు చేరుకున్నాయి. మరికొన్ని పూడిక పేరుకుపోయి ప్రధాన కాల్వలు కూడా పాడయిపోయాయి.146 ఎన్ఆరీఈజీఎస్, 150 ట్రైబల్ సబ్‌ప్లాన్, 180 పునరుద్ధరణ పథకం కింద మరమ్మతులకు అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. దీంతో ఈ చెక్‌డ్యాంల పరిధిలోని వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందడం లేదు. అలాగే కొత్తగా చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. నిధులు మాత్రం మంజూరు కావడం లేదు. మంజూరైన నిధులను వినియోగంలోకి తీసుకురావడంలో ఎస్ఎంఐ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా రైతులకు శాపంగా మారింది. శిథిలమైన చెక్‌డ్యాంలకు మరమ్మతు చేసి,అవసరమైన చోట కొత్త వాటిని నిర్మించేందుకు అరకులోయ అసెంబీ నియోజక వర్గం పరిధిలోని అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ,హుకుంపేట,పెదబయలు, ముంచంగిపుట్ మండలాల్లోని చెక్‌డ్యాంల మరమ్మతుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం సుమారు రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఎస్ఎంఐ శాఖ అధికారులు కొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభించారు. తర్వాత ఈ పనులు ఏమయ్యాయో తెలియడం లేదు. అరకులోయ మండలంలో సుమారు 65 చెక్ డ్యాంలు ఉండగా,ఏ చెక్‌డ్యాం కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి లేదు. వర్షపు నీరు కూడా నిల్వ ఉండడానికి వీలులేని పరిస్థితిలో ఇవి ఉన్నాయని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలం తుఫాన్ సమయంలో కొండల పైనుంచి భారీగా వరద నీరు వచ్చినా నిల్వ చేసుకోలేక పోయామని అంటున్నారు. రబీ రైతుల మేలు కోసం చెక్‌డ్యాంలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.